‘‘ ధరలో క్షత్రియులను దండించిన
‘పరశురాముడు’-మనపాలిట నుండగ...
తక్కువేమి మనకు.. ‘రాముండొక్కడుండు’ వరకు...’’
తన తండ్రి జమదగ్నిని చంపిన వేయి చేతులు గల కార్యవీర్యార్జునుని సంహరించి.. ఇరువది ఒక్క పర్యాయములు భూమినంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు శ్రీ మహావిష్ణువు పరశురామావతారం ఎత్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం భార్గవరామునిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారంలో ఉన్న స్వామివారిని తిలకించి శుభఫలితాలు పొందినట్లు అర్చకులు తెలిపారు.
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామాలయంలో నిర్వహిస్తున్న పగల్‌పత్తు ఉత్సవాల్లో రాజాధిరాజు అయిన శ్రీరాముడు సోమవారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు కొలువై ఉన్న ఆళ్వార్లుకు వేదపండితులు 200 పాశురాల దివ్యప్రబంధనాన్ని వినిపించారు. ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి పరశురామావతరంలో అలంకరించారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. భక్తుల కోలాహలం, మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డు వరకు తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదిక మీదకు తీసుకువచ్చి భక్తుల దర్శనం కోసం ఉంచారు. స్వామివారికి ప్రత్యేక హారతి, నైవేద్యాన్ని సమర్పించారు. పరశురామావతార విశిష్టతను ఆలయ అర్చకులు అమరవాది మదనమోహానాచార్యులు రాగయుక్తంగా వినిపించారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు పంపిణీ చేశారు.
వేదపండితుల వేదఘోష నడుమ తాతగుడిసెంటర్‌లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించటం ఆనవాయితీ. స్టేడియం నుంచి తిరువీధి సేవకు బయలుదేరిన స్వామివారికి రాజవీధి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గంమధ్యలోని విశ్రాంతి మండపంలో కొద్దిసేపు స్వామివారు సేద తీరారు. అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎం. రఘునాథ్, ఏఈవో శ్రవణ్‌కుమార్, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, సన్యాసిశర్మ, ఆలయ అర్చకులు విజయరాఘవన్, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్‌వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
నేడు శ్రీరామునిగా..
లోకకంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారునిగా శ్రీ మన్నారాయణుడు ధరించిన శ్రీరామావతారంలో వైకుంఠ రాముడు మంగళవారం దర్శనమివ్వనున్నారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటిచెప్పారు. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించటం వల్ల ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.
పరశు‘రాముడు’
Published Tue, Jan 7 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement