శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కారణం తెలుసుకోవాలంటే రామావతారంలోనికి వెళ్లాలి. రాముడిది పురుషులకు కూడా మోహం కలిగించేంత సుందర రూపం. వేల మంది మునులు శ్రీరాముడి గాఢపరిష్వంగంకోసం పరితపించారట. అయితే శ్రీరాముడు ‘‘మునులారా! ఇప్పుడు నేను ఏకపత్నీవ్రతంలో ఉన్నాను. కాబట్టి మీ కోరికను ఈ అవతారంలో తీర్చడం సాధ్యం కాదు. కాబట్టి కృష్ణావతారంలో మీరంతా గోపికలుగా పుట్టి నిరంతరం నన్ను అంటిపెట్టుకుని ఉండండి’’ అని వరం ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్వాపరయుగంలో గోపికలుగా జన్మించిన పదహారువేలమంది మునులకు ఇష్టసఖుడిగా మారాడు.
సన్నాయి నొక్కులేగానీ సంగీతం లేదన్నట్టు...
ఓ ఊళ్లో ఓ యువకుడు ఉండేవాడు. ఎప్పుడూ ఖాళీగా ఉండటంతో అందరూ అతణ్ని ఏడిపిస్తూండేవారు. దాంతో ఉన్నట్టుండి కనిపించకుండా పోయి, పది రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికెళ్లావని అడిగితే... సన్నాయి వాయించడం నేర్చుకోవడానికి పట్నం పోయానని చెప్పాడు. అది నమ్మిన ఊరిజనం పండుగనాడు అతడి కచేరీ ఏర్పాటు చేశారు. అతగాడు ఎంత సేపటికీ పీకను శృతిచేస్తూ ఉన్నాడు తప్ప వాయించడం లేదు. దాంతో ‘సన్నాయి నొక్కులే గానీ సంగీతం లేనట్టుంది, వీడికసలు వచ్చో రాదో’ అంటూ నిలదీస్తే, అబ్బాయిగారి అసలు స్వరూపం బయటపడిందట. అప్పటి నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కొంతమంది ఏమీ తెలియక పోయినా తెలిసినట్టు గొప్పలు పోతుంటారు. అసలు విషయం బయటపడ్డాక నీళ్లు నములుతారు. అలాంటప్పుడు ఈ సామెత వాడతారు.
నివృత్తం: శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలెందుకు?
Published Sun, Apr 20 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM
Advertisement