శ్రీకాకుళం న్యూకాలనీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఎగువన ఉన్న ఒడిశాలోనూ కురుస్తున్న వర్షాలతో వంశధార, నాగావళి నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. గొట్టా బ్యారేజీ, నారాయణపురం, తోటపల్లి బ్యారేజీలతోపాటు మడ్డువలస రిజర్వాయర్ పరవళ్లు తొక్కుతున్నాయి. నారాయణపురం ఆనకట్ట మీద నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. దీంతో వ్యవసాయ పనులు ముమ్మరమైనా పల్లపు పొలాలకు నీటి ముప్పు పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో గత 24 గంటల్లో 20.8 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గార మండలంలో 62.0 మి.మీ., అత్యల్పంగా పొందూరులో 3.8 మి.మీ. నమోదైంది. పోలాకిలో 60.8, సోంపేటలో 59.4, వజ్రపుకొత్తూరులో 55.0, సీతంపేటలో 4.8, పాలకొండలో 4.4 మి.మీ. వర్షం కురవగా వంగర, వీరఘట్టం మండలాల్లో అసలు వర్షపాతం నమోదు కాలేదు.
విస్తారంగా వర్షాలు
Published Mon, Sep 1 2014 2:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement