sri ramudu
-
రాముడి చిత్రమ్.. వెండితెర పైనా రామ నామం
అంతా రామమయం... ఈ జగమంతా రామమయం... ఈరోజు దాదాపు ఎక్కడ చూసినా రామ నామమే. వెండితెర పైనా రామ నామం వినపడబోతోంది. రాముడిపై ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. త్వరలో కొన్ని చిత్రాలు రానున్నాయి. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముడి చిత్రాల గురించి తెలుసుకుందాం. ► 1980లలో రాముడంటే బుల్లితెర వీక్షకులు చెప్పిన పేరు అరుణ్ గోవిల్. ‘రామాయణ్’ సీరియల్లో రాముడిగా అంత అద్భుతంగా ఒదిగిపోయారాయన. ఇప్పటికీ రాముడంటే చాలామంది అరుణ్∙పేరే చెబుతారు. రాముడి కథాంశంతో ఇటీవల విడుదలైన ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’లో ఆయన నటించారు. ‘‘ఒక కాలాతీత కథలో మళ్లీ నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సాంస్కృతిక వారసత్వం’’ అని పేర్కొన్నారు అరుణ్ గోవిల్. రామ జన్మభూమిపై రజనీష్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలో విడుదలైంది. ► రాముడు ఆజానుబాహుడు.. అందగాడు... వీరం, కరుణ, ప్రేమ... ఇలా సకల గుణాలూ ఉన్నవాడు. ఎన్ని ఉన్నా అసలు రాముడంటే సౌమ్యంగా కనిపించాలి. రణ్‌బీర్ కపూర్ దాదాపు అలానే ఉంటారు. అందుకే దర్శకుడు నితీష్ తివారీ తన ‘రామాయణ్’ చిత్రానికి రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ని ఎన్నుకున్నారు. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ చిత్రం షూట్ంగ్ ఈ మధ్యే ముంబైలో ఆరంభించారు. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా ఓ నిర్మాత కాగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ మరో నిర్మాత. ఈ చిత్రంలో రావణుడి పాత్రను కూడా యశ్ చేస్తారట. నేడు ఈ చిత్రం గురించి ఆధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ్’ రిలీజవుతుందని సమాచారం. ► ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్న కంగనా రనౌత్‌ది కథానాయికల్లో సెపరేట్ రూట్. స్వతహాగా రాముడి భక్తురాలైన కంగనా ఇప్పటికే రామ మందిరం నేపథ్యంలో ‘అపరాజిత అయోధ్య’ చిత్రాన్ని, ‘సీత: ది ఇన్కార్నేషన్’ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇవి పట్టాలెక్క లేదు. గత ఏడాది తన ‘తేజస్’ చిత్రం విడుదల సందర్భంగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని సందర్శించారు కంగనా రనౌత్. ఆ సమయంలో అయోధ్యపై తాను కథ సిద్ధం చేశానని పేర్కొన్నారామె. ‘‘ఇది ఆరువందల ఏళ్ల పోరాటం. ఇప్పుడు రామ మందిరం సాధ్యమైంది. అయోధ్యపై కథ రాయడానికి నేను చాలా పరిశోధించాను’’ అని కూడా చెప్పారు కంగనా రనౌత్. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియజేయలేదు. ► తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను మాన్’ గడచిన సంక్రాంతికి విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి రెండో భాగంగా ‘జై హనుమాన్’ రానుంది. ‘జై హనుమాన్’ కథ రాయడానికి ఓ పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తి అన్నట్లుగా ప్రశాంత్ వర్మ ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండో భాగం ప్రధానంగా హనుమంతుడి నేపథ్యంలో సాగుతుందని టాక్. వార్తల్లో ఉన్న ప్రకారం హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తారట. ‘హను మాన్’ చిత్రం చూసి, ప్రశాంత్ వర్మకు రణ్వీర్ ఫ్యాన్ అయ్యారని సమాచారం. ఇటీవల ఈ ఇద్దరి మధ్య ‘జై హనుమాన్’ గురించి చర్చలు జరిగాయని, రణ్‌వీర్‌కు స్క్రిప్ట్ కూడా నచ్చిందని భోగట్టా. కాగా.. ప్రశాంత్–రణ్వీర్ కాంబినేషన్లో రూపొందనున్నది ‘జై హనుమాన్’ కాదు.. వేరే చిత్రం అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ తెరకెక్కించడం ఖాయం. ఈ చిత్రం నటీనటుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇవే కాదు.. రాముడిపై ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన మరిన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
రామాయణం నీతి నేటికీ ఆదర్శనీయమే
మన దేశంలో రాముడు కోట్లాదిమందికి దేవుడు, రామనామాన్ని ఎందరో మంత్రంగా జపిస్తారు. రామాయణం నిజంగానే జరిగిందని చెప్పే ఆధారాలను చరిత్రకారులు చూపిస్తారు. మన దేశంలోనే కాక ఇంకా కొన్ని దేశాలలో కొంత భిన్నమైన రామాయణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆదికవి వాల్మీకి రామాయణం అన్నింటికి మూలం. రామాయణం ఇంత ప్రాచుర్యం పొందడానికి, రామనామం ఇంత గొప్ప ప్రభావం చూపడానికి కారణాలు ఏమిటి? మానవ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని జీవన విధానాలను, జీవిత విలువలను రామాయణం చెప్తున్నది. అవి ఈనాటికీ అందరికీ ఆదర్శం. అందుచేతనే ఈ నాటికి రామాయణం కథ ఎందరి మీదనో ప్రభావం చూపుతున్నది. రామాయణం మానవజీవితానికి, సమస్త మానవాళికి, సర్వకాలాలకు, సర్వ దేశాలకు ఉపయోగపడే శాశ్వత సత్యాలను, జీవన విధానాలను మనకు చెప్తున్నది. రామాయణాన్ని విమర్శించే వారు ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని కులవివక్షతను చూపుతుందని విమర్శిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో అడుగడుగునా అన్ని వర్గాల వారిని పిలిచి సంప్రదించినట్లు ఉంది. రామ పట్టాభిషేకానికి నాలుగు వర్ణాల వారిని ఆహ్వానించినట్లు ఉంది. అదీగాక రాముడు, గుహుని ఆతి థ్యాన్ని స్వీకరించాడు. మాతంగ మహర్షి (ఒక చండాల స్త్రీ కుమారుడు) ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఆ ఆశ్రమంలోని శబరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగ రాముడు ఎక్కడ కుల వివక్షతను చూపలేదు. ప్రపంచంలో ఎన్నో రామాయణ కథలు ఉన్నాయి. భిన్నమైన కథలున్నాయి. వాల్మీకి రామాయణంలో ఒకచోట రాముడు జాబాలి వాదనను తిరస్కరిస్తూ ‘బుద్ధుడు దొంగ వంటి వాడు అతడు చెప్పినది నాస్తిక వాదం అని’ అయోధ్య కాండలో రాముడు అన్నట్లు ఉంది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 623 సంవత్సరంలో జన్మించాడు. క్రీ.పూ. 483లో సమాధి చెందాడు. ఇక రామాయణం ఎప్పుడు జరిగింది? రాముడు క్రీ.పూ. 5114 సంవత్సరంలో జన్మించాడని కొందరు లెక్కలు వేశారు. ఢిల్లీ చాప్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అన్ వేదాస్ డైరెక్టర్ సరోజ్ బాల రామాయణం, భారతాలు జరిగినవనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని రామాయణ కాలం క్రీ.పూ. 7000 సంవత్సరాలలోపు జరిగిందని అంచనా వేశారు. ఏది ఏమైనా గౌతమబుద్ధుని కంటే కనీసం 1000–700 సంవత్సరాల కంటే ముందే రాముడు ఉన్నాడని చరిత్రకారులు చెప్తున్నారు. రాముడు బుద్ధుని కంటే ముందే అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దశావతారాల ప్రకారం కూడా రామావతారం, కృష్ణావతారం తర్వాతనే బుద్ధావతారం అని చెప్తారు. అందుచేత రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అని చెప్పడం కచ్చితంగా జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే రామాయణం జరిగిన ఎన్నో వందల సంవత్సరాల తరువాతనే బుద్ధుడు జన్మించాడు అంటే రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అనడం కచ్చితంగా ప్రక్షిప్తమని చెప్పవచ్చు. అలాగే శంబుకుని కథ ప్రక్షిప్తం అని పండితుల, విజ్ఞుల అభిప్రాయం. రామాయణం ప్రకారం రావణాసురుడు బ్రాహ్మణుడు, వేదాలు చదివిన వాడు. గొప్ప శివ భక్తుడు. అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని అధికారానికి, సంపదలకు, భార్యలకు కొదవలేదు. కానీ శూర్పణఖ తప్పుడు సలహాతో కామప్రేరితుడై సీతను అపహరించి వినాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మొదట బోయవాడు. రాముడు గుహుని, శబరిల ఆతిథ్యాన్ని స్వీకరించడం, సుగ్రీవునితో స్నేహం చేయడం, జటాయువుకు దహన సంస్కారాలు చేయడం ఈవిధంగా ఏ కోణంలో చూసినా రామాయణం కులతత్వాన్ని, వర్ణ వివక్షతను సమర్థించదు. ఏ గ్రంథమైనా, ఏ మహానుభావుని చరిత్ర అయినా ఏ పురాణ కథ అయినా అందులోని నీతి ఏమిటి. అది మానవులకు ఇచ్చే సందేశం ఏమిటి? అనే విషయాలను గమనించాలి. అందులోని మంచిని స్వీకరించాలి. రాముడు దేవుడు కాదని ఎవరైనా వాదిం చినా, రామాయణంలోని నీతిని, జీవన విధానాలను తప్పుపట్టలేడు కదా. గురువుల, పెద్దల సలహా పాటించాలి, ఆడిన మాటకు కట్టుబడి ఉండాలి, తండ్రి మాటను గౌరవించాలి, భర్త కష్టాల్లో పాలు పంచుకోవాలి, అన్నదమ్ములు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ధర్మ మార్గాన్ని అనుసరించాలి. పరస్త్రీలపై కన్ను వేయరాదు. ఇది రామాయణం బోధించిన ప్రధాన జీవన విధానాలు. ఇలాంటి జీవన విధానాలు ప్రపంచ మానవాళికి ఆదర్శం కాదా? జస్టిస్ బి. చంద్రకుమార్ విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
‘కత్తి’ని తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలి!
సాక్షి, అనతపురం : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని భజరంగదళ్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఈ రోజు(మంగళవారం) రెవెన్యూ అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్న కత్తి మహేష్ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సీతారాముల చరిత్రను కించపరిచే విధంగా మాట్లాడుతున్న కత్తిపై కేసు నమోదు చేయాలన్నారు. హిందూ ధర్మగ్రహ యాత్రకు తెలంగాణలో అవకాశం కల్పించి, పరిపూర్ణానంద స్వామీజీకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చర్చావేదికలు పెట్టి మత విశ్వాసాలపై డిబెట్ పెడుతున్న టీవీ9 చానల్‌ను సైతం మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కసాపురం రవి, సోమశేఖర్, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. వినతిపత్రం అందజేస్తున్న భజరంగదళ్ నాయకులు -
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
-
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
సాక్షి, చిత్తూరు : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై ఈ రోజు(సోమవారం) హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. కత్తి ఇటీవల శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే కత్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై కత్తి మహేష్ తండ్రి కత్తి ఓబులేసు స్పందించి శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని పేర్కొన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు. నా కొడుకు హిందువే.. నాస్తికుడు కాదు.. అస్తికుడేనని తెలిపారు. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదని చెప్పారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది నా కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. -
కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు
-
కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు!
సాక్షి, హైదరాబాద్ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని కత్తిని ఆదేశించారు. ఈ మేరకు ఆయనను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని.. నగరం నుంచి తీసుకెళ్లారు. ఏపీలోనూ కత్తి మహేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని స్వగ్రామానికి కత్తి మహేశ్‌ను పోలీసులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయనను హైదరాబాద్ నుంచి బహిష్కరించారా? లేక తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎన్ని నెలలపాటు కత్తి మహేశ్‌ను నగరం నుంచి బహిష్కరించారనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ నగర బహిష్కరణ, స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలిపేందుకు తెలంగాణ డీజీపీ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. శ్రీరాముడిపై తాజాగా కత్తి మహేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో కత్తి మహేశ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముండటంతో కత్తి మహేశ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి : ధర్మాగ్రహ యాత్రకు నో.. పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! -
కత్తి మహేష్‌పై ఫిర్యాదులు
సాక్షి, అమలాపురం: రామయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ కోరింది. ఓ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావుకు అందజేశారు. న్యూస్ ఛానల్ డిబేట్లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. ‘రామాయణం నాకొక కథ మాత్రమే. రాముడు దగుల్భాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అజాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధా కొండ తెలిపారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పైన, ఇలాంటి పనికి రాని చర్చలు పెట్టి మతాలు, కులాల, సామాజిక వర్గాలను రెచ్చ గొట్టేలా ప్రసారాలు చేసే ఆ టీవీ ఛానల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించి కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమజానికి ఎంత మాత్రం ప్రయోజనం లేని అలాంటి డిబేట్లను ఇప్పటికైనా నిలిపివేసి సమాజ హితమైన అంశాలను ప్రసారం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు ఆ టీవీ ఛానల్‌కు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్‌పై చర్యలు తీసుకునే వరకూ తమ ఫౌండేషన్ ద్వారా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులు బసవా సత్య సంతోష్, మహదేవ నాగేశ్వరరావు, జొన్నాడ దుర్గారావు, ఇవాని శర్మ, కొత్తపల్లి వంశీ, కొండేపూడి ప్రకాష్, బొక్కా నాని తదితరులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోనూ ఫిర్యాదు కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
ఇద్దరూ ఒకరే... ఒకరిలోనే ఆ ఇద్దరు!
17న శ్రీకృష్ణ జన్మాష్టమి రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత మాణిక్యాలే. రాముడూ... కృష్ణుడూ! ఇద్దరూ భగవంతుడి రూపాలే. అవతార స్వరూపాలే. అన్యాయం చెలరేగిననాడు, అధర్మం పెచ్చరిల్లిననాడు ధర్మాన్ని రక్షించ వచ్చిన మర్మమూర్తులు వారు. కాకపోతే ఒకరు త్రేతాయుగాన... మరొకరు ద్వాపరన. ఒకరు అయోధ్యన. మరొకరు ద్వారకన. ఇద్దరూ ఇద్దరే. శ్రీరాముడు అనగానే మర్యాదకు సూచిక. శ్రీకృష్ణుడనగానే యుక్తికి ప్రతీక. శ్రీరాముడంటే ఓ భయంతో కూడిన గౌరవం... శ్రీకృష్ణుడంటే మనవాడనే దగ్గరితనం. ఎందుకీ తేడా...? ఎందుకంటే... మనమందరం రోజూ చదివే ఆ శ్లోకాలే చూద్దాం. ‘ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం’... అని నీలమేఘశ్యాముణ్ణి... ఆ రాముణ్ణి స్తుతిస్తారు. కేళీవిలాసంగా ఉండే ఆ శిఖిపింఛమౌళిని... ‘నాసాగ్రే నవమౌక్తికం... కరతలే వేణుం... కరే కంకణం’... అంటూ నుతిస్తారు. రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత మాణిక్యాలే. కానీ ఆ ఇద్దరిలోనూ కొన్ని తేడాలు... నిశితంగా చూస్తే తప్ప కనిపించని అత్యంతసూక్ష్మమైన నిత్యవ్యత్యాసాలు... వాటిలో కొన్ని... శ్రీరాముడు ధీరోదాత్తుడైనా స్థిరచిత్తుడే అయినా సీతను ఎత్తుకెళ్లిన సందర్భంలోనో, అడవిలో ఉన్న వేళలోనైనా అప్పుడో ఇప్పుడో కాస్తో కూస్తో దుఃఖిస్తాడు. కనుల నీరు దొర్లిస్తాడు. కానీ కృష్ణుడో... ఆ మోమున ఎప్పుడూ చిద్విలాసమైన చిరునవ్వే. ఆ నవ్వే ఒక చిరునవ్వులదివ్వె. రాముడు ఎప్పుడూ సలహాలు స్వీకరిస్తూనే ఉంటాడు. హనుమంతుడివో, సుగ్రీవుడివో, లంక గుట్టు తెలుసుకోడానికి, దాన్ని ముట్టడించడానికి విభీషణుడివో. ఇలా రాముడు తాను గెలవడానికి ఇతరుల సహాయం తీసుకుంటుంటాడు. కానీ కృష్ణుడు ఎప్పుడూ సలహాలిస్తూ ఉంటాడు... జరాసంధ సంహారానికి భీముడికో. ఖాండవదహనానికి అర్జునుడికో. కురుక్షేత్ర యుద్ధానికి ధర్మజుడికో. ఎవరో గెలవడానికి కృష్ణుడు తానెప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు. ఇలా... అందరి సాయం రాముడి గెలుపు... కృష్ణుడి సాయం అందరి గెలుపు. విశ్వామిత్రుడి వెంట వెళ్తున్న బాల రామలక్ష్మణులను చూసినా, అరణ్యవాసం చేస్తున్న యౌవన అన్నదమ్ముల్ని వీక్షించినా కనిపించే దృశ్యం వేరు. ‘నిశాచర వినాశకర’ స్వరూపాలైన వారు ధనుర్బాణాలతో ఆయుధధారులై మిలటరీ యూనిఫామ్‌లో ఉంటారు. కానీ కృష్ణుడో... ‘కరే కంకణం, కరతలే వేణుం’ అంటూ పిల్లనగ్రోవిని వరించిన ఆ వేణుధరుడి వేణిలో పింఛం అలంకరించుకుని ఎప్పుడూ మఫ్టీలో ఉంటాడు. జలజాతాసనవాసవాది సురపూజా భాజనంబై తనర్చు ఆ కృష్ణుడు... బ్రహ్మాది దేవతలంతా స్తుతించే, నుతించే, ఆర్తితో కీర్తించే స్థానంలో ఉన్న ఆ కృష్ణుడు... ఆదిదేవుడైన ఆ విష్ణువు రూపానికి దగ్గరగా ఎలా ఉంటాడో చూడండి. ఆర్తత్రాణపరాయణత్వంలోనూ, హడావుడి సమయంలోనూ శంఖచక్రయుగముం జేదోయి సంధింపక భయపెట్టక ఉండే విష్ణుమూర్తి మూల రూపానికి కృష్ణావతారం ఎంత దగ్గరగా ఉంటుందో చూడండి. ధనుస్సు లాంటి ఆయుధాన్ని ధరించి న వారిని చూస్తే భయంతో కూడిన గౌరవం. అదే సంగీత ఝరిని ప్రసరింపజేసే వేణువును ధరించిన వాడిని చూస్తే నిర్భయంతో కూడిన దగ్గరిదనం. అందుకే రామాయణమూర్తి కంటే మహాభారతమూర్తే ముచ్చటగా కనిపిస్తాడు. మనవాడే అనిపిస్తాడు. తేడాలేముంటేనేం... ఇద్దరూ ఇద్దరే. దైవావతారాలే. కైవల్యమొసగగల కారుణ్యరూపాలే.అందుకే ముసలీముతకా వారిద్దరినీ కలుపుకుని ‘కృష్ణా.. రామా’ అనుకుంటుంటారు. కొత్తగా బిడ్డను కలిగే వయసులో ఉన్నవారు ఆ ద్వయంలో ఏ ఒక్కరినీ వదల్లేక ‘రామకృష్ణుడ’ంటూ తమ బిడ్డలకు ద్వంద్వసమాసయుక్తమైన వాళ్ల పేరిడుతుంటారు. ముకుళిత హస్తయుగళంతో, మంగళగళంతో, హారతిపళ్లెంతో, తులసీదళంతో ఆ ఇద్దరికీ ఇదే మా ప్రార్థన. - కె.రాంబాబు -
రాముడి అవతారంలో కేసీఆర్!
నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం జరిగిన కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ సందర్భంగా కోడ్ ఉల్లంఘించారని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డికి రిటర్నింగ్ అధికారి కీమ్యానాయక్ నోటీసులు జారీచేశారు. బహిరంగసభ ప్రవేశ ద్వారం వద్ద ధనుస్సు, బాణాలు ధరించిన శ్రీరాముడి అవతారంలో కేసీఆర్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సభను ఎన్నికల బృందం, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పరిశీలించి వీడియో, ఫొటోలు తీశారు. ఎన్నికల్లో మతపరమైన అంశాలతో కూడిన ప్రచారం చేయడం కోడ్‌ఉల్లంఘన కిందికి వస్తుందని, రిప్రజెంటేషన్ పీపుల్స్యాక్ట్ (ఆర్పీయాక్ట్) 1951 ప్రకారం 129 సెక్షన్ కింద కేసునమోదు చేశామని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. దీనిపై టీఆర్ఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. -
నివృత్తం: శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలెందుకు?
శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కారణం తెలుసుకోవాలంటే రామావతారంలోనికి వెళ్లాలి. రాముడిది పురుషులకు కూడా మోహం కలిగించేంత సుందర రూపం. వేల మంది మునులు శ్రీరాముడి గాఢపరిష్వంగంకోసం పరితపించారట. అయితే శ్రీరాముడు ‘‘మునులారా! ఇప్పుడు నేను ఏకపత్నీవ్రతంలో ఉన్నాను. కాబట్టి మీ కోరికను ఈ అవతారంలో తీర్చడం సాధ్యం కాదు. కాబట్టి కృష్ణావతారంలో మీరంతా గోపికలుగా పుట్టి నిరంతరం నన్ను అంటిపెట్టుకుని ఉండండి’’ అని వరం ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్వాపరయుగంలో గోపికలుగా జన్మించిన పదహారువేలమంది మునులకు ఇష్టసఖుడిగా మారాడు. సన్నాయి నొక్కులేగానీ సంగీతం లేదన్నట్టు... ఓ ఊళ్లో ఓ యువకుడు ఉండేవాడు. ఎప్పుడూ ఖాళీగా ఉండటంతో అందరూ అతణ్ని ఏడిపిస్తూండేవారు. దాంతో ఉన్నట్టుండి కనిపించకుండా పోయి, పది రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడికెళ్లావని అడిగితే... సన్నాయి వాయించడం నేర్చుకోవడానికి పట్నం పోయానని చెప్పాడు. అది నమ్మిన ఊరిజనం పండుగనాడు అతడి కచేరీ ఏర్పాటు చేశారు. అతగాడు ఎంత సేపటికీ పీకను శృతిచేస్తూ ఉన్నాడు తప్ప వాయించడం లేదు. దాంతో ‘సన్నాయి నొక్కులే గానీ సంగీతం లేనట్టుంది, వీడికసలు వచ్చో రాదో’ అంటూ నిలదీస్తే, అబ్బాయిగారి అసలు స్వరూపం బయటపడిందట. అప్పటి నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కొంతమంది ఏమీ తెలియక పోయినా తెలిసినట్టు గొప్పలు పోతుంటారు. అసలు విషయం బయటపడ్డాక నీళ్లు నములుతారు. అలాంటప్పుడు ఈ సామెత వాడతారు. -
రాముడు సీతను అనుమానించాడా...
సీతారాముల జంట లోకానికి ఆదర్శప్రాయం వారి జంటే ఎందుకు ఆదర్శప్రాయం అయ్యింది? సీత సంగతి పక్కన పెడితే రాముడు ఎందుకు ఆదర్శం అయ్యాడు శివధనుస్సు విరిచి సీతను వివాహమాడినందుకా పట్టాభిషేకం కాదని ఆమెను అడవుల పాల్చేసినందుకా రావణుడు సీతను అపహరించి లంకలో ఉంచితే... సంవత్సరానికి కాని ఆమెను చెర నుంచి విడిపించనందుకా... తనలో సగభాగమైన సీతను అగ్నిప్రవేశం చేయించినందుకా... ఎందుకు రాముడు ఆదర్శం అయ్యాడు... ఒక్కసారి రామాయణం పరిశీలిద్దాం... గురువులు విశ్వామిత్రునితో మిథిలకు వెళ్లాడు. జనకుని కుమార్తె సీతను వివాహమాడాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. గురువుల అనుజ్ఞతో శివధనుస్సు విరిచి, వారి ఆశీర్వాదంతో సీతను పరిణయమాడాడు శ్రీరాముడు. సీతను తన వెంట అయోధ్యకు తీసుకువెళ్లాడు.గురువుల ఎంపిక ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు. జానకి తన ప్రాణానికి ప్రాణంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అందుకే జానకిని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. కొద్దిరోజులకే... దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం నిర్ణయించాడు. రాముడు... తెల్లవారితే రాజు కాబోతున్నాడు! ఇంకేముంది! పట్టాభిషేకమే కదా! సీత మహారాణి అయిపోతుంది! ఇంత ఆనందంగా గడుపుతున్న సమయంలో... పినతల్లి కైకమ్మ అసూయకు రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. వెళ్లవలసింది తను మాత్రమే కనుక, సీతను తనతో పాటు సీత కూడా కష్టాలు పడకూడదనుకున్నాడు. అందుకే తాను మాత్రమే అరణ్యవాసానికి బయలుదేరాడు. ఇంతలో సీత వచ్చి, ‘రామా! మా అమ్మ నాకు కొన్ని నీతులు బోధించింది. భర్త సుఖాలలోనే కాదు, కష్టాలలోనూ పాలు పంచుకోవాలని చెప్పింది. అందువల్ల నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను’ అంది. అందుకు రాముడు ‘సీతా! అరణ్యమంటే - చెలికత్తెలు వింజామరలు వీచుతుంటే సుఖంగాపట్టుపరుపుల మీద నిద్రించడం, బంగారుపళ్లెంలో భోజనం చేయడం, దాసదాసీ జనం సేవ చేస్తుంటే జీవనం గడపడం అనుకోకు. అరణ్యమంటే - పులులు, సింహాలు, పాములు... వంటి ఎన్నో విషప్రాణులు ఉంటాయి. వాటి బారి నుంచి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కటిక నేల మీద పరుండాలి. సాత్వికమైన ఆహారం తినాలి. అన్నీ కష్టాలే. అందువల్ల నా అరణ్యవాసం పూర్తయ్యేవరకు నువ్వు నీ తండ్రి దగ్గర ఉండు... అని అనునయించాడు? రాముడి మాటలకు సీతకు కోపం వచ్చింది. ‘మా నాన్న ఎంత తెలివితక్కువవాడయ్యా, ఆడ రూపంలో ఉన్న పురుషుడికిచ్చి నన్ను వివాహం చేశారు’ అని కొంచెం పరుషంగాపలికింది. అసలు రాముడు తన వెంట ఎందుకు రావద్దన్నాడు... సీత తన కష్టాలలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఇన్నాళ్లూ రాజభోగాలు అనుభవించిన సీత ఈ నాడు ఇన్ని కష్టాలకు ఓర్చుకోగలదో లేదో అర్థం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఆమె మాటలకు కోపం రాకపోగా ఎంతో ఆనందం కలిగింది రాముడికి. ఆమె పలికిన ఆ మాటలలో సీతకు రాముడిపై ఉన్న అనురాగం ప్రతిబింబించింది. అందుకే రాముడు సీతను తన వెంట అరణ్యాలకు తీసుకువెళ్లాడు. అంతటి అనురాగం ఉన్న సీత వెంట ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చనుకున్నాడు. అందుకు రాముడు అదర్శం అయ్యాడు. అరణ్యాలలో సీత తనతో ఎన్నో ఇబ్బందులు అనుభవించింది. నేలపై నిరాడంబరంగా శయనించింది. అక్కడ దొరికే కందమూలాలు మాత్రమే స్వీకరించింది. దశరథ మహారాజు ఇంటి కోడలై ఉండీ, ఎటువంటి రాజభోగాలూ అనుభవించకుండా, ఒక సామాన్య పౌరురాలిగా అరణ్యంలో జీవనం సాగించింది. తన కోసం అన్ని ఇబ్బందులు పడిన సీతను రాముడు ఎలా మరువగలడు? ఆమెకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సీతను రాముడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. ఎన్నడూ ఏ కోరికా కోరని సీత, బంగారులేడి కావాలని తన మనోరథాన్ని వ్యక్తపరిచింది. సీత కోరిక కోరినందుకు రాముడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఎంతో సామాన్యంగా జీవించే తన సీత ఇన్నాళ్లకు ఒక్క కోరికైనా కోరిందని సంబరపడ్డాడు. అంతే వెంటనే ఆ లేడి కోసం బయలుదేరాడు. ఇంతోనే జరగకూడనిది జరిగిపోయింది. పది తలల రావణుడు సీతను అపహరించుకుపోయాడు. అంతే... రాముడు పసిపిల్లవాడైపోయాడు. తన సీత లేకుండా తాను జీవించలేనన్నాడు. ఆమె మరణించి ఉంటే తక్షణమే తాను ప్రాణత్యాగం చేస్తానన్నాడు. కైక కోరిక ఆ విధంగా నెరవేరుతుందనుకున్నాడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. రాముడు మహారాజ బిడ్డ. తను కావాలనుకుంటే ఇటువంటి సీతలు వందలమంది తన కనుసన్నలలో మెలగుతారు. మరి సీతే కావాలని ఎందుకు తాపత్రయపడ్డాడు. సీతకు తెలుసు, రాముడితో అరణ్యవాసం చేయవలసి వస్తే, ఎన్నో ఇక్కట్లపాలవ్వాలి. అయినా రాముడి తోడిదే జీవితం అనుకుంది. ఆయనతో కలిసి అడుగులో అడుగు వేసింది. అంతటి సీతను మరచిపోయే బలహీనుడు కాదు రాముడు. సీత కోసం చెట్టూ పుట్టా గాలించాడు. కనిపించిన ప్రతిప్రాణి నీ తన సీత జాడ చెప్పమని అర్థించాడు. సీత కనిపించకపోతే సర్వ ప్రాణికోటినీ తన దగ్గర ఉన్న ఆయుధంతో నాశనం చేసేస్తానన్నాడు. అందుకు రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. మరి ఇంతటి రాముడు సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడనుకోవచ్చు. సీతను అన్వేషించేవరకు రాముడు సామాన్యుడు. కాని సీతను అన్వేషించాక రాముడు రాజు. ఒక రాజు తాను చేసే పనులతో తన ప్రజలకు ఆదర్శప్రాయుడు కావాలే కాని, తానే తప్పు చేసి వారికి తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు. అందుకే తన సీత నిప్పులాంటిదని నిరూపించాలనుకున్నాడు. సీత నిష్కలంక శీలవతి అనీ, రాముడినే త్రికరణశుద్ధిగా ఆరాధిస్తున్నదనీ, దుష్టచిత్తుడయిన రావణుని నిరోధించగల పాతివ్రత్య తేజస్విని అనీ రాముడికి తెలుసు. కాని లోకం ఉన్నదేఅది విశ్వసించాలి. రాముడి అంతరంగం ఎరిగిన సీత తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేసింది.దీర్ఘకాలం రావణ అంతఃపురంలో ఉన్న స్త్రీని రాముడు చేపట్టాడని వేలెత్తి చూపకుండా ఉండటం కోసం రాముడు అంత పరుషంగా ప్రవర్తించాడు. జానకి పాతివ్రత్య జ్వాలారూపిణి అని ప్రపంచానికి చాటాడు. తన ప్రజలకు తానేమిటో చూపాడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. - డా.పురాణపండ వైజయంతి -
మధుర భాషణంతో కార్యసాధన
ఆస్ట్రేలియాలో ఒక న్యాయమూర్తి ఉండేవాడట. ఆయనకు రోజూ ఉదయం పార్కులో వ్యాహ్యాళికి వెళ్లే అలవాటు ఉండేది. ఆ పార్కు సమీపంలో పేవ్మెంటు మీద ఓ భిక్షకుడు ఆయనకు తరచుగా కనిపించేవాడు. న్యాయమూర్తి ఉదయం పార్కులోకి వెళ్తుంటే ఒకటి రెండుసార్లు వెటకారానికి ‘న్యాయమూర్తీ శుభోదయం’ అని ఆయన వెనకనించీ కేకవేశాడు. న్యాయమూర్తి వెనక్కి తిరిగి మర్యాదగా సమాధానం చెప్పాడు. మూడోసారి కలిసినప్పుడు ఆ న్యాయమూర్తి తనే ఆ భిక్షుకుడిని పలకరించి పార్కులోకి వెళ్తుంటే, ఓ పెద్ద మనిషి చూసి ‘న్యాయమూర్తి గారూ! మంచీ మర్యాద తెలియని ఆ మూర్ఖుడూ సోమరిపోతూ మిమ్మల్ని ఆట పట్టించటానికి పలకరిస్తున్నాడని మీకు తెలియదా? అతనిస్థాయి ఏమిటి, మీ స్థాయి ఏమిటి? మీరే స్వయంగా అతన్ని పలకరించటం మీ హోదాకు భంగకరం కాదా?’ అని సూచించబోయాడు. న్యాయమూర్తి ‘పెద్ద మనిషి గారూ, మంచీ మర్యాదా తెలియని మూర్ఖ భిక్షుకుడి కంటే మర్యాదలో నేను తీసిపోవాలని మీ ఉద్దేశమా?’ అన్నాడు. మర్యాద అనగానే మర్యాదాపురుషోత్తముడు శ్రీ రామచంద్రుడు గుర్తుకు వస్తాడు. మర్యాద అంటే ‘క్రమం, పద్ధతి’ అని ఒక నిర్వచనం, ‘మర్యాద’ అంటే సంస్కృతంలో హద్దు, లేక పరిధి అని అర్థం చెప్పారు. నీతి, సత్సంప్రదాయం, ధర్మం పరిధిలో ఎప్పుడూ నడుచుకొనేవాడు కనక రాముడు మర్యాదా పురుషోత్తముడు. శ్రీరాముడిని ‘వచస్వి’గా ‘వాగ్మి’(చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. మృదువైన మాట మనిషికి పెట్టని సొమ్ము. దానిని మెలకువలో, సహనంలో, సమర్థంగా వాడినవాడు శ్రీరాముడు. ఆయనది ఒక మాట, ఒక బాణం. మాట మృదువు, బాణం వాడి. ఆయన శూర్పణఖతో మాట్లాడినా, సుగ్రీవుడితో మాట్లాడినా, విభీషణుడితో సంభాషించినా, విశ్వామిత్రుడితో మాట్లాడినా మృదువుగానే మాట్లాడాడు. రాముడు మితభాషి కూడా. రాముడే కాదు, సత్యమే మాట్లాడాలని నియమం గలవాడు, ఆడిన మాట నిలబెట్టుకోవాలనే నిష్ట కలవాడెవడూ మితిమీరి మాట్లాడలేడూ, మాట్లాడడు. శ్రీరాముడి దగ్గర ఉన్న మరొక మహత్తరమైన సుగుణం ‘పూర్వభాషిత్వం’ అని చెప్తారు. ఎవరినైనా తనే ముందు పలకరించి అనురాగంతో, ఆప్యాయతతో కుశలం తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం పూర్వభాషిత్వం. ఇది ఉత్తమ సంస్కారానికి చిహ్నం. శ్రీరాముడు పూర్వభాషి మాత్రమే కాదు. బంగారానికి తావి అబ్బినట్టు, స్మిత పూర్వభాషి కూడా. ముందు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. వాక్కు జంతుకోటిలో మనిషికి మాత్రమే ఉన్న విశిష్ట శక్తి. దానివల్లనే మానవుడు చరాచర సృష్టిలో శిఖరాయమానంగా భాసిస్తూ స్థావర జంగమాలను తన నియంత్రణలోకి తెచ్చుకొనేంత శక్తిశాలి అయ్యాడు. సరిగా వాడుకొంటే వాక్కు సుహృద్భావపూర్వకమైన మానవ సంబంధాలకు దోహదం చేసి, కార్యసిద్ధినీ విజయాన్నీ అందించగల సాధనం. తొందరపాటుతో, అనాలోచితంగా, అశ్రద్ధగా, అహంకార పూర్వకంగా వాడితే అది ఇతరులను తీవ్రంగా గాయపరచి, మానవ సంబంధాలను ధ్వంసం చేసి దుష్పరిణామాలకు దారితీసే ఆయుధం అవుతుందన్న సత్యం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఎరుకను ఆచరించగలవాడు నొప్పించక, తానొవ్వక జీవించగల నేర్పరి. - ఎం. మారుతిశాస్త్రి -
రామా... ఏమి ‘సేతువు’రా..!
అపార జలధిని దాటి లంకను చేరేందుకు నాడు శ్రీరాముడు వానరుల సాయంతో సేతువును నిర్మించాడు. శ్రీకాకుళం జిల్లాలో ఉప్పుటేరు మధ్యలో ఉన్న పూడి‘లంక’కు సేతువు నిర్మించేందుకు మాత్రం రాముడూ(నాయకులు) లేడు.. వానర సేన(అధికారగణం) చొరవ చూపడం లేదని ఇక్కడి ‘లంకేయులు’ వాపోతున్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో.. వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న ఈ గ్రామంలో 164 గడపలున్నాయి. ఇక్కడి ప్రజలు బయటి ప్రపంచంలోకి రావాలన్నా.. బయటివారు ఈ లంకకు చేరాలన్నా ఉప్పుటేరు మధ్యలో ఉన్న సుమారు 700 మీటర్ల ఈ మట్టికట్ట దాటాల్సిందే. దాన్నికూడా నాలుగైదు దశాబ్దాల క్రితం ఉప్పు తయారు చేసే కంపెనీలు తమ అవసరాల కోసం నిర్మించుకున్నారు. తుపాన్లు వచ్చి సముద్రం పొంగినా.. వర్షాలు కురిసి వరదలొచ్చినా.. ఉప్పుటేరు పొంగి మట్టికట్టను ముంచేస్తుంది. నీరు తగ్గేవరకూ పూడిలంకకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. - సాక్షి, శ్రీకాకుళం -
పరశు‘రాముడు’
‘‘ ధరలో క్షత్రియులను దండించిన ‘పరశురాముడు’-మనపాలిట నుండగ... తక్కువేమి మనకు.. ‘రాముండొక్కడుండు’ వరకు...’’ తన తండ్రి జమదగ్నిని చంపిన వేయి చేతులు గల కార్యవీర్యార్జునుని సంహరించి.. ఇరువది ఒక్క పర్యాయములు భూమినంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు శ్రీ మహావిష్ణువు పరశురామావతారం ఎత్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం భార్గవరామునిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారంలో ఉన్న స్వామివారిని తిలకించి శుభఫలితాలు పొందినట్లు అర్చకులు తెలిపారు. భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామాలయంలో నిర్వహిస్తున్న పగల్‌పత్తు ఉత్సవాల్లో రాజాధిరాజు అయిన శ్రీరాముడు సోమవారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు కొలువై ఉన్న ఆళ్వార్లుకు వేదపండితులు 200 పాశురాల దివ్యప్రబంధనాన్ని వినిపించారు. ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి పరశురామావతరంలో అలంకరించారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. భక్తుల కోలాహలం, మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డు వరకు తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదిక మీదకు తీసుకువచ్చి భక్తుల దర్శనం కోసం ఉంచారు. స్వామివారికి ప్రత్యేక హారతి, నైవేద్యాన్ని సమర్పించారు. పరశురామావతార విశిష్టతను ఆలయ అర్చకులు అమరవాది మదనమోహానాచార్యులు రాగయుక్తంగా వినిపించారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు పంపిణీ చేశారు. వేదపండితుల వేదఘోష నడుమ తాతగుడిసెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించటం ఆనవాయితీ. స్టేడియం నుంచి తిరువీధి సేవకు బయలుదేరిన స్వామివారికి రాజవీధి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గంమధ్యలోని విశ్రాంతి మండపంలో కొద్దిసేపు స్వామివారు సేద తీరారు. అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎం. రఘునాథ్, ఏఈవో శ్రవణ్‌కుమార్, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, సన్యాసిశర్మ, ఆలయ అర్చకులు విజయరాఘవన్, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నేడు శ్రీరామునిగా.. లోకకంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారునిగా శ్రీ మన్నారాయణుడు ధరించిన శ్రీరామావతారంలో వైకుంఠ రాముడు మంగళవారం దర్శనమివ్వనున్నారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటిచెప్పారు. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించటం వల్ల ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.