సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం) : సిక్కోలు విద్యార్థినికి అరుదైన గుర్తింపు లభించింది. వ్యవసాయరంగంలో చేసిన పరిశోధనకు గాను జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు–2018 దక్కించుకుంది. పాతపట్నం మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన అంధవరపు రాధిక రమ్య క్రాప్‌సైన్సు ఆధ్వర్యంలో ఐ కార్ ఫౌండేషన్ డే సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 16న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఐ కార్ డైరెక్టర్ జనరల్ మహాపాత్రో చేతుల మీదుగా గోల్డ్‌మెడల్, అవార్డు, రూ.50 వేల నగదు అందుకుంది.
ఇంటర్నేషనల్ ఇక్రిశాట్(హైదరాబాద్)లో జెనిటిక్స్ అండ్ ఫ్లాంట్ బ్లీడింగ్ అనే అంశంపై(కొత్త రకాల వంగడాలు) పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డు వచ్చిందని రమ్య తెలిపారు. దేశం మొత్తమ్మీద ఈ అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రమ్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈమె 1 నుంచి 5వ తరగతి వరకు బోరుబద్ర మండల పరిషత్ పాఠశాల, 6 నుంచి 10వ తరగతి వరకు పాతపట్నం విక్టరీ పాఠశాల, ఇంటర్మీడియెట్ విజవాడ శ్రీ చైతన్య కళాశాల, బీఎస్సీ అగ్రికల్చర్ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ నైరా(ఆమదాలవలస), ఎంఎస్సీ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యునివర్సిటీ, రాజేంద్రనగర్(హైదరాబాద్), పీహెచ్‌డీ బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదివారు.
పీహెచ్‌డీలో జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్లీడింగ్( కొత్త రకాల వంగడాలు) అనే అంశంపై లాల్ అహమ్మద్ గైడ్ ఆధ్వర్యంలో పరిశోధనలు పూర్తిచేశారు. తండ్రి అంధవరపు రాజారావు రిటైర్డు ఉపాధ్యాయుడు. తల్లి వన జాక్షి పాతపట్నం మండలం బొమ్మిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. రమ్య భర్త కరిమి పృథ్వీకృష్ణ విజయనగరం గోషా ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యునిగా పనిచేస్తున్నారు. తండ్రి, భర్త ప్రోత్సాహం వల్లే వ్యవసాయంపై పరిశోధన చేశానని, శ్రమకు తగిన గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నానని రమ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment