Sri Krishnudu
-
కృష్ణుడు ఇంత బరువు ఉంటాడా!
‘‘వ్రతం ముగిసింది. ఇంకా దానాలు ఉన్నాయి. ముందు పతిదానం కానిద్దామా’’ అన్నది సత్యభామ. ‘‘అలాగే కానివ్వండి. అయితే దంపతులిద్దరు పారిజాతవృక్షం దగ్గరకు రావాలి. మహర్షి! దానగ్రహీతలు తమరు కూడా దయచేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు. ‘‘అవశ్యం’’ అని బయలుదేరాడు నారదుడు. ‘‘కొంచెం జలం అక్షతల్లోకి తీసుకొని దారాదత్తం చేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు. అలాగే చేసింది సత్యభామ. ‘‘భాగ్యమన్న నాదే భాగ్యం... మహాభాగ్యం’’ సంబరపడిపోయాడు నారదుడు. ‘‘అమ్మా! ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా’’ అడిగాడు బ్రాహ్మణుడు. ‘‘అబ్బా! ఇంకా అదొక ఆలస్యం ఉందా!’’ అన్నది సత్యభామ. ఈలోపు నారదమహర్షి అందుకొని– ‘‘అంత తొందరపడతారేం ఆచార్యా! బ్రాహ్మణులను ఉండనివ్వండి. శ్రీకృష్ణతులాభారం కన్నుల పండుగగా చూసి మరీ వెళతారు’’ అన్నాడు. ‘‘అవును మహర్షి! ముందు తులాభారం తూచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతే వారిని సత్కరిస్తాను’’ అన్నది సత్యభామ. కృష్ణుడిని త్రాసులో కూర్చోబెట్టారు. ‘‘నళినీ... నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచండి’’ అని చెలికత్తెను ఆదేశించింది సత్యభామ. ‘‘అయ్యయ్యో! ఒక్క వారం నగలే. కృష్ణయ్యబాబు ఇంతేనా!’’ నోరెళ్లబెట్టాడు వసంతయ్య. ‘‘స్వామీ! మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి’’ అంటూ కోపగించుకుంది సత్యభామ. ‘‘విన్నావా వసంతయ్య’’ అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో. ‘‘విన్నాను... వేశాను’’ అని నోటికి తాళం వేసినట్లుగా నటించాడు వసంతయ్య. ఆ బరువుకు కృష్ణుడు తూగలేదు. ‘‘నళినీ... మిగతా ఆరువారాల నగలు కూడా తెచ్చి వేయండి’’ అని చెలికత్తెని ఆదేశించింది సత్యభామ. అలాగే చేసింది నళిని. కానీ ఏంలాభం! ఈ బరువుకూ కృష్ణుడు తూగలేదు. దీంతో సత్యభామకు సహనం నశించింది. అనుమానం వచ్చింది. ‘‘వసంతయ్య! త్రాసులో ఏమీ మోసం లేదుకదా’’ అని అడిగింది. తనిఖీ చేసి– ‘‘త్రాసులో ఏమీ దోషం లేదమ్మా. మరి ఉన్న మోసమంతా ఎక్కడో’’ అన్నాడు నర్మగర్భంగా. ‘‘అవన్నీ నన్నేం చేయవు. శమంతకమణి ప్రసాదించిన బంగారాన్ని వెయ్యి. వసంతయ్యా... వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్లు’’ అని ఆదేశించింది సత్యభామ. ‘‘గోవిందా గోవిందా’’ అనుకుంటూ పనివాళ్లతో పాటు వెళ్లాడు వసంతయ్య. తెచ్చిన బంగారాన్ని త్రాసులో వేశారు. అయినప్పటికీ కృష్ణుడు తూగలేదు. ‘‘ఏమిటి మాయా! నా స్వామి ఇంత బరువు ఉన్నాడా!’’ ఆశ్చర్యపోయింది సత్యభామ. ‘‘ఆయన బరువు నాకేం తెలుసమ్మా’’ అన్నాడు నారదుడు. ‘‘అయ్యో ఇప్పుడేమీ చేయడం’’ ఆలోచనలో పడింది సత్యభామ. ఇద్దరు బ్రాహ్మణులు మెల్లగా ఇలా గొణుక్కుంటున్నారు... ‘‘మన సంభావన కూడా ఏమీ మిగిలేటట్లు లేదే’’ అన్నారు ఒకరు. ‘‘మన చేతులు, చెవులకు ఉన్న బంగారాన్ని తీసి అక్కడ పెట్టమనకపోతే అదే పదివేలు’’ అన్నారు ఇంకొకరు. ‘‘దేవీ! నీ వద్ద ఉన్న ధనం ఇదేనా? నేను ఈయనకు బానిస కావాల్సిందేనా’’ అన్నాడు కృష్ణుడు. ‘‘నీవు లేనిదే నేను జీవించలేను’’ అన్నాడు. ‘‘ఆందోళనపడకండి స్వామీ! మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా! ధైర్యంగా ఉండండి’’ అన్నది సత్యభామ. ‘‘ఏమో ప్రియా! మనకు ఎడబాటు తప్పదేమో’’ అన్నాడు కృష్ణుడు. ‘‘తపస్వీచంద్రమా! ధనేతరాలతో కూడా తూచవచ్చాన్నారు కదా?’’ అడిగింది సత్యభామ. ‘‘సాధ్యమైతే అలాగే ప్రయత్నించండి’’ అన్నాడు నారదుడు. ‘‘నళిని, మల్లిక, వసంతయ్య... మందిరంలో గల విలువైన వస్తువులన్నీ తీసుకురండి’’ అని ఆదేశించింది సత్యభామ. అయినప్పటికీ ఫలితం లేదు!! ‘‘మునీంద్రా! ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథుడు ఇంత బరువు ఉంటాడని నేను నమ్మలేకుండా ఉన్నాను’’ అన్నది సత్యభామ. ‘‘పిచ్చితల్లీ! గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువును ఇంత అని నిర్ణయించగలవారు ఎవరని!’’ అన్నాడు నారదుడు. ‘‘నా నాథుడు ఇంత బరువు ఉంటాడని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి!’’ అలక స్వరంతో అడిగింది సత్యభామ. ‘‘నారాయణ నారాయణ! నా మీద అపనింద వేయడం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడనే భ్రమించావుగాని జగన్నాథుడని గ్రహించలేక పోయావు. అది నా అపరాధమేనంటావా!’’ అన్నాడు నారదుడు. ‘‘మహానుభావా! గతాన్ని తరచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణిని స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి’’ అని నారద మహర్షిని వేడుకుంది సత్యభామ. ‘‘సత్యాదేవి! అహంకారభూయిష్టమైన శమంతకమణికి, ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుణ్ణి వెలబోయమంటావా! అంగడి వీధుల్లో పెట్టి సరిౖయెన వెలకు విక్రయిస్తాను. పిచ్చితలీ!్ల చేతనైతే తుల తూచి తీసుకుపో’’ కరాఖండిగా చెప్పాడు నారదుడు. సమాధానం: శ్రీకృష్ణతులాభారం -
ఇద్దరూ ఒకరే... ఒకరిలోనే ఆ ఇద్దరు!
17న శ్రీకృష్ణ జన్మాష్టమి రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత మాణిక్యాలే. రాముడూ... కృష్ణుడూ! ఇద్దరూ భగవంతుడి రూపాలే. అవతార స్వరూపాలే. అన్యాయం చెలరేగిననాడు, అధర్మం పెచ్చరిల్లిననాడు ధర్మాన్ని రక్షించ వచ్చిన మర్మమూర్తులు వారు. కాకపోతే ఒకరు త్రేతాయుగాన... మరొకరు ద్వాపరన. ఒకరు అయోధ్యన. మరొకరు ద్వారకన. ఇద్దరూ ఇద్దరే. శ్రీరాముడు అనగానే మర్యాదకు సూచిక. శ్రీకృష్ణుడనగానే యుక్తికి ప్రతీక. శ్రీరాముడంటే ఓ భయంతో కూడిన గౌరవం... శ్రీకృష్ణుడంటే మనవాడనే దగ్గరితనం. ఎందుకీ తేడా...? ఎందుకంటే... మనమందరం రోజూ చదివే ఆ శ్లోకాలే చూద్దాం. ‘ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం’... అని నీలమేఘశ్యాముణ్ణి... ఆ రాముణ్ణి స్తుతిస్తారు. కేళీవిలాసంగా ఉండే ఆ శిఖిపింఛమౌళిని... ‘నాసాగ్రే నవమౌక్తికం... కరతలే వేణుం... కరే కంకణం’... అంటూ నుతిస్తారు. రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత మాణిక్యాలే. కానీ ఆ ఇద్దరిలోనూ కొన్ని తేడాలు... నిశితంగా చూస్తే తప్ప కనిపించని అత్యంతసూక్ష్మమైన నిత్యవ్యత్యాసాలు... వాటిలో కొన్ని... శ్రీరాముడు ధీరోదాత్తుడైనా స్థిరచిత్తుడే అయినా సీతను ఎత్తుకెళ్లిన సందర్భంలోనో, అడవిలో ఉన్న వేళలోనైనా అప్పుడో ఇప్పుడో కాస్తో కూస్తో దుఃఖిస్తాడు. కనుల నీరు దొర్లిస్తాడు. కానీ కృష్ణుడో... ఆ మోమున ఎప్పుడూ చిద్విలాసమైన చిరునవ్వే. ఆ నవ్వే ఒక చిరునవ్వులదివ్వె. రాముడు ఎప్పుడూ సలహాలు స్వీకరిస్తూనే ఉంటాడు. హనుమంతుడివో, సుగ్రీవుడివో, లంక గుట్టు తెలుసుకోడానికి, దాన్ని ముట్టడించడానికి విభీషణుడివో. ఇలా రాముడు తాను గెలవడానికి ఇతరుల సహాయం తీసుకుంటుంటాడు. కానీ కృష్ణుడు ఎప్పుడూ సలహాలిస్తూ ఉంటాడు... జరాసంధ సంహారానికి భీముడికో. ఖాండవదహనానికి అర్జునుడికో. కురుక్షేత్ర యుద్ధానికి ధర్మజుడికో. ఎవరో గెలవడానికి కృష్ణుడు తానెప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు. ఇలా... అందరి సాయం రాముడి గెలుపు... కృష్ణుడి సాయం అందరి గెలుపు. విశ్వామిత్రుడి వెంట వెళ్తున్న బాల రామలక్ష్మణులను చూసినా, అరణ్యవాసం చేస్తున్న యౌవన అన్నదమ్ముల్ని వీక్షించినా కనిపించే దృశ్యం వేరు. ‘నిశాచర వినాశకర’ స్వరూపాలైన వారు ధనుర్బాణాలతో ఆయుధధారులై మిలటరీ యూనిఫామ్‌లో ఉంటారు. కానీ కృష్ణుడో... ‘కరే కంకణం, కరతలే వేణుం’ అంటూ పిల్లనగ్రోవిని వరించిన ఆ వేణుధరుడి వేణిలో పింఛం అలంకరించుకుని ఎప్పుడూ మఫ్టీలో ఉంటాడు. జలజాతాసనవాసవాది సురపూజా భాజనంబై తనర్చు ఆ కృష్ణుడు... బ్రహ్మాది దేవతలంతా స్తుతించే, నుతించే, ఆర్తితో కీర్తించే స్థానంలో ఉన్న ఆ కృష్ణుడు... ఆదిదేవుడైన ఆ విష్ణువు రూపానికి దగ్గరగా ఎలా ఉంటాడో చూడండి. ఆర్తత్రాణపరాయణత్వంలోనూ, హడావుడి సమయంలోనూ శంఖచక్రయుగముం జేదోయి సంధింపక భయపెట్టక ఉండే విష్ణుమూర్తి మూల రూపానికి కృష్ణావతారం ఎంత దగ్గరగా ఉంటుందో చూడండి. ధనుస్సు లాంటి ఆయుధాన్ని ధరించి న వారిని చూస్తే భయంతో కూడిన గౌరవం. అదే సంగీత ఝరిని ప్రసరింపజేసే వేణువును ధరించిన వాడిని చూస్తే నిర్భయంతో కూడిన దగ్గరిదనం. అందుకే రామాయణమూర్తి కంటే మహాభారతమూర్తే ముచ్చటగా కనిపిస్తాడు. మనవాడే అనిపిస్తాడు. తేడాలేముంటేనేం... ఇద్దరూ ఇద్దరే. దైవావతారాలే. కైవల్యమొసగగల కారుణ్యరూపాలే.అందుకే ముసలీముతకా వారిద్దరినీ కలుపుకుని ‘కృష్ణా.. రామా’ అనుకుంటుంటారు. కొత్తగా బిడ్డను కలిగే వయసులో ఉన్నవారు ఆ ద్వయంలో ఏ ఒక్కరినీ వదల్లేక ‘రామకృష్ణుడ’ంటూ తమ బిడ్డలకు ద్వంద్వసమాసయుక్తమైన వాళ్ల పేరిడుతుంటారు. ముకుళిత హస్తయుగళంతో, మంగళగళంతో, హారతిపళ్లెంతో, తులసీదళంతో ఆ ఇద్దరికీ ఇదే మా ప్రార్థన. - కె.రాంబాబు -
నివృత్తం: శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలెందుకు?
శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కారణం తెలుసుకోవాలంటే రామావతారంలోనికి వెళ్లాలి. రాముడిది పురుషులకు కూడా మోహం కలిగించేంత సుందర రూపం. వేల మంది మునులు శ్రీరాముడి గాఢపరిష్వంగంకోసం పరితపించారట. అయితే శ్రీరాముడు ‘‘మునులారా! ఇప్పుడు నేను ఏకపత్నీవ్రతంలో ఉన్నాను. కాబట్టి మీ కోరికను ఈ అవతారంలో తీర్చడం సాధ్యం కాదు. కాబట్టి కృష్ణావతారంలో మీరంతా గోపికలుగా పుట్టి నిరంతరం నన్ను అంటిపెట్టుకుని ఉండండి’’ అని వరం ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్వాపరయుగంలో గోపికలుగా జన్మించిన పదహారువేలమంది మునులకు ఇష్టసఖుడిగా మారాడు. సన్నాయి నొక్కులేగానీ సంగీతం లేదన్నట్టు... ఓ ఊళ్లో ఓ యువకుడు ఉండేవాడు. ఎప్పుడూ ఖాళీగా ఉండటంతో అందరూ అతణ్ని ఏడిపిస్తూండేవారు. దాంతో ఉన్నట్టుండి కనిపించకుండా పోయి, పది రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికెళ్లావని అడిగితే... సన్నాయి వాయించడం నేర్చుకోవడానికి పట్నం పోయానని చెప్పాడు. అది నమ్మిన ఊరిజనం పండుగనాడు అతడి కచేరీ ఏర్పాటు చేశారు. అతగాడు ఎంత సేపటికీ పీకను శృతిచేస్తూ ఉన్నాడు తప్ప వాయించడం లేదు. దాంతో ‘సన్నాయి నొక్కులే గానీ సంగీతం లేనట్టుంది, వీడికసలు వచ్చో రాదో’ అంటూ నిలదీస్తే, అబ్బాయిగారి అసలు స్వరూపం బయటపడిందట. అప్పటి నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కొంతమంది ఏమీ తెలియక పోయినా తెలిసినట్టు గొప్పలు పోతుంటారు. అసలు విషయం బయటపడ్డాక నీళ్లు నములుతారు. అలాంటప్పుడు ఈ సామెత వాడతారు. -
మానవ సేవే మాధవ సేవ!
పరమ భక్తుడెప్పుడూ మోక్షాన్ని కోరడు. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ‘నందబాలా చక్కని భార్య, లెక్కకు మించిన శిష్యగణం, ఆర్థిక సంపద, లౌకిక స్థిరత్వం వంటి భౌతిక సుఖాలేవీ నాకు వద్దు. నేను మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తే మాత్రం అన్ని జన్మలలోనూ నీపై భక్తితో ఉండాలని, అచంచల భక్తితో ఉండాలని ప్రార్థిస్తాను’ అన్నాడు. నిజమైన భక్తుడు ఆయన నామస్మరణ, ఆయన లక్షణాలకు ఆకర్షితుడవుతూ ముక్తిని గురించి పట్టించుకోడు. శ్రీ బిల్వమంగళ ఠాకూరు ఇలా చెప్పారు: ‘స్వామీ! నిన్ను అన్ని ప్రదేశాల్లో పొందగలను. అన్ని వస్తువుల్లోనూ నీవే. అంతటా నీవే. అప్పుడు ఇక ముక్తి నా వాకిలి ముందు నిలుచుని నన్ను సేవించడానికి ఎదురుచూస్తుంది’. కనుక నిజమైన భక్తులకు ముక్తి, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, భౌతిక సుఖం ముఖ్యం కావు. భక్తులు ఐచ్ఛికంగా తమ సేవలందించే వినూత్న పద్ధతి చిలుకూరు ఆలయంలో కొనసాగుతున్నది. ఆలయంలో జరిగే వివిధ సేవలకు భక్తులు స్వచ్ఛందంగా రావలసిందిగా మైకులో మేము కోరుకుంటాము. భాగవత సేవయే భగవంతుని సేవ. స్వచ్ఛందంగా వచ్చే ఈ భక్తులు ఇతర భక్తులకు సహాయపడుతూ వారికి దర్శనం సులభతరం చేస్తారు. నేలను ఊడ్చి శుభ్రపరచడం, ప్రసాదాన్ని పంచడం వగైరా పనులు చేస్తారు. కొంతకాలం క్రితం జరిగిన ఆసక్తికరమైన ఘటన గురించి చెబుతాను. తన బంధువులతో వచ్చిన ఒక చిన్న అమ్మాయి గోపురం దగ్గర మెట్లపై కూర్చుని కనిపించింది. ఖాళీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి ‘అలా ఖాళీగా ఉండేబదులు ఇక్కడకొచ్చి భక్తులకు పూవులు పంచు’ అని మైకులో చెప్పాను. ఆమె సంతోషంతో రెండు గంటలపాటు ఆ పనిచేసింది. మూడు నెలల తర్వాత మళ్లీ వచ్చిన ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి తన అనుభవాన్ని చెప్పింది. అప్పట్లో పుణెనుంచి హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిందట. వారితోపాటు చిలుకూరు వచ్చిందట. బంధువులు 108 ప్రదక్షిణలు చేస్తుండగా ఈమె పూలు పంచింది. అప్పటికే ఆమె ఎంబీఏ ఫైనల్ పరీక్షలు రాసి కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లిందట. పుణె వెళ్లినవెంటనే ఆశ్చర్యంగా ఆమెకు ఒక పెద్ద సంస్థనుంచి ఉద్యోగంలో చేరమంటూ లేఖ అందిందట. ‘ఇదంతా ఆ భగవంతుని కృప. మీరు ఆయనకు సేవ చేసే అవకాశం ఇచ్చినందువల్లనే ఇది సాధ్యమైంది. మీకు ధన్యవాదాలు’ అంటూ సంతోషంగా చెప్పింది. భగవంతుడు ఆ చిన్నారిని ఆవిధంగా ఆశీర్వదించినందుకు నేను కూడా సంతోషించాను. భక్తులు హుండీల్లో వందలకొలదీ రూపాయలు వేస్తుంటారు. దానికి బదులు ఏ ఆలయానికి వెళ్లినప్పు డైనా తమ సేవలు అందించడానికి ప్రయత్నించాలి. గుడికొచ్చే భక్తులకు సహకరించడం, ఊడ్వడం వంటి సేవలు చేయాలి. ఆలయంలో ఊడిస్తే విష్ణులోకంలో నివసించేందుకు అర్హత లభిస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణునితో ఉద్ధవుడు ఇలా చెబుతాడు: ‘స్వామీ! నీ సేవలో పడిన భక్తునికి ముక్తి, ఆర్థికాభివృద్ధి, మొదలైన వాటిపై ఆసక్తి ఉండదు. వీటన్నిటివల్లా కలిగే సుఖాలన్ని టినీ నీ సేవలో అతడు సులభంగా పొందగలు గుతాడు. నాది ఒకే ప్రార్థన. ఎన్ని జన్మలైనా నీపై నాకు అచంచల భక్తివిశ్వాసాలు సదా ఉండుగాక’. కనుక మానవసేవే మాధవసేవ అని అందరూ గుర్తుంచుకోవాలి. - సౌందర్‌రాజన్, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు -
శ్రీకృష్ణసత్యన్నారదీయం
దీపావళి సందర్భంగా శ్రీకృష్ణుడు, సత్యభామ, నారదుల సంభాషణ. నారదుడు: స్వామీ! శ్రీకృష్ణపరమాత్మా! అడగ కూడదని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుతున్నాను... ఎక్కడకు బయలుదేరారు స్వామీ. సత్యభామ: అయ్యా! నారదమునీంద్రా! ఆచారాలు సంప్రదాయాలు తెలిసి కూడా నువ్వు ఇలా అడగటం భావ్యమేనా. అయినా ఈ పూట మేం ఎక్కడికి వెళ్తామో ముందుగా నీకే తెలుస్తుంది కదా త్రిలోకసంచారీ! నారదుడు: అయ్యో! తెలియక కాదమ్మా! అన్నీ తెలిసినవాడినే. తెలుసు కనుకనే అడగవలసి వచ్చింది. సత్యభామ: అంతటి అత్యవసరం ఏమొచ్చింది మునివర్యా! నారదుడు: అమ్మా! సత్యాభామా దేవీ! నిన్నటికి నిన్న భూలోకమంతా ఒకసారి పర్యటించి వచ్చాను. అక్కడ కొందరు ప్రజలు మాట్లాడుకున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ విషయాలు మీకు విన్నవించుకుందామని వచ్చాను తల్లీ! శ్రీకృష్ణుడు: ప్రజలు ఏమనుకుంటారు నారదా! ఈ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, బాణాసంచా కాల్చుకుంటూ సంబరంగా జరుపుకోవాలనుకుంటారు అంతేగా! ఇందులో ప్రత్యేకంగా విన్నవించుకోవలసినదేం ఉంటుంది! నారదుడు: అక్కడే మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు స్వామీ! నేను కొన్ని ప్రాంతాలు పర్యటించి, దీపావళి పండుగను ఎవరెవరు ఏ విధంగా జరుపుకోవాలనుకుంటున్నారో తెలుసుకుందామని ఒక సర్వే నిర్వహించాను. వారి మాటలు నన్ను అవాక్కయ్యేలా చేశాయి. సత్యభామ: ఊరికే ఉత్కంఠ కలిగించేలా కాకుండా అసలు విషయం ఏమిటో శలవియ్యవయ్యా బ్రహ్మచారీ! నారదుడు: వస్తున్నా! ఆ విషయానికే వస్తున్నాను! శ్రీకృష్ణుడు: ఊఁ ప్రారంభించు. నారదుడు: ఎలా ప్రారంభించమంటారో అర్థం కావటం లేదు స్వామీ! వారి మాటలు వినలేక నా చెవులు మూసుకున్నాను. సత్యభామ: అంత వినరాని మాటలు ఏమన్నారు కలహభోజనా! నారదుడు: తల్లీ! నన్ను కలహ భోజనా అన్నా సరే! ఏమన్నా సరే! కాని, నేను చెబుతున్నది వాస్తవం. నా చెవులతో విన్న మాటలు నోటితో పలకలేను. విన్నందుకే నా చెవులలో దివ్య మందాకినీ జలం పోసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నోటితో పలికి నోటిని కూడా సంప్రోక్షణ చేసుకోమంటావా తల్లీ! శ్రీకృష్ణుడు: ఏం జరిగింది నారదా! ముందువెనుకలు లేకుండా మాట్లాడుతున్నావు. ఇక ఆ మాటలు కట్టిపెట్టి అసలు విషయానికి రావయ్యా! నారదుడు: ఏముంది స్వామీ! మీరు సత్యా సమేతులై, ద్వాపరయుగంలో నరకాసుకర సంహారం చేసి ప్రజలకు చీకటిని పారద్రోలి వెలుతురును ప్రసాదించారు. ఆ సంతోషంతో నాటి నుంచి భూలోకవాసులంతా నరకచతుర్దశి, దీపావళి జరుపుకుంటున్నారు. ఈ సంగతి తెలిసిందేగా. సత్యభామ: అవును! ఇందులో వినరాని మాటలేం ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే కదా. ముల్లోకాలలోనే కాకుండా కలియుగంలో సైతం కిందటి సంవత్సరం వరకు ఇలాగే జరుగుతూ వస్తోంది కదా! నారదుడు: ప్రజల అమాయకత్వమనుకోవాలో, వారి అతి తెలివితేటలను కోవాలో అర్థం కావట్లేదు స్వామీ! ప్రజలట బాణసంచా కాల్చకూడదట. అలా కాల్చటం వలన వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం ఏర్పడుతుందట. ఈ విడ్డూరం ఎన్నడైనా విన్నామా కన్నామా స్వామీ! మరీ ఇంత అన్యాయమా! వారంరోజులుగా ఈ విషయమై విస్తృత ప్రచారం జరుగుతోంది. పండుగనాడు కేవలం దీపాలు మాత్రమే వెలిగించుకోవాలట, టపాసులు కాల్చకూడదట. ఎక్కడ చూసినా ఈ ప్రచారం జోరుగా, హోరుగా, వడివడిగా సాగుతోంది. కొందరైతే సోషల్ నెట్‌వర్క్‌లలో మెయిల్స్ పంపుతున్నారు. ఏం చెప్పమంటారు స్వామీ! శ్రీకృష్ణుడు: అంతే కదా నారదా! ఒకటి చెప్పనా నా ప్రజలేమీ తెలివితక్కువ వారు కాదు. వారు టపాసులు కాల్చితీరతారు. ఆకాశంలో హరివిల్లులు సృష్టిస్తారు. భూలోకంలోకి వెన్నెల వెలుగులు, సుధామయూఖాలు తీసుకువస్తారు. నువ్వేమీ విచారించకు నారదా! సత్యభామ: ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంటే ప్రజలు భయపడి, కాల్చటం మానేయరా స్వామీ..! శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! ప్రజలేమీ అవివేకులు కారు. మంచిచెడులు తెలియనివారు అంతకన్నా కాదు. తెల్లవారి లేచింది మొదలు ఎంత కాలుష్యాన్ని చూస్తున్నారు ప్రజలు. ఆటోల నుంచి వచ్చే కిరోసిన్ వాసనకి ఎంతమంది ఆస్త్మా బారినపడుతున్నారో, నిరంతరం బస్సులు, కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు వాయించే హారన్లకి ఎంత శబ్దం కాలుష్యం అవుతోందో, ప్లాస్టిక్ వల్ల ఎంత జల కాలుష్యం అవుతోందో నా ప్రజలకు బాగా తెలుసు. అటువంటిది టపాసుల వలన కాలుష్యం అంటే ఎవ్వరూ విశ్వసించరు. పైగా కాకరపువ్వొత్తుల వల్ల, మతాబుల వల్ల క్రిమికీటకాలు నశిస్తాయని, దోమలు సమూలంగా నాశనమవుతాయని భారతీయులకు తెలుసు. అంతేకాదు, ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభ మవుతుంది. అంటే చీకటి రాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే చలి కూడా మొదలవుతుంది. వీటిని పారద్రోలడానికే ఈ పండుగ అనే విషయం ప్రతి భారతీయ పౌరుడికి తెలుసు. సత్యభామ: ఈ ప్రచారం చేసేది కూడా మీ ప్రజలేగా స్వామీ! అయినా ఇలా ఎందుకు చేస్తున్నట్లో అర్థం కావటం లేదు స్వామీ! శ్రీకృష్ణుడు: ఏముంది? నేటి యువత విదేశీ వ్యామోహంలో కొట్టుకుపోతోంది. వారికి మన భారతీయ విలువలు తెలియడానికి ఇంకా కొంతకాలం పడుతుంది సత్యా! సత్యభామ: స్వామీ! మన పండుగలలో సైన్స్ కూడా ఉందంటారు కదా! శ్రీకృష్ణుడు: మనవారికి రోగనిరోధకశక్తి ఎక్కువ. అందుకు కారణం ఏ ఋతువుకు తగ్గట్టు ఆయా పండుగలు, ఆహారపు అలవాట్లూనూ... ఇన్ని పండుగలు, ఇంత వైజ్ఞానిక శాస్త్ర ప్రగతి మనకు ఉన్నంతగా మిగతా దేశాలకు లేవు. అవి తెలియక, ఈ వెర్రిమొర్రి ఆలోచనలు కలుగుతున్నాయి. సత్యభామ: ఇంకా... నరులు ఇంటింటా వాడే దోమల మందులు, రసాయనాలు, ఇంటిని పరిశుభ్రపరచే ద్రవాలు... వీటికి మించిన కాలుష్యం లేదట కదా స్వామీ! ఏడాదికి ఒకసారి జరుపుకునే ఈ పండుగ వలన సత్యాశ్రీకృష్ణులకు పేరు వచ్చేస్తుందేమోననే ఈర్ష్య ఉన్నవారు ఇలా ఈ పండుగ గురించి దుష్ర్పచారం చేస్తున్నారనిపిస్తోంది స్వామీ! శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! మన మీద ఈర్ష్య అసూయలు కాదు, వారు ఇలా కాల్చవద్దని చెప్పడంలోనూ ఒక ఆంతర్యం ఉంది. కొందరు స్వార్థపరులు ఈ సమయంలో పెద్దపెద్ద ధ్వనులు వచ్చే టపాసులు కాల్చుతారు. దానివల్ల పసిపిల్లలు,అమాయక ప్రాణులు ఇబ్బంది పడతాయి. అందువలన చెప్పి ఉంటారనుకోవచ్చు కదా! ఎవరు ఏది చెప్పినా అందులోని మంచిని గ్రహించటానికి ప్రయత్నించాలి సత్యా! నారదుడు: అయ్యా! పరంధామా! మీ మాటలు నాకు తేనెల ఊటలా ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను స్వామీ! ఈ పండుగకు బాణాసంచా కొనకుండా ఆ డబ్బును సత్కార్యాలకు వినియోగించమని ప్రచారం చేస్తున్నారు, మరి అవేవో ఇంగ్లీషువారి దినాలుంటాయి కదా, వాలెంటైన్స్‌డే, మదర్స్ డే... ఇత్యాది దినాలకు ఖర్చు చేయవద్దని ఇటువంటి ప్రచారం ఎందుకు చేయరు స్వామీ! శ్రీకృష్ణుడు: నారదా! మనం వాటి గురించి ఆలోచించటం అనవసరం. ‘శ్రీకృష్ణుడు’ అంటే ‘లోకకల్యాణం కోసం ప్రభవించినవాడు’ అని ప్రపంచమంతా తెలిసిందే. నరకుడిని చంపిన రోజు లోకానికి ఆనందం కనుక ఈ పండుగను జరుపుకోవలసిందే... మరోమాట... దుష్టసంహారం జరిపిన ఇటువంటిరోజులను పండుగగా జరుపుకుంటే... కొందరైనా శిష్టరక్షణ కార్యానికి పూనుకుంటారు. ఈ పండుగలు మానుకుంటే మంచిపనులు చేయాలనే అభిలాష కొరవడుతుంది. అనునిత్యం లోకకల్యాణం కోసం ఎవరో ఒకరు పాటుపడుతూనే ఉండాలి. అందుకే ఈ పండుగలు పబ్బాలూనూ. పిండివంటలు నైవేద్యాలు పెట్టడమూనూ... సత్యభామ: ఎవ్వరు ఎన్ని మాటలన్నా మీ నవ్వురాజిల్లెడు మోములో లవలేశం క్రోధం కూడా కనపడదు కదా స్వామీ.! నీ నుంచి నేను ఆ లక్షణం నేర్చుకోగలిగితే బాగుంటుంది. శ్రీకృష్ణుడు: ఒకటి చెప్పనా సత్యా! నీకు స్వాభిమానం ఎక్కువ. అది ప్రతి స్త్రీకి అలంకారం. నీలో ఆ గుణం చూసి అందరూ సత్యలా ఉండాలనుకుంటున్నారు. అంతకుమించిన ఘనత ఏముంది. నారదుడు: అయ్యా! సత్యాపతీ! మీరిద్దరూ ఒకరినొకరు ప్రశంసలలో ముంచెత్తుకోవడమేనా, భూలోక యాత్ర ప్రారంభించేది లేదా... శ్రీకృష్ణుడు: ఇదిగో బయలుదేరుతున్నాము మహర్షీ! సత్యా... రథాన్ని పోనియ్యి ... భూలోకవాసులు జరుపుకునే ఈ దీపావళిని కన్నుల పండువుగా వీక్షిద్దాం... - డా.పురాణపండ వైజయంతి