మధుర భాషణంతో కార్యసాధన
ఆస్ట్రేలియాలో ఒక న్యాయమూర్తి ఉండేవాడట. ఆయనకు రోజూ ఉదయం పార్కులో వ్యాహ్యాళికి వెళ్లే అలవాటు ఉండేది. ఆ పార్కు సమీపంలో పేవ్‌మెంటు మీద ఓ భిక్షకుడు ఆయనకు తరచుగా కనిపించేవాడు. న్యాయమూర్తి ఉదయం పార్కులోకి వెళ్తుంటే ఒకటి రెండుసార్లు వెటకారానికి ‘న్యాయమూర్తీ శుభోదయం’ అని ఆయన వెనకనించీ కేకవేశాడు. న్యాయమూర్తి వెనక్కి తిరిగి మర్యాదగా సమాధానం చెప్పాడు. మూడోసారి కలిసినప్పుడు ఆ న్యాయమూర్తి తనే ఆ భిక్షుకుడిని పలకరించి పార్కులోకి వెళ్తుంటే, ఓ పెద్ద మనిషి చూసి ‘న్యాయమూర్తి గారూ! మంచీ మర్యాద తెలియని ఆ మూర్ఖుడూ సోమరిపోతూ మిమ్మల్ని ఆట పట్టించటానికి పలకరిస్తున్నాడని మీకు తెలియదా? అతనిస్థాయి ఏమిటి, మీ స్థాయి ఏమిటి? మీరే స్వయంగా అతన్ని పలకరించటం మీ హోదాకు భంగకరం కాదా?’ అని సూచించబోయాడు. న్యాయమూర్తి ‘పెద్ద మనిషి గారూ, మంచీ మర్యాదా తెలియని మూర్ఖ భిక్షుకుడి కంటే మర్యాదలో నేను తీసిపోవాలని మీ ఉద్దేశమా?’ అన్నాడు.
మర్యాద అనగానే మర్యాదాపురుషోత్తముడు శ్రీ రామచంద్రుడు గుర్తుకు వస్తాడు. మర్యాద అంటే ‘క్రమం, పద్ధతి’ అని ఒక నిర్వచనం, ‘మర్యాద’ అంటే సంస్కృతంలో హద్దు, లేక పరిధి అని అర్థం చెప్పారు. నీతి, సత్సంప్రదాయం, ధర్మం పరిధిలో ఎప్పుడూ నడుచుకొనేవాడు కనక రాముడు మర్యాదా పురుషోత్తముడు. శ్రీరాముడిని ‘వచస్వి’గా ‘వాగ్మి’(చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు.
మృదువైన మాట మనిషికి పెట్టని సొమ్ము. దానిని మెలకువలో, సహనంలో, సమర్థంగా వాడినవాడు శ్రీరాముడు. ఆయనది ఒక మాట, ఒక బాణం. మాట మృదువు, బాణం వాడి. ఆయన శూర్పణఖతో మాట్లాడినా, సుగ్రీవుడితో మాట్లాడినా, విభీషణుడితో సంభాషించినా, విశ్వామిత్రుడితో మాట్లాడినా మృదువుగానే మాట్లాడాడు. రాముడు మితభాషి కూడా. రాముడే కాదు, సత్యమే మాట్లాడాలని నియమం గలవాడు, ఆడిన మాట నిలబెట్టుకోవాలనే నిష్ట కలవాడెవడూ మితిమీరి మాట్లాడలేడూ, మాట్లాడడు.
శ్రీరాముడి దగ్గర ఉన్న మరొక మహత్తరమైన సుగుణం ‘పూర్వభాషిత్వం’ అని చెప్తారు. ఎవరినైనా తనే ముందు పలకరించి అనురాగంతో, ఆప్యాయతతో కుశలం తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం పూర్వభాషిత్వం. ఇది ఉత్తమ సంస్కారానికి చిహ్నం. శ్రీరాముడు పూర్వభాషి మాత్రమే కాదు. బంగారానికి తావి అబ్బినట్టు, స్మిత పూర్వభాషి కూడా. ముందు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు.
వాక్కు జంతుకోటిలో మనిషికి మాత్రమే ఉన్న విశిష్ట శక్తి. దానివల్లనే మానవుడు చరాచర సృష్టిలో శిఖరాయమానంగా భాసిస్తూ స్థావర జంగమాలను తన నియంత్రణలోకి తెచ్చుకొనేంత శక్తిశాలి అయ్యాడు. సరిగా వాడుకొంటే వాక్కు సుహృద్భావపూర్వకమైన మానవ సంబంధాలకు దోహదం చేసి, కార్యసిద్ధినీ విజయాన్నీ అందించగల సాధనం. తొందరపాటుతో, అనాలోచితంగా, అశ్రద్ధగా, అహంకార పూర్వకంగా వాడితే అది ఇతరులను తీవ్రంగా గాయపరచి, మానవ సంబంధాలను ధ్వంసం చేసి దుష్పరిణామాలకు దారితీసే ఆయుధం అవుతుందన్న సత్యం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఎరుకను ఆచరించగలవాడు నొప్పించక, తానొవ్వక జీవించగల నేర్పరి.
- ఎం. మారుతిశాస్త్రి