
శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆయన వలన భూదేవికి ఒక కొడుకు పుట్టాడు. అతడే నరకుడు. పుట్టిన వేళ దోషప్రదమైనది కావడంతో అతడు అసుర లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నాడు. అసుర చేష్టలతో జనాలను పీడిస్తూ నరకాసురుడిగా ప్రతీతి పొందాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని, కామరూప దేశాన్ని పరిపాలించసాగాడు. పొరుగునే ఉన్న శోణితపురం రాజు బాణాసురుడితో నరకుడికి మైత్రి కుదిరింది.
బాణాసురుడి ప్రోద్బలంతో నరకుడు మరింత దుండగుడిగా మారాడు. తన కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టేవాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాల మీద దండెత్తి పదహారువేల మంది పడతులను ఎత్తుకొచ్చి, వారందరినీ చెరలో పెట్టాడు. బాణాసురుడి ప్రోద్బలంతో నరకాసురుడు అమాయకులను హింసించేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవాడు. అతడి దుండగాలను భూదేవి కూడా సహించలేకపోయింది. నరకాసురుడు తన రాజధాని చుట్టూ నాలుగు దుర్భేద్యమైన దుర్గాలను నిర్మించుకున్నాడు.
అవి: గిరి దుర్గం, జల దుర్గం, అగ్ని దుర్గం, వాయు దుర్గం. వాటిని దాటి వెళ్లి, ప్రాగ్జ్యోతిషపురం మీదకు దండయాత్రకు వెళ్లడం దేవతలకు సైతం దుస్సాధ్యంగా ఉండేది. నాలుగు దుర్గాల మధ్య శత్రుదుర్భేద్యంగా ఉన్న నరకుడు ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి, నరకాసురుడు అనేక దివ్యాస్త్రాలను సాధించాడు. వరగర్వం తలకెక్కి, దేవతల మీద తరచు దండెత్తి వాళ్లను నానా హింసలు పెట్టేవాడు. దేవతలపై దండెత్తిన నరకుడు బలవంతంగా వరుణుడి ఛత్రాన్ని, అదితీదేవి కర్ణకుండలాలను చేజిక్కించుకున్నాడు. దేవతలకు చెందిన మణిపర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నరకుడి ధాటిని అరికట్టడం దేవేంద్రుడికి కూడా సాధ్యంకాలేదు.
స్వర్గం మీద దండెత్తిన నరకుడి ధాటికి నిలువలేక దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని, యథేచ్ఛగా తన దాష్టీకాలను కొనసాగించాడు. యజ్ఞ యాగాదుల ఫలితం తనకే దక్కాలని ఆజ్ఞాపించాడు. కాదన్న మహర్షులను చెరసాలలో బంధించి, వారిని చిత్రహింసలు పెట్టాడు. ఒకనాడు వసిష్ఠుడు కామాఖ్యదేవిని పూజించడానికి ప్రాగ్జ్యోతిషపురం చేరుకున్నాడు. ఆయన ఆలయం వద్దకు చేరుకునే వేళకు నరకాసురుడు ఆలయ ద్వారాన్ని మూసివేయించాడు. ఈ దుశ్చర్యకు ఆగ్రహించిన వసిష్ఠుడు, ‘దుర్మదాంధుడా! నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’ అని శపించాడు.
నరకాసురుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. ముల్లోకాల్లోనూ జనాలు హాహాకారాలు చేయసాగారు. నరకుడి బాధలు భరించలేక దేవేంద్రుడు దేవతలందరితోనూ కలసి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. ‘శ్రీకృష్ణా! పాహిమాం, పాహిమాం! నరకుడి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మమ్మల్నందరినీ తరిమికొట్టి, స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఎదురు చెప్పిన మహర్షులను చెరలో బంధించి హింసిస్తున్నాడు. కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టాడు. నరకుడి దాష్టీకాలతో ధర్మం గాడి తప్పుతోంది. నరకుడిని అంతమొందించగల సమర్థుడవు నువ్వే! అతడి బారి నుంచి మమ్మల్ని కాపాడు. ఆలస్యం చేయక అతణ్ణి సంహరించు’ అని ప్రార్థించాడు. నరకుడి పీడ విరగడ చేయమని ముక్కోటి దేవతలూ ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు. దేవత మొరను సావకాశంగా ఆలకించిన నరకుడిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు సమాయత్తమయ్యాడు. ‘నాథా! నేను కూడా యుద్ధానికి వస్తాను. నన్ను కూడా తీసుకువెళ్లండి’ అంది సత్యభామ.
సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు గరుడవాహనంపై నరకుడిపై దండయాత్రకు బయలుదేరాడు. తన మిత్రులైన మురాది రాక్షసులను శ్రీకృష్ణుడు అప్పటికే సంహరించడంతో నరకుడు అతడిపై కోపంగా ఉన్నాడు. సుప్రతీకం అనే ఏనుగునెక్కి నరకుడు భారీ సైన్యంతో రణరంగానికి వచ్చాడు. హోరా హోరీగా యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడితో నరకుడు వెనక్కు తగ్గకుండా పోరాడాడు. నరకుడి బాణం తాకి శ్రీకృష్ణుడు మూర్ఛిల్లాడు. సత్యభామ ఆగ్రహోదగ్రురాలైంది. విల్లంబులు చేతిలోకి తీసుకుని, నరకుడిపై శరపరంపరను కురిపించింది. యుద్ధరంగంలో సత్యభామ ఆదిశక్తిలా విజృంభించింది.
ఆమె ధాటికి నరకుడి సేనలు చెల్లాచెదురయ్యాయి. ఈలోగా మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీకృష్ణుడు తన చక్రాన్ని సంధించి, నరకుడి తలను తెగ నరికాడు. నరకుడు అపహరించిన కుండలాలను అదితికి, ఛత్రాన్ని వరుణుడికి అప్పగించాడు. నరకుడి చెరలో ఉన్న పదహారువేల మంది పడతులను విడిపించి, వారిని పెళ్లాడాడు. నరకుడి పీడ విరగడ చేసినందుకు దేవతలంతా శ్రీకృష్ణుడిని వేనోళ్ల పొగిడారు. నరకాసుర సంహారం తర్వాత తిరిగి వస్తున్న సత్యభామా శ్రీకృష్ణులకు ద్వారకా పురవాసులు ముంగిళ్లలో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.
∙సాంఖ్యాయన