అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం | Amit Shah Targets Congress in Assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం

Published Sun, Mar 16 2025 5:22 AM | Last Updated on Sun, Mar 16 2025 5:22 AM

Amit Shah Targets Congress in Assam

ప్రధాని మోదీ హయాంలో శాంతి, అభివృద్ధి 

హోం మంత్రి అమిత్‌ షా వెల్లడి

దెర్‌గావ్‌జ్వాల్‌: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, మౌలిక వనరులను అభివృద్ధి చేసింది ప్రధాని మోదీయేనని హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని తెలిపారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాష్ట్రంలో శాంతి నెలకొనకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రానికి ఎటువంటి గ్రాంట్లు అందకపోవడంతో ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలకు, వెనుకబాటుకు మారుపేరుగా మారిందని విమర్శించారు.

శనివారం మంత్రి అమిత్‌ షా గోలాఘాట్‌ జిల్లా దెర్‌గావ్‌లోని లచిత్‌ బార్‌పుకాన్‌ పోలీస్‌ అకాడెమీ పునరుద్ధరణ మొదటి దశ పనులను ప్రారంభించడంతోపాటు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అస్సాంలో 10 వేల మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో గత పదేళ్లుగా రాష్ట్రంలో శాంతి నెలకొంది. ఆందోళనలు, హింస, వేర్పాటువాదానికి పేరున్న అస్సాంలో నేడు రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడితో అత్యాధునిక సెమీ కండక్టర్‌ పరిశ్రమ నడుస్తోంది. ఇది అస్సాం భవిష్యత్తునే మార్చనుంది’అని అన్నారు.

ఇటీవల ముగిసిన అడ్వాంటేజ్‌ అస్సాం 2.0లో మరో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. ఇవి ఏర్పాటైతే యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని మంత్రి చెప్పారు. మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. విద్యార్థిగా ఉండగా అస్సాంకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘అప్పట్లో కాంగ్రెస్‌ నేత హితేశ్వర్‌ సైకియా సీఎంగా ఉండేవారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అరెస్టయిన వారిలో నేనూ ఉన్నా. అస్సాం జైలులో వారం పాటు నన్ను ఉంచారు’అని తెలిపారు.

అప్పటి కాంగ్రెస్‌ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లచిత్‌ బార్‌పుకాన్‌ పోలీస్‌ అకాడెమీ దేశంలోనే అగ్రగామిగా మారనుందని చెప్పారు. అనంతరం అమిత్‌ షా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో అస్సాం రైఫిల్స్‌ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మిజోరంలో అభివృద్ధి పనుల పురోగతిపై స్వయంగా ప్రధాని మోదీయే సమీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు.

అస్సాం రైఫిల్స్‌ క్యాంప్‌ను ఐజ్వాల్‌ వెలుపలికి మార్చడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. మిజో ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ప్రధానమంత్రులంతా కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది 21 సార్లు మాత్రమే రాగా, ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో 78 పర్యాయాలు పర్యటించారని అమిత్‌ షా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement