కాంగ్రెస్‌ ఎంపీకి వ్యతిరేక నినాదాలు.. క్రికెట్‌ బ్యాట్లతో దాడి | Assam Congress MP Rakibul Hussain And Security Attacked By Mob, Watch Video Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎంపీకి వ్యతిరేక నినాదాలు.. క్రికెట్‌ బ్యాట్లతో దాడి

Published Fri, Feb 21 2025 8:24 AM | Last Updated on Fri, Feb 21 2025 10:09 AM

Assam Congress MP Rakibul Hussain Security Injuries

గౌహతి: అస్సాంకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ రకీబుల్‌ హుస్సైన్‌తోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎంపీ క్షేమంగా బయటపడగా, ఆయన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందిస్తూ ఎంపీ రకిబుల్‌కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అస్సాంలోని నాగావ్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ఎంపీ రకీబుల్‌ హుస్సైన్‌పై దాడి జరిగింది. రకీబుల్‌ హుస్సైన్‌ అస్సాంలో దూబ్రీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుపోహీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గునమారీ గ్రామంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి దిగారు. క్రికెట్‌ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. గుర్తుపట్టకుండా ముఖాలకు నల్లరంగు వ్రస్తాలు కప్పుకున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది ఎంపీకి రక్షణగా నిల్చున్నారు. అయినా దుండుగులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో చుట్టుముట్టి దాడి చేయడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ముష్కరులు వీరంగం సృష్టించారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించడంతో వారంతా పారిపోయారు. అనంతరం ఎంపీ రకీబుల్‌ యథావిధిగా కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీపై దాడి ఘటనపై అస్సాం కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముష్కర మూకను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ గురువారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఎంపీ రకీబుల్‌కు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారికపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక, రకీబుల్‌ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో 10 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనపై దాడికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. బీజేపీ పాలనలో తమకు రక్షణ లేకుండాపోయిందని అస్సాం కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీనియర్‌నేత గౌరవ్‌ గొగోయ్‌ ధ్వజమెత్తారు. గూండారాజ్‌ సంస్కృతి నుంచి రాష్ట్ర ప్రజలు స్వాతంత్య్రం కోరుకుంటున్నారని చెప్పారు.    

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement