M. Maruthi Sastri
-
ప్రసూతి బహుమతి
పడమటి గాలి ఎన్నో కొత్త విషయాలు మోసుకొస్తుంటుంది. మూడు నాలుగు దశా బ్దాలలో ఈ ప్రభావం మరింత బలపడింది. పడమటి గాలి మోసుకొచ్చిన సాంస్కృతిక సంప్రదాయాల్లో వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్‌డే లాంటివి జరుపుకొనే అలవాటు మన నగరాలకు వచ్చింది. బహుమతి వస్తువులు అమ్మే వ్యాపారంలో ఉన్న వాణిజ్య సంస్థల జోరూ, వారి ప్రకటనల హోరూ ఊరికే ఎందుకు పోతాయి? ఇప్పుడిప్పుడే ఇలాంటి మరొక కొత్త సంప్రదా యం గురించి వింటున్నాం. దీని పేరు ‘పుష్ ప్రెజెంట్’, తెలుగులో ‘ప్రసూతి బహుమతి’ అనచ్చు. అప్పుడే బిడ్డను కన్న భార్యకు పది నెలలు బిడ్డను మోసిన ఆమె శారీరక శ్రమనూ ముఖ్యంగా ప్రసవ సమయంలో ఆమె పడే వేదననూ గుర్తించి, భర్త ఇచ్చే బహుమతి. ఈ బహుమతిని ప్రసవానికి కొంచెం ముందు గానీ, ప్రసవం జరిగిన కొద్ది రోజు లలో గానీ ఇవ్వాలి. ఆస్పత్రిలో ప్రసూతి గదిలో ఇవ్వ టం ఉత్తమం. ఇంటికి వచ్చిన తరువాత ఇవ్వటం మధ్యమం. ప్రసవ సమయానికి తగినంత ముందే భార్య భర్తకు తనకెలాంటి ‘పుష్ ప్రెజెంట్’ కావాలో సూచిస్తుంది. ఎలాంటి బహుమతులంటారా? బంగారు ఉంగరాలు, గొలుసులు, వజ్రాల చెవి కమ్మలు, బ్రాస్లెట్లు, తల్లీ - బిడ్డా నెక్లెస్ సెట్లూ సందర్భోచి తంగా ఉంటాయని వ్యాపార సంస్థల సూచన. అమెరికన్ నటి కిమ్ కార్దాషియాన్‌కు ఈ మధ్య ఆమె భర్త 5 కోట్ల రూపాయల వజ్రపుటుంగరం, ప్రసూతి బహుమతిగా ఇచ్చాడు. బ్రిటీష్ యువరాజు అరుదైన గులాబీ రంగు వజ్రం తన భార్యకు ఇవ్వబోతున్నాడట. పుష్ ప్రజెంట్నే కాస్త సున్నితంగా ‘బేబీమామా గిఫ్ట్’, ‘బేబీ బాబుల్’ అని కూడా ప్రస్తావిస్తుంటారు. మన దేశంలో ఇలాంటి సంబరాలు లేవా? లేకేం, స్తోమత ఉండాలే గానీ ప్రతి రోజూ రోజుకొకటి జరుపుకున్నా, ఇంకా మిగిలిపోయేటన్ని సంబరాలూ, పర్వదినాలూ ఉన్నాయి మనకూ. గర్భస్థదశ నించీ, జన్మాంతం వరకూ మనిషికి జరగ(ప)వలసిన షోడశ కర్మలలో శిశుదశలో జరిగేవి సగం: గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం(చెవి కుట్టించటం) వగైరాలు శాస్త్రోక్త విధులు. ఇవి కాక బోర్లపడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు, పలుకులకు చిలకలు, కూర్చొంటే కుడుములూ, ఇలాంటి వేడుకలకు అవధి లేదు. సంపన్నుల ఇళ్లలో సంతానం కలిగిందంటే జరిగే కోటి సంబరాలలో, ఆ సంతానాన్ని కలగజేసిన ఇల్లాలును బహుమతులతో సత్కరించకుండా ఉండే అవకాశమే లేదు. ఒకమాట చెప్పుకోవాలి. ఈ ప్రసూతి బహు మతి సంప్రదాయంలో వేడుకేకాకుండా చాలా సబ బు ఉంది. పది నెలల పాటు ఎంతో ఒత్తిడి, మానసి కాందోళనా, శారీరక శ్రమలకు ఓర్చి, బిడ్డను ప్రసవించిన ఆనందమయమైన సమయం బహుమ తులకు సందర్భమే. భార్య భర్తకు బిడ్డను ఎలాగూ బహుమతిగా ఇస్తున్నది. కనక భర్త భార్యకు ఆ సమయంలో తన శక్తికి తగిన బహుమతి ఇవ్వటం సందర్భోచితం. పరస్పరానురాగానికి అది చక్కని చిహ్నం. పాశ్చాత్య దేశాలలో కూడా ఈ కొత్త బహుమతి సంప్రదాయాన్ని స్వాగతించే వారు, విరోధించేవారు ఉన్నారు. - ఎం. మారుతి శాస్త్రి -
భక్తి ఉద్యమ సారథి
భారతీయ సనాతన ధర్మంలో మోక్ష సాధనకు జ్ఞాన-కర్మ-భక్తి మార్గాలను నిర్దేశించారు. వీటిలో జ్ఞానయోగం సాధారణ మేధస్సుగల సామాన్యులకు ఒక పట్టాన అర్థమై అంతుబట్టేది కాదు. అటు కర్మమార్గంలో ఆచరించాల్సిన వైదిక కర్మలూ, యజ్ఞయాగాలూ, విధినిషేధాలూ కూడా సాధారణ మానవులకు సులభంగా సాధ్యమయ్యేది కాదు. కనుకనే కలియుగంలో మానవులందరికీ భగవత్ సాక్షాత్కారానికి సర్వోత్కృష్టమైన మార్గం భక్తి మార్గమేనని చైతన్య మహా ప్రభువు అంటారు. పదకొండో శతాబ్దం తరువాతి కాలంలో దేశమంతా వెల్లువలా వ్యాపించిన భక్తి ఉద్యమ నిర్మాతల్లో ఆయన ప్రముఖుడు. గౌడీయ సంప్రదాయంవారూ, ఇస్కాన్ సభ్యులూ ఆయనను ద్వాపరయుగంలో ‘నల్లనయ్య’గా పుట్టిన శ్రీకృష్ణుడి ‘తెల్లనయ్య’ అవతారంగా ఆరాధిస్తారు. చైతన్య ప్రభువు ‘గౌరాంగుడు’-తెల్లని దేహకాంతితో మెరిసిపోయే సుందరాకారుడు. ఆయన బోధలు ఆనాటి సగటు మనిషి ఆధ్యాత్మిక చింతనకూ, సాధనకూ ఆచరణీయమైన స్పష్టమైన మార్గ నిర్దేశం చేశాయి. భగవన్నామ సంకీర్తనను మించిన ఆధ్యాత్మిక సాధనలేదని చైతన్యులు తన ఆచరణద్వారా, బోధనల ద్వారా, ఉద్యమంద్వారా దేశమంతా చాటారు. సర్వకాల సర్వావస్థలలోనూ, ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే , హరేరామ హరేరామ రామ రామ హరే హరే!’ అన్న మహా మంత్రాన్ని జపిస్తూ, ఏ పనిచేసినా శ్రీకృష్ణార్పణ భావంతో చేస్తే ఆపదలన్నీ తొలగి, పాపాలన్నీ క్షయమైపోయి తరిస్తారని చైతన్యులు బోధించారు. చైతన్యులు 1486 సంవత్సరం, ఫిబ్రవరి 18 ఫాల్గుణ పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో వంగదేశంలోని నవద్వీపంలో మాయాపూర్ గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఎన్నో మానవాతీతమైన లీలలూ, మహిమలూ ప్రదర్శించారు. పదహారేళ్ల వయసుకే ఉద్దండ పండితుడిగా పేరు సంపాదించారు. ఇరవైయ్యేళ్ల వయసులో గయక్షేత్రంలో ఈశ్వరపురి అనే గురువునుంచి హరే కృష్ణ మంత్రోపదేశం పొందాక ఆయనకు కృష్ణభక్తే లోకమైపోయింది. నృత్యంలో, గానంలో కృష్ణ నామ సంకీర్తనచేస్తూ కృష్ణభక్తి ప్రచారాన్ని ఉద్యమంగా నిర్వహిస్తూ శేష జీవితమంతా గడిపారు చైతన్య ప్రభువు. ఇరవైనాలుగేళ్లకే ఆయన సన్యాసం స్వీకరించారు. రాధాకృష్ణ ప్రేమతత్వం ఆయనను ఎంతో ప్రభావితుడిని చేసింది. ఆయనకు జీవితమంతా బృందావనంలోనే గడపాలని ఉండేదట. కానీ, చైతన్య ప్రభువు తల్లి ఆదేశం మేరకు సన్యాసాశ్రమ జీవితంలో ఎక్కువ భాగం పూరీ క్షేత్రంలోని జగన్నాథుడి సంకీర్తనలో గడిపారు. పూరీ రథయాత్ర సంప్రదాయాన్ని చైతన్యులు మరింత వైభవోపేతం చేశారు. దక్షిణ యాత్రచేసి ఆయన శ్రీకూర్మం, సింహాచలం, మంగళగిరి, తిరుపతిసహా దక్షిణాదిన ఉన్న పుణ్యక్షేత్రాలెన్నో దర్శించారు. కొవ్వూరులో రాజప్రతినిధిగా ఉన్న రామానంద రాయలు అనే ఆంధ్రుడు చైతన్యప్రభువుల సన్నిహిత శిష్యుల్లో ఒకరయ్యారు. బృందావన యాత్రలో చైతన్యులకు లభించిన సనాతన గోస్వామి, రూపగోస్వామి, జీవగోస్వామి తదితర శిష్యులు ఆయన బోధించిన భక్తి తత్వాన్ని గ్రంథస్థం చేశారు. చైతన్యులు మాత్రం శిక్షాష్టకం అనే ఎనిమిది శ్లోకాలు మినహా స్వయంగా ఏ గ్రంథమూ రాయలేదు. ఆయన పూరీ సముద్ర తీరంలో ఉన్న గోపీనాథ మందిరంలో 1533 జూన్ 14న నలభైయ్యేడు సంవత్సరాల వయసులో నృత్య సంకీర్తనలు చేస్తూ ఆ భక్తి పారవశ్యంలో ఆకస్మికంగా మందిరంలోనికి దూసుకుపోయి గోపీనాథుడిలో లీనమై అవతార సమాప్తి చేశారు. (నేడు చైతన్య ప్రభువు జయంతి) - ఎం. మారుతిశాస్త్రి -
ఈలోకం-పైలోకం!
మహాకవి, శతావధాని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు ‘కవనార్ధంబుదయించితన్ సుకవితా కార్యంబె నావృత్తి’ అని చెప్పుకుని, ఆ మాటను ‘అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశంబులో’ పండిత సభలెన్నిటినో చక్కగా సమర్థించుకొని, సత్కారాలు పొందిన మహానుభావులు. మహాభారతంలో ఎర్రాప్రగ్గడ రచించిన పద్యం ఒకటి ఆయనకు ఎంతో ఇష్టమైనది. వారిని అంతగా పులకరింపజేసిన పద్యం ఇది: ఈలోకమె యగు కొందర కాలోకమె కొందరకు, ఇహంబును పరమున్ మేలగు కొందర కధిపా! ఏలోకము లేదు వినవె యిల కొందరకున్! ‘పుణ్యఫలమైన సుఖం కొందరికి ఈ లోకంలోనే కలుగుతుంది. మరికొందరికి ఆ లోకంలో-అంటే పరలోకంలో కలుగుతుంది. కొందరికి రెండు లోకాలలోనూ కలుగుతుంది. మరికొందరు ఉభయభ్రష్టులకు ఇక్కడా కలగదు, అక్కడా కలగదు’అని ఈ పద్యం సారాంశం. అలంకార వైభవమేమీ లేకపోయినా నిసర్గ సుందరంగా మెరిసిపోతున్న ఈ పద్యంలో అందం కళ్లకు కడుతూనే ఉన్నది కదా! మహాభారతం అరణ్యపర్వం నాలుగో ఆశ్వాసంలో పద్యం ఇది. సందర్భం పాండవులు అరణ్యవాసం చేసేటపుడు పరమ తపోవృద్ధుడైన మార్కండేయ మహర్షి వాళ్ల దగ్గరకు వచ్చి ధర్మోపదేశం చేసే ఘట్టం. సర్వధర్మాలూ తెలిసిన ధర్మరాజుకు కూడా ఆ సమయంలో ఒక ధర్మ సందేహం మనసును తొలిచేస్తుండేది. ఆ సందేహమే ఆయన మార్కండేయ మహర్షి ముందు వెలిబుచ్చాడు: ‘ఓ మహర్షీ! ధర్మవర్తన గల మేము ఇలా ఇన్ని దుఃఖాలు అనుభవించడమేమిటి? ఎప్పుడూ పాపాలే చేసే ధృతరాష్ట్ర పుత్రులు సుఖోన్నతితో బతకడమేమిటి? ఈ విపరీతం గురించి నేనెంత ఆలోచించినా సమాధాన పడలేకపోతున్నాను. మనిషి ఇక్కడ చేసే కర్మ ఫలం ఈ లోకంలో పొందుతాడా? లేక పైలోకంలో పొందుతాడా? లేక ఈ లోకంలోనూ, పరలోకంలోనూ కూడా పొందుతాడా? జీవుడి కర్మఫలాలు జీవుడిని జన్మజన్మాంతరాలదాకా అంటిపెట్టుకొని ఉంటాయా? లేక శరీరం నశించినప్పుడు దానితోపాటు కర్మఫలాలూ నశించిపోతాయా?’ అందుకు మర్కండేయ మహర్షి చెప్పిన సమాధానం ఇది: ‘ధర్మరాజా! మనుషుల పుణ్యకర్మల ఫలం నీడలా వాళ్లను జన్మజన్మాంతరాల వరకూ అనుసరించి సుఖదుఃఖాలను కలిగిస్తుంది. పుణ్యకర్మల ఫలరూపమైన సుఖం కొందరికి ఈ లోకంలోనే లభిస్తుంది. కొందరికి పైలోకంలో లభిస్తుంది. మరికొందరికి రెండుచోట్లా లభిస్తుంది. ఎలాగంటావా? ఈ జన్మలో బాగా ధనికులూ, భాగ్యశాలులూ అయివుండి, సుఖలోలులై ఎప్పుడూ పుణ్యం, ధర్మం మాట తలపకుండా లోభానికీ, మోహానికీ బానిసలై ప్రవర్తించే మనుషులకు పరలోక సౌఖ్యాలు కలగవు. పుణ్యఫలం ఇక్కడివరకే ప్రాప్తం. ఈ జన్మలో ఉపవాసాలు, వ్రతాలు, తీర్థయాత్రలు, తపస్సాధనలూ చేసేవారికి వాటివల్ల శరీరక్లేశం కలిగినా, మరణానంతరం పరలోకంలో విశేషమైన ఆనందాలు కలుగుతాయి. ఇక ఈ జన్మలో ధర్మకర్మలు చేస్తూ, ధర్మంద్వారా అర్ధకామాలు సాధించి అనుభవిస్తూ ధర్మానుసారం వివాహం చేసుకుని, సంతానం పొంది, సత్కర్మలూ, యజ్ఞాలూ చేసేవారు రెండుచోట్లా సుఖం అనుభవిస్తారు. పుణ్య, పాప కర్మలేవి అనే వివేచన పురాణేతి హాసాలవల్లా, ఆధ్మాతిక విషయ సత్సంగా లవల్లా, పెంపొందించుకుని యథాశక్తి సత్కర్మలు ఆచరించు కోమని హితులైన పెద్దలు చెప్పే ఆప్తవాక్యం. - ఎం. మారుతిశాస్త్రి -
మధుర భాషణంతో కార్యసాధన
ఆస్ట్రేలియాలో ఒక న్యాయమూర్తి ఉండేవాడట. ఆయనకు రోజూ ఉదయం పార్కులో వ్యాహ్యాళికి వెళ్లే అలవాటు ఉండేది. ఆ పార్కు సమీపంలో పేవ్మెంటు మీద ఓ భిక్షకుడు ఆయనకు తరచుగా కనిపించేవాడు. న్యాయమూర్తి ఉదయం పార్కులోకి వెళ్తుంటే ఒకటి రెండుసార్లు వెటకారానికి ‘న్యాయమూర్తీ శుభోదయం’ అని ఆయన వెనకనించీ కేకవేశాడు. న్యాయమూర్తి వెనక్కి తిరిగి మర్యాదగా సమాధానం చెప్పాడు. మూడోసారి కలిసినప్పుడు ఆ న్యాయమూర్తి తనే ఆ భిక్షుకుడిని పలకరించి పార్కులోకి వెళ్తుంటే, ఓ పెద్ద మనిషి చూసి ‘న్యాయమూర్తి గారూ! మంచీ మర్యాద తెలియని ఆ మూర్ఖుడూ సోమరిపోతూ మిమ్మల్ని ఆట పట్టించటానికి పలకరిస్తున్నాడని మీకు తెలియదా? అతనిస్థాయి ఏమిటి, మీ స్థాయి ఏమిటి? మీరే స్వయంగా అతన్ని పలకరించటం మీ హోదాకు భంగకరం కాదా?’ అని సూచించబోయాడు. న్యాయమూర్తి ‘పెద్ద మనిషి గారూ, మంచీ మర్యాదా తెలియని మూర్ఖ భిక్షుకుడి కంటే మర్యాదలో నేను తీసిపోవాలని మీ ఉద్దేశమా?’ అన్నాడు. మర్యాద అనగానే మర్యాదాపురుషోత్తముడు శ్రీ రామచంద్రుడు గుర్తుకు వస్తాడు. మర్యాద అంటే ‘క్రమం, పద్ధతి’ అని ఒక నిర్వచనం, ‘మర్యాద’ అంటే సంస్కృతంలో హద్దు, లేక పరిధి అని అర్థం చెప్పారు. నీతి, సత్సంప్రదాయం, ధర్మం పరిధిలో ఎప్పుడూ నడుచుకొనేవాడు కనక రాముడు మర్యాదా పురుషోత్తముడు. శ్రీరాముడిని ‘వచస్వి’గా ‘వాగ్మి’(చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. మృదువైన మాట మనిషికి పెట్టని సొమ్ము. దానిని మెలకువలో, సహనంలో, సమర్థంగా వాడినవాడు శ్రీరాముడు. ఆయనది ఒక మాట, ఒక బాణం. మాట మృదువు, బాణం వాడి. ఆయన శూర్పణఖతో మాట్లాడినా, సుగ్రీవుడితో మాట్లాడినా, విభీషణుడితో సంభాషించినా, విశ్వామిత్రుడితో మాట్లాడినా మృదువుగానే మాట్లాడాడు. రాముడు మితభాషి కూడా. రాముడే కాదు, సత్యమే మాట్లాడాలని నియమం గలవాడు, ఆడిన మాట నిలబెట్టుకోవాలనే నిష్ట కలవాడెవడూ మితిమీరి మాట్లాడలేడూ, మాట్లాడడు. శ్రీరాముడి దగ్గర ఉన్న మరొక మహత్తరమైన సుగుణం ‘పూర్వభాషిత్వం’ అని చెప్తారు. ఎవరినైనా తనే ముందు పలకరించి అనురాగంతో, ఆప్యాయతతో కుశలం తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం పూర్వభాషిత్వం. ఇది ఉత్తమ సంస్కారానికి చిహ్నం. శ్రీరాముడు పూర్వభాషి మాత్రమే కాదు. బంగారానికి తావి అబ్బినట్టు, స్మిత పూర్వభాషి కూడా. ముందు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. వాక్కు జంతుకోటిలో మనిషికి మాత్రమే ఉన్న విశిష్ట శక్తి. దానివల్లనే మానవుడు చరాచర సృష్టిలో శిఖరాయమానంగా భాసిస్తూ స్థావర జంగమాలను తన నియంత్రణలోకి తెచ్చుకొనేంత శక్తిశాలి అయ్యాడు. సరిగా వాడుకొంటే వాక్కు సుహృద్భావపూర్వకమైన మానవ సంబంధాలకు దోహదం చేసి, కార్యసిద్ధినీ విజయాన్నీ అందించగల సాధనం. తొందరపాటుతో, అనాలోచితంగా, అశ్రద్ధగా, అహంకార పూర్వకంగా వాడితే అది ఇతరులను తీవ్రంగా గాయపరచి, మానవ సంబంధాలను ధ్వంసం చేసి దుష్పరిణామాలకు దారితీసే ఆయుధం అవుతుందన్న సత్యం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఎరుకను ఆచరించగలవాడు నొప్పించక, తానొవ్వక జీవించగల నేర్పరి. - ఎం. మారుతిశాస్త్రి -
శ్రీసూర్యనారాయణా...
‘దేవుడున్నాడా, లేడా?’ అని అనుమానం వస్తే, తొలిసంజెలో తూర్పుదిక్కు చూడండి. ప్రతిరోజూ ఈ విశ్వాన్ని నియంత్రిస్తూ, రక్షిస్తూ, క్రమం తప్పక ‘ఉదయించే’, ఊహకు కూడా అందనంత అమేయశక్తి శాలి అయిన ఒక అరుణగోళం ఆ సందేహానికి సమాధానం ఇస్తుంది. ఈ చరాచర ప్రాణికోటికీ సాక్షాత్తూ ప్రాణదాత అయిన భువనేశ్వరుడు భాస్కర రూపంలో ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తాడు. సూర్యుడు లేకపోతే ప్రకాశం లేదు. అది లేకపోతే నీరు కానీ, ఆహార చక్రం గానీ సాధ్యం కావు. అవి లేకపోతే జీవనం లేదు. కనుకనే సూర్యుడు చరాచర ప్రాణికోటికి ప్రాణదాత. సృష్టి స్థితిలయాలకు మూలం. ప్రాణికోటిని సృష్టించి, పోషించి, పెంచి, నియంత్రించి, రక్షించే అమే యమైన అచింత్యమైన, అనూహ్యమైన, సర్వసమర్థతగల శక్తినే గదా దేవు డంటాం. అందుకే సూర్యుడు, నిజానికి సూర్య భగవానుడు! ఆదిత్య హృదయం సూర్యుడిని, ఏషః- బ్రహ్మ చ, విష్ణుశ్చ, శివః, స్కందః ప్రజాపతిః మహేంద్రః-, ధనదః-, కాలః -, యమః-, సోమః- (హి) అపాంపతిః॥ (ఈయనే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కార్తికేయుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలదేవత, దక్షిణ దిక్పాలకుడయిన యమధర్మరాజు, చంద్రుడు, జలాధిపతి అయిన వరుణ దేవుడు) అని కొనియాడటం చాలా వరకు స్వభావోక్తి. మయూరుడనే మహాకవి ఉన్నాడు. ఈయన హర్షవర్ధన చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు. అంటే క్రీ.శ. ఏడవ శతాబ్దంలో. ఈయనకు ఏ కార ణం చేతో కుష్ఠువ్యాధి సంక్రమించిందట. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, రోగవిముక్తికి సూర్యుడిని ఆరాధించాలని జనశ్రుతి. ఆరోగ్యం భాస్కరాత్ - ఇచ్ఛేత్, శ్రీయం-ఇచ్ఛేత-హుతాశనాత్ జ్ఞానం మహేశ్వరాత్ ఇచ్ఛేత్, మోక్షం - ఇచ్ఛేత్ - జనార్దనాత్॥ (ఆరోగ్యం సూర్యుడి నుంచి, సంపద అగ్నిదేవుడి నుంచి, జ్ఞానం శివుడి నుంచీ, మోక్షం జనార్దనుడి నుంచి కోరాలి). అందువల్ల మయూరుడు సూర్యుడిని నూరు ప్రౌఢమైన శ్లోకాల సూర్య శతకంతో స్తుతించాడు. ఆరోగ్యమూ, దాంతోపాటు సంస్కృత సాహిత్యంలో చిరస్థాయి అయిన కీర్తీ కూడా సంపాదించుకున్నాడు. సూర్యదేవుడి ఆరాధకులకు పరమ పవిత్రమైన రథసప్తమి సందర్భంగా మయూరుడి సూర్యశతకంలో ఒక్క శ్లోకం అన్నా గుర్తు చేసుకోవటం సంద ర్భోచితంగా ఉంటుంది. దాదాపు నలభై శ్లోకాలలో సూర్యకాంతినీ, ముప్ఫయి శ్లోకాలలో సూర్యుడి రథాన్నీ, పాతిక శ్లోకాలలో సూర్యుడి మహత్మ్యాన్నీ వర్ణించిన మయూరుడు, శతకానికి ముక్తాయింపుగా మనోహరమైన ఈ నూరో శ్లోకం అందించాడు. ‘దేవః కిం? బాంధవః స్యాత్? ప్రియ సుహృస్పిత్, అథ వా- (ఆ) ,ఆనకచః ఝ - ఆహోస్పిత్, - అర్యః? రక్షా? చక్షుః ను? దీపంః ? గురుః? - ఉత జనకః? జీవితం? బీజం? - ఓజంః?’ ఏవం నిర్ణీయతే యః కః యివ న; జగతాం సర్వధా, సర్వదా - అ సౌ సర్వాకారోపకారీ; దిశతు దశ శత- (అ) భీషుః అభ్యర్థితం వః! ప్రౌఢంగా ఉన్నా, శ్రద్ధగా చదువుకొంటే అర్థమయ్యే శ్లోకమే. ‘ఈయన దేవుడా? లోకబాంధవుడా? ప్రియమిత్రుడా? లేక ఆచా ర్యుడా? అదీ కాకుంటే (ఆహోస్విత్), ప్రభువా? రక్షకుడా? నేత్రమా? శక్తా?’ - యిలా ఫలానా అని ఎవరు నిర్ణయించబడజాలడో, ఆ సూర్యుడు లోకాలకు అన్నివిధాలా, అన్నివేళలా, అన్ని దేవతల రూపాలలోనూ ఉపకారాలు చేస్తాడు. ఆ సహస్ర కిరణుడు మీరు అభ్యర్థించినవన్నీ ఇచ్చుగాక!’ తథాస్తు! - ఎం. మారుతిశాస్త్రి (నేడు రథసప్తమి, సూర్యజయంతి) -
అతి చేస్తే అంతే సంగతులు
ప్రాచీనకాలంలో ఋషులూ, మేధావులూ, ప్రవక్తలూ చెప్పిన సుభాషితాలు కొన్ని ఆ రోజులకంటే, ఇప్పటి సాం ఘిక పరిస్థితులకే ఎక్కువ అన్వయిస్తాయని ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది. అందరూ ఎరిగిన ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న సూక్తి దీనికొక చక్కని ఉదాహరణ. ప్రపంచంలో ఇంత ఆర్థిక సాంకేతిక అభివృద్ధి కనిపిస్తున్నా, చాలా మందికి జీవితం సమస్యలమయమే. మరింత అభివృద్ధి చెందిన దేశాలలో మరిన్ని సమస్యలు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, దాం పత్య సమస్యలు, సంతానంతో సమస్యలు, మానవ సం బంధాల సమస్యలు.‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న చిన్న సూత్రాన్ని బాగా మనసుకు పట్టించుకొని, ఆచరించగలిగితే, ఈ సమస్యలలో చాలా వాటికి పరిష్కారం లభిస్తుంది. ఆహార విహారాల విషయంలో, జీవన విధానం విషయంలో నివార్యమైన ‘అతి’ వల్లనే కదా ఆరోగ్య సమస్యలలో మూడువంతుల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే కామక్రోధాలూ, ఈర్ష్యాహంకారాలలో ‘అతి’ వల్లనే మానవ సంబంధాలలో ఎక్కువ శాతం సమస్యలు. అతి లోభం, అత్యాశ వల్లా, ఎలాగైనా సరే అందరికంటే ఉత్తమమైన, ఉన్నతమైన స్థానానికి ఏదోవిధంగా చేరుకోవాలనే తాపత్రయంతో అనారోగ్యకరమైన పోటీతో తెచ్చిపెట్టుకునే సమస్యలు మరికొన్ని. ‘అతి’ వల్ల మనిషి యుగ యుగాలుగా బాధపడుతున్నాడు, ఇవాళే కాదు. అతి దర్పే హతాలంకా అతి మానే చ కౌరవాః అతిదానే బలిః-బద్ధః అతి సర్వత్ర వర్జయేత్ ॥ మితిమీరిన బలదర్పం వల్ల త్రేతాయుగంలో లంకా రాజ్యం నాశనమైపోయింది. ద్వాపరయుగంలో మితిమీరిన ఈర్ష్యవల్ల కౌరవులు నశించిపోయారు. అంతకుముందు కృతయుగంలో దానం లాంటి సత్కర్మ కూడా మితి ఎరగకుండా చేసి, బలిచక్రవర్తి కట్టుబడిపోయి పాతాళ వాసం చేశాడు. అందుకే ‘అతి’ అన్ని చోట్లా వర్జించాలి అని ఆర్యోక్తి. ఇది కలియుగంలో కూడా ఆచరణ యోగ్యం. ‘అతి’కి, ఈ కాలంలో అన్నిటికంటే సాధారణమైన, సర్వజనీనమైన, స్థూలమైన స్పష్టమైన ఉదాహరణ ఆహా రం. నాలుకకు హితవైన ఆహారం మితంగా భుజించటం తప్పేమీ కాదు. కానీ ‘అతి’గా భుజిస్తే, భుజించింది అరిగేందుకు అవకాశం లేనంతగా భుజిస్తే ఊబకాయం, అనారోగ్యం, సంబంధిత సమస్యలూ తప్పవు. అలాగే మనకు అందుబాటులో ఉండి, చట్టానికీ ధర్మానికీ విరుద్ధం కాని ఏ భోగమైనా అనుభవించవచ్చు. పరిమితులూ పరిస్థితులూ మరచిపోకుండా దాని కోసం యథాశక్తి ప్రయత్నించవచ్చు. అర్థ, కామాలు కూడా పురుషార్థాలే. కానీ, కోరిక పరిమితులలో ఉంటేనే అది తీరే అవకాశం, తీరటం వల్ల సుఖానుభవం. మితులు దాటితే దుఃఖం తప్పదు. మితులు మీరిన కోరికలే దుఃఖానికి కారణం. మితిలేని ధన కనక వస్తు వాహనాల తాపత్రయం కూడా మితిలేకుండా పెరిగిన అనారోగ్యదాయకమైన ఊబకాయం లాంటిదే. కాకపోతే ఇది కంటికి కనిపిం చని ఊబకాయం. కనిపించే ఊబకాయం సుఖాన్ని కలి గించే బదులు ఆయాసం, అనారోగ్యం, అనాకారితనం కలిగించినట్టు, ‘అతి’ తాపత్రయం అశాంతినీ, అలజడినీ, ఒత్తిడినీ కలిగిస్తుంది. ‘మనిషికి చిక్కకుండా ఉండే భోగాలు మనిషికి మనోవ్యధను కలిగిస్తాయి. భోగాలకు చిక్కకుండా ఉండే మనిషిదే అసలైన సుఖం!’ అని మరొక ఆసక్తికరమైన, ఆలోచనీయమైన ప్రాచీన భారతీయ సుభాషితం. ఎం. మారుతి శాస్త్రి