అంతా రామమయం... ఈ జగమంతా రామమయం... ఈరోజు దాదాపు ఎక్కడ చూసినా రామ నామమే. వెండితెర పైనా రామ నామం వినపడబోతోంది. రాముడిపై ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. త్వరలో కొన్ని చిత్రాలు రానున్నాయి. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముడి చిత్రాల గురించి తెలుసుకుందాం.
► 1980లలో రాముడంటే బుల్లితెర వీక్షకులు చెప్పిన పేరు అరుణ్ గోవిల్. ‘రామాయణ్’ సీరియల్‌లో రాముడిగా అంత అద్భుతంగా ఒదిగిపోయారాయన. ఇప్పటికీ రాముడంటే చాలామంది అరుణ్∙పేరే చెబుతారు. రాముడి కథాంశంతో ఇటీవల విడుదలైన ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’లో ఆయన నటించారు. ‘‘ఒక కాలాతీత కథలో మళ్లీ నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సాంస్కృతిక వారసత్వం’’ అని పేర్కొన్నారు అరుణ్ గోవిల్. రామ జన్మభూమిపై రజనీష్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలో విడుదలైంది.
► రాముడు ఆజానుబాహుడు.. అందగాడు... వీరం, కరుణ, ప్రేమ... ఇలా సకల గుణాలూ ఉన్నవాడు. ఎన్ని ఉన్నా అసలు రాముడంటే సౌమ్యంగా కనిపించాలి. రణ్‌బీర్ కపూర్ దాదాపు అలానే ఉంటారు. అందుకే దర్శకుడు నితీష్ తివారీ తన ‘రామాయణ్’ చిత్రానికి రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ని ఎన్నుకున్నారు. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేసుకున్నారు.
అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ చిత్రం షూట్‌ంగ్ ఈ మధ్యే ముంబైలో ఆరంభించారు. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా ఓ నిర్మాత కాగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ మరో నిర్మాత. ఈ చిత్రంలో రావణుడి పాత్రను కూడా యశ్ చేస్తారట. నేడు ఈ చిత్రం గురించి ఆధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ్’ రిలీజవుతుందని సమాచారం.
► ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్న కంగనా రనౌత్‌ది కథానాయికల్లో సెపరేట్ రూట్. స్వతహాగా రాముడి భక్తురాలైన కంగనా ఇప్పటికే రామ మందిరం నేపథ్యంలో ‘అపరాజిత అయోధ్య’ చిత్రాన్ని, ‘సీత: ది ఇన్‌కార్నేషన్’ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇవి పట్టాలెక్క లేదు. గత ఏడాది తన ‘తేజస్’ చిత్రం విడుదల సందర్భంగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని సందర్శించారు కంగనా రనౌత్. ఆ సమయంలో అయోధ్యపై తాను కథ సిద్ధం చేశానని పేర్కొన్నారామె.
‘‘ఇది ఆరువందల ఏళ్ల పోరాటం. ఇప్పుడు రామ మందిరం సాధ్యమైంది. అయోధ్యపై కథ రాయడానికి నేను చాలా పరిశోధించాను’’ అని కూడా చెప్పారు కంగనా రనౌత్. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియజేయలేదు.
► తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను మాన్’ గడచిన సంక్రాంతికి విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి రెండో భాగంగా ‘జై హనుమాన్’ రానుంది. ‘జై హనుమాన్’ కథ రాయడానికి ఓ పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తి అన్నట్లుగా ప్రశాంత్ వర్మ ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండో భాగం ప్రధానంగా హనుమంతుడి నేపథ్యంలో సాగుతుందని టాక్. వార్తల్లో ఉన్న ప్రకారం హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తారట. ‘హను మాన్’ చిత్రం చూసి, ప్రశాంత్ వర్మకు రణ్‌వీర్ ఫ్యాన్ అయ్యారని సమాచారం.
ఇటీవల ఈ ఇద్దరి మధ్య ‘జై హనుమాన్’ గురించి చర్చలు జరిగాయని, రణ్‌వీర్‌కు స్క్రిప్ట్ కూడా నచ్చిందని భోగట్టా. కాగా.. ప్రశాంత్–రణ్‌వీర్ కాంబినేషన్‌లో రూపొందనున్నది ‘జై హనుమాన్’ కాదు.. వేరే చిత్రం అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ తెరకెక్కించడం ఖాయం. ఈ చిత్రం నటీనటుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవే కాదు.. రాముడిపై ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన మరిన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment