రామా... ఏమి ‘సేతువు’రా..!
అపార జలధిని దాటి లంకను చేరేందుకు నాడు శ్రీరాముడు వానరుల సాయంతో సేతువును నిర్మించాడు. శ్రీకాకుళం జిల్లాలో ఉప్పుటేరు మధ్యలో ఉన్న పూడి‘లంక’కు సేతువు నిర్మించేందుకు మాత్రం రాముడూ(నాయకులు) లేడు.. వానర సేన(అధికారగణం) చొరవ చూపడం లేదని ఇక్కడి ‘లంకేయులు’ వాపోతున్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో.. వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న ఈ గ్రామంలో 164 గడపలున్నాయి. ఇక్కడి ప్రజలు బయటి ప్రపంచంలోకి రావాలన్నా.. బయటివారు ఈ లంకకు చేరాలన్నా ఉప్పుటేరు మధ్యలో ఉన్న సుమారు 700 మీటర్ల ఈ మట్టికట్ట దాటాల్సిందే. దాన్నికూడా నాలుగైదు దశాబ్దాల క్రితం ఉప్పు తయారు చేసే కంపెనీలు తమ అవసరాల కోసం నిర్మించుకున్నారు. తుపాన్లు వచ్చి సముద్రం పొంగినా.. వర్షాలు కురిసి వరదలొచ్చినా.. ఉప్పుటేరు పొంగి మట్టికట్టను ముంచేస్తుంది. నీరు తగ్గేవరకూ పూడిలంకకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి.
- సాక్షి, శ్రీకాకుళం