ఆనందోత్సాహాల వెలుగు పూలు | Diwali on Wednesday | Sakshi
Sakshi News home page

ఆనందోత్సాహాల వెలుగు పూలు

Published Sun, Nov 4 2018 12:53 AM | Last Updated on Sun, Nov 4 2018 12:53 AM

Diwali on Wednesday  - Sakshi

లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం దీపావళి అమావాస్య. రావణవధ అనంతరం శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి.

అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో బాణాసంచా కాలుస్తారు.

ఒకనాడు కృష్ణభగవానుడు కొలువుతీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు దుర్వాసమహర్షి తదితరులందరూ వచ్చి ‘కృష్ణా, నరకాసురుని ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. వాడు దేవతల తల్లి అదితి కుండలాలను తస్కరించాడు. వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహరించే మణిపర్వతాన్ని మరలించి వేశాడు. అమిత బలాఢ్యుడైన నీవే వానిని పరిమార్చాలి’ అన్నారు. అపుడు కృష్ణుడు ‘నేను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతలనందరిని సాంత్వన పరిచాడు. తరువాత సత్యభామా సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ప్రాగ్జోతిషపురానికి వెళ్లాడు.

అక్కడ ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. కృష్ణుడు ప్రళయ కాలంలో మేఘం ఉరిమినట్లుగా తన పాంచజన్యం పూరించాడు. ఆ శబ్దానికి నిద్రనుంచి లేచి యుద్ధానికి దూకబోయిన మురాసురుని మట్టుపెట్టాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు ఏడుగురు కృష్ణుడి మీదికి యుద్ధానికి వచ్చారు. ఆ ఏడుగురిని కూడా యమపురికి పంపించాడు కృష్ణుడు. ఈ వార్త నరకాసురుడికి చేరి యుద్ధానికి వచ్చాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది. రాక్షసుల మస్తకాన్ని ఖండించడానికి అనువయిన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుస్సును కృష్ణుడు సత్యభామ చేతికి అందించాడు.

వెంటనే యుద్ధాన్ని ప్రారంభించి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణాన్ని తీసి వింటికి తొడుగుతుంటే వీర రసం, శృంగార రసం, భయరసం, రౌద్ర రసాలు ఆమెలో తాండవిస్తున్నాయి. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణాలను ప్రయోగించడం ప్రారంభించారు. భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటికి అత్తుకుపోయిన సత్యభామ వంక చూసిన కృష్ణుడు ‘సత్యా, నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను’ అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు.

చివరికి ప్రాణాలతో ఉన్న నరకుడి మీదికి తన చేతిలో వున్న సుదర్శన చక్రాన్ని.ప్రయోగించగానే నరకాసురుని తల తెగి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడనే సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించారు. వాడు చతుర్దశినాడు చచ్చిపోయాడు. అందుకనే మనం నరకచతుర్దశి అంటాము. ఆ మరునాటిని దీపావళి అమావాస్య అంటాము.

దీపావళి నాడు ఆచరించవలసినవి – ఈ రోజున తెల్లవారు జామున్నే పెద్దల చేత తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.

దీపావళి నాడు విధివిధానంగా లకీ‡్ష్మ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో ప్రవేశిస్తుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి.

దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?
దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్తంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి.

అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టిప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. చీకటిపడే సమయంలో దీపదానం చేసి, మండుతున్న కట్టెల్ని తిప్పాలి. ఇలా తిప్పడం చేత పీడ పోతుందని చెప్తారు. నిజానికి దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దీవిటీలు వెలిగించి తిప్పుతారు.

ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతసిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీపూజ చేయాలి. దీపావళీ నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతోకొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ దరిద్ర దేవతను సాగనంపాలని శాస్త్రవచనం.

బలిపాడ్యమి
దీపావళి మరునాటినుంచి కార్తీకమాసం ఆరంభమవుతుంది. కార్తీక శుద్ధపాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈరోజు బలిచక్రవర్తిని పూజించి ‘‘బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో భవిష్యేంద్ర సు రారాతే పూజేయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి.

భగినీ హస్త భోజనం
కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ పేరిట పండుగను జరుపుకుంటారు. ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా దేవి (నది)ని స్మరించి పూజించాలి. దీన్నే భాయ్‌ దూజ్‌ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్‌ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ.


– కృష్ణకార్తీక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement