‘మహాభారతంలోనూ లవ్ జిహాద్ జరిగింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా క్షమాపణలు తెలియజేశారు. ప్రజల నుంచి క్షమాపణలు కోరుతూ వైష్ణవ్ ప్రార్థనకు చెందిన ఓ గీతాన్ని కూడా పాడారు.
కాగా, గోలాఘాట్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు ‘లవ్ జిహాద్’ అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడంపై బోరా స్పందిస్తూ.. శ్రీకృష్ణుడికి రుక్మిణితో ఉన్న బంధాన్ని ప్రస్తావించాడు. రుక్మిణిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలని భావించినప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని.. మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని ఆరోపించాడు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. దీనిపై ఒకవేళ పోలీస్ కేసు నమోదైతే అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల అంశాన్ని లేవనెత్తడం ఖండించదగినదని చెప్పారు.
సనాతన ధర్మం, హిందూ ధర్మాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. హజ్రత్ మహమ్మద్‌ను, జీసస్ క్రైస్ట్‌ను ఏ విధంగా అయితే వివాదాల్లోకి లాగబోమో, అదేవిధంగా శ్రీకృష్ణుడిని వివాదాల్లోకి లాగడం మానుకోవాలని హితవు పలికారు. నేరపూరిత చర్యలను భగవంతుడితో పోల్చడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
చదవండి: ఉడిపి వాష్‌రూమ్ కేసులో సీఎంపై అనుచిత ట్వీట్.. బీజేపీ కార్యకర్త అరెస్ట్
దీనిపై అసోం కాంగ్రెస్ చీఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. తమ తాత నిన్న రాత్రి తన కలలోకి వచ్చారని తెలిపారు. తను చేసిన స్టేట్‌మెంట్ తప్పని, ఇది రాష్ట్ర ప్రజలను బాధపెట్టిందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యల కారణంగా పార్టీకి నష్టం జరగకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైష్ణవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కూడా ఇష్టం లేదన్నారు.
వైష్ణవ్ భక్తులు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు బాధగా అనిపించిందని భూపేన్ చెప్పారు. అందుకే వైష్ణవ ఆలయంలో మట్టి దీపం, తమలపాకులు సమర్పించాలని నిర్ణయించుకున్నాన్నారు. స్వామిని క్షమించమని ప్రార్థించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేగానీ బీజేపీ, సీఎంకు భయపడి క్షమించమని కోరడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిపై పలు కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment