ఈలోకం-పైలోకం!
మహాకవి, శతావధాని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు ‘కవనార్ధంబుదయించితన్ సుకవితా కార్యంబె నావృత్తి’ అని చెప్పుకుని, ఆ మాటను ‘అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశంబులో’ పండిత సభలెన్నిటినో చక్కగా సమర్థించుకొని, సత్కారాలు పొందిన మహానుభావులు. మహాభారతంలో ఎర్రాప్రగ్గడ రచించిన పద్యం ఒకటి ఆయనకు ఎంతో ఇష్టమైనది. వారిని అంతగా పులకరింపజేసిన పద్యం ఇది:
ఈలోకమె యగు కొందర
కాలోకమె కొందరకు, ఇహంబును పరమున్
మేలగు కొందర కధిపా!
ఏలోకము లేదు వినవె యిల కొందరకున్!
‘పుణ్యఫలమైన సుఖం కొందరికి ఈ లోకంలోనే కలుగుతుంది. మరికొందరికి ఆ లోకంలో-అంటే పరలోకంలో కలుగుతుంది. కొందరికి రెండు లోకాలలోనూ కలుగుతుంది. మరికొందరు ఉభయభ్రష్టులకు ఇక్కడా కలగదు, అక్కడా కలగదు’అని ఈ పద్యం సారాంశం. అలంకార వైభవమేమీ లేకపోయినా నిసర్గ సుందరంగా మెరిసిపోతున్న ఈ పద్యంలో అందం కళ్లకు కడుతూనే ఉన్నది కదా!
మహాభారతం అరణ్యపర్వం నాలుగో ఆశ్వాసంలో పద్యం ఇది. సందర్భం పాండవులు అరణ్యవాసం చేసేటపుడు పరమ తపోవృద్ధుడైన మార్కండేయ మహర్షి వాళ్ల దగ్గరకు వచ్చి ధర్మోపదేశం చేసే ఘట్టం. సర్వధర్మాలూ తెలిసిన ధర్మరాజుకు కూడా ఆ సమయంలో ఒక ధర్మ సందేహం మనసును తొలిచేస్తుండేది. ఆ సందేహమే ఆయన మార్కండేయ మహర్షి ముందు వెలిబుచ్చాడు:
‘ఓ మహర్షీ! ధర్మవర్తన గల మేము ఇలా ఇన్ని దుఃఖాలు అనుభవించడమేమిటి? ఎప్పుడూ పాపాలే చేసే ధృతరాష్ట్ర పుత్రులు సుఖోన్నతితో బతకడమేమిటి? ఈ విపరీతం గురించి నేనెంత ఆలోచించినా సమాధాన పడలేకపోతున్నాను. మనిషి ఇక్కడ చేసే కర్మ ఫలం ఈ లోకంలో పొందుతాడా? లేక పైలోకంలో పొందుతాడా? లేక ఈ లోకంలోనూ, పరలోకంలోనూ కూడా పొందుతాడా? జీవుడి కర్మఫలాలు జీవుడిని జన్మజన్మాంతరాలదాకా అంటిపెట్టుకొని ఉంటాయా? లేక శరీరం నశించినప్పుడు దానితోపాటు కర్మఫలాలూ నశించిపోతాయా?’
అందుకు మర్కండేయ మహర్షి చెప్పిన సమాధానం ఇది:
‘ధర్మరాజా! మనుషుల పుణ్యకర్మల ఫలం నీడలా వాళ్లను జన్మజన్మాంతరాల వరకూ అనుసరించి సుఖదుఃఖాలను కలిగిస్తుంది. పుణ్యకర్మల ఫలరూపమైన సుఖం కొందరికి ఈ లోకంలోనే లభిస్తుంది. కొందరికి పైలోకంలో లభిస్తుంది. మరికొందరికి రెండుచోట్లా లభిస్తుంది. ఎలాగంటావా? ఈ జన్మలో బాగా ధనికులూ, భాగ్యశాలులూ అయివుండి, సుఖలోలులై ఎప్పుడూ పుణ్యం, ధర్మం మాట తలపకుండా లోభానికీ, మోహానికీ బానిసలై ప్రవర్తించే మనుషులకు పరలోక సౌఖ్యాలు కలగవు. పుణ్యఫలం ఇక్కడివరకే ప్రాప్తం. ఈ జన్మలో ఉపవాసాలు, వ్రతాలు, తీర్థయాత్రలు, తపస్సాధనలూ చేసేవారికి వాటివల్ల శరీరక్లేశం కలిగినా, మరణానంతరం పరలోకంలో విశేషమైన ఆనందాలు కలుగుతాయి. ఇక ఈ జన్మలో ధర్మకర్మలు చేస్తూ, ధర్మంద్వారా అర్ధకామాలు సాధించి అనుభవిస్తూ ధర్మానుసారం వివాహం చేసుకుని, సంతానం పొంది, సత్కర్మలూ, యజ్ఞాలూ చేసేవారు రెండుచోట్లా సుఖం అనుభవిస్తారు. పుణ్య, పాప కర్మలేవి అనే వివేచన పురాణేతి హాసాలవల్లా, ఆధ్మాతిక విషయ సత్సంగా లవల్లా, పెంపొందించుకుని యథాశక్తి సత్కర్మలు ఆచరించు కోమని హితులైన పెద్దలు చెప్పే ఆప్తవాక్యం.
- ఎం. మారుతిశాస్త్రి