పోప్‌తో మోదీ.. వ్యంగ్యంగా పోస్ట్‌! కేరళ కాంగ్రెస్‌ క్షమాపణ | Kerala Congress Unit Apology On Modi Pope Photo Row, More Details Inside | Sakshi
Sakshi News home page

పోప్‌తో మోదీ.. వ్యంగ్యంగా పోస్ట్‌! కేరళ కాంగ్రెస్‌ క్షమాపణ

Published Mon, Jun 17 2024 12:38 PM | Last Updated on Mon, Jun 17 2024 1:30 PM

Kerala Congress Unit Apology On Modi Pope Photo Row

తిరువనంతపురం: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై సెటైరిక్‌గా ఓ పోస్ట్‌ చేసి.. అది కాస్త తీవ్ర దుమారం రేపడంతో కేరళ కాంగ్రెస్‌ యూనిట్‌ క్షమాపణలు చెప్పింది. అయితే.. మోదీని విమర్శించడంలో, అవహేళన చేయడంలోనూ తాము ఏమాత్రం సంకోచించబోమని అంటోంది.

ఇటలీలో  జీ-7 సమ్మిట్‌ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పోప్‌ను కలిశారు. అయితే ఆ ఫొటోను పోస్ట్‌ చేసిన కేరళ కాంగ్రెస్‌ యూనిట్‌.. ‘‘ఎట్టకేలకు.. దేవుడ్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కిందంటూ’’ కామెంట్‌ చేసింది. తాను దైవ దూతనంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేరళ కాంగ్రెస్‌ యూనిట్‌ ఈ వ్యంగ్య పోస్ట్‌ చేసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈ పోస్ట్‌పై బీజేపీ విమర్శలకు దిగింది. 

ఇది ప్రధాని మోదీని మాత్రమే కాదని.. పోప్‌ను కూడా అవమానించడమే అవుతుందని మండిపడింది. కేరళ ఎక్స్‌ హ్యాండిల్‌ బహుశా రాడికల్‌ ఇస్లామిస్ట్స్‌, లేదంటే అర్బన్‌ నక్సల్స్‌ చేతుల్లో ఉందేమో. అందుకే జాతీయస్థాయి అగ్రనేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. ఇప్పుడు ఏకంగా పోప్‌ను.. క్రైస్తవ కమ్యూనిటీని అగౌరవపరుస్తోంది అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు.. బీజేపీ కార్యదర్శి జార్జి కురియన్‌ కూడా మతపరమైన మనోభావాల్ని దెబ్బ తీస్తున్నారంటూ కాంగ్రెస్‌ పోస్ట్‌పై మండిపడ్డారు. ఇంకోవైపు బీజేపీ ఐటీ సెల్‌ ఇంఛార్జి అమిత్‌ మాలవీయా సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ పరిణామంపై సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఈ వ్యవహారం ఇక్కడితోనే ఆగలేదు. పోప్‌ మాటల్నే ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ..  కేరళ కాంగ్రెస్‌ యూనిట్‌ మరో పోస్ట్‌ చేసింది. దీంతో వ్యవహారం మరింత ముదిరింది. ఈ తరుణంలో.. కేరళ కాంగ్రెస్‌ వెనక్కి తగ్గింది. సదరు పోస్టును తొలగించి.. ‘‘తమ పోస్ట్‌ వల్ల ఏమైనా మానసిక క్షోభ అనుభవించి ఉంటే క్రైస్తవులు క్షమించాలి’’ అని కోరింది. అయితే..

నరేంద్ర మోదీని విమర్శించడంలో మాత్రం తాము తగ్గబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో మణిపూర్‌లో జరిగిన హింస.. చర్చిల దహనం పరిణామాలపై బీజేపీ కూడా క్రైస్తవులకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement