Narakasura Vadha
-
మన ముంగిళ్లలో వెలుగు పూలు
సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడే ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...దీపావళికి సంబంధించి కథలెన్నో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతుడై... లోక కంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామన్న కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది.నరకాసుర వధభూదేవి కుమారుడైన నరకుడు ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేవాడు. నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఉండాలని కాబోలు.. రాజై ఉండి కూడా దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసల పాల్జేసేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీ కృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు.లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.ఈ పర్వదినాన ఇలా చేయాలి...ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకుని, తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపజేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాడు ఇంటిని వీలైనంత అందంగా అలంకరించాలి.దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పురాతన వృక్షాల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈనాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం.దీపావళి నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని, లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతినివ్వాలనీ శాస్త్రవచనం.లక్ష్మీపూజ ఇలా చేయాలి...ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం ΄ోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దుపుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామర పువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి. సాయంత్రం వేళ నూత్న వస్త్రాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
Diwali 2024: నరకాసుర సంహారం
శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆయన వలన భూదేవికి ఒక కొడుకు పుట్టాడు. అతడే నరకుడు. పుట్టిన వేళ దోషప్రదమైనది కావడంతో అతడు అసుర లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నాడు. అసుర చేష్టలతో జనాలను పీడిస్తూ నరకాసురుడిగా ప్రతీతి పొందాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని, కామరూప దేశాన్ని పరిపాలించసాగాడు. పొరుగునే ఉన్న శోణితపురం రాజు బాణాసురుడితో నరకుడికి మైత్రి కుదిరింది.బాణాసురుడి ప్రోద్బలంతో నరకుడు మరింత దుండగుడిగా మారాడు. తన కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టేవాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాల మీద దండెత్తి పదహారువేల మంది పడతులను ఎత్తుకొచ్చి, వారందరినీ చెరలో పెట్టాడు. బాణాసురుడి ప్రోద్బలంతో నరకాసురుడు అమాయకులను హింసించేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవాడు. అతడి దుండగాలను భూదేవి కూడా సహించలేకపోయింది. నరకాసురుడు తన రాజధాని చుట్టూ నాలుగు దుర్భేద్యమైన దుర్గాలను నిర్మించుకున్నాడు. అవి: గిరి దుర్గం, జల దుర్గం, అగ్ని దుర్గం, వాయు దుర్గం. వాటిని దాటి వెళ్లి, ప్రాగ్జ్యోతిషపురం మీదకు దండయాత్రకు వెళ్లడం దేవతలకు సైతం దుస్సాధ్యంగా ఉండేది. నాలుగు దుర్గాల మధ్య శత్రుదుర్భేద్యంగా ఉన్న నరకుడు ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి, నరకాసురుడు అనేక దివ్యాస్త్రాలను సాధించాడు. వరగర్వం తలకెక్కి, దేవతల మీద తరచు దండెత్తి వాళ్లను నానా హింసలు పెట్టేవాడు. దేవతలపై దండెత్తిన నరకుడు బలవంతంగా వరుణుడి ఛత్రాన్ని, అదితీదేవి కర్ణకుండలాలను చేజిక్కించుకున్నాడు. దేవతలకు చెందిన మణిపర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నరకుడి ధాటిని అరికట్టడం దేవేంద్రుడికి కూడా సాధ్యంకాలేదు. స్వర్గం మీద దండెత్తిన నరకుడి ధాటికి నిలువలేక దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని, యథేచ్ఛగా తన దాష్టీకాలను కొనసాగించాడు. యజ్ఞ యాగాదుల ఫలితం తనకే దక్కాలని ఆజ్ఞాపించాడు. కాదన్న మహర్షులను చెరసాలలో బంధించి, వారిని చిత్రహింసలు పెట్టాడు. ఒకనాడు వసిష్ఠుడు కామాఖ్యదేవిని పూజించడానికి ప్రాగ్జ్యోతిషపురం చేరుకున్నాడు. ఆయన ఆలయం వద్దకు చేరుకునే వేళకు నరకాసురుడు ఆలయ ద్వారాన్ని మూసివేయించాడు. ఈ దుశ్చర్యకు ఆగ్రహించిన వసిష్ఠుడు, ‘దుర్మదాంధుడా! నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’ అని శపించాడు.నరకాసురుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. ముల్లోకాల్లోనూ జనాలు హాహాకారాలు చేయసాగారు. నరకుడి బాధలు భరించలేక దేవేంద్రుడు దేవతలందరితోనూ కలసి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. ‘శ్రీకృష్ణా! పాహిమాం, పాహిమాం! నరకుడి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మమ్మల్నందరినీ తరిమికొట్టి, స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఎదురు చెప్పిన మహర్షులను చెరలో బంధించి హింసిస్తున్నాడు. కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టాడు. నరకుడి దాష్టీకాలతో ధర్మం గాడి తప్పుతోంది. నరకుడిని అంతమొందించగల సమర్థుడవు నువ్వే! అతడి బారి నుంచి మమ్మల్ని కాపాడు. ఆలస్యం చేయక అతణ్ణి సంహరించు’ అని ప్రార్థించాడు. నరకుడి పీడ విరగడ చేయమని ముక్కోటి దేవతలూ ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు. దేవత మొరను సావకాశంగా ఆలకించిన నరకుడిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు సమాయత్తమయ్యాడు. ‘నాథా! నేను కూడా యుద్ధానికి వస్తాను. నన్ను కూడా తీసుకువెళ్లండి’ అంది సత్యభామ.సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు గరుడవాహనంపై నరకుడిపై దండయాత్రకు బయలుదేరాడు. తన మిత్రులైన మురాది రాక్షసులను శ్రీకృష్ణుడు అప్పటికే సంహరించడంతో నరకుడు అతడిపై కోపంగా ఉన్నాడు. సుప్రతీకం అనే ఏనుగునెక్కి నరకుడు భారీ సైన్యంతో రణరంగానికి వచ్చాడు. హోరా హోరీగా యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడితో నరకుడు వెనక్కు తగ్గకుండా పోరాడాడు. నరకుడి బాణం తాకి శ్రీకృష్ణుడు మూర్ఛిల్లాడు. సత్యభామ ఆగ్రహోదగ్రురాలైంది. విల్లంబులు చేతిలోకి తీసుకుని, నరకుడిపై శరపరంపరను కురిపించింది. యుద్ధరంగంలో సత్యభామ ఆదిశక్తిలా విజృంభించింది. ఆమె ధాటికి నరకుడి సేనలు చెల్లాచెదురయ్యాయి. ఈలోగా మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీకృష్ణుడు తన చక్రాన్ని సంధించి, నరకుడి తలను తెగ నరికాడు. నరకుడు అపహరించిన కుండలాలను అదితికి, ఛత్రాన్ని వరుణుడికి అప్పగించాడు. నరకుడి చెరలో ఉన్న పదహారువేల మంది పడతులను విడిపించి, వారిని పెళ్లాడాడు. నరకుడి పీడ విరగడ చేసినందుకు దేవతలంతా శ్రీకృష్ణుడిని వేనోళ్ల పొగిడారు. నరకాసుర సంహారం తర్వాత తిరిగి వస్తున్న సత్యభామా శ్రీకృష్ణులకు ద్వారకా పురవాసులు ముంగిళ్లలో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.∙సాంఖ్యాయన -
ద్వివిధుడి వధ
ద్వివిధుడనే వానరుడు నరకాసురుడికి నమ్మకమైన స్నేహితుడిగా ఉండేవాడు. కృష్ణుడి చేతిలో నరకుడు హతమైపోయాక, తన మిత్రుణ్ణి చంపిన కృష్ణుడి మీద, అతడి పరివారమైన యాదవుల మీద పగబట్టాడు. కృష్ణుడి ఆనర్త దేశంలో అడపా దడపా నానా బీభత్సం సృష్టించేవాడు. పొలాల మీద పడి పంటలు నాశనం చేసేవాడు. ఊళ్లకు ఊళ్లను తగులబెట్టేవాడు. ఉద్యానవనాల్లోకి చొరబడి వాటిని ధ్వంసం చేసేవాడు. ద్వారక మీదకు రాళ్లు రువ్వేవాడు. ఆలమందలను చెదరగొట్టేవాడు. ఇలా నానా ఆగడం చేసి, చెట్ల మీద నుంచి గెంతుతూ ఎవరకీ దొరక్కుండా క్షణాల్లో పారిపోయేవాడు. ఇలా ఉండగా, ఒకసారి బలరాముడు ప్రియురాళ్లతోను, వాళ్ల చెలికత్తెలతోను కలసి రైవత పర్వతం మీదకు వనవిహారానికి వెళ్లాడు. సముద్రం మీద నుంచి వీచే చల్లగాలి హాయిగొలుపుతుండగా, అందరూ కొండ మీద చదునైన చోట కూర్చుని సేదదీరసాగారు. బలరాముడు హాయిగా మధువు తాగుతూ, ఆ తన్మయత్వంలో పాటలు పాడసాగాడు. బలరాముడి సంగీతానికి అనుగుణంగా ప్రియురాళ్లు నాట్యం చేయసాగారు. వారి వినోద కాలక్షేపం పాన గానాలతో ఆహ్లాదభరితంగా సాగుతుండగా, ఎక్కడి నుంచి చూశాడో ద్వివిధుడు చెట్ల మీద నుంచి దూకుతూ రైవత పర్వతం మీదకు చేరుకున్నాడు. కొండ మీదనున్న చెట్లపై వేలాడుతూ, ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ కోతిచేష్టలు మొదలుపెట్టాడు. చెట్లను బలంగా ఊపుతూ, వాటికి ఉన్న పండ్లను దులిపేశాడు. పూలను రాల్చేశాడు. ఆడవాళ్ల ఎదుటికొచ్చి చిందులు వేశాడు. వాళ్లు అతణ్ణి వింతగా చూశారు. కొందరు నవ్వారు. ఇంత జరుగుతున్నా బలరాముడు తన మైకంలో, తన లోకంలో తానుండి హాయిగా గానాలాపన సాగిస్తూనే ఉన్నాడు. తాను ఎంత ఆగడం చేస్తున్నా, బలరాముడు చలించకపోవడంతో ద్వివిధుడు చిర్రెత్తిపోయాడు. ఏకంగా బలరాముడి ఎదుటికే వచ్చి, జబ్బలు చరుచుకుని రంకెలు వేశాడు. కాళ్లు నేలకు తాటిస్తూ, కయ్యానికి కాలు దువ్వాడు. ఈ చేష్టలను బలరాముడు అరమూత కళ్లతో ఒకసారి చూసి, తన మానాన పాడుకోసాగాడు. ద్వివిధుడు మరింతగా కోపంతో పెట్రేగి ఊగిపోయాడు. పళ్లు పటపట కొరికాడు. బలరాముడి ముందున్న మధుపాత్రను పైకెత్తి నేలకేసి కొట్టాడు. మధుపాత్ర పగిలి, మధువు నేలపాలైంది. ఏదో ఘనకార్యం చేసినట్టు వికటాట్టహాసం చేశాడు. రెప్పలెత్తి చూశాడు బలరాముడు. మామూలు కోతిని అదిలించినట్లుగానే, పక్కనే ఉన్న ఒక చిన్నరాయిని తీసుకుని అదిలించాడు. బలరాముడి ధోరణికి ద్వివిధుడు బాగా రెచ్చిపోయాడు. ఈసారి ఆడవాళ్ల గుంపులోకి దూకాడు. వాళ్లను మిర్రి మిర్రి చూస్తూ కిచకిచలాడాడు. బెదిరిస్తున్నట్లుగా పైపైకి వచ్చాడు. గంతులు వేశాడు. వాళ్లు ఇదంతా వినోదంగా అనుకుంటున్నంతలోనే ఒక్కసారిగా వాళ్ల జడలు గుంజి, చీరలు చించేశాడు. మీదపడి దొరికిన వాళ్లను దొరికినట్లుగా గోళ్లతో రక్కాడు. వానరం ఆగడం మితిమీరడంతో వాళ్లంతా హాహాకారాలు చేస్తూ, ఏడుపు మొదలుపెట్టారు. అప్పుడు వాణ్ణి తేరిపార చూశాడు బలరాముడు. దేశంలో ఆగడాలు సాగిస్తున్న వానరుడు వీడేనని గుర్తించాడు. ఆడవాళ్ల మీద ఆగడం సాగిస్తుండటంతో ఏమాత్రం సహించలేకపోయాడు. ఇక ఆలస్యం చేయకుండా, ఒక చేత నాగలి, మరో చేత ముసలం పట్టుకుని పైకి లేచాడు. బలరాముడు ఆయుధాలతో పైకి లేవడం గమనించిన ద్వివిధుడు, ఒక భారీ గుగ్గిలం చెట్టును పెరికి, బలరాముడి మీదకు విసిరాడు. ఎడమచేత్తో దాన్ని అడ్డుకున్నాడు బలరాముడు. ఒక మద్దిచెట్టును విసిరాడు. దాన్ని ముసలంతో నేలకూల్చేశాడు బలరాముడు. ఒక్క ఊపుతో ముందుకు దూసుకొచ్చాడు ద్వివిధుడు. ముసలంతో చాచిపెట్టి వాడి నెత్తి మీద కొట్టాడు బలరాముడు. వాడి తల పగిలి నెత్తురోడసాగింది. అయినా లక్ష్యపెట్టలేదు వాడు. భయంకరంగా పెడబొబ్బలు పెడుతూ, చెట్టు మీద చెట్టు పెరికి బలరాముడి మీదకు దండెత్తాడు. చుట్టు పక్కల చెట్లన్నీ ఖాళీ అయిపోయాక, పెద్ద పెద్ద బండరాళ్లు విసిరి ఊపిరాడనివ్వకుండా చేశాడు. అంతటితో ఆగకుండా బలరాముడి మీదకు దూకి, నేలకేసి అదిమి పిడిగుద్దులు కురిపించాడు. ఉపేక్షిస్తున్న కొద్దీ వానరం రెచ్చిపోతుండటంతో బలరాముడికి కోపం తలకెక్కింది. ఆగ్రహంతో కళ్లెర్రచేసి, కాలసర్పంలా బుసకొట్టాడు. ద్వివిధుడి మీద పిడుగుల్లా పిడిగుద్దులు కురిపించాడు. ఇద్దరూ కచాకచీ బాహాబాహీ ఒకరితో ఒకరు తలపడ్డారు. రైవతపర్వతం అదిరిపోయేలా రంకెలు వేస్తూ భీకరంగా ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు నేలపైకి పడదోసుకుంటూ యుద్ధం సాగించారు. ఒకరినొకరు తన్నుకుంటూ, చరుచుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ కలియబడ్డారు. అదను చూసుకుని బలరాముడు ద్వివిధుణ్ణి ఒడుపుగా పట్టుకుని, నేలకేసి తోశాడు. పైకి లేచేలోగానే అతడిపై కలబడ్డాడు. అతడి గుండెల మీద కూర్చుని, లేవనివ్వకుండా అతణ్ణి కట్టడి చేశాడు. ప్రతిఘటించేలోపే వ్యవధినివ్వకుండా పిడిగుద్దులు కురిపించాడు. గుండెల మీద పిడుగులాంటి పోటు పిడికిటితో పొడిచాడు. దెబ్బకు నెత్తురు కక్కుకుంటూ, భీకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు ద్వివిధుడు. బలరాముడి చేతిలో వానరం హతమవడంతో అతడితో కొండ మీదకు వచ్చిన ఆడవాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. బలరాముడిని పొగుడుతూ ఆనందంతో పాటలు పాడారు. యుద్ధంలో అలసిపోయిన బలరాముడికి సపర్యలు చేశారు. కొండ మీద కాసేపు సేదదీరాక, తిరిగి ద్వారకకు మళ్లారు. -సాంఖ్యాయన -
మాటలేనా..మాఫీలేదా?
‘నరకాసుర వధ’ విజయవంతం టీడీపీ అరాచకాలను లెక్కచేయని రైతులు, మహిళలు రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు డ్వాక్రా, రైతు రుణాలన్నీ రద్దుచేస్తానని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 45 రోజులు దాటినా రుణమాఫీపై పూటకోమాట చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎటువంటి షరతులు లేకుండా రుణాలన్నీ రద్దుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో మూడు రోజులు చేపట్టిన ‘నరకాసుర వధ’ కార్యక్రమానికి రైతులు, మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. పల్లెలు, పట్టణాలు.. అనే తేడా లేకుండా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాటలతో గారడీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఎటువంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని నినదించారు. వెంటనే ఖరీఫ్ సాగుకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము కోరుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవడం ఏమిటని పలుచోట్ల మహిళలు నిలదీశారు. మూడు రోజులుపాటు జరిగిన ‘నరకాసుర వధ’ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా రైతులు, డ్వాక్రా మహిళలు భారీగా పాల్గొన్నారు. టీడీపీ నేతల హల్చల్! రైతులు, మహిళలకు మద్దతుగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘నరకాసుర వధ’ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అధికార బలాన్ని ఉపయోగించి పోలీసుల సాయంతో అడుగడుగునా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. అనవసరంగా రోడ్డెక్కి అల్లరు సృష్టించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించారు. గురువారం పామర్రులో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి శాంతియుత వాతావరణంలో చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమాన్ని అడ్డుకుని అరాచకం సృష్టించారు. శుక్రవారం కూచిపూడిలోనూ వైఎస్సార్ సీపీకి ప్రతిగా టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో 144 సెక్షన్ విధించారు. విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మూడో రోజూ నిరసనల వెల్లువ శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యాన చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు రైతులు, మహిళలను నిలువునా మోసం చేశాడని ఉదయభాను విమర్శించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. నూజివీడు చిన్న గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో పాటు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు తన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నందిగామలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. వెంటనే రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, డ్వాక్రా రుణాలన్నీ రద్దుచేయాలని చల్లపల్లిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ‘నరకాసుర వధ’లో పాల్గొన్న రైతులు వ్యక్తంచేసిన అనుమానాలు రైతుల రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఎప్పుడు, ఎలా చేస్తారనే అంశాలపై ఏమాత్రం స్పష్టత లేదు. తీవ్రమైన అయోమయం, గందరగోళంగా ఉంది. రుణమాఫీపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. విడ్డూరమైన ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. ఎర్రచందన చెట్లను తాకట్టు పెడతారట, ఇసుకపై సెస్ వేస్తారట, ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలను తెచ్చి మభ్యపెట్టేలా ఉన్నారు. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని మంత్రులే చెబుతున్నారు. అసలు రుణమాఫీ ఎక్కడుంది? ఎక్కడ అమలవుతోంది? జూన్ 30వ తేదీలోపు రుణాలు చెల్లిస్తే పావలా వడ్డీతో సరిపోయేదే. చంద్రబాబు మాటలు నమ్మి పాత రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు 13 శాతం వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.3వేలు కడితే సరిపోయేదానికి ఇప్పుడు రూ.13,000 చెల్లించాల్సి వస్తోంది. అదనపు వడ్డీ ఎవరు చెల్లించాలి. మేమా.. లేక ప్రభుత్వం భరిస్తుందా? రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పంటల బీమాకు మేము అనర్హులమవుతున్నాం. రుణాలు కట్టాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాకు ఎవరు భరోసా ఇస్తారు. ఆదేశాలు రాలేదంటున్నారు.. రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటన తర్వాత బ్యాంకుల వద్దకు వెళ్తే ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారు. రైతులకు ఓదార్పు మాటలు చెబుతున్నారు గానీ, రుణమాఫీ అమలయ్యే సూచనలు కనిపించటం లేదు. రైతుల బాధలు ఎప్పటికి కడతేరేనో. - ప్రత్తి వీరబాబు, మునిపెడ,కృత్తివెన్ను మండలం మభ్య పెడుతున్నారు నిధులు అందుబాటులో లేకుండా ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. బ్యాంకులు రుణాలు వసూళ్లకు ఒత్తిడి తెస్తున్నాయి. అదనపు వడ్డీలు ప్రభుత్వమే భరించాలి. ఇన్సూరెన్స్ అమలవుతుందో, లేదో తెలియని పరిస్థితి రైతుల్లో నెలకొంది. - వెంట్రపాటి శ్యాంబాబు, పెందుర్రు, బంటుమిల్లి మండలం స్పష్టమైన ప్రకటన చేయాలి చంద్రబాబు మాట నమ్మి పాత రుణాలను చెల్లించలేదు. రుణాలు రీషెడ్యూలు చేస్తే 13 శాతం వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ వడ్డీ ఎవరు కట్టాలనే విషయంపై స్పష్టతలేదు. ఒకవైపు ఖరీప్ సీజన్ రెండు నెలలు గడిచింది. ఎప్పటికి పంట రుణం ఇస్తారో అర్థంకావడం లేదు. - నాగమల్లేశ్వరరావు, కోకనారాయణపాలెం, గూడూరు(మం) -
ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 'నరకాసుర వధ'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు,డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేస్తానని చెప్పి... ఆ తర్వాత మాట మార్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వురు జాతీయ రహదారిపై ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఆ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీకి నిరసన తెలుపుతు నరకాసుర వధ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించాలని బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా గురువారం నుంచి మూడో రోజుల పాటు నరకాసుర వధ రాష్ట్రవ్యాప్తంగా జరుగనుంది. అందులోభాగంగా రెండు రోజైన నేడు రాష్ట్రవ్యాప్తంగా నరకాసుర వధ జరుగుతుంది. -
విజయవంతమైన నరకాసుర వధ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతురుణ మాఫీపై వంచనకు పాల్పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామగ్రామాన విజయవంతమైందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో జ్యోతుల నెహ్రూ విలేకర్లసమావేశంలో మాట్లాడుతూ... నరకాసుర వధ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతాంగం, మహిళాలోకం కదిలి వచ్చిందని తెలిపారు. ఆర్థిక మంత్రి యనమల తన స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారని నెహ్రూ ఆరోపించారు. దొడ్డి దారిన మంత్రి అయిన మీరా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను విమర్శించేది అని యనమలను ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని రెండుసార్లు ఓడించారని యనమలను ఉద్దేశించి అన్నారు. ప్రజలు అలా ఎందుకు ఓడించారో ఇప్పటికైనా తెలుసుకోవాలని యనమలకు నెహ్రూ సూచించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను విమర్శించడమే ఆంధ్రప్రదేశ్ మంత్రులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తమ నాయకుడిపై సదరు మంత్రులు హద్దులు మీరి మాట్లాడడం తగదని అన్నారు. టీడీపీ నేతలు సొంత డబ్బా, అలాగే వారి నాటకాలు చూస్తుంటే నవ్వోస్తోందని నెహ్రూ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తే తామే సన్మానం చేస్తామని టీడీపీ నేతలకు వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ నెహ్రూ సవాల్ విసిరారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం వంచనకు పాల్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ గ్రామాన నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామగ్రామాన నరకాసుర వధ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ నిర్వహించింది.