శ్రీకృష్ణసత్యన్నారదీయం | Sri Krishnasatyanaradeeyam | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణసత్యన్నారదీయం

Published Sun, Nov 3 2013 10:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

శ్రీకృష్ణసత్యన్నారదీయం

శ్రీకృష్ణసత్యన్నారదీయం

దీపావళి సందర్భంగా శ్రీకృష్ణుడు, సత్యభామ, నారదుల సంభాషణ.

నారదుడు: స్వామీ! శ్రీకృష్ణపరమాత్మా! అడగ కూడదని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుతున్నాను... ఎక్కడకు బయలుదేరారు స్వామీ.

 సత్యభామ: అయ్యా! నారదమునీంద్రా! ఆచారాలు సంప్రదాయాలు తెలిసి కూడా నువ్వు ఇలా అడగటం భావ్యమేనా. అయినా ఈ పూట మేం ఎక్కడికి వెళ్తామో ముందుగా నీకే తెలుస్తుంది కదా త్రిలోకసంచారీ!

 నారదుడు: అయ్యో! తెలియక కాదమ్మా! అన్నీ తెలిసినవాడినే. తెలుసు కనుకనే అడగవలసి వచ్చింది.

 సత్యభామ: అంతటి అత్యవసరం ఏమొచ్చింది మునివర్యా!

 నారదుడు: అమ్మా! సత్యాభామా దేవీ! నిన్నటికి నిన్న భూలోకమంతా ఒకసారి పర్యటించి వచ్చాను. అక్కడ కొందరు ప్రజలు మాట్లాడుకున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ విషయాలు మీకు విన్నవించుకుందామని వచ్చాను తల్లీ!

 శ్రీకృష్ణుడు: ప్రజలు ఏమనుకుంటారు నారదా! ఈ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, బాణాసంచా కాల్చుకుంటూ సంబరంగా జరుపుకోవాలనుకుంటారు అంతేగా! ఇందులో ప్రత్యేకంగా విన్నవించుకోవలసినదేం ఉంటుంది!

 నారదుడు: అక్కడే మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు స్వామీ! నేను కొన్ని ప్రాంతాలు పర్యటించి, దీపావళి పండుగను ఎవరెవరు ఏ విధంగా జరుపుకోవాలనుకుంటున్నారో తెలుసుకుందామని ఒక సర్వే నిర్వహించాను. వారి మాటలు నన్ను అవాక్కయ్యేలా చేశాయి.  సత్యభామ: ఊరికే ఉత్కంఠ కలిగించేలా కాకుండా అసలు విషయం ఏమిటో శలవియ్యవయ్యా బ్రహ్మచారీ!

 నారదుడు: వస్తున్నా! ఆ విషయానికే వస్తున్నాను!

 శ్రీకృష్ణుడు: ఊఁ ప్రారంభించు.

 నారదుడు: ఎలా ప్రారంభించమంటారో అర్థం కావటం లేదు స్వామీ! వారి మాటలు వినలేక నా చెవులు మూసుకున్నాను.

 సత్యభామ: అంత వినరాని మాటలు ఏమన్నారు కలహభోజనా!

 నారదుడు: తల్లీ! నన్ను కలహ భోజనా అన్నా సరే! ఏమన్నా సరే! కాని, నేను చెబుతున్నది వాస్తవం. నా చెవులతో విన్న మాటలు నోటితో పలకలేను. విన్నందుకే నా చెవులలో దివ్య మందాకినీ జలం పోసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నోటితో పలికి నోటిని కూడా సంప్రోక్షణ చేసుకోమంటావా తల్లీ!

 శ్రీకృష్ణుడు: ఏం జరిగింది నారదా! ముందువెనుకలు లేకుండా మాట్లాడుతున్నావు. ఇక ఆ మాటలు కట్టిపెట్టి అసలు విషయానికి రావయ్యా!

 నారదుడు: ఏముంది స్వామీ! మీరు సత్యా సమేతులై, ద్వాపరయుగంలో నరకాసుకర సంహారం చేసి ప్రజలకు చీకటిని పారద్రోలి వెలుతురును ప్రసాదించారు. ఆ సంతోషంతో నాటి నుంచి భూలోకవాసులంతా నరకచతుర్దశి, దీపావళి జరుపుకుంటున్నారు. ఈ సంగతి తెలిసిందేగా.

 సత్యభామ: అవును! ఇందులో వినరాని మాటలేం ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే కదా. ముల్లోకాలలోనే కాకుండా కలియుగంలో సైతం కిందటి సంవత్సరం వరకు ఇలాగే జరుగుతూ వస్తోంది కదా!

 నారదుడు: ప్రజల అమాయకత్వమనుకోవాలో, వారి అతి తెలివితేటలను  కోవాలో అర్థం కావట్లేదు స్వామీ! ప్రజలట బాణసంచా కాల్చకూడదట. అలా కాల్చటం వలన వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం ఏర్పడుతుందట. ఈ విడ్డూరం ఎన్నడైనా విన్నామా కన్నామా స్వామీ! మరీ ఇంత అన్యాయమా! వారంరోజులుగా ఈ విషయమై విస్తృత ప్రచారం జరుగుతోంది. పండుగనాడు కేవలం దీపాలు మాత్రమే వెలిగించుకోవాలట, టపాసులు కాల్చకూడదట. ఎక్కడ చూసినా ఈ ప్రచారం జోరుగా, హోరుగా, వడివడిగా సాగుతోంది. కొందరైతే సోషల్ నెట్‌వర్క్‌లలో మెయిల్స్ పంపుతున్నారు. ఏం చెప్పమంటారు స్వామీ!

 శ్రీకృష్ణుడు: అంతే కదా నారదా! ఒకటి చెప్పనా నా ప్రజలేమీ తెలివితక్కువ వారు కాదు. వారు టపాసులు కాల్చితీరతారు. ఆకాశంలో హరివిల్లులు సృష్టిస్తారు. భూలోకంలోకి వెన్నెల వెలుగులు, సుధామయూఖాలు తీసుకువస్తారు. నువ్వేమీ విచారించకు నారదా!

 సత్యభామ: ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంటే ప్రజలు భయపడి, కాల్చటం మానేయరా స్వామీ..!

 శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! ప్రజలేమీ అవివేకులు కారు. మంచిచెడులు తెలియనివారు అంతకన్నా కాదు. తెల్లవారి లేచింది మొదలు ఎంత కాలుష్యాన్ని చూస్తున్నారు ప్రజలు. ఆటోల నుంచి వచ్చే కిరోసిన్ వాసనకి ఎంతమంది ఆస్త్మా బారినపడుతున్నారో, నిరంతరం బస్సులు, కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు వాయించే హారన్లకి ఎంత శబ్దం కాలుష్యం అవుతోందో, ప్లాస్టిక్ వల్ల ఎంత జల కాలుష్యం అవుతోందో నా ప్రజలకు బాగా తెలుసు. అటువంటిది టపాసుల వలన కాలుష్యం అంటే ఎవ్వరూ విశ్వసించరు. పైగా కాకరపువ్వొత్తుల వల్ల, మతాబుల వల్ల క్రిమికీటకాలు నశిస్తాయని, దోమలు సమూలంగా నాశనమవుతాయని భారతీయులకు తెలుసు. అంతేకాదు, ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభ మవుతుంది. అంటే చీకటి రాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే చలి కూడా మొదలవుతుంది. వీటిని పారద్రోలడానికే ఈ పండుగ అనే విషయం ప్రతి భారతీయ పౌరుడికి తెలుసు.

 సత్యభామ: ఈ ప్రచారం చేసేది కూడా మీ ప్రజలేగా స్వామీ! అయినా ఇలా ఎందుకు చేస్తున్నట్లో అర్థం కావటం లేదు స్వామీ!

 శ్రీకృష్ణుడు: ఏముంది? నేటి యువత విదేశీ వ్యామోహంలో కొట్టుకుపోతోంది. వారికి మన భారతీయ విలువలు తెలియడానికి ఇంకా కొంతకాలం పడుతుంది సత్యా!

 సత్యభామ: స్వామీ! మన పండుగలలో సైన్స్ కూడా ఉందంటారు కదా!

 శ్రీకృష్ణుడు: మనవారికి రోగనిరోధకశక్తి ఎక్కువ. అందుకు కారణం ఏ ఋతువుకు తగ్గట్టు ఆయా పండుగలు, ఆహారపు అలవాట్లూనూ... ఇన్ని పండుగలు, ఇంత వైజ్ఞానిక శాస్త్ర ప్రగతి మనకు ఉన్నంతగా మిగతా దేశాలకు లేవు. అవి తెలియక, ఈ వెర్రిమొర్రి ఆలోచనలు కలుగుతున్నాయి.  

 సత్యభామ: ఇంకా... నరులు ఇంటింటా వాడే దోమల మందులు, రసాయనాలు, ఇంటిని పరిశుభ్రపరచే ద్రవాలు... వీటికి మించిన కాలుష్యం లేదట కదా స్వామీ! ఏడాదికి ఒకసారి జరుపుకునే ఈ పండుగ వలన సత్యాశ్రీకృష్ణులకు పేరు వచ్చేస్తుందేమోననే ఈర్ష్య ఉన్నవారు ఇలా ఈ పండుగ గురించి దుష్ర్పచారం చేస్తున్నారనిపిస్తోంది స్వామీ!

 శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! మన మీద ఈర్ష్య అసూయలు కాదు, వారు ఇలా కాల్చవద్దని చెప్పడంలోనూ ఒక ఆంతర్యం ఉంది. కొందరు స్వార్థపరులు ఈ సమయంలో పెద్దపెద్ద ధ్వనులు వచ్చే టపాసులు కాల్చుతారు. దానివల్ల పసిపిల్లలు,అమాయక ప్రాణులు ఇబ్బంది పడతాయి. అందువలన  చెప్పి ఉంటారనుకోవచ్చు కదా! ఎవరు ఏది చెప్పినా అందులోని మంచిని గ్రహించటానికి ప్రయత్నించాలి సత్యా!

 నారదుడు: అయ్యా! పరంధామా! మీ మాటలు నాకు తేనెల ఊటలా ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను స్వామీ! ఈ పండుగకు బాణాసంచా కొనకుండా ఆ డబ్బును సత్కార్యాలకు వినియోగించమని ప్రచారం చేస్తున్నారు, మరి అవేవో ఇంగ్లీషువారి దినాలుంటాయి కదా, వాలెంటైన్స్‌డే, మదర్స్ డే... ఇత్యాది దినాలకు ఖర్చు చేయవద్దని ఇటువంటి ప్రచారం ఎందుకు చేయరు స్వామీ!

 శ్రీకృష్ణుడు: నారదా! మనం వాటి గురించి ఆలోచించటం అనవసరం. ‘శ్రీకృష్ణుడు’ అంటే ‘లోకకల్యాణం కోసం ప్రభవించినవాడు’ అని ప్రపంచమంతా తెలిసిందే. నరకుడిని చంపిన రోజు లోకానికి ఆనందం కనుక ఈ పండుగను జరుపుకోవలసిందే... మరోమాట... దుష్టసంహారం జరిపిన ఇటువంటిరోజులను పండుగగా జరుపుకుంటే... కొందరైనా శిష్టరక్షణ కార్యానికి పూనుకుంటారు. ఈ పండుగలు మానుకుంటే మంచిపనులు చేయాలనే అభిలాష కొరవడుతుంది. అనునిత్యం లోకకల్యాణం కోసం ఎవరో ఒకరు పాటుపడుతూనే ఉండాలి. అందుకే ఈ పండుగలు పబ్బాలూనూ. పిండివంటలు నైవేద్యాలు పెట్టడమూనూ...

 సత్యభామ: ఎవ్వరు ఎన్ని మాటలన్నా మీ నవ్వురాజిల్లెడు మోములో లవలేశం క్రోధం కూడా కనపడదు కదా స్వామీ.! నీ నుంచి నేను ఆ లక్షణం నేర్చుకోగలిగితే బాగుంటుంది.

 శ్రీకృష్ణుడు: ఒకటి చెప్పనా సత్యా! నీకు స్వాభిమానం ఎక్కువ. అది ప్రతి స్త్రీకి అలంకారం. నీలో ఆ గుణం చూసి అందరూ సత్యలా ఉండాలనుకుంటున్నారు. అంతకుమించిన ఘనత ఏముంది.

 నారదుడు: అయ్యా! సత్యాపతీ! మీరిద్దరూ ఒకరినొకరు ప్రశంసలలో ముంచెత్తుకోవడమేనా, భూలోక యాత్ర ప్రారంభించేది లేదా...

 శ్రీకృష్ణుడు: ఇదిగో బయలుదేరుతున్నాము మహర్షీ! సత్యా... రథాన్ని పోనియ్యి ... భూలోకవాసులు జరుపుకునే ఈ దీపావళిని కన్నుల పండువుగా వీక్షిద్దాం...

 - డా.పురాణపండ వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement