రాముడు సీతను అనుమానించాడా...
సీతారాముల జంట లోకానికి ఆదర్శప్రాయం
వారి జంటే ఎందుకు ఆదర్శప్రాయం అయ్యింది?
సీత సంగతి పక్కన పెడితే రాముడు ఎందుకు ఆదర్శం అయ్యాడు
శివధనుస్సు విరిచి సీతను వివాహమాడినందుకా
పట్టాభిషేకం కాదని ఆమెను అడవుల పాల్చేసినందుకా
రావణుడు సీతను అపహరించి లంకలో ఉంచితే...
సంవత్సరానికి కాని ఆమెను చెర నుంచి విడిపించనందుకా...
తనలో సగభాగమైన సీతను అగ్నిప్రవేశం చేయించినందుకా...
ఎందుకు రాముడు ఆదర్శం అయ్యాడు...
ఒక్కసారి రామాయణం పరిశీలిద్దాం...
గురువులు విశ్వామిత్రునితో మిథిలకు వెళ్లాడు. జనకుని కుమార్తె సీతను వివాహమాడాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. గురువుల అనుజ్ఞతో శివధనుస్సు విరిచి, వారి ఆశీర్వాదంతో సీతను పరిణయమాడాడు శ్రీరాముడు. సీతను తన వెంట అయోధ్యకు తీసుకువెళ్లాడు.గురువుల ఎంపిక ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు. జానకి తన ప్రాణానికి ప్రాణంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అందుకే జానకిని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. కొద్దిరోజులకే... దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం నిర్ణయించాడు.
రాముడు... తెల్లవారితే రాజు కాబోతున్నాడు!
ఇంకేముంది!
పట్టాభిషేకమే కదా!
సీత మహారాణి అయిపోతుంది!
ఇంత ఆనందంగా గడుపుతున్న సమయంలో...
పినతల్లి కైకమ్మ అసూయకు రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది.
వెళ్లవలసింది తను మాత్రమే కనుక, సీతను తనతో పాటు సీత కూడా కష్టాలు పడకూడదనుకున్నాడు. అందుకే తాను మాత్రమే అరణ్యవాసానికి బయలుదేరాడు. ఇంతలో సీత వచ్చి, ‘రామా! మా అమ్మ నాకు కొన్ని నీతులు బోధించింది. భర్త సుఖాలలోనే కాదు, కష్టాలలోనూ పాలు పంచుకోవాలని చెప్పింది. అందువల్ల నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను’ అంది.
అందుకు రాముడు ‘సీతా! అరణ్యమంటే -
చెలికత్తెలు వింజామరలు వీచుతుంటే సుఖంగాపట్టుపరుపుల మీద నిద్రించడం, బంగారుపళ్లెంలో భోజనం చేయడం, దాసదాసీ జనం సేవ చేస్తుంటే జీవనం గడపడం అనుకోకు.
అరణ్యమంటే -
పులులు, సింహాలు, పాములు... వంటి ఎన్నో విషప్రాణులు ఉంటాయి. వాటి బారి నుంచి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కటిక నేల మీద పరుండాలి. సాత్వికమైన ఆహారం తినాలి. అన్నీ కష్టాలే. అందువల్ల నా అరణ్యవాసం పూర్తయ్యేవరకు నువ్వు నీ తండ్రి దగ్గర ఉండు... అని అనునయించాడు?
రాముడి మాటలకు సీతకు కోపం వచ్చింది. ‘మా నాన్న ఎంత తెలివితక్కువవాడయ్యా, ఆడ రూపంలో ఉన్న పురుషుడికిచ్చి నన్ను వివాహం చేశారు’ అని కొంచెం పరుషంగాపలికింది.
అసలు రాముడు తన వెంట ఎందుకు రావద్దన్నాడు...
సీత తన కష్టాలలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఇన్నాళ్లూ రాజభోగాలు అనుభవించిన సీత ఈ నాడు ఇన్ని కష్టాలకు ఓర్చుకోగలదో లేదో అర్థం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఆమె మాటలకు కోపం రాకపోగా ఎంతో ఆనందం కలిగింది రాముడికి.
ఆమె పలికిన ఆ మాటలలో సీతకు రాముడిపై ఉన్న అనురాగం ప్రతిబింబించింది.
అందుకే రాముడు సీతను తన వెంట అరణ్యాలకు తీసుకువెళ్లాడు.
అంతటి అనురాగం ఉన్న సీత వెంట ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చనుకున్నాడు.
అందుకు రాముడు అదర్శం అయ్యాడు.
అరణ్యాలలో సీత తనతో ఎన్నో ఇబ్బందులు అనుభవించింది. నేలపై నిరాడంబరంగా శయనించింది.
అక్కడ దొరికే కందమూలాలు మాత్రమే స్వీకరించింది. దశరథ మహారాజు ఇంటి కోడలై ఉండీ, ఎటువంటి రాజభోగాలూ అనుభవించకుండా, ఒక సామాన్య పౌరురాలిగా అరణ్యంలో జీవనం సాగించింది. తన కోసం అన్ని ఇబ్బందులు పడిన సీతను రాముడు ఎలా మరువగలడు?
ఆమెకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సీతను రాముడు.
అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు.
ఎన్నడూ ఏ కోరికా కోరని సీత, బంగారులేడి కావాలని తన మనోరథాన్ని వ్యక్తపరిచింది. సీత కోరిక కోరినందుకు రాముడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఎంతో సామాన్యంగా జీవించే తన సీత ఇన్నాళ్లకు ఒక్క కోరికైనా కోరిందని సంబరపడ్డాడు. అంతే వెంటనే ఆ లేడి కోసం బయలుదేరాడు.
ఇంతోనే జరగకూడనిది జరిగిపోయింది.
పది తలల రావణుడు సీతను అపహరించుకుపోయాడు.
అంతే... రాముడు పసిపిల్లవాడైపోయాడు.
తన సీత లేకుండా తాను జీవించలేనన్నాడు. ఆమె మరణించి ఉంటే తక్షణమే తాను ప్రాణత్యాగం చేస్తానన్నాడు. కైక కోరిక ఆ విధంగా నెరవేరుతుందనుకున్నాడు.
అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు.
రాముడు మహారాజ బిడ్డ. తను కావాలనుకుంటే ఇటువంటి సీతలు వందలమంది తన కనుసన్నలలో మెలగుతారు. మరి సీతే కావాలని ఎందుకు తాపత్రయపడ్డాడు.
సీతకు తెలుసు, రాముడితో అరణ్యవాసం చేయవలసి వస్తే, ఎన్నో ఇక్కట్లపాలవ్వాలి.
అయినా రాముడి తోడిదే జీవితం అనుకుంది. ఆయనతో కలిసి అడుగులో అడుగు వేసింది.
అంతటి సీతను మరచిపోయే బలహీనుడు కాదు రాముడు.
సీత కోసం చెట్టూ పుట్టా గాలించాడు. కనిపించిన ప్రతిప్రాణి నీ తన సీత జాడ చెప్పమని అర్థించాడు.
సీత కనిపించకపోతే సర్వ ప్రాణికోటినీ తన దగ్గర ఉన్న ఆయుధంతో నాశనం చేసేస్తానన్నాడు.
అందుకు రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు.
మరి ఇంతటి రాముడు సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడనుకోవచ్చు.
సీతను అన్వేషించేవరకు రాముడు సామాన్యుడు.
కాని సీతను అన్వేషించాక రాముడు రాజు.
ఒక రాజు తాను చేసే పనులతో తన ప్రజలకు ఆదర్శప్రాయుడు కావాలే కాని, తానే తప్పు చేసి వారికి తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు.
అందుకే తన సీత నిప్పులాంటిదని నిరూపించాలనుకున్నాడు. సీత నిష్కలంక శీలవతి అనీ, రాముడినే త్రికరణశుద్ధిగా ఆరాధిస్తున్నదనీ, దుష్టచిత్తుడయిన రావణుని నిరోధించగల పాతివ్రత్య తేజస్విని అనీ రాముడికి తెలుసు. కాని లోకం ఉన్నదేఅది విశ్వసించాలి. రాముడి అంతరంగం ఎరిగిన సీత తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేసింది.దీర్ఘకాలం రావణ అంతఃపురంలో ఉన్న స్త్రీని రాముడు చేపట్టాడని వేలెత్తి చూపకుండా ఉండటం కోసం రాముడు అంత పరుషంగా ప్రవర్తించాడు. జానకి పాతివ్రత్య జ్వాలారూపిణి అని ప్రపంచానికి చాటాడు. తన ప్రజలకు తానేమిటో చూపాడు.
అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు.
- డా.పురాణపండ వైజయంతి