నటి సీత ఇంట్లో విషాదఛాయలు కమ్ముకున్నాయి. తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా ఆమె రాణించారు. 'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్‌కు అక్కగా నటించి ఆమె మంచి గుర్తింపు తెచ్చకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న సీత టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. సీతకు మాతృవియోగం కలిగింది. ఈమె తల్లి చంద్రమోహన్ (88) శుక్రవారం చెన్నైలోని సాలిగ్రామంలోని తమ స్వగృహంలో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రావతి.
సేలంకు చెందిన ఈమె చెన్నైకి చెందిన పీఎస్.మోహన్‌బాబును పెళ్లి చేసుకున్న తరువాత తన పేరును చంద్రమోహన్‌గా మార్చుకున్నారు. వీరికి ఎంజీఆర్ పాండు, రాజమోహన్ అనే ఇద్దరు కుమారులతో పాటు కూతురు సీత ఉన్నారు. చంద్రమోహన్ గత 45 ఏళ్లుగా చెన్నైలోని జీహెచ్ ఆస్పత్రిలో నర్సుగా వైద్యసేవలు అందించారు. ఆ తరువాత స్థానిక సాలిగ్రామంలోని సూర్య ఆస్పత్రిలో 9 ఏళ్లు వైద్యసేవలు అందించారు. ఈమె భర్త పీఎస్.మోహన్‌బాబు నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. నటి సీతతో పాటు ఆమె సోదరులు సీనీ రంగానికి చెందిన వారే. సీత తండ్రి గత 10 ఏళ్ల క్రితమే కన్నుమూశారు.
కాగా చంద్రమోహన్ మృతికి పలువురు సీనీ ప్రముఖులు అంజలి ఘటించి సీత కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చంద్రమోహన్ భౌతికకాయానికి శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్థానిక అరుంబాక్కమ్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
సీత తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం. ఈమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ చెన్నైలో స్థిరపడ్డారు. 1990లో కెరీర్ పరంగా మంచి పీక్‌లో ఉన్నప్పుడే నటుడు పార్థిబన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కుమార్తెలతో పాటు రాఖీ అనే దత్తత తీసుకుకున్న కుమారుడు ఉన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ సినిమాలో కీర్తన నటించింది. ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు కూడా ఆమె అందుకుంది. పార్థిబన్‌తో విడిపోయిన తర్వాత సీరియల్ నటుడు సతీష్‌ను ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత అతనితో కూడా ఆమె విడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment