కృష్ణుడు ఇంత బరువు ఉంటాడా! | Sri Krishna Tulabharam Movie Story | Sakshi
Sakshi News home page

కృష్ణుడు ఇంత బరువు ఉంటాడా!

Published Sun, Aug 25 2019 12:46 PM | Last Updated on Sun, Aug 25 2019 12:46 PM

Sri Krishna Tulabharam Movie Story - Sakshi

‘‘వ్రతం ముగిసింది. ఇంకా దానాలు ఉన్నాయి. ముందు పతిదానం కానిద్దామా’’ అన్నది సత్యభామ.
‘‘అలాగే కానివ్వండి. అయితే దంపతులిద్దరు పారిజాతవృక్షం దగ్గరకు రావాలి. మహర్షి! దానగ్రహీతలు తమరు కూడా దయచేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు.
‘‘అవశ్యం’’ అని బయలుదేరాడు నారదుడు.
‘‘కొంచెం జలం అక్షతల్లోకి తీసుకొని దారాదత్తం చేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు.
అలాగే చేసింది సత్యభామ.
‘‘భాగ్యమన్న నాదే భాగ్యం... మహాభాగ్యం’’ సంబరపడిపోయాడు నారదుడు.
‘‘అమ్మా! ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా’’ అడిగాడు బ్రాహ్మణుడు.
‘‘అబ్బా! ఇంకా అదొక ఆలస్యం ఉందా!’’ అన్నది సత్యభామ.

ఈలోపు నారదమహర్షి అందుకొని–
‘‘అంత తొందరపడతారేం ఆచార్యా! బ్రాహ్మణులను ఉండనివ్వండి. శ్రీకృష్ణతులాభారం కన్నుల పండుగగా చూసి మరీ వెళతారు’’ అన్నాడు.
‘‘అవును మహర్షి! ముందు తులాభారం తూచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతే వారిని సత్కరిస్తాను’’ అన్నది సత్యభామ.
కృష్ణుడిని త్రాసులో కూర్చోబెట్టారు.
‘‘నళినీ... నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచండి’’ అని చెలికత్తెను ఆదేశించింది సత్యభామ.
‘‘అయ్యయ్యో! ఒక్క వారం నగలే. కృష్ణయ్యబాబు ఇంతేనా!’’ నోరెళ్లబెట్టాడు వసంతయ్య.
‘‘స్వామీ! మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి’’ అంటూ కోపగించుకుంది సత్యభామ.
‘‘విన్నావా వసంతయ్య’’ అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో.
‘‘విన్నాను... వేశాను’’ అని నోటికి తాళం వేసినట్లుగా నటించాడు వసంతయ్య.
ఆ బరువుకు కృష్ణుడు తూగలేదు.
‘‘నళినీ... మిగతా ఆరువారాల నగలు కూడా తెచ్చి వేయండి’’ అని చెలికత్తెని ఆదేశించింది సత్యభామ.
అలాగే చేసింది నళిని. కానీ ఏంలాభం!
ఈ బరువుకూ కృష్ణుడు తూగలేదు.

దీంతో సత్యభామకు సహనం నశించింది. అనుమానం వచ్చింది.
‘‘వసంతయ్య! త్రాసులో ఏమీ మోసం లేదుకదా’’ అని అడిగింది.
తనిఖీ చేసి– ‘‘త్రాసులో ఏమీ దోషం లేదమ్మా. మరి ఉన్న మోసమంతా ఎక్కడో’’ అన్నాడు నర్మగర్భంగా.
‘‘అవన్నీ నన్నేం చేయవు. శమంతకమణి ప్రసాదించిన బంగారాన్ని వెయ్యి. వసంతయ్యా... వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్లు’’ అని ఆదేశించింది సత్యభామ.
‘‘గోవిందా గోవిందా’’ అనుకుంటూ పనివాళ్లతో పాటు వెళ్లాడు వసంతయ్య.
తెచ్చిన బంగారాన్ని త్రాసులో వేశారు.
అయినప్పటికీ కృష్ణుడు తూగలేదు.
‘‘ఏమిటి మాయా! నా స్వామి ఇంత బరువు ఉన్నాడా!’’ ఆశ్చర్యపోయింది సత్యభామ.
‘‘ఆయన బరువు నాకేం తెలుసమ్మా’’ అన్నాడు నారదుడు.
‘‘అయ్యో ఇప్పుడేమీ చేయడం’’ ఆలోచనలో పడింది సత్యభామ.
ఇద్దరు బ్రాహ్మణులు మెల్లగా ఇలా గొణుక్కుంటున్నారు...
‘‘మన సంభావన కూడా ఏమీ మిగిలేటట్లు లేదే’’ అన్నారు ఒకరు.

‘‘మన చేతులు, చెవులకు ఉన్న బంగారాన్ని తీసి అక్కడ పెట్టమనకపోతే అదే పదివేలు’’ అన్నారు ఇంకొకరు.
‘‘దేవీ! నీ వద్ద ఉన్న ధనం ఇదేనా? నేను ఈయనకు బానిస కావాల్సిందేనా’’ అన్నాడు కృష్ణుడు.
‘‘నీవు లేనిదే నేను జీవించలేను’’ అన్నాడు.
‘‘ఆందోళనపడకండి స్వామీ! మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా! ధైర్యంగా ఉండండి’’ అన్నది సత్యభామ.
‘‘ఏమో ప్రియా! మనకు ఎడబాటు తప్పదేమో’’ అన్నాడు కృష్ణుడు.
‘‘తపస్వీచంద్రమా! ధనేతరాలతో కూడా తూచవచ్చాన్నారు కదా?’’ అడిగింది సత్యభామ.
‘‘సాధ్యమైతే అలాగే ప్రయత్నించండి’’ అన్నాడు నారదుడు.
‘‘నళిని, మల్లిక, వసంతయ్య... మందిరంలో గల విలువైన వస్తువులన్నీ తీసుకురండి’’ అని ఆదేశించింది సత్యభామ.
అయినప్పటికీ ఫలితం లేదు!!

‘‘మునీంద్రా! ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథుడు ఇంత బరువు ఉంటాడని నేను నమ్మలేకుండా ఉన్నాను’’ అన్నది సత్యభామ.
‘‘పిచ్చితల్లీ! గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువును ఇంత అని నిర్ణయించగలవారు ఎవరని!’’ అన్నాడు నారదుడు.
‘‘నా నాథుడు ఇంత బరువు ఉంటాడని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి!’’ అలక స్వరంతో అడిగింది సత్యభామ.
‘‘నారాయణ నారాయణ! నా మీద అపనింద వేయడం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడనే భ్రమించావుగాని జగన్నాథుడని గ్రహించలేక పోయావు. అది నా అపరాధమేనంటావా!’’ అన్నాడు నారదుడు.
‘‘మహానుభావా! గతాన్ని తరచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణిని స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి’’ అని నారద మహర్షిని వేడుకుంది సత్యభామ.
‘‘సత్యాదేవి! అహంకారభూయిష్టమైన శమంతకమణికి, ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుణ్ణి వెలబోయమంటావా! అంగడి వీధుల్లో పెట్టి సరిౖయెన వెలకు విక్రయిస్తాను. పిచ్చితలీ!్ల చేతనైతే తుల తూచి తీసుకుపో’’ కరాఖండిగా చెప్పాడు నారదుడు.
సమాధానం:  శ్రీకృష్ణతులాభారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement