Love jihad
-
‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబయి:‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకోవడానికి డిసైడయింది.‘లవ్ జిహాద్’పై చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఓ కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, లవ్ జిహాద్ ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది.కాగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 2022లో ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేశాడు.దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలొచ్చాయి.అప్పట్లో లవ్‌జిహాద్‌పై తీవ్రంగా చర్చ జరిగింది.దీంతో ఈ అంశంపై ఇటీవలే మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.అయితే, ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే సూచించారు. -
లవ్ జిహాద్‌కు జీవిత ఖైదు: అసోం
గువాహటి: హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న ‘లవ్ జిహాద్’ దోషులకు యావజ్జీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని బీజేపీ పాలిత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ప్రకటించారు. ‘‘ఎన్నికల వాగ్దానాలనే నెరవేర్చబోతున్నాం. లవ్ జిహాద్‌తో సంబంధమున్న వారికి జీవితఖైదు తప్పదు. ఇకపై అసోంంలో పుట్టిన వారినే స్థానికులుగా గుర్తిస్తాం. వారికే ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ఉంటుంది’’ అన్నారు. -
తప్పుడు ప్రచారాలపై పాత్రికేయ అస్త్రం
ఉద్దేశపూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడించడం ఉత్తమమైన పాత్రికేయ విలువలకు ప్రామాణికం అవుతుంది. అటువంటి ఒక ప్రామాణిక గ్రంథమే సీనియర్ జర్నలిస్టులు రాసిన ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’! పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం లాంటి అసత్య ప్రచారాలు. వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశోధనాంశాలతో హాస్యాస్పద మైన అభియోగాలను రచయితలు బట్టబయలు చేశారు. 2014 తర్వాత ‘గో–సంబంధ దాడులు’ ఎంత పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఒకవేళ మీకు కూడా నాలాగే భారతీయ పాత్రికేయ వృత్తి వైఖరులపై నిరాశ మొదలై ఉంటే, కనుచూపు మేరలో భూమ్యాకాశాలు కలిచేచోట ఒక శుభవార్త ఉందని తెలుసుకుని మీరెంతగానో సంతోషిస్తారు. అది టీవీ న్యూస్ ఛానెల్ కోసమో లేదా వార్తాపత్రిక కోసమో జరిగిన పనైతే కాదు. నిజానికి అదొక పుస్తకం. ఆ పుస్తకం అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలను కలిగివుండి, ఖ్యాతిని కోల్పోతున్న వృత్తిపై విశ్వాసాన్ని పాదుగొల్పే ఒక గణనీయ పునరుద్ధరణ. ఈ రోజు నేను ఆ పుస్తకం వైపు మీ దృష్టిని మరల్చాలని అనుకుంటున్నాను. ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’ అనే ఆ పుస్తకాన్ని ఇద్దరు మాజీ ఎన్డీ టీవీ జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మరియమ్ అలావీ; ‘స్క్రోల్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియా శర్మ కలిసి రాశారు. పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం, ఇంకా సోకాల్డ్... ‘పింక్ రివల్యూషన్’. ప్రతి కేసులోనూ మొదట ఈ పుస్తక రచయితలు ఉద్దేశ పూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడిస్తారు. ఆ తర్వాత వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశో ధనాంశాలతో హాస్యాస్పదమైన ఆ అభియోగాలను బట్టబయలు చేస్తారు. లేదా ఆ ఆరోపణల్లోని అవాస్తవాలను ధ్వంసం చేస్తారు. పుస్తకం గురించి నేను చెప్పవలసి ఉన్నదానిలో ఇంతకుమించి ఒక్కమాటైనా చెప్పకుండా నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. మీకై మీరు చదవవలసిన అవసరం ఉన్న పుస్తకం ఇది. తనని చదివించు కునేలా చేస్తుంది. మిమ్మల్ని ఒప్పించేలా చదివిస్తుంది. అయినా గానీ, మీ ఆకలిని నన్ను కాస్త రెచ్చగొట్టనివ్వండి. లవ్ జిహాద్‌పై ఈ పుస్తక రచయితలు విశ్వ హిందూ పరిషత్ అంతర్గత పత్రిక ప్రత్యేక సంచిక ప్రచురించిన జాబితాలోని కేసులను విశ్లేషించారు. ‘‘లవ్ జిహాద్‌పై అందుబాటులో ఉన్న ఏకైక సమగ్ర సాక్ష్యాధార సమాచారం అదొక్కటే’’. అయితే నిజానికది, ‘‘147 వార్తా కథనాల క్రమానుగత కూర్పు మాత్రమే’’. ఆ కూర్పులో మొదటి కేసు 2011 నవంబరు నాటిది, చివరి కేసు 2020 సెప్టెంబర్ లోనిది. వాటిల్లో డెబ్బై మూడు, అంటే సగానికి సగం కేసులు ‘వాస్తవాలకు నిలబడనివి’. ‘‘అవన్నీ లింకులు తెగినవి, చెప్పిందే చెప్పినవి, భారతదేశానికి సంబంధం లేనివి’’. తక్కిన డెబ్బై నాలుగు... ‘‘మోసం, అపహరణ, విడిచిపెట్టటం, అత్యా చారం, హత్య మొదలైన వాటితో సహా లింగ సంబంధ నేరాల విస్తృత సమాచారం. ‘‘అన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్నది ఒకటే. నిందితుడు ముస్లిం, బాధితురాలు హిందువు’’ అని రచయితలు పేర్కొన్నారు. లవ్ జిహాద్ లక్ష్యం హిందూ మహిళల్ని మాయచేసి, మభ్యపెట్టి మతం మార్చడమే అయితే ఈ ఉదాహరణలు కేసును బలహీన పరుస్తాయి. 2014 తర్వాత ‘‘గో–సంబంధ దాడులు’’ ఎంతలా విపరీతంగా పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ‘‘ఇంటర్నెట్లోని మీడియా ఆర్కైవ్స్‌ను ఉపయోగించి మేము రెండు కాలాల వ్యవధిలో... 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023 మే వరకు... జరిగిన గో–సంబంధ దాడుల సంఖ్యను లెక్కించాం’’ అని పుస్తక రచయితలు వెల్లడించారు. నిజం ఏమిటో తెలిసిన కొద్దిమందికి ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగించవు. తెలియని ఎక్కువమంది మాత్రం నమ్మలేనట్లు చూస్తారు. ‘‘2009–2014 మధ్య ఒకే ఒక గో–సంబంధ హింసాత్మక సంఘ టనను మేము కనుగొన్నాము.’’ ఆ కేసులో కూడా, ‘‘దాడి వీహెచ్‌పీ నేతృత్వంలో జరిగింది’’. అందుకు భిన్నంగా, ‘‘2014 నుంచి 2023 మే వరకు అలాంటి గో–సంబంధ దాడులు 136 వరకు జరిగినట్లు మా లెక్కల్లో తేలింది. ఆ దాడుల్లో 66 మంది మరణించారు. 284 మంది గాయపడ్డారు. హతులైన వాళ్లలో కనీసం 70 శాతం మంది ముస్లింలే’’ అని వారు వివరాలు పొందు పరిచారు. ద్వేషపూరిత ప్రసంగాల విస్తృతిపై ఈ రచయితలు బహిర్గతపరచిన వివరాలను కూడా మీకు చెబుతాను. ‘‘2009–2014 మధ్య కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 25 వరకు అలాంటి ద్వేష ప్రసంగాలు మా లెక్కకు అందాయి. ఆ సంఖ్య బీజేపీ హయాంలో ప్రముఖ వ్యక్తులు చేసిన విద్వేష ప్రసంగాలతో కలిపి 460కి చేరు కుంది’’. అంటే తొమ్మిది రెట్ల దూకుడు! మీలో చాలామంది లవ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్ల వంటి అపోహల్ని నమ్మకపోవచ్చు. ముస్లింల బుజ్జగింపు జరుగుతోందంటే మాత్రం బహుశా మీలో ఎక్కువమంది నమ్మే అవకాశమైతే ఉంది. అప్పుడైతే మీరు ఆ అంశానికి సంబంధించిన అధ్యాయాన్ని ఈ పుస్తకంలో తప్పనిస రిగా చదవాలి. అందులో రచయితలు ఈ బుజ్జగింపు అభియోగాన్ని అక్షరాలా తుడిచిపెట్టేశారు. ఎంత ప్రభా వవంతంగా వారు ఆ పని చేశారన్నది కనిపెట్టే విష యాన్ని మీకే వదిలేస్తాను. కానీ వారిచ్చిన ముగింపు లలో ఒకదాని గురించి చిన్న ముక్క చెబుతాను. ‘‘హిందూ రైట్‌వింగ్ పొరబడింది. ముస్లింలు కాంగ్రెస్ బుజ్జగింపులకు దూరంగా ఎక్కడో అట్టడుగున ఉండిపోయారు. కాంగ్రెస్ దేనికైనా దోషిగా నిలబడిందీ అంటే... ఆ దోషం... అంత సుదీర్ఘంగా అధికారంలో ఉండి కూడా ముస్లింలను పైకి తేవటంలో విఫలం అవటమే’’ అని రచయితలు వ్యాఖ్యానించారు. చిన్నపాటి ధార్మిక ఉపన్యాసంతో నేనిది ముగిస్తాను. సత్యాన్ని చూడకూడదని అనుకునేవారు, అంధులుగానే ఉండిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ పుస్తకం చదవకండి. ఎందుకంటే అది వారి నిరాధారమైన భ్రమల్ని పటాపంచలు చేస్తుంది. కానీ నిజం ఏమిటో తెలుసుకోగోరే యథార్థవాదులకు ఇది చదవవలసిన పుస్తకం. వాస్తవాలను సరళంగా, పూత పూయని పదాలతో తేలిగ్గా జీర్ణమయ్యేలా మీకు ఈ పుస్తకం చెబుతుంది. అంతే తేలిగ్గా మీరు పుస్తకం లోపలి విషయాలను అంగీకరించ గలుగుతారని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మరో రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం..?
ముంబయి: లవ్ జిహాద్ చట్టాన్ని దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో త్వరలో మహారాష్ట్ర కూడా చేరనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్రాలోనూ లవ్ జిహాద్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్ఫష్టం చేశారు. హిందూ యువతులను వివాహం పేరిట మతమార్పిడీకి పాల్పడే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిని అరికట్టడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు చట్టాన్ని కూడా తీసుకువచ్చాయి. 'పెళ్లి పేరిట యువతులపై మతమార్పిడీకి పాల్పడుతున్నారనే కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ ఉంది. ఇదే విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో ప్రస్తావించాను. పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన లవ్ జిహాద్ చట్టంపై అధ్యయనం చేస్తున్నాం. అనంతరం మహారాష్ట్రాలోనూ ఆ చట్టాన్ని తీసుకువస్తాం' అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మోదీ వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు స్టే విధించిన అంశంపై ఫడ్నవీస్ స్పందించారు. కోర్టు తీర్పు తమకు అనుగుణంగా రాగానే కాంగ్రెస్ వేడుకలు జరపడంపై ఆయన ఆక్షేపించారు. కొందరు రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కి హాజరైన అనంతరం ఫడ్నవీస్ మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో 18000 పోలీసు రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: మోదీ-యోగీ సోదరీమణుల ఆత్మీయ ఆలింగనం.. -
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్ జరిగింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా క్షమాపణలు తెలియజేశారు. ప్రజల నుంచి క్షమాపణలు కోరుతూ వైష్ణవ్ ప్రార్థనకు చెందిన ఓ గీతాన్ని కూడా పాడారు. కాగా, గోలాఘాట్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు ‘లవ్ జిహాద్’ అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడంపై బోరా స్పందిస్తూ.. శ్రీకృష్ణుడికి రుక్మిణితో ఉన్న బంధాన్ని ప్రస్తావించాడు. రుక్మిణిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలని భావించినప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని.. మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. దీనిపై ఒకవేళ పోలీస్ కేసు నమోదైతే అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల అంశాన్ని లేవనెత్తడం ఖండించదగినదని చెప్పారు. సనాతన ధర్మం, హిందూ ధర్మాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. హజ్రత్ మహమ్మద్‌ను, జీసస్ క్రైస్ట్‌ను ఏ విధంగా అయితే వివాదాల్లోకి లాగబోమో, అదేవిధంగా శ్రీకృష్ణుడిని వివాదాల్లోకి లాగడం మానుకోవాలని హితవు పలికారు. నేరపూరిత చర్యలను భగవంతుడితో పోల్చడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. చదవండి: ఉడిపి వాష్‌రూమ్ కేసులో సీఎంపై అనుచిత ట్వీట్.. బీజేపీ కార్యకర్త అరెస్ట్ దీనిపై అసోం కాంగ్రెస్ చీఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. తమ తాత నిన్న రాత్రి తన కలలోకి వచ్చారని తెలిపారు. తను చేసిన స్టేట్మెంట్ తప్పని, ఇది రాష్ట్ర ప్రజలను బాధపెట్టిందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యల కారణంగా పార్టీకి నష్టం జరగకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైష్ణవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కూడా ఇష్టం లేదన్నారు. వైష్ణవ్ భక్తులు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు బాధగా అనిపించిందని భూపేన్ చెప్పారు. అందుకే వైష్ణవ ఆలయంలో మట్టి దీపం, తమలపాకులు సమర్పించాలని నిర్ణయించుకున్నాన్నారు. స్వామిని క్షమించమని ప్రార్థించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేగానీ బీజేపీ, సీఎంకు భయపడి క్షమించమని కోరడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిపై పలు కేసులు నమోదయ్యాయి. -
సంఘమిత్ర కుటుంబానికి అసోం సీఎం పరామర్శ
తీవ్ర చర్చగా మారిన అసోం ట్రిపుల్ మర్డర్ కేసులో బాధిత కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరామర్శించారు. ఈ క్రమంలో లవ్ జిహాదీ అంశం ప్రస్తావించిన ఆయన.. నిందితుడు నజిబుర్ పైనా సంచలన ఆరోపణలు చేశారు. ఇది మొత్తంగా లవ్ జిహాద్ పరిణామమే. బాధిత కుటుంబం హిందూ.. అలాగే నిందితుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు. ఫేస్బుక్లో హిందూ పేరుతో పరిచయం పెంచుకుని.. ఆమెను ట్రాప్ చేశాడు. కోల్‌కతాలో ఆ ఇద్దరూ ఉన్నప్పుడు ఆమెపై డ్రగ్స్ ప్రయోగించినట్లూ తేలింది అని తెలిపారాయన. నిందితుడు నజిబుర్ రెహమాన్ బోరా తన మతం మార్చేసి.. ఆమెను మోసం చేశాడు. అతను డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి. ఆమెకూ డ్రగ్స్ ఇచ్చి లోబర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆపై ఆమెను హింసించడంతో.. భరించలేకే పుట్టింటికి వచ్చేసింది అని సీఎం హిమంత వెల్లడించారు. కరోనా సమయంలో బాధితురాలి సోదరి అంకిత ఈ లవ్ జిహాదీ అంశంపై తనకు లేఖ రాసిందని.. కానీ, ఆ టైంలో ఆ లేఖ తన దాకా రాకపోవడం వల్ల ఇవాళ ఇంత ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళ గతంలో తన భర్తను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ టైంలో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన సంఘమిత్ర, నజిబూర్లు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయారు. ఆపై ఆమెపై దొంగతనం కేసు పెట్టించి నెలపాటు జైలు పాలు చేసింది ఆమె కుటుంబం. తిరిగి మళ్లీ పారిపోయిన జంట.. ఈసారి వివాహం చేసుకుని కాపురం పెట్టింది. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే మనస్పర్థలతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుని నజిబూర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైలుపాలైన నజిబూర్.. కోపంతో రగిలిపోయి సోమవారం ఆమె ఇంటికి వెళ్లాడు. భార్య సంఘమిత్రను, ఆమె తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జునూ ఘోష్‌లను పదునైన ఆయుధంతో హతమార్చాడు నిందితుడు నజిబూర్ రెహమాన్ బోరా(25). ఆపై తొమ్మిది నెలల బిడ్డను చంకనెక్కించుకుని గోలాఘాట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో నిందితులను ఎవరినీ ఉపేక్షించం. 15 రోజుల్లో ఛార్జిషీటు నమోదుచేసి నిందితుణ్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిలబెడతామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. అసోం హోం మంత్రిత్వ శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తుండడంతో.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించి బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేకూరుస్తానని చెబుతున్నారాయన. -
వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్
గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం తన సోషల్ మీడియా ఖాతాలో వివాదాస్పద కథనం పోస్టు చేశాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో యశ్ దయాల్ వెంటనే పోస్టు డిలీట్ చేశాడు. విషయంలోకి వెళితే.. లవ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని యశ్ దయాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. యువతి కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా ఓ వ్యక్తి తన వీపు వెనుక చాకును దాచి పెట్టుకుని ఆమెకు ప్రపొజ్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ పక్కనే సమాధులు ఉండగా మరో మహిళ మృతదేహం ఉంది. ఆ మృతదేహం పై సాక్షి అని పేరు రాసి ఉంది. కానీ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను కావాలని ఆ పోస్ట్ ను చేయలేదని పొరబాటు జరిగినట్లు ఒప్పుకుంటూ తన తప్పును క్షమించాలంటూ పోస్ట్ పెట్టాడు. ''పొరబాటున ఆ కథనాన్ని పోస్ట్ చేశాను దయచేసి క్షమించండి ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు. థ్యాంక్యూ.. సొసైటీలోని ప్రతి సంఘం, కమ్యూనిటీ పట్ల నాకు గౌరవం ఉంది.'' అంటూ రాసుకొచ్చాడు. ఐపీఎల్లో యశ్ దయాల్ పేలవ ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. ఈ దెబ్బతో మానసికంగా ఒత్తిడికి గురైన యష్ దయాల్.. ఫైనల్‌కు ముందు బరిలోకి దిగాడు. చదవండి: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్‌భూషణ్ ఇంటికి పోలీసులు -
యూపీలో ‘ది కేరళ స్టోరీ’... సంచలన ఉదంతం వివరాలివే..
‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తలపించే ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక హిందూ యువతిని హత్యచేశారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిని కిడ్నాప్ చేసి, రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమె చేత మతమార్పిడి చేయించాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయ్యింది. ఈ సమయంలోనే ఆమెను హత్య చేశాడని సమాచారం. ఈ ఉదంతంలో పోలీసులు నావేద్ అనే యువకునితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి, వారిని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలు సామాజిక సంస్థలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లవ్ జిహాద్, హత్యలతో ముడిపడిన ఈ ఉదంతం లోదీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నావేద్ అనే యువకుడు లఖీపూర్ జిల్లాలోని పలియా ప్రాంతానికి చెందిన సీమా గౌతమ్ అనే యువతి చేత మత మార్పిడి చేయించి, ఆమెను వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాహం తరువాత సీమా గౌతమ్ పేరును సిద్ధిఖీ అని మార్చాడని తెలుస్తోంది. ఒక ఆసుపత్రిలో పనిచేసే ఆమెతో పాటు ఒక గదిలో నావేద్ అద్దెకు ఉండటం ప్రారంభించాడు. ఆదివారం అర్థరాత్రి నవాద్ ఆమెను వైద్య పరీక్షల పేరుతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, మృతి చెందిందని ధృవీకరించారు. దీంతో నవాద్ ఆమె మృతదేహాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని నావేద్తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ యువతి 6 నెలల గర్భవతి అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తమ కుమార్తె చేత బలవంతంగా మత మార్పిడి చేయించి, గర్భవతిని చేశాక, విషం ఇచ్చి చంపేశారని ఆరోపించారు. నిందుతునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పలు సామాజిక సంస్థలు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టాయి. నిందితునిపై వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో హిందూ సంస్థలు సంయుక్తంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తాయని హెచ్చరించారు. -
లేడీ డాక్టర్ హత్య.. బజరంగ్ దళ్ నిరసనలు
జమ్ముకశ్మీర్‌లో ఓ లేడీ డాక్టర్ హత్య కేసు మతపరమైన మలుపు తీసుకుంటోంది. ఇందులో లవ్ జిహాదీ కోణం ఉందని, డాక్టర్ సుమేధాను ప్రియుడే హత్య చేశాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ రోడ్డెక్కింది. సుమేధా శర్మ.. జమ్ము పాంపోష్ కాలనీలో జనవరి 7వ తేదీన దారుణ హత్యకు గురైంది. అదే ఇంట్లో ఆమె బాయ్‌ఫ్రెండ్ జోహార్ గనై గాయాలతో పడి ఉన్నాడు. దీంతో పోలీసులు అతన్ని జీఎంసీ జమ్ముకి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. దారుణానికి కొన్నిగంటల ముందు గనై తనకు జీవితం మీద విరక్తి కలుగుతోందని.. తనకు బతకాలని లేదంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు. అది చూసి అతని బంధువు ఒకరు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఇంటి తలుపులు బద్ధలు కొట్టిన పోలీసులకు సుమేధా విగత జీవిగా, పక్కనే గనై గాయాలతో కనిపించారు. అయితే ఈ వ్యవహారంలో లవ్ జిహాద్ కోణం ఉన్నట్లు బజరంగ్ దళ్ అనుమానిస్తోంది. పక్కా ప్రణాళికతోనే సుమేధాను గనై హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది. జమ్ము కశ్మీర్లో మైనారిటీలకు రక్షణ కరువైందని.. లవ్ జిహాద్ వ్యవహారాల కట్టడికి చట్టాలు అవసరమంటూ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీస్ శాఖ సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. -
శ్రద్ధా కేసు వల్లే.. నటి సూసైడ్ కేసులో సంచలన వాంగ్మూలం
ముంబై: ప్రముఖ టీవీ నటి తునిషా శర్మ మృతి దర్యాప్తు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ పోలీసుల ముందు కీలక వాంగ్మూలం ఇచ్చాడు. పోలీస్ కస్టడీలో భాగంగా తొలిరోజు సోమవారం(ఇవాళ) వాలివ్ పోలీసులకు తమ రిలేషన్షిప్ ముగింపునకు కారణం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసేనని చెప్పాడు. శ్రద్ధా వాకర్ ఘోర హత్యోదంతం తర్వాత.. దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇద్దరికీ వయసు అంతరంతో(ఎనిమిదేళ్ల గ్యాప్) పాటు వేర్వేరు కమ్యూనిటీలనే ఆటంకాలు తప్పవని భావించా. అందుకే బలవంతంగా ఆమెకు బ్రేకప్ చెప్పా అని షీజాన్ పోలీసులకు వెల్లడించాడు. శ్రద్దా వాకర్ కేసు నాపై ఒత్తిడి పెంచింది. లేనిపోని ఇరకాటంలో పడతామనే వద్దనుకున్నా. తునిషా మతం వల్లే ఆమెకు బ్రేకప్ చెప్పాను!. అంతేకాదు.. ఇంతకు ముందు తునిషా ఆత్మహత్యాయత్నం చేసిందని ఇంటరాగేషన్‌లో షీజాన్ పోలీసులకు వెల్లడించాడు. ‘‘చనిపోవడానికి కొన్నిరోజులు ముందు కూడా ఆమె సూసైడ్ యత్నం చేసింది. ఆ సమయంలో నేనే ఆమెను రక్షించా. తునిషా తల్లికి అప్పగించి.. జాగ్రత్తగా చూసుకోవాలని ఆమెకు సూచించా.’’ అని పోలీసులకు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 24వ తేదీ టీవీ షూటింగ్ జరుగుతున్న చోట టాయ్లెట్లో తునిషా శర్మ(20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా కనిపించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. బహుశా బ్రేకప్ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు టీవీ నటులు గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. అయితే పదిహేను రోజుల కిందట షీజాన్ ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తంది. శనివారం ఉదయం ఇంటి నుంచి యధాతధంగా ముంబై వాసాయిలో జరిగే షూటింగ్‌కు వెళ్లిందామె. ఫస్ట్ షిఫ్ట్ షూట్లో షీజాన్, తునిషాలు కలిసే పాల్గొన్నారు. ఆ షూటింగ్ సమయంలోనే ఆమె సూసైడ్‌కు పాల్పడింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద షీజాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తునిషా శర్మ తల్లి వనిత, షీజాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. తన కూతురిని షీజాన్ వాడుకుని, వదిలేశాడంటూ ఆరోపిస్తోంది. మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తూనే.. తునిషాతో ప్రేమాయణం నడిపాడు. మూడు నాలుగు నెలలు ఆమెను బాగా వాడుకున్నాడు. నా బిడ్డను పొగొట్టుకున్నా. నాకు న్యాయం చేయండి. షీజాన్‌ను శిక్షించండి అని కోరుతోందామె. ఇదిలా ఉంటే ఈ కేసులో లవ్ జిహాదీ కోణం తెరపైకి రాగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు పూర్తయితేనే గానీ ఏం చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ సైతం ఇది లవ్ జిహాద్ వ్యవహారమేనని, షిండే ప్రభుత్వం లవ్ జిహాదీకి వ్యతిరేకంగా గట్టి చట్టం తేవాలంటూ కామెంట్ చేయడం తెలిసిందే. -
అప్పటికే నిశ్చితార్థం.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా.. షాపు ఓనర్‌తో కలిసి..
సాక్షి, రాయచూరు: జిల్లాలో లవ్ జిహాద్ తరహా ఘటన జరిగిట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటికే పెళ్లి కుదిరిన హిందూ యువతి భారతి (22)ని, మరో మతం యువకుడు రెహాన్ (24) పెళ్లి చేసుకున్నాడని భారతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. రెహాన్ నగరంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. భారతి అతని షాపులో పనికి వెళుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. భారతికి ముందుగానే విజయనగర జిల్లా హూవినహడగలికి చెందిన యువకునితో పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరిగింది. కానీ 3 రోజుల కిందట రెహాన్ భారతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. భారతిని పెళ్లికి ముందు మతం మార్పించారని చెప్పారు. పోలీసు స్టేషన్లో విచారణ.. తమ కుమార్తె భారతి కనపడటం లేదని వారు నేతాజీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిని పిలిచారు. భారతి స్టేషన్‌కు బుర్కా ధరించి వచ్చింది. తన కూతురు భారతి రెహాన్ వద్దకు కూలి పనికి వెళుతుండేదని, మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడని భారతి తల్లి నాగమ్మ ఆరోపించింది. ఇద్దరూ మేజర్లు కావడం, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు ఆ జంటను విచారించి పంపించివేశారు. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) -
లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. -
ప్యార్ కియా తో డర్నా క్యా?
ప్రేమించడం నేరం కాదు... ఘోరం కాదు... పాపం అసలే కాదు. స్వచ్ఛమైన ప్రేమ దేనికైనా భయపడాల్సిన పనేముంది? ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అంటూ అలనాటి మొఘల్ యువరాజు సలీమ్‌ను ప్రేమించిన అనార్కలీ నోట పాలకులకు కవి వేసిన ప్రశ్న అదే! కానీ మతాలు వేరైతే ప్రేమకైనా, పెళ్ళికైనా భయపడాల్సిందే అన్నది ఈనాటి ఆధునిక భారత పాలకుల అభిప్రాయంలా తోస్తోంది. విభిన్న మతాల వాళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకొంటే భయపడాల్సి వచ్చేలా యాంటీ ‘లవ్ జిహాద్’ చట్టాలూ వచ్చాయి. అలాంటి ఒక ఓటుబ్యాంకు చట్టంపై గుజరాత్ హైకోర్టు గురువారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు లౌకికవాదులకు ఒకింత సంతోషం కలిగిస్తున్నాయి. గుజరాత్ సర్కారు 2003 నాటి మతస్వాతంత్య్ర చట్టాన్ని ఆ మధ్య సవరిస్తూ, కొత్తగా అనేక అంశాలు చేర్చింది. అందులోని ఆరు నిరంకుశ సెక్షన్లను అడ్డగోలుగా అమలు చేయరాదని కోర్టు ఇప్పుడు పేర్కొంది. పదేళ్ళ జైలు, 5 లక్షల జరిమానాలే కాక, అసలు పెళ్ళే చెల్లదనేలా పాలకులు చట్టసవరణలు చేశారు. అది పౌరుల ప్రాథమిక హక్కయిన మత స్వాతంత్య్రానికి భంగమంటూ కేసు దాఖలైంది. మోసం చేసో, బలవంతపెట్టో, ప్రలోభపరిచో మతాంతర వివాహం చేస్తే తప్పు. అందుకు సాక్ష్యాలు లేకుండా ప్రతి పెళ్ళినీ ‘చట్టవిరుద్ధమైన మతమార్పిడి పెళ్ళి’గా అభివర్ణించడానికి వీలు లేదని కోర్టు తేల్చింది. వెరసి, ఈ ఏడాది ఏప్రిల్ 1న అసెంబ్లీలో ఆమోదించి, ఈ జూన్ 15న గుజరాత్ సర్కారు చేసిన నిరంకుశ సవరణలకు అడ్డుకట్ట పడింది. ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో అమలులో, ఆలోచనల్లో ఉన్న ఇదే తరహా యాంటీ ‘లవ్ జిహాద్’ చట్టాలపై మళ్ళీ చర్చ మొదలైంది. కర్ణాటకలోని ప్రమోద్ ముతాలిక్ సారథ్యంలోని ‘శ్రీరామ్సేనె’ కొన్నేళ్ళ క్రితం సృష్టించిన పదం ‘లవ్ జిహాద్’. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు యోగి ఆదిత్యనాథ్ సారథ్యం వహించిన ‘హిందూ యువవాహిని’ కూడా మతాంతర వివాహాలను భగ్నం చేస్తూ వచ్చింది. సీఎం అయ్యాక నిరుడు ఆదిత్యనాథ్ యూపీలో యాంటీ ‘లవ్ జిహాద్’ చట్టమే తెచ్చారు. వయసొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే, మతాలు వేరైనా సరే పెళ్ళి చేసుకోవడం నేరం కాదని మన సుప్రీమ్ కోర్టు, హైకోర్టులు పదే పదే స్పష్టం చేశాయి. మతాంతర వివాహాల ద్వారా మతమార్పిడి కుట్ర జరుగుతోందన్న వాదననూ కొట్టేశాయి. ఆ మధ్య హదియా, షఫీ జహాన్ కేసులో మతాంతర వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పునిస్తే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పే చెల్లదని చెప్పడం గమనార్హం. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాలతో కొందరు పాలకులు ఇలాంటి అంశాలను పెడచెవిన పెడుతున్నారు. మతమార్పిడి కోసమే బలవంతాన పెళ్ళి చేసుకున్నారని ఎవరైనా ఆరోపణలకు గురైతే, ఆ నిందితులే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని గుజరాత్ సర్కారీ చట్టం చెబుతోంది. ఇది విస్మయం కలిగిస్తోంది. అసలైతే ఆరోపణలు చేసినవారే వాటిని రుజువు చేయాలనేది 150 ఏళ్ళుగా అమలులో ఉన్న ‘1872 నాటి భారతీయ సాక్ష్యాధార చట్టం’. దానికి విరుద్ధంగా గుజరాతీ యాంటీ ‘లవ్ జిహాద్’ చట్టంలో సెక్షన్ 6ఏ లాంటివి చోటుచేసుకోవడం విడ్డూరం. ఆ మాటకొస్తే, ‘లవ్ జిహాద్’ మాటనే కేంద్రం గుర్తించడం లేదనీ, ఏ చట్టంలోనూ నిర్వచించనే లేదనీ హోమ్ శాఖ నిరుడు వివరణ ఇచ్చినట్టు భోగట్టా. కానీ, మెజారిటీ మతానికి చెందిన ఆడపిల్లలకు వల వేసి, పెళ్ళి పేరుతో పెద్దయెత్తున మరో మతంలోకి మార్చేస్తున్నారనీ, ఇది ‘ప్రేమ పేరిట సాగుతున్న మతయుద్ధం’ (లవ్ జిహాద్) అనీ వస్తున్న ఆరోపణలు ఆగట్లేదు. ఇప్పటికీ మన దేశంలో అయిదింట నాలుగు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే. అయినాసరే, వాట్సప్‌లో లక్షల మందికి ఈ విద్వేష ప్రచారం యథేచ్ఛగా సాగుతూనే ఉంది. దాదాపు 1300 ఏళ్ళ పైగా మతసామరస్యం వెల్లివిరుస్తున్న దేశంలో ఈ ‘వాట్సప్ యూనివర్సిటీలు’ అసలు చరిత్ర పేరిట కొత్త కథలు వండి వారుస్తున్నాయి. మధ్యయుగాల నాటి మైనారిటీ పాలకులకు, నేటి తరం మైనారిటీలు నకళ్ళు అంటూ లేనిబూచిని చూపెడుతున్నాయి. 2022లో రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఆపై 2024లో జరిగే సాధారణ ఎన్నికల వరకూ ఈ విద్వేష ప్రచారం ఇలాగే సాగడం ఖాయమని అంచనా. దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలలో అతి పెద్ద వర్గమైన ముస్లిమ్‌లను ఇరుకున పెట్టడానికే ఇదంతా అని మైనారిటీల వాదన. పౌరసత్వ చట్టాలు, ‘లవ్ జిహాద్’ లాంటి అసత్యాలు, గో సంరక్షణ పేరిట దాడులు అందుకు ఉదాహరణలని వారి ఆరోపణ. వారి అనుమానాలు పూర్తిగా అర్థరహితమని అనలేం. ఒకటి మాత్రం నిజం. దేశంలో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ మతం పేరిట మనుషుల్లో విద్వేషం రగిల్చి, మనసు విరిచి, మెజారిటీలను సంఘటిత ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఇలాంటి ‘లవ్ జిహాద్’ ఆరోపణలు బాగా పనికొస్తాయి. అది దృష్టిలో పెట్టుకొనే, మెజారిటీ వర్గాల ఏకైక పరిరక్షకులమనే ముద్ర కోసం కొన్ని రాష్ట్రాలు ఇలా మత మార్పిడి నిరోధక చట్టాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇష్టమైనవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకొనే మానవ స్వేచ్ఛకు ఇవన్నీ తీవ్ర అవరోధం. పెళ్ళంటే ‘మూడే ముళ్ళు... ఏడే అడుగులు... మొత్తం కలిసి నూరేళ్ళు’ అంటారు మనసు కవి. మనసులు కలసిన ఇద్దరు మనుషులు నూరేళ్ళ జీవితం కలసి నడవాలనుకున్నప్పుడు కులం, మతం లాంటి అడ్డుగోడలు పెట్టాలనుకోవడం అసలు సిసలు మధ్యయుగపు మనస్తత్వం. ఆధునిక ప్రభుత్వాల అడ్డగోలు చట్టాల వల్ల లౌకికవాద సమాజంలో శాశ్వతంగా చీలికలొస్తే ఆ పాపం ఎవరిది? సహనం, సమానత్వం, సామరస్యమే ప్రాణధాతువులైన మన జాతి మనోఫలకంపై ఇవన్నీ మాయని మరకలుగా మిగిలిపోతే, దానికి ప్రాయశ్చితం ఏమిటి? పాలకులారా... కళ్ళు తెరవండి! -
‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’
భోపాల్: వివాహం పేరుతో మోసపూరితంగా మతమార్పిడికి పాల్పడడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దాన్ని నేరపూరితంగా పరిగణిస్తూ, అందుకు పదేళ్ళ వరకు జైలు శిక్షని విధించేలా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుని పాస్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చట్టం ఆవశ్యకతను ప్రశ్నించగా, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సమాధానమిస్తూ 1968 చట్టం మాదిరిగా కాకుండా, ఈ చట్టం అలాంటి వివాహాన్ని రద్దు చేస్తుందని, ఆ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సైతం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ‘‘మధ్య ప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్ 2021’’ఆమోదం అనంతరం బీజేపీ శాసనసభ్యులు సభలో ‘జై శ్రీరాం’నినాదాలు చేశారు. అంతకు ముందు జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ తాము లవ్ జిహాదీ కోసం ‘రఫీక్‌ని రవిగా’మారనివ్వమని అన్నారు. తాము ‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో సీఏఏని వ్యతిరేకించినట్టే, ఆర్టికల్ 370ని వ్యతిరేకించినట్టే కాంగ్రెస్ ఈ బిల్లుని సైతం వ్యతిరేకించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాన్ని కాంగ్రెస్ నేతలు విజయ్ సక్సేనా తదితరులు తీవ్రంగా తప్పు పట్టారు. చదవండి: కోవిడ్ టీకా: పడిపడి నవ్వుతున్న పోలీసు అధికారి -
లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు!
తిరువనంతపురం: లవ్ జిహాద్ కారణంగా ఎంతో మంది అమాయక యువతులు బలైపోతున్నారని ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ శ్రీధరన్ అన్నారు. కేరళలో ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కాగా మెట్రో మ్యాన్‌గా ప్రసిద్ధి పొందిన శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ‘‘విజయ యాత్ర’’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ జాతీయ మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు. ‘‘కేరళలో లవ్ జిహాద్ పరిణామాలు చూస్తూనే ఉన్నాను. హిందువులను ఎలా బలవంతపు పెళ్లిళ్లతో బంధిస్తున్నారు? ఆ తర్వాత వాళ్లు ఎలాంటి బాధలు పడుతున్నారు? అన్న అంశాలు గమనిస్తున్నా. కేవలం హిందువులు మాత్రమే కాదు.. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకం’’ అని శ్రీధరన్ పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో పాలన గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ను నియంతగా అభివర్ణించారు. ‘‘ఈ సీఎం పాలనకు 10కి మూడు మార్కులు కూడా రావు. ఆయన అసలు ప్రజలతో మమేకం కారు. సీపీఎం పట్ల ప్రజల్లో సదభిప్రాయం లేదు. మంత్రులకు కూడా ధైర్యంగా మాట్లాడే స్వేచ్చ లేదు. అభిప్రాయాలు పంచుకునే స్వాతంత్ర్యం లేదు. నియంత పాలనకు ఇదే నిదర్శనం’’ అని విమర్శించారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తానని, పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ శ్రీధరన్ తన మనుసులోని మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ రంగప్రవేశానికి ముందే ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు. చదవండి: సీఎం పదవి చేపట్టడానికి నేను రెడీ: శ్రీధరన్ చదవండి: బీజేపీకి షాక్: హస్తం గూటికి ఎంపీ తనయుడు -
ఫుల్లుగా తాగి ఆపై..
భోపాల్: వాలెంటైన్స్‌డే రోజు కొంత మంది ఆకతాయిలు భోపాల్‌లోని ఒక రెస్టారెంట్లో తప్పతాగి, హల్ చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని ఆరేరా కాలనీలో ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి కొంత మంది ఆకతాయిలు వచ్చారు. హోటల్లో కావాలసిన పదార్థాలు తెప్పించుకొని సుష్టుగా తిన్నారు. మత్తుపానీయాలు సేవించారు. ఆ తర్వాత తాగిన మత్తులో అక్కడి టెబుల్స్‌ను, ప్లేట్స్‌ను విరగొట్టారు. అంతటితో ఆగకుండా అక్కడి మహిళా సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించారు. పైగా, తాము శివసేన పార్టీ కారకర్తలమని చెప్పుకొని నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనతో రెస్టారెంట్లో ఉన్న సామాన్య ప్రజలు తీవ్ర భయాందళనలకు గురై అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు.. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బీజేపీ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే మరొక గొడవలో అరెస్టు అయ్యారు. ఈ రెండు గొడవలలో కలిపి మొత్తంగా 17 మందిని అరెస్ట్ చేసినట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. భోపాల్ నగరంలో లవ్‌జిహద్, హుక్కాకల్చర్ పెరిగిపోయిందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా ఉండాలని భారతీయ జనతా యువమోర్చా(బిజేవైయమ్) నాయకుడు అమిత్ రాథోర్ హితవు పలికారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, ఇప్పటికైనా హోటల్స్ , రెస్టారెంట్ల నిర్వాహకులు యువతను పెడదోవపట్టించే కార్యకలాపాలను మానుకోవాలని, లేకుంటే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
‘లవ్ జీహాద్’ పెద్ద తలనొప్పిగా మారింది
తిరువనంతపురం : తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేరళ రాష్ట్రంలో ‘లవ్ జీహాద్’కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెచ్చినట్లుగా ‘యాంటీ లవ్ జీహాద్’ చట్టాన్ని తెస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం లవ్ జీహాద్ ఓ పెద్ద తలనొప్పిగా మారింది. హిందూ ధార్మిక సంస్థలు మాత్రమే కాదు! క్రిస్టియన్ సంస్థలు, చర్చీలు కూడా లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకని వచ్చే ఎన్నికలకు సంబంధించిన మా మేనిఫెస్టోలో ‘యాంటీ లవ్ జీహాద్ చట్టం’ను పొందుపరుస్తాం. ఉత్తర ప్రదేశ్లోలా చట్టాన్ని తెస్తాము’’ అని అన్నారు. ( మేం రెడీ.. డేట్ ఫిక్స్ చేయండి: అన్నదాతలు ) కాగా, మరికొన్ని నెలల్లో కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేపనిలో పడ్డాయి. తమ విధానాలకు తగ్గట్టు హామీలు గుప్పిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన సీపీఐ(ఎమ్), కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు నడుస్తోంది. ఎప్పటిలాగే కూటములతో బరిలోకి దిగనున్నాయి. -
మతాంతర వివాహం: ఆ హక్కు ఎవరికీలేదు
సాక్షి, న్యూఢిల్లీ : మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం రూపొందించిన తరుణంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మేజర్లైన ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగిన వివాహాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి స్వేచ్ఛను హరించే హక్కు, అధికారాలు ఇరు కుటుంబాల సభ్యులకు కూడా లేదని తీర్పును వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ శ్రీవాస్తవతో కూడిన ఏకసభ్య ధర్మాసనం శనివారం తీర్పునిచ్చింది. లక్నోకు చెందిన ఇద్దరు యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో వారి వివాహానికి పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో పెద్దల అభిష్టానికి విరుద్ధంగా గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని కుటుంబ సభ్యులు వేధించసాగారు. వివాహాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో జంట హైకోర్టును ఆశ్రయించింది. (వింత వివాహం: ఓ వరుడు.. ఇద్దరు వధువులు) తమ ప్రేమకు వ్యతిరేకంగా పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని, తమకు రక్షణకు కల్పించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బాధితులకు బాసటగా నిలిచింది. ఇరు కుటుంబాల సభ్యుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. యువతీ, యువకులు స్వేచ్ఛను హరించే హక్కు వారికి లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా నూతన దంపతులకు కొన్ని రోజుల పాటు పోలీసు భద్రతను కల్పించాల్సిందిగా స్థానిక డీఎస్పీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు కుటుంబ సభ్యులను వదులుకుని వచ్చిన వధువుకు ఆర్థికంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత భర్తపై ఉందని, వెంటనే ఆమె పేరు మీద 3లక్షల రూపాయల నగదును జమచేయాలని పేర్కొంది. కాగా మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మధ్య ప్రదేశ్ సైతం ఇలాంటి చట్టాన్నే రూపొందించింది. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలపై దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. (ప్రేమలో పడ్డవారిని శిక్షించడం నేరం) -
మతం మారడాన్ని ప్రోత్సాహించను: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి పేరుతో జరుగుతున్న మతమార్పిడిలపై చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. యూపీ, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ని కూడా తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివాహం కోసం జరిగే మత మార్పిడిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా తాను ఇలాంటి వాటిని సమర్థించనని స్పష్టం చేశారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఇంటర్వ్యూలో భాగంగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసలు మతం ఎందుకు మారాలి. సామూహిక మత మార్పిడి వ్యవహారాలు ఆగిపోవాలి. నాకు తెలిసినంత వరకు ముస్లిం మతం ఇతర మతస్తులను వివాహం చేసుకోవడానికి అంగీకరించదు. ప్రస్తుతం అనేక కేసుల్లో కేవలం వివాహం కోసం.. బలవంతంగా.. చెడు ఉద్దేశంతో మత మార్పిడి జరుగుతుంది. సహజ వివాహ ప్రక్రియకు.. ఈ బలవంతపు మత మార్పిడి వివాహ తంతుకు చాలా తేడా ఉంది. ఇందుకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తోన్న ప్రభుత్వాలు ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్ తీసుకువచ్చాయి అని భావిస్తున్నాను. నా వరకు మత మార్పిడిలను నేను ప్రోత్సాహించను’ అన్నారు రాజ్‌నాథ్ సింగ్. (చదవండి: యోగికి షాకిచ్చిన ఐఏఎస్ అధికారులు) ఇక ఈ ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ రైతుల ఉద్యమం, చైనా-భారత్ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన వంటి అంశాలపై మాట్లాడారు. తాను ఓ రైతు బిడ్డనని.. వారి కష్టం తనకు బాగా తెలుసన్నారు. అలానే మోదీ ప్రభుత్వం అన్నదాతలకు మేలు చేస్తుంది తప్ప నష్టం చేకూర్చదని స్పష్టం చేశారు. ఇక చైనాతో చర్చలు కొనసాగుతన్నప్పటికి పెద్దగా ఫలితం లేదని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్. -
యోగికి షాకిచ్చిన ఐఏఎస్ అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖను మంగళవారం విడుదల చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రం "ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా" మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. "చట్టవిరుద్ధమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని" వారు లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర రాజకీయ నాయకులందరూ "మీరు ... పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడింది" అని పేర్కొన్నారు. "ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ.. ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారింది. పాలనా సంస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో మునిగిపోయాయి" అని వారు లేఖలో తెలిపారు. "స్వేచ్ఛగా బతకాలనుకునే భారతీయు పౌరులు హక్కుకు వ్యతిరేంగా యూపీలోని ప్రభుత్వ యంత్రాంగం యువకులపై దారుణాలకు పాల్పడుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఆర్డినెన్స్‌ని అడ్డుపెట్టుకుని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దారుణాల గురించి లేఖలో ప్రస్తావించారు. వీటిలో ముఖ్యమైనది ఈ నెల ప్రాంరభంలో రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగిన సంఘటన. దీనిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. బాధితుల్లో ఓ వ్యక్తి పెళ్లి పేరుతో బలవంతంగా ఓ హిందూ యువతిని మతం మారేలా చేశాడని ఆరోపించారు. పోలీసులు సదరు వ్యక్తుల మీద ఈ ఆర్డినెన్స్ కింద కేసు నమోదు చేశారని ఐఏఎస్ అధికారులు లేఖలో తెలిపారు. అలానే మరి కొన్ని ఘటనల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అమాయకపు జంటలను వేధింపులకు గురి చేశారని.. ఆ సమయంలో పోలీసులు స్పందించలేదని.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. మరో ఘటనలో దంపతులను వేధించగా.. గర్భవతిగా ఉన్న యువతికి అబార్షన్ అయ్యిందంటూ ఓ ఆంగ్ల న్యూస్ పేపర్లో వచ్చిన ఉదంతాన్ని ఐఏఎస్ అధికారులు లేఖలో ప్రస్తావించారు. అలానే గత వారం బిజ్నోర్‌లో జరిగిన మరో సంఘటనను కూడా ప్రస్తావించారు. ఇక సదరు ఆర్డినెన్స్ భారతీయ ముస్లిం యువకులు హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను అలహాబాద్ కోర్టు కూడా వ్యతిరేకించిందని లేఖలో పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకువచ్చిన సదరు యాంటీ లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను నలుగురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకించారు. వీరిలో జస్టిస్ మదన్ బీ లోకూర్ సదరు ఆర్డినెన్స్‌ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. -
మధ్యప్రదేశ్‌లోనూ మత స్వేచ్ఛ బిల్లు
మధ్యప్రదేశ్: వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు 2020ని మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించిందని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చి చట్టరూపం దాలిస్తే, చట్ట ఉల్లంఘనకు అత్యధికంగా పదేళ్ళ జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. ఈ బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ ఆర్డినెన్స్, 2020ని పోలి ఉంది. మధ్య ప్రదేశ్‌లో ఇది అమలులోకి వస్తే దేశంలోనే కఠినతరమైన చట్టం అవుతుందని మిశ్రా తెలిపారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష, రూ. 50,000 జరిమానాకి అర్హులు. మతమార్పిడికి పాల్పడిన వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, ౖమైనర్ అయితే, 2 నుంచి 10 ఏళ్ళ జైలు, రూ.50వేల జరిమానా విధించొచ్చు. -
నాడు యూపీ.. నేడు మధ్యప్రదేశ్
భోపాల్ : వివాదాస్పద లవ్ జిహాద్ బిల్లుకు మరో రాష్ట్రం ఆమోదముద్ర వేసింది. బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బిల్లుకు కేబినెట్ఆమోదం తెలిపిన అనంతరం హోంమంత్రి నాథూరాం మిశ్రా వివరాలను వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సమాజిక వర్గాలకు చెందిన యువతులను బలవంతంగా మతమార్పడి చేయించి వివాహం చేసుకుంటే పదేళ్లపాటు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయాల జరిమానా విధించే విధంగా బిల్లు రూపొందించామని తెలిపారు. అలాగే ఇతర వర్గాలకు చెందిన యువతను చట్ట విరుద్ధంగా మత మార్పిడి చేసి వివాహం చేసుకుంటే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50 వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. (‘లవ్ జిహాద్’ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు) ఒకవేళ యువతీ, యువకులు ఇష్టపూరితంగా వివాహం చేసుకోవాలి అనుకుంటే మతమార్పడి కోసం రెండు నెలల ముందుగా జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ విధంగా చేయకుండా వివాహం చేసుకుంటే దానిని చట్ట విరుద్ధమైన వివాహం గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మధ్యప్రదేశ్ కంటే ముందుగా మతమార్పిడి వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యూపీ అనంతరం ఇలాంటి చట్టాన్ని రూపొందించిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. మరోవైపు ఇలాంటి చట్టాలను రూపొందించడటంపై దేశ వ్యాప్తంగా పలువర్గాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
‘లవ్ జిహాద్’ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిడి వివాహాలను అడ్డుకోవడానికి ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ తెచ్చిన వారానికి, ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి మధ్య జరుగనున్న వివాహ వేడుకను పోలీసులు నిలిపివేశారు. బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో వివాహ వేడుకలు ప్రారంభం కావడానికి ముందు, పోలీసులు అక్కడకి చేరుకుని ఇరు వర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కి రావాలని కోరారు. వివాహానికి ముందు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఇరువర్గాలు అనుమతి పొందాలని వారికి సూచించారు. ఈ క్రమంలో.. పెళ్లి విషయంలో బలవంతం ఏదీ లేదని, ఇరు కుటుంబాల సమ్మతితోనే వివాహం జరుగుతుందని, మత మార్పిడి ఉద్దేశం లేదని ఇరు వర్గాలు పోలీసులకు తెలియజేశాయి. ఏదేమైనా చట్టపరంగా అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాతనే వివాహం జరిపించనున్నట్లు వారు పేర్కొన్నారు. కొత్త ఆర్డినెన్స్ ఏం చెబుతోంది? ఇక వివాహం పేరుతో బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చునని ఈ ఆర్డినెన్స్(2020) పేర్కొంది. పెళ్లి కోసం మతం మారాలంటూ బలవంతం చేసేవారికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలను బలవంతంగా మతం మార్చేవారికి 3 సంవత్సరాల నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా విధించవచ్చని ఆర్డినెన్స్ తెలిపింది. సామూహిక మతమార్పిడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50000 రూపాయల జరిమానా విధించవచ్చు. (చదవండి: విడాకులు కోరిన ఐఏఎస్ దంపతులు) జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి: పోలీస్ అధికారి సురేష్ చంద్ర రావత్ ‘‘వేర్వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోనున్నట్లు డసెంబర్ 2న సమాచారం అందింది. మేము అక్కడికి చేరుకుని, ఇరు వర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించాం. ఇరు కుటుంబాలకు కొత్తగా తెచ్చిన బలవంతపు మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ కాపీని అందించి, చట్ట ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌తో లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలని సూచించాం. ఒకవేళ వివాహం తరువాత మతం మారే ఉద్దేశం ఉంటే కనీసం రెండు నెలల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.’’ అని లక్నో సీనియర్ పోలీస్ అధికారి సురేశ్ చంద్ర రావత్ మీడియాకు తెలిపారు. -
లవ్ జిహాద్: ‘అలాంటి వారిని నాశనం చేస్తాం’
భోపాల్: లవ్ జిహాద్ ప్రస్తుతం ఈ పదం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన సంగతి తెలసిందే. తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరనుంది. లవ్ జిహాద్ పేరిట మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తాం అంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. మత మార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా రాష్ట్రం ముసాయిదా బిల్లును రూపొందించిన కొన్ని రోజులకే ఈ హెచ్చరిక వెలువడటం గమనార్హం. ఇక పెళ్లి పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతుల మతం మార్చే ఈ ప్రక్రియ పట్ల దేశవ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని కొందరు వాదిస్తుండగా.. ఈ తరహా పెళ్లిల్లు ప్రేమ వివాహాలు కదా.. మరి మతం మార్చుకోవడం ఎందుకు. ప్రేమకు అడ్డురాని మతం పెళ్లికి ఎలా అడ్డంకిగా మారుతుంది.. అమ్మాయే మతం మారాలా.. అబ్బాయి కన్వర్ట్ అయితే ఏం అవుతుంది అంటూ ప్రశ్నలు లేవనేత్తేవారు మరికొందరు. ఈ చర్చ ఎలా ఉన్నప్పటికి వివాహం పేరుతో మతం మారడానికి వీలు లేదంటున్నాయి పలు రాష్ట్రాలు. (చదవండి: ఆడ పిల్లల జీవితాలతో ఆటలు మానండి) ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాహం పేరిట మత బలవంతపు మతమార్పిడికి పాల్పడివారికి పదేళ్ల జైలు శిక్ష విధించేంలా ముసాయిదా బిల్లును రూపొందించింది. అయితే దీని మీద రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అసమ్మతి, అసహనం, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సీంఎ శివరాజ్ సింగ్ వీటిని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పైగా లవ్ జిహాద్ పేరిటి మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడితే.. నాశనం చేస్తాం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతి ఒక్కరిది.. అన్ని మతాలు, కులాలకు చెందినది. ఓ మతం, కులం, ప్రాంతం పట్ల ప్రభుత్వం పక్షపాతం చూపదు. కానీ మా కూతుళ్లుతో ఎవరైనా అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే.. ఊరుకోం. లవ్ జిహాద్ పేరిట ఎవరైనా మత మార్పిడి వంటి కుట్రలకు ప్లాన్ చేస్తే వారిని నాశనం చేస్తాం’ అంటూ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. (హిందూ యువతులను సిస్టర్స్‌గా భావించండి: ఎంపీ) ధర్మ స్వాంత్రాత బిల్లు 2020 ముసాయిదా చట్టం ప్రకారం వివాహం కోసం స్వచ్ఛందగా మతం మారాలని భావిస్తున్న వారు నెల రోజులు ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ తరహా కేసుల్లో సంరక్షకులు ఫిర్యాదు చేయవచ్చు.. ఇలాంటి వివాహాలను సులభతరం చేసే వారిని నిందితుడిగా పరిగణించడమే కాక జరిమానా విధిస్తారు. ఈ తరహా కార్యక్రమాలను ప్రొత్సాహించే సంస్థల నమోదును రద్దు చేస్తారు అని పేర్కొంది. ఇక ఇప్పటికే యూపీ లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిళ్లను నియంత్రించడం కోసం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
లక్నో: బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా లవ్ జిహాద్ గురించి చర్చ నడుస్తున్న తరుణంలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు(యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక) దీనికి వ్యతిరేకంగా చట్టం రూపొందిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్- 2020ను తీసుకువచ్చింది. దీని ప్రకారం.. బలవంతంగా, కేవలం వివాహం కోసమే మతాన్ని మార్పించడం వంటి అంశాలను నేరంగా పరిగణిస్తారు. (చదవండి: ముస్లిం కుర్రాళ్లను హెచ్చరించిన ఎస్పీ ఎంపీ) అంతేగాకుండా ఈ తరహా కేసుల్లో బెయిలు కూడా మంజూరు చేయకుండా కఠిన చర్యలు తీసుకునే వెసలుబాటు ఉంటుంది. అదే విధంగా నేరం రుజువైతే కనిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మేర జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇష్టప్రకారమే మతం మార్చుకోవాలని ఎవరైనా భావిస్తే రెండు నెలల ముందుగానే సంబంధిత అధికారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా యోగి సర్కారు నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇక మేజర్లైన ఇద్దరు వ్యక్తులు తమకు నచ్చినవారితో జీవితాన్ని పంచుకునే హక్కు ఉంటుందని.. ఇందులో మూడో వ్యక్తి జోక్యం తగదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ఆర్డినెన్స్ వెలువడటం గమనార్హం. -
హిందూ యువతులను సిస్టర్స్‌గా భావించండి: ఎంపీ
లక్నో: ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టం చేయాలని భావిస్తోన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హిందూ-ముస్లిం యువతీయువకుల మధ్య జరిగే వివాహాల్లో చోటు చేసుకునే మత మార్పిడిలను పరిశీలించడానికి ఉద్దేశించిన ఈ ఆర్డినెన్స్ పట్ల ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ‘అయితే ఇక యూపీలో ముస్లిం కుర్రాళ్లు, హిందూ యువతులను సిస్టర్స్‌గా భావించాలి. కాదని ప్రేమ, పెళ్లి అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఈ ఆర్డినెన్స్ కింద అరెస్ట్ చేసి టార్చర్ చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త’ అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఒకరు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. మొరాదాబాద్ ఎస్పీ ఎంపీ ఎస్టీ హసన్ మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్ అనే ఓ రాజకీయ స్టంట్. మన దేశంలో ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన జీవిత భాగస్వామని ఎన్నుకునే హక్కు ఉంది. హిందువులు, ముస్లింలను.. ముస్లింలు, హిందువులను సంతోషంగా వివాహం చేసుకుంటున్నారు. ఒకసారి ఆ జంటలను పరిశిలిస్తే.. వారు ఎంత సంతోషంగా జీవిస్తున్నారో తెలుస్తుంది. దురదృష్టవశాత్తు వారి మధ్య విబేధాలు వస్తే.. అప్పుడు అందరు వరుడు ముస్లిం.. అందుకే ఇలా బాధిస్తున్నారు అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం ప్రారంభిస్తారు’ అన్నారు. (లవ్ జిహాద్ : కోర్టు సంచలన తీర్పు) హసన్ మాట్లాడుతూ.. ‘ఈ నేపథ్యంలో ముస్లిం యువకులకు నేను చెప్పేది ఒక్కటే. హిందూ యువతులను మీ అక్కాచెల్లెళ్లుగా భావించండి. లేదంటే ప్రభుత్వం మిమ్మల్ని టార్చర్ చేస్తుంది’ అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ కావాలనే హిందూ-ముస్లింల మధ్య దూరాన్ని పెంచాలని చూస్తుంది అంటూ హసన్ మండి పడ్డారు. ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆమోదించిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యోగి ప్రభుత్వం లవ్ జిహాద్ మీద కాక నిరుద్యోగం, పేదరికం వంటి అంశాల మీద దృష్టి పెడితే మంచిది అంటూ మండిపడుతున్నాయి. -
లవ్ జిహాద్: ఆర్డినెన్స్ ఆమోదించిన యోగి సర్కార్
లక్నో: దేశవ్యాప్తంగా ‘లవ్ జిహాద్’ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాలని భావిస్తోన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ తరహా వివాహాల్లో బలవంతపు మత మార్పిడిలను గుర్తించేందుకు ఓ ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. యూపీ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం దీనికి ఆమోదం తెలిపింది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకోస్తామని కొద్ది రోజుల క్రితం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజుల లోపున ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ (2020) ప్రకారం అబద్ధం, బలవంతంగా జరిగే మత మార్పిడులు.. అలానే వివాహ ప్రయోజనం కోసం మాత్రమే జరిగే మత మార్పిడులను నేరంగా ప్రకటిస్తారు. ఈ తరహా కేసుల్లో బెయిల్ కూడా మంజూరు చేయరు. ఒకేవళ ఎవరైనా వివాహాం తర్వాత మతం మారాలని భావిస్తే.. దాని గురించి రెండు నెలల ముందుగానే జిల్లా అధికారికి తెలపాలని పేర్కొంది. "బలవంతంగా మత మార్పిడి జరిగిన 100 కేసులు మన ముందు ఉన్నాయి. అందువల్ల ఒక చట్టాన్ని రూపొందించడం అవసరం. యోగిజీ మంత్రివర్గం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దాని ప్రకారం బలవంతంగా మత మార్పిడి జరిగితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం వంటి నియమాలు ఉన్నాయి" అని యూపీ క్యాబినెట్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఈ ఆర్డినెన్స్ ప్రకారం, బలవంతపు మత మార్పిడికి పాల్పడితే (మోసం ద్వారా మార్పిడి) ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా 15,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. బలవంతపు మత మార్పిడిలో అట్టడుగు వర్గాలకు చెందిన ఒక మహిళ ఉంటే.. మూడు నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సామూహిక మత మార్పిడిలకు పాల్పడితే 3-10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. (లవ్ జిహాద్ : కోర్టు సంచలన తీర్పు) ఆర్డినెన్స్ ఆమోదించడానికి కొన్ని గంటల ముందు, అలహాబాద్ హైకోర్టు ఈ తరహా కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్లయిన ఇద్దరు వ్యక్తులకు వారికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని.. దీనిలో ఎవరి జోక్యం తగదని తెలిపింది. -
లవ్ జిహాద్ : కోర్టు సంచలన తీర్పు
లక్నో : వివాదాస్పద లవ్ జిహాద్ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందు వర్గానికి చెందిన యువతి, ముస్లిం మతానికి చెందిన యువకుడి చేసుకున్న వివాహం చట్టబద్ధమైనదిగా పేర్కొంది. దేశ పౌరులకు రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక హక్కులకు లోబడే వారిద్దరూ వివాహం చేసుకున్నారని స్పష్టం చేసింది. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతపు మతమార్పిడి ద్వారా వివాహం చేసుకున్నారని యువతి కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. పూర్తి వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక కర్వార్ (హిందు), సలామత్ అన్సారీ (ముస్లిం) గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడి అభ్యర్థన మేరకు పెళ్లికి ముందు ప్రియాంక మత మార్పిడి చేసుకున్నారు. తన పేరును ఆలియాగా మార్చుకున్నారు. అయితే వీరిద్దరి వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యువతి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేయించి, ముస్లిం మతంలోకి మార్చి వివాహం చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మైనరైన తమ కుమార్తెను మోసగించి చేసుకున్న వివాహాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా వరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై సుమారు ఏడాది పాటు విచారణ జరిపిన వివేక్ అగర్వాల్, పంకజ్ నఖ్వీల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం నాడు తుది తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘యువతీ, యువకులను తాము మత ప్రతిపాదకన చూడటంలేదు. ప్రియాంక హిందు, అన్సారీ ముస్లిం అయినప్పటికీ వారి వివాహాన్ని మత కోణంలో విభజించలేం. కులం, మతం, వర్గంతో సంబంధంలేకుండా ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే హక్కు పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించింది. యువతి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నా అని చెబుతోంది. దీనిలో ఎలాంటి బలవంతం లేదని కోర్టు విశ్వసిస్తోంది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. వివాహం సమయంలో యువతి వయసు 20 ఏళ్లు. తన విచక్షణ మేరకే మతమార్పిడి చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. వీరి వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది’ అంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. యువతి తల్లీదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఏడాది కాలంగా దంపతులిద్దరూ సుఖ,సంతోషాలతో గడుపుతున్నారని వారి జీవితంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కాగా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. హిందు యువతులను ముస్లిం వ్యక్తులను వివాహం చేసుకోవడాన్ని నేరంగా పరిగణించే చట్టానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పలువురు సీఎంలు ప్రకటించారు. మధ్యప్రదేశ్, అస్సోం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఈ మేరకు చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే అలహాబాద్ హైకోర్టు తీర్పు రావడం గమనార్హం. -
విడాకులు కోరిన ఐఏఎస్ దంపతులు
'సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్ ప్రేమపక్షులు అథర్ ఆమిర్ ఉల్ షఫీఖాన్, టీనా దాబీ తమ వివాహ బంధంపై ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివాహమైన రెండేళ్లకే దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దాబీ భర్త షఫీఖాన్ జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో విడాకులను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరి అంగీకారం మేరకే పిటిషన్ ఫైల్ చేసినట్లు శుక్రవారం తెలిపారు. 2015 సివిల్స్ టాపరైన టీనా దాబీ తన జూనియర్ అయిన అమీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ వీరి పెళ్లికి మాత్రం పలు హిందూ సంఘాలు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీనా ఐఏఎస్ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వ హిందూ మహా సభ బహిరంగంగానే విమర్శించింది. అయినా అవేవి పట్టించుకుకోని ఈ జంట 2018లో అమీర్ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వివాహంతో ఒకటైయారు. పోస్టింగ్ అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం రాజస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో ఉండటం అనుకోకుండా వచ్చిన అదృష్టంగా భావించారు. అయితే పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య అభిప్రాయ విభేదాలు రావడం ప్రారంభమయ్యాయి. చదవుకున్న యువతీ, యువకులు కావడంతో అర్థంచేసుకుని సర్ధుకుపోతారని ఇరువురి కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కాలం గుడుస్తున్న కొద్దీ మనస్పర్థాలు పెరగడంతో ఇక వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే కులాలు, మతాలను కాదని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వచ్చినా వెనుకడుగు వేయకుండా వివాహ బంధంతో ఒకటైన జంట తాజాగా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2015 సివిల్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే భోపాల్‌కు చెందిన టీనా దబి మొదటి ర్యాంకు సాధించగా.. అదే పరీక్షలో కశ్మీర్‌కు చెందిన అథల్ ఆమీర్ రెండో ర్యాంకు సాధించారు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహరం హాట్‌టాపిక్‌గా మారగా.. ఇప్పుడు విడాకుల వార్త కూడా అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లవ్ జిహాద్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చసాగుతున్న తరుణంలో వీరు విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. హిందు మతానికి చెందిన యువతులకు ముస్లిం యువకులు గాలం వేసి మోసపూరితంగా వివాహం చేసుకుంటున్నారని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
‘బీజేపీ మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది’
జైపూర్: లవ్ జీహాద్ అనే పదాన్ని సృష్టించి భారతీయ జనతా పార్టీ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. దేశ ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుందని బీజేపీపై మండిపడ్డారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. చట్టంలో ‘లవ్ జీహాద్’ కు ఎలాంటి నిర్వచనం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమకు ఇష్టం ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం పౌరులకు రాజ్యాంగం కల్సించిన స్వేచ్ఛ అని.. అలాంటి స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. లవ్‌లో జీహాద్‌కు స్థానం లేదని, దీనిసై చట్టాలు తీసుకురావడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని గెహ్లట్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలు ఏ న్యాయస్థానంలోనూ నిలబడే పరిస్థితి లేదన్నారు. ప్రజలు తమ దయతోనే జీవించాలనే వాతావారణం సృష్టించేందుకు జీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆ స్వేచ్ఛ స్త్రీలకు ఉంటుంది : షెకావత్ అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్విటర్ వేదికగా స్పందించారు. దేశంలో వేలాదిమంది యువతులు లవ్ జీహాద్ వలలో చిక్కుకుంటున్నారని షెకావత్ అన్నారు. ఎవరిని వివాహం చేసుకోవాలనేది వ్యక్తిగత స్వేచ్చ అయితే తమ మతంలో కొనసాగే హక్కు, స్వేచ్చ సైతం స్త్రీలకు ఉంటుందిని పేర్కొన్నారు. లవ్ జీహాద్ ట్రాప్‌లో పడుతున్న యువతులు పెళ్లి తర్వాత వారు నయవంచనకు గురైనట్లు గ్రహిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో లవ్ జీహాద్ వంటి అనధికార నయా నయవంచన చట్టానికి కాంగ్రెస్ మద్దతిస్తుందంటూ దుయ్యబట్టారు. కొత్త పదాలను సృష్టించడం, అల్లర్లకు పాల్పడటం, విద్వేషాలను రగిల్చడం వంటి వాటిపై కాంగ్రెస్ పార్టీ సర్వ హక్కులను కలిగి ఉంటుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మహిళలకు అన్యాయం జరగకుండా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందనే విషయాన్ని బీజేపీ నమ్ముతుందని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. గత కొంత కాలంగా లవ్ జీహాద్ అంశంపై దేశంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక వర్గం వారు ప్రేమ పేరుతో మత మార్సిడికి పాల్పడుతున్నారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజల వ్యక్తిగత స్వేచ్చను హరించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. -
‘గోవధ నిషేధంపై త్వరలోనే బిల్లు’
బెంగళూరు: రాష్ష్ర్టంలో గోవధ నిషేధం త్వరలోనే వాస్తవరూపం దాల్చబోతోందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గోవధను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. ఇక ‘లవ్ జిహాద్’పై చర్చ నేపథ్యంలో పెళ్లి పేరుతో మతం మారేందుకు కుదరదని ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణాటకలో అమలు చేస్తామని సీటీ రవి తెలిపారు. తమ సోదరీమణులను ‘లవ్ జీహాద్’ పేరుతో మతం మార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(చదవండి: లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: యడియూరప్ప) కాగా, తమ మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గత జూలైలో పెళ్లి చేసుకున్న ఓ జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అమ్మాయి తన ఇష్టంతోనే మతం మారినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తమ విషయంలో జోక్యం చసుకోవద్దని అమ్మాయి తండ్రితో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆ జంట కోర్టును కోరింది. అయితే వివాహం పేరుతో మతం మారడం కుదరదని పేర్కొంటూ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది. Cow Slaughter Ban will be a reality in Karnataka in the near future. In have asked Animal Husbandry Minister Sri @PrabhuChavanBJP to get "The Karnataka Prevention of Slaughter & Preservation of Cattle Bill" passed in the Cabinet and present the same in upcoming Assembly Session. — C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) November 20, 2020 -
లవ్ జిహాద్: ‘ఐదేళ్ల శిక్ష, వారికి సైతం..’
భోపాల్: లవ్ జిహాద్‌ను అరికట్టడం కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడతామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు. పెళ్లి పేరుతో మత మార్పిడికి పాల్పడితే నాన్ బెయిల్ కేసులు నమోదు చేసి, ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, లవ్ జిహాద్‌కి సహాయం చేసిన వారికి కూడా ప్రధాన నిందితుడితో సమానంగా శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బలవంత మత మార్పిడుల కోసం పవిత్రమైన వివాహ ధర్మాన్ని అడ్డు పెట్టుకోవడం దుర్మార్గమని మిశ్రా వ్యాఖ్యానించారు. ఇక పెళ్లి కోసం స్వచ్చందంగా మతం మారాలని భావించే వారు తప్పని సరిగా నెల రోజుల ముందుగానే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. (చదవండి: సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!) కాగా, కేవలం వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్ కోర్టు వ్యాఖ్యల లవ్ జిహాద్ అంశం ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక, హరియాణా వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామంటూ ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సైతం అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇక ముస్లిం వర్గానికి చెందిన అబ్బాయి, హిందూ అమ్మాయిని ప్రేమించడం లేదా పెళ్లి చేసుకున్న సందర్భాలను లవ్ జిహాద్‌గా పేర్కొంటూ రైట్ వింగ్ గ్రూపులు ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే లవ్ జిహాద్ అనే పదానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్వచనం చెప్పలేదు. అంతేగాకుండా ఈ అంశం ఆధారంగా కేంద్ర నిఘా సంస్థలు ఎలాంటి కేసు నమోదు చేయలేదని లోక్‌సభలో ఈ మేరకు ఫిబ్రవరిలో ప్రకటన చేసింది. -
సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!
లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు సంచలన వాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మధురాలోని ఒక ఆలయంలో నమాజ్ సమర్పించినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తరువాత ఆమె ఇలా బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ 29 న మధురలోని నందగావ్‌లో ఉన్న నంద్ బాబా మందిర్ వద్ద ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైజల్ ఖాన్, చంద్ మొహమ్మద్ అనే వ్యక్తులు నమాజ్ చేయగా వారితో పాటు వచ్చిన అలోక్ రతన్, నీలేష్ గుప్తా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత, మసీదులలో 'హనుమాన్ చలీసా' చదివిన కేసులు వెలువడ్డాయి. తారోలి గ్రామంలోని ఒక మసీదులోకి ప్రవేశించి హనుమాన్ చలీసాను పఠించినట్లు ఆరోపణలు రావడంతో మధుర పోలీసులు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై సీఆర్పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాచి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ప్రాచి ఈ విషయాల పై స్పందిస్తూ సామాజిక సామరస్యం పేరిట ఒక ముఠా దేవాలయాలకు వెళ్లి నమాజ్ చేస్తోందని, సాంఘిక సామరస్యాన్ని కాపాడుకునేలా హిందువులు కూడా మసీదుల వద్దకు వెళ్లి హోమం చేయాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయాలను నాశనం చేసి నిర్మించిన మసీదులను కూల్చివేసి అక్కడ పూజలు నిర్వహించాలన్నారు. హోమం చేయడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. లక్నోలో ఉన్న పురాతన మసీదలో హోమం చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఆమె ‘లవ్ జిహాద్’ పై కూడా స్పందించారు. ఇది ఎంతోకాలంగా చేస్తోన్న కుట్ర అని ఇది నెమ్మదిగా భారతదేశమంతా విస్తరిస్తుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను బహిరంగా ఉరితీయాలన్నారు. ఈ విషయానికి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చదవండి: లవ్ జిహాద్: విచారణలో కీలక విషయాలు -
లవ్ జిహాద్: విచారణలో కీలక విషయాలు
లక్నో: కర్ణాటక నుంచి హర్యానా వరకు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హిందూ యువతులను బలవంతంగా ముస్లింలుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని గట్టిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ జిహాద్’ పేరుతో ఇలా చేస్తున్నారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఇలాంటి పనులకు పాల్పడితే అంతిమ సంస్కారాలు తప్పవని బాహాటంగానే ప్రకటించారు. అయితే ఈ కేసులను విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి కేసులు కాన్పూర్‌లో 14 నమోదు కాగా వాటిలో 7 కేసులు విచారణ చేపట్టిన పోలీసులకు ఈ అన్ని కేసులలో తమ ఇష్టప్రకారమే యువతి యువకులు ఒక్కటయినట్లు తెలిసింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులు నీరుగారిపోయాయి. ఆగస్టు 7 వతేదీన జుహి కాలనికి చెందిన షాలిని యాదవ్ అనే యువతిని మహ్మమద్ ఫసిల్ అనే వ్యక్తి తమ కూతురి పై గన్ను గురిపెట్టి ఆమెను బలవంతంగా పెళ్లి తీసుకోని ఇస్లాంలోకి మారాలని బలవంతం పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ యువతి తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, తనకు నచ్చే ఇస్లాంలోకి మారానని ఇందులో ఎవరి బలవంతం లేదని కోర్టుకు తెలిపింది. ఇంకా వేరే కేసులో కూడా ఆ అమ్మాయి అబ్బాయి ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారని ఇలా కేసు పెట్టడానికి ముందు వరకు వారు బాగానే ఉన్నారని వారి ఇరుపొరుగువారు తెలిపారు. చదవండి:లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: సీఎం -
లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: సీఎం
బెంగళూరు : ‘‘లవ్ జిహాద్ అనేది ఓ సామాజిక భూతం. దీనిని రూపుమాపేందుకు నిపుణులను సంప్రదించి చట్టం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు, ప్రేమ పేరిట యవతులకు వల వేసే చర్యలను సహించబోమన్నారు. ‘‘లవ్ జిహాద్ కారణంగా ఇటీవల తరచుగా మతమార్పిడులు జరుగుతున్న విషయాల గురించి వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అధికారులతో కూడా దీని గురించి చర్చించా. ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనేది తెలియదు. కానీ కర్ణాటకలో దీన్ని ఆపాలనుకుంటున్నాం. డబు, ప్రేమ పేరుతో మతం మార్చడమనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం’’ అని ఆయన అన్నారు. కాగా ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా లవ్ జిహాదీ అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేవలం వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ తారస్థాయికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో లవ్ జిహాద్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయనే వార్తలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రి కంటే ముందు మీడియాతో మాట్లాడిన హోం మంత్రి బసవరాజ్ బొమ్మాయ్.. లవ్ జిహాద్ అనేది ఓ దుష్టశక్తి అని.. ఇందుకు విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.(చదవండి: లవ్ జిహాద్: హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు) అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి? ముస్లిం వర్గానికి చెందిన అబ్బాయి, హిందూ యువతిని ప్రేమించడం, పెళ్లి చేసుకున్న సందర్భాలను లవ్ జిహాద్‌గా పేర్కొంటూ రైట్ వింగ్ గ్రూపులు వాడుకలోకి తెచ్చాయి. అయితే లవ్ జిహాద్ అనే పదానికి కేంద్ర ఇంతవరకు ఎలాంటి నిర్వచనం చెప్పలేదు. ఈ మేరకు ఫిబ్రవరిలో కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటులో మాట్లాడుతూ.. లవ్ జిహాద్ అనే పదానికి ఎలాంటి చట్ట పరమైన నిర్వచనం లేదన్నారు. ఇప్పటి వరకు దీనిపై కేంద్ర నిఘా సంస్థలు ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రజల మధ్య విభేదాలు లేకుండా స్వేచ్ఛగా ఏ మతానైనా స్వీకరించడానికి వీలుకల్పిస్తుంది. కానీ లవ్ జిహాద్ గురించి ఎక్కడా లేదని లోక్‌సభలో అన్నారు. -
లవ్ జిహాద్: హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘లవ్ జిహాద్’పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. మతాంతర వివాహాలకు విరుద్ధంగా చట్టాల రూపకల్పనకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మాయ్ ‘‘లవ్ జిహాద్’ అనేది ఓ దుష్టశక్తి అని.. ఇందుకు విరుద్ధంగా ఓ చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదించిందని.. త్వరలోనే చట్టం రూపొందిస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, హరియాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మేరకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయం గురించి ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించాం. ఆ నిర్ణయాల మేరకు కొత్త చట్టాన్ని రూపొందిస్తాం’ అన్నారు. కాగా లవ్ జిహాద్ అనే పదాన్ని రైట్ వింగ్స్ గ్రూపులు వాడుకలోకి తెచ్చాయి. ఇది ముస్లిం అబ్బాయి, హిందూ యువతి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ బంధంలో ఆడపిల్లలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మాయ్ మాట్లాడుతూ.. ‘అలహాబాద్ హై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటకలో కూడా ఓ చట్టం తీసుకురాబోతున్నాం. కేవలం వివాహం కోసం మతం మార్చుకోవడం అంగీకారం కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. అదే విధంగా.. మరో ట్వీట్లో ముస్లిం యువకులను జిహాదీలతో పోల్చారు బొమ్మాయ్. వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. మతాంతర వివాహం చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) -
లవ్ జిహాద్ : విస్తరిస్తున్న కొత్త వివాదం
దేశంలో గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కొత్త చర్చకు దారితీసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతమంది భిన్న మతాల యువతీ యువకులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. మరోవైపు దేశంలో వేగంగా విస్తరిస్తున్న లవ్ జిహాద్‌పై బీజేపీ పాలిత ప్రభుత్వాలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. మతాంతర వివాహాలను విరుద్ధంగా చట్టల రూపకల్పనకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేవలం వివాహం కోసమే మతాల మారటం సమంజసం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి, న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం కేరళ వేదికగా వెలుగుచూసిన లవ్ జిహాద్ నేడు దేశంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 25 ఏళ్ల ఓ హిందూ యువతి ముస్లింగా మతమార్పిడి చేసుకుని హిందూ యువకుడిని వివాహం చేసుకోగా.. అది చెల్లదంటూ కేరళ హైకోర్టు 2018లో వివాదాస్పద తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ జంటకు ఉపశమనం అభించింది. కేరళ హైకోర్టును ఇచ్చిన తీర్పును కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.. హదియా తన భర్తతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చని సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చజరిగింది. అప్పటి నుంచి దేశంలో ఏదో ఓ మూలన లవ్ జిహాద్ నినాదం వినపడుడూనే ఉంది. తన ఇష్టపూర్తిగానే మత మార్పిడి చేసుకుని ఇతర మతస్థుడిని వివాహం చేసుకున్నా అంటూ యువతి చెబుతున్నా.. తమ కుమార్తెను బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఛండీగఢ్ సమీపంలోని ఫరీదాబాద్‌లో ముస్లిం యువకుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన నికితా తోమర్ ఉదంతం మరోసారి లవ్ జిహాద్‌పై చర్చకు దారితీసింది. తమ కుమార్తె మతమార్పిడికి ఒప్పుకోకపోవడంతోనే ప్రేమోన్మాది తన బిడ్డను బలితీసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. (ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి) హిందు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనే దుర్భుద్ది మరోవైపు హిందు యువతులకు వలవేసి ముస్లిం యువకులు మోసపూరిత వివాహాలు చేసుకుంటున్నారని పలువురు హిందు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందు యువతులను మోసం చేసి వివాహం చేసుకుంటున్న ముస్లిం యువకులపై కఠిన చర్యలకు తీసుకోవాలని గత అక్టోబర్‌లో బీజేపీపాలిత అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగినే నేపథ్యంలో చాలామంది అమాయక బాలికలు మోసపోతున్నారని, హిందు అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్భుద్దితో కొంతమంది ముస్లిం యువకులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి హేమంత్ బిశ్వా ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారని, ఇలా ఎంతో మంది యువతులు ముస్లింల చేతిలో మోసపోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా మోసపూరితమైన మతాంతర వివాహాలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. లవ్ జిహాద్‌కు చెక్ : యోగీ ఇకపై లవ్ జిహాద్ పేరుతో వివాహం చేసుకుంటే ఏమాత్రం ఉపక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సైతం మతాంతర వివాహాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లవ్ జిహార్‌పై కఠినమైన చట్టం తీసుకురావలని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్నామ్ సత్య యాత్ర ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఇలాంటి తరుణంలో వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం సంచలనంగా మారింది. ఇతర మతాలపై ఎలాంటి అవగహాన లేకుండా కేవలం వివాహం కోసమే మతమార్పిడి చేసుకోవడం సమంజసం కాదని న్యాయస్థానం స్పష్టం చెప్పింది. ఈ తీర్పు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీసింది. లవ్ జిహాద్‌పై దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఈ తరుణంలోనే అలహాబాద్ హైకోర్టు తీర్పుపై పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. యువతీ, యువకులు అభిప్రాయలకు విరుద్ధంగా తీర్పు ఉందని పలువురు ప్రజాస్వామికవాదలు పెదవి విరుస్తున్నారు. మనుషులు ఇష్టాయిష్టాలపై చట్టం చేసే హక్కు ఎవరికీ లేదని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అయితే మత మార్పడి అనేది ఇతరుల అభిప్రాయాలను అవమానపరిచే విధంగా ఉండకూడదు అనేది రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఇక ఈ లవ్ జిహాద్ అనే వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి. -
ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని సమీపంలోని ఫరిదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న యువతి నికితా తోమర్ (21) హత్య ఉదంతంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బలవంతపు మత మార్పిడికి ఒప్పుకోకపోవడంతోనే ప్రేమోన్మాది తౌసీఫ్ తమ బిడ్డను బలితీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గత మూడు రోజులుగా ఇంటి ఆరు బయట కూర్చోని నిరసన తెలుపుతున్నారు. లవ్ జిహాద్ పేరుతో నికితా తోమర్‌ను అతి కిరాతకంగా హతమార్చిన తౌసీఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి మహిళా సంఘాలతో పాటు, విద్యార్థి సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ‘వెంటనే ఆ దుర్మార్గుణ్ని కాల్చి చంపండి.. లవ్ జిహాద్ ముర్దాబాద్’ అనే నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటుతున్నాయి. కాగా గత నెల 26న ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో పరీక్ష రాసి వస్తుండగా నికితా తోమర్‌ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. ఆమెపై కాల్పులు జరిపుతున్న దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. అయితే ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమవుతున్నారు. (పెళ్లి కోసమే మతం మారడం సరికాదు) అయితే గతంలో కేరళ యువతి వివాహం కేసులో హైకోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చిన లవ్ జిహాద్.. తాజాగా నికిత హత్యతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో పెళ్లి కోసం కొంతమంది యువతీ, యువకులు మతం మారడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే పెను వివాదానికి దారితీస్తోంది. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త చర్చకు దారితీస్తోంది. వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని న్యాయస్థానం సంచనల తీర్పును వెలువరించింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మతమార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించారు. ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదంటూ 2014లో ఇచ్చిన తీర్పును ఉటంకించారు. అయితే జాతీయ స్థాయిలో లవ్ జిహాద్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. దేశ పౌరులు ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని అనుసరించొచ్చు, ఆ మత విధానాలను పాటించవచ్చు. -
ఆడ పిల్లల జీవితాలతో ఆటలు మానండి
లక్నో: కేవలం పెళ్లి కోసమే మతం మారడం సరికాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. లవ్ జిహాద్ విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని శనివారం చెప్పారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్నామ్ సత్య యాత్ర ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. శనివారం ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడారు. లవ్ జిహాద్లో భాగస్వాములైన వారి పోస్టర్లను రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. (అస్సాం, మిజోరాంల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు) -
లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం
గువాహటి : అస్సోంలోని పాలిత బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందు యువతులను మోసం చేసి వివాహం చేసుకుంటున్న ముస్లిం యువకులపై కఠిన చర్యలకు తీసుకోవాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హేమంత్ బిశ్వాశర్మ గురువారం గువాహటిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా అస్సోం ప్రభుత్వం పోరాటాన్ని ప్రారంభించబోతుందని మంత్రి ప్రకటించారు. తమ బిడ్డలను మోసగాళ్ల వంచన నుంచి రక్షించేందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. (లవ్ జిహాద్‌కు నిర్వచనం లేదు) ఈ సందర్భంగా హేమంత్ బిశ్వా మట్లాడుతూ.. ‘సోషల్ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగినే నేపథ్యంలో చాలామంది అమాయక బాలికలు మోసపోతున్నారు. హిందు అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్భుద్దితో కొంతమంది ముస్లిం యువకులు కుట్రలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో హిందు వ్యక్తి మాదిరిగా ఫేక్ ఎకౌంట్ సృష్టించి దానికి ఓ దేవుడి ఫోటోను వాల్‌పేపర్‌గా పెడుతున్నారు. ఈ విధంగా హిందు వర్గానికి చెందిన యువతులను మోసం చేసి, ప్రేమ పేరుతో లోబర్చుకుంటున్నారు. అనంతరం పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది యువతులు వారి చేతిలో మోసపోతున్నారు. మరోవైపు లవ్ జిహాద్ పేరుతో తమ బిడ్డలను మరో వర్గం వారు బలవంతంగా వివాహం చేసుకుంటున్నారు. అన్నెంపున్నెం ఎరుగని యువతుల్ని మభ్యపెట్టి బలవంతంగా మత మార్పిడి చేసి.. తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని ఇక సహించేది లేదు. అలాంటి వారిపై అస్సోం ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటిస్తోంది. తమ బిడ్డలను మోసం చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాల్సింది. బలవంతపు వివాహాలను నివారించడానికి చర్యలకు ఉపక్రమిస్తున్నాం. అస్సామీ ఆడపడచుల రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో మతమార్పిడి సంఘటలను తరచుగా వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు యువతులు చెబుతున్నా.. ఇది బలవంతపు వివాహమని తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేలుకున్న అస్సోం ప్రభుత్వం ఇకపై బలవంతపు వివాహాలను చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలకు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు, ముస్లిం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యువతీ యువకులు ఇష్టాలకు అనుగుణంగా చేసుకున్న వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తున్నారు. ఇది ముస్లిం సమాజంపై కక్షసాధించడంగా వారు భావిస్తున్నారు. -
వైరల్ యాడ్ తొలగించిన తనిష్క్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ సోషల్‌మీడియా నుంచి తన యాడ్‌ను తొలగించింది. రెండు రోజుల నుంచి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ కోసం తనిష్క్ ఒక యాడ్‌ను క్రియేట్ చేసింది. ఇందులో, హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమె సీమంతం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది. ఇక నలభై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు, ‘‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్ సంస్థ డిస్క్రిప్షన్ పొందుపరిచింది. దీనిపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. బాయ్‌కాట్ తనిష్క్ అంటూ నిన్నంతా ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. లవ్ జిహాద్‌ను తనిష్క్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కావడంతో తనిష్క్ ఆ యాడ్‌ను తొలగించింది. చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్.. -
లవ్ జిహాద్‌కు నిర్వచనం లేదు
న్యూఢిల్లీ: ‘లవ్ జిహాద్’ అనే మాటకు ప్రస్తుత చట్టాల్లో ఎటువంటి నిర్వచనం లేదని, కేంద్ర సంస్థలేవీ లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసులను విచారణ చేయడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లవ్ జిహాద్ కేసులకు సంబంధించి కేరళ కాంగ్రెస్ నాయకుడు బెన్నీ బెహనా అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత రెండేళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దక్షిణాదిలో లవ్ జిహాద్ కేసులు నమోదు చేశాయా అని బెన్నీ బెహనా అడిగారు. అదేవిధంగా, ఎన్నార్సీ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మంగళవారం ఎయిర్‌క్రాఫ్ట్ చట్ట ఉల్లంఘనుల నుంచి భారీ జరిమానా వసూలు చేయడం సహా పలు ప్రతిపాదనలతో ఎయిర్‌క్రాఫ్ట్ చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.1కోటికి ప్రభుత్వం పెంచింది. (చదవండి: అందుకేనా మా నాన్న ఉగ్రవాది...?) -
బాలికపై ఇద్దరు యువకుల దాష్టీకం
బనశంకరి: కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న లవ్ జిహాద్ తతంగం మళ్లీ తెరమీదకు వచ్చింది. బెంగళూరులో వ్యాపారం నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం కాసరగూడుకు చెందిన యువకుడు ఒక మైనర్ బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడి, మతం మారాలని ఒత్తిడి తెస్తున్నాడని, తక్షణం అతడిని అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకురాలు, చిక్కమగళూరు ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె బాలిక కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి యడియూరప్పను కలిశారు. అనంతరంబెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కఠినంగా వ్యవహరించాలన్నారు బాధితురాలి కుటుంబం తనను సంప్రదించగా, ఆదివారం కలిశానని, వీరిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లానని శోబా కరంద్లాజే తెలిపారు. ముఖ్యమంత్రి కూడా పోలీస్ అధికారులకు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారన్నారు. బెంగళూరులో ఘటన చోటుచేసుకోవడంతో బాలిక ఎలక్ట్రానిక్‌సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దుండగులపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బెంగళూరు పోలీసులు బాధితురాలి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' వీడియో తీసి బెదిరింపులు ఎంపీ శోభా మాట్లాడుతూ.. 17 ఏళ్ల బాలిక బెంగళూరులో కాలేజీలో చదువుతున్న సమయంలో పరిచయం చేసుకున్న రిషబ్, మసూద్ అనే ఇద్దరు యువకులు ఆమెను మంగళూరు, బెంగళూరులో తిప్పి మత్తు మందులిచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. అత్యాచార దృశ్యాలను వీడియో తీసి బాలికను బెదిరించారు. బాలిక తండ్రి మినహా మొత్తం కుటుంబసభ్యులు మతం మారాలని, లేకపోతే వీడియో బహిరంగ పరుస్తామని, ఇంటికి నిప్పు పెట్టి హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ యువకులు ఎలక్ట్రానిక్ సిటీలో అక్వేరియం వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాలిక తెలిపిన ప్రకారం గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నారు. వీరు నిత్యం గంజాయి మత్తులో ఉంటారు. వీరు ఇంకా ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, మంగళూరు, బెంగళూరులో ఇలాంటి కేసుల్లో భాగస్వాములుగా ఉన్నారా అనే దానిపై లోతుగా విచారణ చేపట్టాలి అని శోభా డిమాండ్ చేశారు. -
నా కూతురు లవ్ జిహాద్ బాధితురాలు..
భోపాల్ : రాష్ట్రంలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ ఆరోపించారు. ఆయన కారణంగానే తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ సురేంద్రనాథ్ కూతురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల చిత్ర హింసలు తట్టుకోలేక అఙ్ఞాతంలోకి వెళ్లినట్లు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సురేంద్రనాథ్... భోపాల్‌లో ఉన్న హుక్కా లాంజ్ యజమానులు వెంటనే వాటిని మూసివేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో వాటి భద్రతకు భంగం వాటిల్లితే తననేమీ ప్రశ్నించకూడదని మీడియా ముఖంగా తెలియజేశారు.(చదవండి : బలవంతపు పెళ్లి చేస్తున్నారు: బీజేపీ నేత కూతురు) ‘హుక్కా లాంజ్‌లు కేంద్రంగా లవ్ జిహాద్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వీటితో సంబంధం ఉంది. నా కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారింది. అసలు పిల్లలు హుక్కా లాంజ్‌లకు ఎందుకు వెళ్తున్నారు. వారికి హుక్కా తాగాల్సిన అవసరం ఏమిటి? దయచేసి ఇప్పటి నుంచి ఎవరూ హుక్కా సెంటర్లకు వెళ్లకండి. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా నాకు అక్కర్లేదు. కానీ భోపాల్‌లో మాత్రం హుక్కా సెంటర్లు ఉంటే సహించేది లేదు’ అని సురేంద్రనాథ్ హెచ్చరించారు. ఇక తన కూతురి గురించి మాట్లాడుతూ.. ఐదేళ్లుగా తాను డిప్రెషన్‌తో బాధ పడుతుందని.. అందుకు చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. మానసికంగా కుంగిపోయిన తనతో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతీ తండ్రి తన కూతురిని తన మతం వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడతాడని.. అందుకు తానేమీ మినహాయింపు కాదని చెప్పుకొచ్చారు. దేవుడిని విశ్వసిస్తూ.. సంస్కృతీ సంప్రదాయాలు పాటించే వ్యక్తికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భోపాల్‌లో లవ్ జిహాదీ కొనసాగితే క్రూసేడ్లు(మత యుద్ధాలు) చేయడానికి కూడా తాము వెనుకడుగువేయబోమని హెచ్చరించారు. -
మరో 'లవ్ జిహాదీ’ కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో లవ్ జిహాదీ వ్యవహారం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో రఫిక్ అనే యువకుడు ఓ దళిత యువతిని మోసం చేసిన ఘటన మల్కాజిగిరిలో కలకలం రేపుతోంది. రఫిక్.. తనను బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గర్భం దాల్చిన తర్వాత తనను మోసం చేసాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్లో నివాసముండేవారు. వరంగల్‌కి చెందిన రఫిక్ .. 6 ఏళ్ల క్రితం క్రిష్ణవేణితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేటలో ఉద్యోగం చేస్తూ ఆమెను పెళ్ళిచేసుకున్నారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళిచేసుకోనని రఫిక్ తెలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణవేణి బలవంతంగా మతం మార్చుకుని షబానా గా మారింది. పెళ్లైనా తరువాత కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది. కానీ కొద్ది రోజుల తరువాత అసలైన కథ మొదలైంది. పిల్లలు కావాలని రఫిక్ షబానాను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అనారోగ్యం వల్ల షబానాకు నాలుగు సార్లు అబార్షన్ అయింది. అవేమీ పట్టించుకోని రఫిక్ అప్పటినుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం పుట్టింటినుంచి డబ్బులు తేవాలని హింసించడం ప్రారంభించాడు. దీనిపై షబానా పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ తో సరిపెట్టారు. ఆఖరికి తాజాగా షబానా గర్భందాల్చారు. అయితే రఫిక్ షబానాకు నాలుగో నెల రాగానే తనకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతోఇలాంటి నీచపు పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని భాదితురాలు క్రిష్ణవేణి(షబానా) డిమాండ్ చేస్తున్నారు. -
పేరు మార్చుకుని పెళ్లి; విడాకులు
రాంచి : ఎయిర్ రైఫిల్ షూటర్ తారా సహదేవ్ మాజీ భర్త రకిబుల్ హసన్ అలియాస్ రంజిత్ కోహ్లిపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. రంజిత్‌గా పేరు మార్చుకుని తనను మోసపూరితంగా వివాహం చేసుకున్నాడంటూ తారా సహదేవ్ విడాకులు కోరిన విషయం తెలిసిందే. అదే విధంగా హిందువునైన తనను మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి చేసి గృహహింసకు పాల్పడ్డాడంటూ ఆమె 2014లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2018లో వారిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే రకిబుల్ లవ్ జీహాదీకి పాల్పడ్డాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఉద్దేశపూర్వకంగానే తారాను అతడు మోసం చేశాడన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రకిబుల్, అతడికి సహకరించిన వారిపై సీబీఐ అధికారులు శుక్రవారం చార్జిషీటు దాఖలు చేశారు. -
వాళ్లని ఉతికితే.. మరకలు పోతాయి!
‘మరక మంచిదే’ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్ యూనీలివర్ రూపొందించిన సరికొత్త యాడ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న హెచ్‌యూఎల్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ #boycottSurfexcel పేరిట నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘హిందుత్వాన్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచేలా యాడ్ రూపొందించిన సర్ఫ్ ఎక్సెల్‌ను నిషేధించాలి. హిందూ బాలికను, ముస్లిం బాలుడిని ఎంచుకుని లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే హోలి రంగులను మరకలు అని ఎలా అంటారు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇంత అందమైన ఫిల్మ్‌ను రూపొందించిన వారికి ధన్యవాదాలు. ఈ యాడ్‌ను వ్యతిరేకించడమంటే భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం భావనకు విరుద్ధంగా వ్యవహరించినట్లే’ అని ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి.. ‘నాదొక మంచి సలహా. భక్తులను సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతకాలి. ఎందుకంటే మరకలు పోగొట్టడమే కదా సర్ఫ్ పని’ అని వ్యంగంగా ట్వీట్ చేసి సర్ఫ్ ఎక్సెల్‌కు అండగా నిలిచారు. ఆ యాడ్‌లో ఏముందంటే... హోలి పండుగ రోజు ముస్లిం బాలుడు, హిందూ బాలిక కలిసి సైకిల్‌పై వెళ్తూంటారు. వైట్ డ్రెస్ ధరించిన ఆ బాలిక హోలి రంగులు పడకుండా తన వెనుక ఉన్న స్నేహితుడిని రక్షిస్తుంది. ఆ తర్వాత అతడిని దగ్గర్లో ఉన్న మసీదులో దిగబెట్టగా అతడు నమాజ్ చేసేందుకు పరిగెడతాడు. నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ మరక మంచిదే అనే ట్యాగ్‌లైన్‌తో ముగుస్తుంది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ యాడ్ ఇప్పటికే దాదాపు 85 లక్షల వ్యూస్ సాధించింది. అయితే హిందుత్వ వాదులు మాత్రం తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు హిందూస్థాన్ యూనీలివర్ చవకబారు చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శిస్తున్నారు. కాగా రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రమోషన్ కోసం హెచ్‌యూఎల్ ఇటీవల రూపొందించిన యాడ్ వివాదాస్పమైన సంగతి తెలిసిందే. ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు మండిపడ్డారు. I have a better suggestion. Bhakts should be washed properly with Surf Excel. Kyunki Surf ki dhulai daag ko karain saaf. https://t.co/YiYrW4AM2j — Mehbooba Mufti (@MehboobaMufti) March 10, 2019 -
బీజేపీలో చేరిన హదియా తండ్రి
తిరువనంతపురం : ఇస్లాం మతం స్వీకరించి.. ఆ తర్వాత ముస్లిం యువకుడిని వివాహం చేసుకుని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని హదియా తండ్రి కేఎమ్ అశోకన్ సోమవారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యదర్శి బి.గోపాలకృష్ణన్ సమక్షంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అశోకన్ మీడియాతో మాట్లాడారు. ‘ చిన్ననాటి నుంచి నేను కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను నమ్ముతున్నాను. కానీ ఇటీవలి కాలంలో మైనార్టీ ఓట్ల కోసం ఆ పార్టీ దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి హిందువుల గురించి మాట్లాడుతున్నాడు అంటే అతడిని ఎందుకు ఓ తీవ్రవాదిగా ముద్ర వేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు. నమ్మకానికి, చట్టానికి మధ్య నలిగిపోతున్నాం.. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరు హిందువుల్లాగే తాను కూడా చట్టానికి, నమ్మకానికి మధ్య నలిగిపోతున్నాని అశోకన్ అన్నారు. నిజానికి మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలను చట్టం పరిధి నుంచి తప్పిస్తేనే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.. అయితే శబరిమల అంశంలో బీజేపీ అనుసరించే ఏ విధానాలనైనా తాను సమర్థిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంపై మేధావులు కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాగా కేరళకు చెందిన అఖిల ఆశోకన్(25) అనే యువతి 2016 డిసెంబర్లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అఖిల తండ్రి అశోకన్ మాత్రం తన కూతురుని బలవంతంగా మతం మార్పించి, షఫీన్ పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై కేరళ హైకోర్టు వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పునివ్వడంతో హదియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో హదియా- షఫీన్ల వివాహం చట్టబద్ధమైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. -
పెళ్లి చేసుకోకపోయినా కలిసుండొచ్చు
న్యూఢిల్లీ : యుక్త వయస్సు వచ్చిన వారికి వివాహంతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉన్నదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం గృహహింస నిరోధక చట్టం 2005 కింద ‘లివ్ ఇన్ రిలేషన్షిప్స్’(సహజీవనాన్ని)ను శాసన సభ గుర్తించిందని తెలిపింది. చట్ట బద్దమైన వివాహ వయసు కంటే ముందే పెళ్లి చేసుకున్నారని కేరళకు చెందిన ఓ మేజర్ దంపతుల వివాహాన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. దాంతో తనకు న్యాయం చేయాల్సిందిగా ఆ యువకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ విన్నపం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వివాహంతో సంబంధం లేకుండా యుక్త వయసుకు వచ్చిన వారు తమకు నచ్చిన వారితో జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది. అప్పీలు వివరాలు... కేరళకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి తుషారా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం నాటికి వీరిరువురు మేజర్లు అయినప్పటికి నందకుమార్‌కు మాత్రం 21 ఏళ్లు నిండలేదు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే వివాహానికి అర్హులు. దీనిని ఆధారంగా చేసుకుని కేరళ హైకోర్టు నందకుమార్, తుషార్ల వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. అంతేకాక తుషార్‌ను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నందకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టు ఈ అప్పీలును విచారించడానికి జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ అధ్వర్యంలో ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. నందకుమార్, తుషార్ ఇద్దరు హిందూవులే కనుక హిందూ వివాహ చట్టం సెక్షన్ 12 ప్రకారం వీరి వివాహం చెల్లుబాటు అవుతుందని, అంతేకాక ఇద్దరు మేజర్లు అయిన కారణంగా వారికి కలిసి జీవించే హక్కుందని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ‘లవ్ జీహాద్’గా పేరు గాంచిన వైకోమ్‌కు చెందిన ‘హదియా’ కేసును ఉదహరించింది. కేరళ వైకోమ్‌కు చెందిన 24 ఏళ్ల హోమియో వైద్య విద్యార్థిని హదియా తాను ప్రేమించిన జహన్‌ను వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారింది. ఈ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఇద్దరు యుక్త వయస్కుల వివాహ విషయంలో కోర్టు జోక్యం చెల్లదని తీర్పునిచ్చిన సంగతిని గుర్తు చేసింది. అందువల్ల నందకుమార్, తుషార్ల వివాహం చెల్లుతుందని, వారిరువురికి కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు నిచ్చింది. నందకుమార్‌కి ఈ నెల 31 నాటికి 21 ఏళ్లు నిండుతాయి. -
మన అమ్మాయిలు ఇట్టే ట్రాప్‌లో పడతారు
భోపాల్: ‘మంచిగా మాట్లాడితే చాలూ కొత్త వాళ్లకైనా సరే మన అమ్మాయిలు ఇట్టే పడిపోతారు. అందుకే పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటల ఉదంతాలు దేశంలో నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి అమ్మాయిల్ని కట్టడి చేయాలి’.... మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అగర్ మాల్వా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ పర్మర్ శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘మన ప్రభుత్వాలు అమ్మాయిలకు వివాహర్హత వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాయి. కానీ, ఇప్పుడు అదే కొంప ముంచుతోంది. తియ్యటి మాటలకు మన అమ్మాయిలు సులువుగా వలలో పడిపోతారు. ఆ సమయంలో వాళ్లకు ఆలోచించే శక్తి ఉండదు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లవ్ జిహాదీ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి, తల్లులు వారిని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. లవ్ జిహాద్ నుంచి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది’ అని ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలకు మద్ధతుగా మాట్లాడుతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... ‘వివాహ వయసును నిర్ణయించటంలో ప్రభుత్వ ఉద్దేశాలు వేరే అయి ఉండొచ్చు. కానీ, కొంత మంది ముస్లింలు పేర్లు మార్చుకుని హిందూ యువతులను మోసం చేస్తున్నారు. నాకు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అలాగని బాల్య వివాహాలను నేను ప్రొత్సహించను. 18 ఏళ్లలోపే అమ్మాయిలకు పెళ్లిళ్లు కుదిర్చండి. అప్పుడు వాళ్లకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావన్నదే నా అభిప్రాయం’ అని పర్మర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షం, ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం సాయంత్రం కొంత మంది విద్యార్థులు భోపాల్ హైవే పై ధర్నా చేపట్టారు. పర్మర్ క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
సుప్రీం తీర్పు అనంతరం స్పందించిన హదియా
కేరళ: ఇస్లాం మతం స్వీకరించడం వల్లనే ఎన్నో అవమానాలను, సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చిందని 'లవ్ జీహాద్' తీర్పు అనంతరం హదియా తెలిపారు. వారి వివాహం చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం తొలిసారి భర్త షఫిన్ జహాన్‌తో కలిసి ఆమె కేరళ వెళ్లారు. హదియా కేసులో న్యాయపరంగా ఎంతో కీలక పాత్ర పోషించిన 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' నాయకులను మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. ఇస్లామిక్ సంస్థ ముఖ్య నేత సైనాబాను కోజికోడ్‌లో కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హాదియా మత మార్పిడిలో సైనాబానే కీలక పాత్ర వహించింది. ఈ సందర్భంగా సైనాబా స్పందిస్తూ సుప్రీంకోర్టు హదియా, జహాన్‌ల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడం తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. తమ కూతుర్ని బలవంతంగా మత మార్పిడి చేసి, ఇస్లాం స్వీకరించేలా ప్రోత్సహించి వివాహం చేసుకున్నారని హదియా తండ్రి కేరళ హైకోర్టును ఆశ్రయించగా తొలుత ఈ కేసును విచారించిన హైకోర్టు వారి విహహాం చెల్లదని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ కోర్టును సుప్రీంకోర్టులో హదియా దంపతులు సవాల్ చేయగా రెండేళ్ల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. -
ప్రేమ పెళ్లి.. కాదు లవ్ జిహాద్
తుమకూరు: రాష్ట్రంలోని కరావళి ప్రాంతంలో సంచలనంగా మారిన లవ్ జిహాద్ సంఘటనల ప్రభావం తుమకూరుపైనా పడింది. బెంగళూరులో ఐటీ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి, మైనారిటీ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది తట్టుకోలేని ఆమె తండ్రి ఇది లవ్ జిహాద్ ఘటన అని, తమ కూతురిని బెదిరించి పెళ్లి చేశారని విలపిస్తూ తుమకూరు పోలీసులను ఆశ్రయించడంతో చర్చనీయాంశమైంది. వివరాలు.. తుమకూరు తాలూకాలోని కుంకుమనహళ్ళి గ్రామానికి చెందిన చైత్ర (26), అదే గ్రామానికి చెందిన ముస్లిం సాజీద్‌ఖాన్ (30)ను ప్రేమించి కొద్దివారాల కిందట వివాహం చేసుకున్నారు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరికి కాస్త పరిచయడం ఉండేది. క్రమంగా స్నేహం బలపడి ప్రేమగా మారింది. ఆమె ఇంట్లో వారిని ఎదిరించి అతని వెంట వెళ్లింది. ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరు కాగా, సాజిద్ కూడా బెంగళూరులోనే ఆటో నడుపుతూ జీవిస్తున్నారు. వీరిద్దరూ బెంగళూరులోనే కాపురం పెట్టారు. పోలీసులకు తండ్రి ఫిర్యాదు : చైత్ర తండ్రికి ఈ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇది ప్రేమ కాదని, లవ్ జిహాద్ అని, తమ కూతురిని తమ ఇంటికి పంపించాలని విలపిస్తూ తుమకూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన, బంధువులు ఫిర్యాదు చేశారు. మాది ప్రేమ పెళ్లేనన్న దంపతులు : తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో చైత్ర–సాజిద్‌లు రూరల్ పీఎస్‌కు వచ్చి తమ వాదన వినిపించారు. తామిద్దరం గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పెళ్ళి చేసుకున్నామని పోలీసుల ముందు తెలిపారు. దాంతో పోలీసులు విచారణ జరిపి ఇది లవ్ జిహాద్ కాదని చెప్పారు. -
లవ్ జిహాద్‌కు కాంగ్రెస్ మద్దతు
మైసూరు: లవ్‌జిహాద్ పేరుతో హిందూ యువతులపై పీఎఫ్ఐ,ఎ స్డీపీఐ, కేఎఫ్‌డీ సంస్థలు పాల్పడుతున్న ఆకృత్యాల గురించి తెలిసినా ఓటు బ్యాంకు కోసం వాటిని చూసీ చూడనట్లు ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా ఆయా ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని మైసూరు నగర బీజేపీ ఇన్చార్జ్ రవిశంకర్ ఆరోపించారు. మంగళవారం నగరంలోని నజరాబాద్లో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం హిందూ సంఘాల బీజేపీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతున్నారని ఆరోపించారు. -
మరో లవ్ జిహాద్ కేసు
సాక్షి, మైసూరు: కర్ణాటకలోని మైసూరు నగరంలో మరో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. గత 10 రోజుల్లో ఇలాంటిది రెండో సంఘటన కావడంతో నగరంలో చర్చనీయాంశమైంది. గుజరాత్‌లోని ద్వారక జిల్లా దేవభూమికి చెందిన హిందూ యువతికి మూడేళ్ల క్రితం మైసూరు తాలూకా జయపురకు చెందిన ఫైజల్ అహ్మద్ అనే యువకుడితో ఫేస్బుక్లో పరిచయమైంది. ఇద్దరూ చాటింగ్, ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఫైజల్ సూచనల మేరకు ఆ యువతి 6 నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి మైసూరుకు వచ్చేయగా, ఇద్దరూ వివాహం చేసుకున్నారు. మొదట సవ్యంగానే ఉన్న ఫైజల్, అతని తల్లి రోజులు గడిచేకొద్దీ మతం మారాలని, మాంసాహారం తినాలని యువతిపై ఒత్తిడి చేయసాగారు. రోజురోజుకు వారి నుంచి శారీరక, మానసిక వేధింపులు తీవ్రతరం కావడంతో కొద్ది రోజుల క్రితం యువతి గుజరాత్లో ఉన్న తన తల్లితండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో నగరానికి చేరుకున్న యువతి సోదరుడు ఆదివారం మైసూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యభర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా, యువతి తనపై జరుగుతున్న వేధింపులను ఏకరువు పెట్టింది. భర్తతో కలసి జీవించడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పడంతో పోలీసులు యువతిని ఆమె సోదరుడి వెంట గుజరాత్‌కు పంపించారు. అయితే యువతి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఫైజల్ చెబుతున్నాడు. ఇస్లాంలోకి మారాలని, మాంసాహారం అలవాటు చేసుకోవాలనే తదితర షరతులకు అంగీకారం తెలిపే ఆమె తనను పెళ్లి చేసుకుందని ఫైజల్ తెలిపాడు. -
లవ్ జిహాద్ హత్యకేసులో విస్తుపోయే నిజం
సాక్షి, జైపూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన రాజస్థాన్ లవ్‌జిహాద్ హత్య కేసు దర్యాప్తు ఆధారంగా పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. నిందితుడు శంభు లాల్ లక్ష్యం వేరే వ్యక్తి అని.. కానీ, పొరపాటున అఫ్రజుల్ను చంపాడని పోలీసులు తెలిపారు. ‘శంభు లక్ష్యం అజ్జూ అనే వ్యక్తిని చంపటం. కానీ, అనుకోకుండా అఫ్రజుల్ బలయ్యాడు. ఈ విషయాన్ని విచారణలో శంభు వెల్లడించాడు. తనకు సోదరితో సమానం అని చెబుతున్న యువతిని శంభు ప్రేమిస్తున్నట్లు తేలింది. అందుకే పగతో అజ్జూను చంపేయాలనుకున్నాడు. ఆ క్రమంలో జరిగిన పొరపాటు మూలంగా అఫ్రజుల్ను చంపేశాడు ’’ అని రాజ్‌సమంద్ పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే... రెగర్ మొహల్లా ప్రాంతానికి చెందిన యువతి మహమ్మద్ బబ్లూ షేక్ అనే వ్యక్తితో 2010లో వెళ్లిపోయింది. మాల్దాలో ఉంటున్న ఆమెను వెనక్కి రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో ఆమెను సోదరిగా చెప్పుకునే శంభులాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా వెళ్లి ఆమెతో మాట్లాడి వెనక్కి రప్పించాడు. అయితే కొంత కాలానికే అజ్జూ అనే మరోవ్యక్తి ఆమెను తిరిగి మాల్దాకు తీసుకెళ్లాడు. దీంతో మరోసారి ఆమెతో ఫోన్లో మాట్లాడి వెనక్కి రప్పించేందుకు యత్నించగా.. అజ్జూ-శంభు ఫోన్లోనే వాదులాడుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ యువతి స్వచ్ఛందంగా ఇంటికి వచ్చేసింది. చివరకు నాలుగైదు నెలల క్రితం అజ్జూ మళ్లీ ఆమె కోసం మొహుల్లాకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శంభు ఇక అజ్జూను చంపేయటమే మార్గమని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో అజ్జూ కోసం శంభు వేట ప్రారంభించాడు. పొరపాటు అక్కడ దొర్లింది... అజ్జూ కూడా అఫ్రోజ్ మాదిరిగానే మాల్దా(పశ్చిమ బెంగాల్) నుంచి వలస వచ్చి రాజ్‌సమంద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శంభు అజ్జూ కోసం గాలిస్తూ మార్కెట్లో ఆరాతీయటం ప్రారంభించాడు. అసలు విషయం తెలీని ఓ వ్యక్తి.. కూలి పనుల కోసం కాబోలు అన్న ఉద్దేశ్యంతో అఫ్రోజ్ నంబర్ ఇచ్చాడు. అప్పటిదాకా అజ్జూతో శంభుకి ముఖపరిచయం లేకపోవటం.. ఫోన్లో కూడా అజ్జూ గొంతును గుర్తుపట్టకపోవటంతో.. అన్నింటికి మించి అతని వివరాలను కూడా తెలుసుకోవటానికి శంభు ఆసక్తి చూపలేదు. డిసెంబర్ 6న ఉదయం అఫ్రోజ్‌కు ఫోన్ చేసి కాంపౌండ్ వాల్ పనుల కోసం మాట్లాడేందుకు రావాలంటూ శంభు పిలిచాడు. దీంతో వీరిద్దరూ కలుసుకుని పనుల గురించి మాట్లాడుకున్నారు. ఆపై పని ప్రాంతం చూపిస్తానంటూ కిలో మీటర్ దూరం తీసుకెళ్లి అక్కడ అఫ్రోజుల్పై దారుణానికి తెగబడ్డారు. ఆ తతంగం అంతా వీడియో తీసి అప్లోడ్ చేశాడు. అసలు విషయం పక్కదారి పట్టేందుకు అతను మతద్వేషిగా అభివర్ణించుకుంటూ వీడియోలను అప్లోడ్ చేశాడంటూ పోలీసులు వివరించారు. -
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ప్రియుడితో వధువు జంప్!
సాక్షి, బెంగళూరు : మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి రాత్రికి రాత్రే ప్రియుడితో కలసి పరారైన ఘటన ఆదివారం మంగళూరు నగరంలో వెలుగు చూసింది. మంగళూరు నగరంలోని మూడబిద్రికి చెందిన ప్రియాంక(25) చిన్న వయసులోనే తండ్రి మృతి చెందడంతో ఆమెను తల్లి ఎంతో గారాబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివిన ప్రియాంకకు ఆమె తల్లి, బంధువులు ఇటీవల విదేశాల్లో ఉద్యోగంలో స్థిరపడ్డ యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. ఈ క్రమంలో సోమవారం ఇరువురికి వివాహం జరగాల్సి ఉండగా అందుకు సంబంధించి శుక్రవారం రాత్రి ప్రియాంక ఇంట్లో మెహందీ కార్యక్రమం కూడా నిర్వహించారు. మెహందీలో కూడా ప్రియాంక ఎవరికీ అనుమానం కలుగకుండా అందరితో ఉల్లాసంగా గడిపింది. రాత్రికి రాత్రి ఇంట్లో నగలు, పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డులను తీసుకొని ప్రియుడితో కలసి పారిపోయింది. ఆదివారం ఉదయం ప్రియాంక ఎంతకి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లి, బంధువులు ఇళ్లంతా గాలించగా ఇంట్లో దాచిన ఆభరణాలతో పాటు ప్రియాంక పాస్‌పోర్ట్, ఆధార్‌కార్డు కనిపించకపోవడంతో మూడిబిద్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. లవ్‌జిహాద్‌గా అనుమానం... కాగా ప్రియుడితో కలసి ప్రియాంక పారిపోయిన ఘటన లవ్‌జిహాద్ అయి ఉండొచ్చంటూ ఆమె తల్లి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి ప్రియాంక ఫరంగిపేటకు చెందిన హైదర్ అనే వ్యక్తితో తరచూ మాట్లాడుతుండేదని తెలిపారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ప్రియాంకను హైదర్ తనతో పాటు తీసుకెళ్లి ఉండాడంటూ అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఇది ముమ్మాటికి లవ్ జిహాదేనంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనలు చేసారు. -
ఏం జరిగినా మీరు మాత్రం స్పందించరు!
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పనికిరాని అంశాలపై మాత్రమే స్పందిస్తుంటారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ లవ్ జిహాద్ అంశంపై నగరంలో నిర్వహించిన ఓ సభలో ఒవైసీ స్పందించారు. ‘‘ వరుస ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నింటిపైనా ప్రసంగిస్తారు. తనపై ప్రతిపక్షాలు వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలను ఖండిస్తారు. కానీ, అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై అస్సలు నోరు మెదపరు. రాజస్థాన్‌లో జరిగిన అఫ్రజుల్ హత్య ఉదంతాన్ని దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. ఓ మతోన్మాది చేసిన దుశ్చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కానీ, మోదీ మాత్రం స్పందించలేదు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. 50 ఏళ్ల వ్యక్తి లవ్ జిహాద్ పాల్పడ్డాడన్న ఆరోపణ ఏ మాత్రం సమంజసం. కేవలం ముస్లింలు అన్న కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. వీటిని మౌనం వహించటం ఎంత వరకు సమంజసం? అని ఒవైసీ.. ప్రధానిని ప్రశ్నించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌కు అఫ్రజుల్ ఖాన్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ ఏతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజస్థాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఎట్టకేలకు భర్తను కలిసింది..
సాక్షి, తిరువనంతపురం : దాదాపు ఏడాది కాలం వారిద్దరి మధ్య విరామం. భార్య భర్తలైనప్పటికీ లవ్ జిహాద్ వివాదం వల్ల దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ డిసెంబర్ 3న వారిద్దరు ఓ కాలేజీలో సీసీటీవీ కెమెరాల మధ్య కలిసేలా అవకాశం కల్పించారు. ఆ సమయంలో వారిద్దరు పొందిన అనుభూతిని మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరో కాదు.. కేరళకు చెందిన హదియా (24), షఫీన్ జహాన్‌లు. వాస్తవానికి హదియా ముందు ఓ హిందువు. ఆమె పేరు అఖిల.. ఓ కాలేజీలో హోమియోపతి విభాగంలో విద్యనభ్యసిస్తున్న ఆమెను ఇంట్లో ఓ పండుగకు ఆహ్వానించగా అందులో పాల్గొనేందుకు నిరాకరించింది. దాంతో ఆమె తండ్రి అశోకన్ కేఎం వివరాలు తెలుసుకోగా షాకింగ్ అంశాలు తెలిశాయి. ఆ అఖిల ఇప్పుడు నాటి అఖిల కాదని హదియాగా మారిందని, ముస్లిం మతంలోకి మారి వివాహం కూడా చేసుకుందని తెలిసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ చేసిన కుట్రలో భాగంగా తన కూతురుని బలవంతంగా మతం మార్పించారని, ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రేరేపించారని, అందుకే తనను హదియా మార్చారని వివరించారు. వారి పెళ్లిని కూడా రద్దు చేయాలని అందులో కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు ఈ వ్యవహారంపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. దీంతో హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆమె తిరిగి తన విద్యను కొనసాగించేందుకు అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా ఆమెకు సంరక్షకుడిగా ఓ డీన్ కూడా పెట్టింది. ఎవరు ఎలాంటి సమస్యను ఆమెకు సృష్టించాలని చూసినా అతడే చర్యలు తీసుకునేలా అవకాశం కల్పించింది. అయితే, వారి వివాహం విషయంలో పిటిషన్ మాత్రం జనవరి నెలలో విచారిస్తామని తెలిపింది. -
వాడు చంపుతానన్నాడు.. నేను చంపేశా!
జైపూర్ : రాజస్థాన్‌లో దారుణ హత్యకు పాల్పడిన శంభులాల్ రాయ్‌ఘర్ ఎట్టకేలకు నోరు మెదిపాడు. లవ్ జిహాద్ నుంచి యువతిని కాపాడేందుకే తాను అతన్ని చంపినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు తాను చేసింది నేరమే కాదని అతను వాదిస్తున్నాడు. ‘‘నేనేం తప్పు చేయలేదు. మా కాలనీకి చెందిన ఓ యువతితో అఫ్రాజుల్(అంతకు ముందు అతని పేరును మహ్మద్ భట్టా షేక్ అని పోలీసులు పేర్కొన్నారు) పారిపోయాడు. చిన్నతనం నుంచి ఆమె నాకు తెలుసు. ఆమె సోదరుడితో నేను కలిసి చదువుకున్నా కూడా. నేను ఆమెను వెనక్కి రప్పించేందుకు సహకరించబోయా. దానికి కోపంగా అఫ్రజుల్ నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు. అందుకే అతన్ని చంపేశా. ఆ వీడియోను తీసింది నా అల్లుడే’’ అని దిల్వారా పోలీస్ స్టేషన్ లో శంభులాల్ వివరణ ఇచ్చుకున్నారు. ఇక రాజసమంద్ పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించారు. శుంభునాథ్ రాయ్‌ఘర్ చెప్పిన విషయాలనే కాదు.. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు పక్కగా చేపడతామని, పూర్తి సాక్ష్యాలు సేకరించి అసలు వాస్తవాలను త్వరలోనే వెల్లడిస్తాం అని ఉదయ్‌పూర్ ఐజీ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు. -
‘లవ్ జిహాద్’ దారుణం!
జైపూర్: ‘లవ్ జిహాద్’కు పాల్పడ్డాడని రాజస్తాన్‌లో ఓ ముస్లిం కూలీని మరో వ్యక్తి అత్యంత పాశవికంగా నరికి సజీవ దహనం చేశాడు. రాజసమంద్ జిల్లాలోని రాజ్‌నగర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితుడిని పశ్చిమబెంగాల్‌కు చెందిన మహమ్మద్ అఫ్రాజుల్(48)గా, హంతకుడిని స్థానికుడైన శంభులాల్ రాయ్‌గర్‌గా గుర్తించారు. పోలీసులు శంభూలాల్తో పాటు అతడి మేనల్లుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే విస్తృతంగా వ్యాపించిన ఆ వీడియోలో... హంతకుడు గొడ్డలితో బాధితుడిని నరికి, ఆ తరువాత కిరోసిన్ పోసి సజీవంగానే దహనం చేసినట్లు కనిపించింది. తనను వదిలిపెట్టాలని బాధితుడు మొరపెట్టుకుంటున్నా కనికరించలేదు. లవ్ జిహాదీలంతా దేశం విడిచిపోవాలని లేదంటే వారికీ ఇదే గతి పడుతుందన్నాడు. సగం కాలిన శరీరంతో ఉన్న వీడియో చూడటానికి కూడా జుగుప్సాకరంగా ఉంది. ఈ వీడియో మరింత మందికి చేరకుండా నిరోధించడానికి రాజసమంద్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. హత్యకు నిందితుడు వాడిన గొడ్డలి, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు అఫ్రాజుల్ బెంగాల్‌లోని మాల్డా నుంచి జీవనోపాధి కోసం రాజస్తాన్‌కు వలసవచ్చాడు. తమ కుటుంబంలో సంపాదిస్తున్నది అతనొక్కడేనని, హంతకుడిని కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
మనిషిని చితక్కొట్టి..దహనం!
-
మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!
రాజస్థాన్‌లో చోటుచేసుకున్న అత్యంత భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. 'లవ్ జిహాద్' పేరిట ఓ వ్యక్తిని సజీవ దహనం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడో కిరాతకుడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. ఈ ఘటనలో మరణించిన బాధితుడిని మహమ్మద్ భట్టా షైక్‌గా పోలీసులు గుర్తించారు. శంబూనాథ్ రాయ్‌గర్ అనే వ్యక్తి అతడిని కొట్టి చంపి.. సజీవ దహనం చేశాడు. నిందితుడిని గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈలోపు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన మరో వీడియో సదరు నేరగాడు తాను చేసిన చర్యను సమర్థించుకోవడం గమనార్హం. లవ్ జిహాద్ నుంచి యువతిని కాపాడేందుకు తాను అలా చేశానంటూ అతను వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్‌సమంద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు చోటుచేసుకోకుండా జిల్లాలో ఐజీ ఆనంద్ శ్రీవాస్తవ క్యాంప్ చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాజ్‌సమంద్ జిల్లాలోని రాజ్‌నగర్ ప్రాంతంలో దేవి హెరిటేజ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సగం కాలి పడి ఉన్న మృతదేహం గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. బాధితుడిని వ్యవసాయ పరికరంతో చితక్కొట్టిన నిందితుడు.. అనంతరం కిరోసిన్ పెట్టి తగులబెట్టాడు. ఈ మేరకు వీడియో తీసి.. ఎవరూ 'లవ్ జిహాద్'కు పాల్పడిన ఇదే గతి పడుతుందని అతను హెచ్చరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన మీడియాకు తెలిపారు. -
ఇక ‘బేటీ బచావో బహు లావో’
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం యువకులు చేపడుతున్న ‘లవ్ జిహాద్’కు ప్రతీకారంగా తాము ‘బేటీ బచావో బహు లావో’ కార్యక్రమాన్ని వచ్చేవారం నుంచి చేపడుతున్నామని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ హిందూ జాగారణ్ మంచ్ ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద తమ హిందూ యువకులు 2,100 మంది ముస్లిం యువతులను పెళ్లి చేసుకుంటారని వెల్లడించింది. తాము ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ ఇది ఒకలాంటి లవ్ జిహాద్ లాంటిదేనని హిందూ జాగారణ్ మంచ్ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ అజ్జూ చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ముస్లిం యువతులకు రెండు విధాలుగా అంటే, ఆర్థికంగా, సామాజికంగాను భద్రత కల్పిస్తామని చెప్పారు. పైగా తమ హిందువులు పెళ్లి చేసుకునే ముస్లిం యువతులు హిందూ మతంలోకి మారాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. వారు ముస్లిం యువకులను పెళ్లి చేసుకున్నట్లయితే పది మంది పిల్లల్ని కనాల్సి ఉంటుంది. హిందువులను పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరు, ముగ్గురుకు మించి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. తాము హిందువులమని చెప్పుకొని ముస్లిం యువతులను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వెళతామని ఆయన చెప్పారు. లవ్ జిహాద్‌కు పాల్పడే ముస్లిం యువకులు అలా చేయరని, నుదిటన తిలకం పెట్టుకొని తిరుగుతారని, హనుమాన్ చాలిస్ కూడా కంఠతా పట్టి వల్లిస్తారని, తీరా ప్రేమలో పడ్డాక తాము ముస్లింలమని, ముస్లిం మతం పుచ్చుకోవాలని హిందూ యువతులపై ఒత్తిడి చేస్తారని ఆయన చెప్పారు. పైగా టెర్రరిస్టులుగా, మానవ బాంబులుగా మార్చేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. తాము ముస్లిం యువతులను పెళ్లి చేసుకోవడం వల్ల వారు కనే పదిమంది ముస్లిం పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, వారి పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారికి హిందూ వ్యతిరేకతను నూరి పోస్తారని, అదే హిందువులను చేసుకోవడం వల్ల తమ పిల్లలకు హిందువు వ్యతిరేక ప్రచారం చేయరని, ఇది ఈ కార్యక్రమం ద్వారా తమకు లాభించే అంశమని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరించారు. -
ఉల్టా లవ్ జీహాద్
సాక్షి, జోధ్‌పూర్ : రాజస్థాన్‌లో లవ్ జీహాద్ కాస్త వికటించింది. ముస్లిం అబ్బాయి హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని యువతి పూజా జోషి స్పష్టం చేసింది. పూజా జోషి నిర్ణయంతో ప్రియుడు మోహిసన్ ఖాన్.. పెళ్లికి నిరాకరించాడు.. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న మోహిసిన్ ఖాన్‌ను 20 ఏళ్ల పూజా జోషిని ప్రేమించాడు. అతని ప్రేమకు పూజా కూడా అంగీకరించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఈ నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. పూజా జోషి కనిపించకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. ప్రేమికులిద్దరినీ పోలీసులు బికనీర్‌లో అదుపులోకి తీసుకుని జోధ్‌పూర్ తరలించారు. పోలీసుల వీరిద్దరిరని విచారిస్తున్న తరుణంలో లవ్ జీహాద్ గురించి పట్టణమంతా పాకిపోయింది. భారీగా హిందువులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్ బయట పెద్ద వివాదం జరుగుతున్న సమయంలో.. మోహిసన్ ఖాన్ హిందూ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు తెలిపారు. ప్రియుడు మతం మార్చుకునేదాకా ఎదురు చూస్తానని లేదంటే వేరే వివాహం చేసుకుంటానని పూజా ప్రకటించడంతో వివాదం సద్దు మణిగింది. -
హిందూ పేరుతోనే.. ‘హదియా’ చదువు
సాక్షి, సేలం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్ జీహాద్ వ్యవహారంలో యువతి హదియా.. హిందూపేరుతోనే వైద్య విద్యను పూర్తి చేయనున్నట్లు సేలమ్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని కాలేజ్ ప్రిన్సిపాల్ జీ. కన్నన్ స్పష్టం చేశారు. హదియాగా పేరు, మతం మార్చుకున్నా.. కాలేజ్ రికార్డుల్లో మాత్రం అఖిలా అశోకన్గానే గుర్తిస్తామని ఆయన తెలిపారు. హదియాను ఆమె తల్లిదండ్రులు మాత్రమే కలిసేందుకు అవకాశం ఉందని.. ఇతరులు ఎవరూ ఆమెను కలవకూడదని ఆయన స్పష్టం చేశారు. హదియా బుధవారం నుంచి తరగతులకు హాజరవుతుందని ప్రిన్సిపాల్ కన్నన్ తెలిపారు. సుప్రీంకోర్టు సూచలన మేరకు హదియా.. తన వైద్య విద్యను కొనసాగించేందుకు కేరళ పోలీసు భద్రత మధ్య సేలం చేరుకున్నారు. కాలేజీకి చేరుకున్న హదియా.. ఉన్నతాధికారులను కలిశారు. కాలేజ్ పరిసరాల్లో భర్త షఫీన్ జహాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కాలేజ్ ప్రిన్సిపాల్‌ను కోరారు. అఖిలా అశోకన్.. సేలంలోని వైద్య కళాశాలలో వైద్య విద్య చదువుతోంది. నాలుగున్నరేళ్లు చదివిన అనంతరం పరిచయమైన షబ్బీన్ జహాన్నే అనే ముస్లింను పెళ్లిచేసుకుని పేరును, మతాన్నిమార్చుకుంది. అఖిళా అశోకన్.. హదియాగా మతం మార్చుకోవడం వెనకు కుట్ర ఉందని ఆమె తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. ఈ వివాహం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ.. హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆమె విద్యను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని ఎన్ఐఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై హదియా తండ్రి.. అశోకన్ హర్షం వ్యక్తం చేశారు. తమ కటుంబంలోకి ఒక ఉగ్రవాదిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని ఆయన తెలిపారు. -
సేలం చేరుకున్న హదియా
సేలం: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లవ్ జిహాద్ వ్యవహారంలో యువతి హదియా సుప్రీంకోర్టు సూచన మేరకు తన వైద్యవిద్య కొనసాగించేందుకు మంగ ళవారం సేలం చేరుకున్నారు. వివరాలు.. కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అఖిలఅశోకన్. ఈమె సేలంలోని సిద్ధక్ కోవిల్ ప్రాంతంలో హోమియోపతి వైద్య కళాశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఈ క్రమంలో నాలుగున్నరేళ్లు చదువుకున్న అనంతరం కేరళకు వెళ్లిన అఖిల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయలేదు. కేరళకు వెళ్లిన ఆమె అక్కడ షబ్బిన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అంతేకాకుండా మతం మారి తన పేరును హదియాగా మార్చుకుంది. తన కుమార్తెకు మాయమాటలు చెప్పి, మతం మార్చి వివాహం చేసుకున్నారని ఆమె తండ్రి కేరళ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఆమె వివాహం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హదియా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన సుప్రీం కోర్టు ఆమె చదువును కొనసాగించాలని సూచించింది. దీంతో హదియా మంగళవారం సాయంత్రం సేలం కళాశాలకు చేరుకుంది. -
వివాదం రేపుతున్న కరీనా మార్ఫింగ్ ఫొటో
సాక్షి, జైపూర్ : రాజస్థాన్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా హిందు స్పిర్చువాలిటీ అండ్ సర్వీస్ ఫౌండేషన్ (హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్) అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ఎప్ఎఫ్ విడుదల చేసిన కరీనా కపూర్ ఖాన్ ఫొటో అత్యంత వివాదాస్పదంగా మారింది. కరీనా ఫొటోను, బుర్ఖా వేసుకున్న మరో మహిళ ఫొటోతో మార్ఫింగ్ చేసి.. లవ్ జిహాద్ వలలో చిక్కుకుంటే.. మీరు ఇలా అవుతారంటూ విద్యార్థులకు హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు బోధిస్తున్నారు. ఈ కరపత్రాన్ని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ బహిరంగ ప్రదేశాల్లో పంపిణీ చేస్తోంది. ముస్లిం, క్రైస్తవ మతాలు చేస్తున్న మతమార్పిడి మోసాలను విద్యార్థులకు తెలియచెప్పేందుకే ఇలా చేస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక పెంపెందించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా హాజరు కావాలని అక్కడి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ అవగాహనా కార్యక్రమాల్లో హిందూ జీవన విధానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ బోధించనుంది. -
‘ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లిని కేరళ హైకోర్టు కూడా ధ్రువీకరించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు. నేను చచ్చేవరకు హిందువుగానే జీవిస్తాను. ఇక అనీస్ హమీద్ కూడా జీవితాంతం ముస్లింగానే జీవిస్తాడు’ అని 24 ఏళ్ల శృతి మెలెడత్ వ్యాఖ్యానించారు. అనీస్ హమీద్‌తో జరిగిన వివాహాన్ని అక్టోబర్ 19వ తేదీన హైకోర్టు ధ్రువీకరించాక ఆమె మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆమె ఎర్నాకులంలోని ‘శివశక్తి యోగ విద్యా కేంద్రం’లో అనుభవించిన నరకయాతనను, తనను పెళ్లి చేసుకోవడం కోసం ఆరు నెలలపాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ హమీద్ అనుభవించిన బాధను మీడియాతో పంచుకున్నారు. కన్నూర్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న పిలాతర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శృతి, హమీద్‌లు 2010 నుంచి 2013 వరకు కలసి చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఫిజిక్స్‌లో మాస్టర్ డిగ్రీ కోసం శృతి, కన్నూర్ యూనివర్శిటీకే అనుబంధంగా ఉన్న తాలిపరంబ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరారు. డిగ్రీ తర్వాత కోజికోడ్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సు చేసిన హమీద్ ఎంబీఏ కరస్పాండెన్స్ కోర్సు కూడా పూర్తి చేసి 2015లో ఢిల్లీలోని ఓ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. పీజీ పూర్తి చేసిన శృతిని పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తుండడంతో అప్పటికీ టచ్‌లో ఉన్న హమీద్‌తో విషయం చెప్పింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంతో హమీద్, శృతి ఇంటికి తన తల్లిని తీసుకొని వచ్చి పెళ్లి ప్రతిపాదన చేశారు. అందుకు శృతి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించలేదు. ఇక ఎప్పటికీ తమ పెళ్లిని శృతి తల్లిదండ్రులు ఒప్పుకోరని గ్రహించిన శృతి, హమీద్‌లు గత మే 16వ తేదీన ఢిల్లీకి పారిపోయారు. అక్కడి సోనెపట్‌లో కొన్ని రోజులు కలసి జీవించారు. ఇంతలో శృతి తలిదండ్రులు హమీద్‌కు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు దాఖలు చేయడంతో కేరళ పోలీసులు వచ్చి శృతి, హమీద్‌లను అరెస్ట్‌చేసి తీసుకెళ్లారు. శృతిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిన పోలీసులు మే 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌కు ‘లవ్ జిహాద్’ కేసని వివరించారు. శృతిని తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా మేజిస్ట్రేట్ ఆదేశించారు. పోలీసులు అలాగే చేశారు. తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లాక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవద్దంటూ శృతికి నయాన, భయాన చెప్పి చూశారు. ఎంతకు వినిపించుకోకపోవడంతో ఆమెను ఎర్నాకులంలోని శివశక్తి యోగా విద్యా కేంద్రంలో చేర్చారు. అక్కడ నరకాన్ని చూశాను! ఇతర మతంలోకి మారిన హిందువులను లేదా ఇతర మతాల వారిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను హితబోధ ద్వారా మళ్లీ హిందూ మతంలోకి తీసుకరావడం ఈ యోగా విద్యా కేంద్రం ప్రధాన లక్ష్యం. కేరళలో ఇలాంటి కేంద్రాలు ఇంకా మూడు, నాలుగు పనిచేస్తున్నాయి. ఆ కేంద్రంలో తనతో అరవ చాకిరి చేయించారని, ఉదయం 4 గంటలకు ముఖాన నీళ్లు చల్లి బలవంతంగా లేపేవారని, వంట పాత్రలను కడగడంతోపాటు వంట చేయడం, యోగా కేంద్రాన్ని ఊడవడంతో సహా రాత్రి పది గంటల వరకు ఎడతెగని పని చేయించేవారని శృతి వివరించారు. తాను కేంద్రానికి వెళ్లినప్పుడు తనతోపాటు ఇతర మతాల యువకులను ప్రేమించిన 60 మంది యువతులు ఉన్నారని, వారందరితోని కూడా చాకిరి చేయించారని ఆమె చెప్పారు. హిత బోధనలు చేయడం కన్నా మతం మారినా, మతాంతర వివాహం చేసుకున్నా చంపేస్తామనే ఎక్కువ బెదిరించారని ఆమె తెలిపారు. జూన్ 26 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు అందులో నరకం అనుభవించానని చెప్పారు. కోర్టు జోక్యంతో న్యాయం హమీద్ తనను పెళ్లి చేసుకోవడం కోసం హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా న్యాయపోరాటం మొదలుపెట్టి విజయం సాధించారని శృతి తెలిపారు. కోర్టు జోక్యంతో తాము తిరిగి కలుసుకునే అవకాశం లభించడంతో అక్టోబర్ 9వ తేదీన ‘స్పెషల్ మారేజెస్ యాక్ట్’ కింద పెళ్లి చేసుకున్నాం. ఆ మరుసటి రోజే హైకోర్టుకు హాజరయ్యాం. సిరియాలో ఐఎస్ టెర్రరిస్టుల తరఫున యుద్ధం చేయడం కోసమే హమీద్ తనను పెళ్లి చేసుకున్నారని ప్రాసిక్యూటర్ వాదించారన్నారు. దాన్ని తాను తీవ్రంగా ఖంచించానని, కాలేజీ రోజుల నుంచి తమ మధ్యనున్న అనుబంధం గురించి వివరించానని చెప్పారు. చచ్చేవరకు హిందువుగానే జీవిస్తానని కూడా చెప్పానని ఆమె అన్నారు. తన ధైర్యానికి కోర్టు కూడా మెచ్చుకున్నదని తెలిపారు. తమ పెళ్లి చెల్లుతుందని కోర్టు ప్రకటించిందని చెప్పారు. అత్తా మామలను కూడా కోరుకుంటున్నాను మీడియాతోని శృతి మాట్లాడుతున్నంత సేపు మౌనంగా ఉన్న హమీద్, తాను అత్తామామలతో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. వారు మనసు మార్చుకునే వరకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని అన్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపండంటూ మీడియా విష్చేయగా, ఇంకా తమ కష్టాలు తీరలేదని, ఈ పాటికి తన ఉద్యోగం పోయే ఉంటుందని హమీద్ అన్నారు. తనకు ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ తనను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వచ్చిన కేరళ పోలీసు అధికారి తన బాస్‌తో చెప్పారని, అది బాస్ నమ్మి ఉంటే ఉద్యోగం పోవడం ఖాయమన్నారు. (ఇప్పటికీ మతతత్వ శక్తుల నుంచి శృతి, హమీద్ ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారి ఫొటోలను గుర్తించేలా ప్రచురించడం లేదు) -
లవ్ జిహాద్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య
సాక్షి, తిరువనంతపురం : లవ్ జిహాద్ వ్యవహారంపై కేరళ హైకోర్టు గురవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతాంతర వివాహాలన్నింటిని 'లవ్ జీహాద్' గా అభివర్ణించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అదే సమయంలో మత మార్పిడి కేంద్రాలను రాజ్యాంగ విరుద్ధమని బెంచ్ వ్యాఖ్యానించింది. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు 'ఘర్ వాపసీ' అంటూ మతం మార్పించారని ఎర్నాకులంకు ఓ ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించాడు. అయితే అన్ని వివాహాలనూ లవ్ జిహాద్ లేదా ఘర్ వాపసీగా భావించలేమని కోర్టు పిటిషనర్‌కు తెలిపింది. ప్రతి మతాంతర వివాహాన్నీ.. మత కోణంలో పరిశీలించడం సాధ్యపడదని జస్టిస్ వీ చిదంబరేష్, జస్టిస్ సతీష్ నినాన్ లతో కూడిన ధర్మాసనం వివరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. మరో రూపంలో కేసు దాఖలు చేయాలని సూచించింది. మరోపక్క తాను ఓ క్రిస్టియన్ యువకుడిని పెళ్లి చేసుకోగా, తన తల్లిదండ్రులు ఇంట్లో బంధించారని ఓ ఆయుర్వేద వైద్యురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుతోనే మత మార్పిడి కేంద్రాలు వెలుగు చూడగా.. తక్షణమే వాటిని గుర్తించి మూసివేయించాలని న్యాయస్థానం కేరళ పోలీస్ శాఖను ఆదేశించింది. కేరళ రాష్ట్రంలోనే ఈ తరహా మత మార్పిడులు, ఘర్ వాపసీలు అధికంగా జరుగుతుండటం గమనార్హం. మతాంతర వివాహాల అనంతరం వారిని ఉగ్రసంస్థల్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో జాతీయ దర్యాప్తు సంఘం(ఎన్ఐఏ) రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. దర్యాప్తులో గత ఏడాది వ్యవధిలో ఇటువంటి 90 వివాహాలు జరిగాయని వెల్లడికాగా, వీటిలో 23 ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే ఇస్లామిక్ రాడికల్ గ్రూప్‌కు నేతృత్వంలో జరగటం విశేషం. -
కేరళలో యూపీ సీఎం పాదయాత్ర
కీచెరి (కేరళ): ప్రమాదకర ‘లవ్ జీహాద్’ కట్టడిలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. కేరళలో అధికార సీపీఎం పాల్పడుతున్న హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన పాద యాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ ప్రారంభించిన జన రక్షా యాత్రలో ఆయన మాట్లాడుతూ.. బెదిరింపులకు దిగి అధికారం చేజిక్కించుకోవడం సీపీఎంకు అలవాటేనని ధ్వజమెత్తారు. సనాతన హిందూ సంప్రదాయంలో కేరళకు ప్రముఖ స్థానం ఉందని, విదేశీ కమ్యూనిజం భావాలు అక్కడకి ఎలా ప్రవేశించాయో అర్థం కావడంలేదన్నారు. ‘సీపీఎం ఓ వైపు సామ్యవాద సూత్రాలు వల్లిస్తూనే మరోవైపు జీహాద్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది. పవిత్ర భూమి అయిన కేరళలో ఇలాంటి పోకడలకు చోటులేదు. ఇక్కడ కేవలం జాతీయ భావాలకే ప్రచారం కల్పించాలి’ అని అన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ హిందూ మహిళ మతం మార్చుకుని ముస్లిం వ్యక్తిని పెళ్లాడిన ఉదంతాన్ని ఉదహరిస్తూ...‘లవ్ జీహాద్’ ప్రమాదకర ధోరణి అని అన్నారు. -
కశ్మీర్లో లవ్ వార్
లడఖ్‌లో లవ్ జీహాద్ మంటలు ప్రధాని అపాయింట్మెంట్ కోరిన ఎల్బీఏ ఉద్రిక్తంగా పరిస్థితులు శ్రీనగర్: కశ్మీర్లో మళ్లీ మరో వివాదం రాజుకుంది.. సరిహద్దు గొడవలు, ఉగ్రదాడులు.. రాళ్లు రువ్వుకోవడం వంటివి కాకపోయినా.. అంతే స్థాయిలో మంటలు రేగుతున్నాయి. ఈ వివాదాన్ని ప్రధాని నరేంద్రమోదీకి వివరించేందుకు ఒక వర్గంవారు అపాయింట్మెంట్ కోరడంతో వివాదం స్థాయి మరింత పెరిగింది. కశ్మీర్లో రాజుకున్న వివాదంపై పూర్తి వివరాలు ఇవే. కొంత కాలంగా శ్రీనగర్‌లోని లద్దాక్ బుద్ధిస్ట్ అసోసియేషన్(ఎల్బీఏ) స్థానిక ముస్లింల మధ్య వివాదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. లవ్ జీహాద్ ఇందుకు కారణం అని ఎల్బీఏ చెబుతోంది. లవ్ జీహాద్‌పై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సదరు సంస్థ పీడీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. గత ఏడాది బౌద్ధమతానికి 30 ఏళ్ల అమ్మాయిని మత మార్పడి చేసి ఒక ముస్లిం అబ్బాయి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ ఇక్కడ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ వివాహం చెల్లదని బౌద్దులు వాదిస్తున్నారు. పెళ్లి చేసుకున్న వారిని వేధించడం సరికాదని ఈ ఏడాది రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన బౌద్దులు.. ఈ పెళ్లిని రద్దు చేయడం కోసం చివరి రక్తపు బొట్టువరకూ పోరాడతాం అని ప్రకటించారు. లడఖ్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి వివరిస్తామని అందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎల్బీఏ చెబుతోంది. లడఖ్‌లో బౌద్ధుల జనాభా 51 శాతం ఉంటుంది. చదువుకున్న, అందంగా ఉన్న బౌద్ధమతానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని బౌద్ధ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడేళ్లలో ఇలా 45 మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చారని లడఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ చెబుతోంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి చేసుకున్న వారిని రహస్య ప్రదేశంలో సురక్షితంగా ఉంచినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో 1989 నుంచి ఇరువర్గాల మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతంలో దాదాపు దశాబ్దకాలం పాటు ముస్లింల వస్తువులు కొనకుండా బౌద్దులు బహిష్కరించారు. ముస్లింలు లవ్‌జీహాద్‌ను మానకపోతే భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతాయని బౌద్ధులు చెబుతున్నారు. -
‘లవ్ జిహాద్’ కేసు ఎన్ఐఏకు..
న్యూఢిల్లీ: ఓ హిందూ యువతి ఇస్లాం మతాన్ని స్వీకరించి, ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న కేసును దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు బృందాన్ని (ఎన్ఐఏ) సుప్రీంకోర్టు ఆదేశిం చింది. కేరళలో జరిగిన ఈ వివాహం యాదృ చ్ఛికంగా జరిగింది కాదని, క్రమక్రమంగా అక్కడ ఈ పద్ధతి రూపుదిద్దుకుంటోందని కోర్టుకు ఎన్ఐఏ వివరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టా లని ఆదేశిస్తూ న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ‘బ్లూ వేల్’ గేమ్ తరహాలోనే.. ఎవరినైనా ఏదైనా పని చేయడానికి పురిగొల్పవచ్చని లవ్ జిహాద్‌ను ఉద్దేశిస్తూ ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని, దర్యాప్తు తుది నివేదికను కోర్టు ముందుంచాలని ఎన్ఐఏకు స్పష్టం చేసింది. కేరళ పోలీసులు, స్థానిక మహిళల నుంచి ఎన్ఐఏ తీసుకున్న సమాచారంతో కూడిన నివేదికను పరిగణన లోకి తీసుకున్న తర్వాతే కేసుపై తాము ఓ అభిప్రాయానికి వస్తామంది. సంబంధిత యువతి భర్త, పిటిషనర్ షాఫిన్ జహాన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. సదరు యువతిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాలని, ఆమెతో మాట్లాడాలని కోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్ఐఏ నివేదిక అందిన తర్వాతనే ఆమెతో మాట్లాడతామని చెప్పింది. కేరళకు చెందిన ఓ హిందూ యువతి ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత అతడిని 2016లో పెళ్లాడింది. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. వారిద్దరి పెళ్లి ‘లవ్ జిహాద్’కు ఉదాహరణ వంటిదని పేర్కొంటూ వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. -
సుప్రీం ముంగిట తొలి లవ్ జిహాది కేసు
న్యూఢిల్లీ : దేశంలో తొలి లవ్ జిహాది కేసు సర్వోన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. కేరళకు చెందిన ఓ హిందూ మహిళ ఇస్లాంను స్వీకరించి ముస్లింను వివాహం చేసుకోవడం వివాదాస్పదమైంది. దీన్ని లవ్ జిహాదిగా పరిగణించి వీరి వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహిళ భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 24 ఏళ్ల తన భార్యకు ఏ మతాన్ని స్వీకరించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకునే హక్కు ఉందని భర్త కోర్టుకు వివరించారు. లవ్ జిహాది కుట్రలో భాగంగా ఇది జరిగిందని పేర్కొంటూ వివాహాన్ని రద్దు చేస్తూ కేరళ హైకోర్టు ఉత్తర్వులను పిటిషనర్ తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, ఇందిరా జైసింగ్ తప్పుపట్టారు. వీరి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు సదరు మహిళను తన భర్తతో కలిసేందుకు అనుమతించకపోవడం దురదృష్టకరమని అన్నారు. బాధిత మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మనోభావాలు తెలుసుకునేందుకు కోర్టుకు పిలిపించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లకు విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళ ఇంటిని పోలీసులు చుట్టుముట్టి ఆమెను ఎవరూ కలిసేందుకు అనుమతించడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.24 గంటల్లోగా ఆమెను కోర్టుఎదుట హాజరు పరిచేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
మతమార్పిడులపై హైకోర్టు సీరియస్
బలవంతపు మత మార్పిడులు, లవ్ జీహాద్ కేసుల వ్యవహారం జాతి ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కేరళ హైకోర్టు మండిపడింది. దీనిపై వెంటనే సమగ్రంగా విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. తన ముందుకు వచ్చిన రెండు కేసుల విషయంల కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనల్లో డీజీపీ స్వయంగా విచారణను పర్యవేక్షించి, దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలిపింది. 24 ఏళ్ల వయసున్న హిందూ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి, ఆమెకు ఓ ముస్లిం వ్యక్తితో 2016 డిసెంబర్ నెలలో చేసిన పెళ్లి చెల్లుబాటు కాదని చెబుతూ, ఇలాంటి విషయాలపై తక్షణం దృష్టి పెట్టాలని డీజీపీని ఆదేశించింది. మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న సంస్థల పాత్రపై విచారణ జరపాలని, మొత్తం రాష్ట్రమంతా డీజీపీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఆయన వీటిని పర్యవేక్షించాలని జస్టిస్ కె. సురేంద్రమోహన, జస్టిస్ అబ్రహం మాథ్యూలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. లవ్ జీహాద్, మతమార్పిడుల కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలే ఉండటం దారుణమని వ్యాఖ్యానించింది. ముందుగా హిందూ యువతులను ప్రేమలోకి దించి తర్వాత వారిని బలవంతంగా మతమార్పిడి ద్వారా ఇస్లాం మతంలోకి మార్చి అప్పుడు వారిని పెళ్లి చేసుకోవడాన్నే లవ్ జీహాద్ అంటున్నారు. కేరళలో ఇందుకోసం ఏకంగా కొన్ని సంస్థలే ఏర్పాటయ్యాయి. తన కూతురిని కొన్ని సంస్థలు బలవంతంగా మతం మార్పించి, ఒక ముస్లిం వ్యక్తితో ఆమె పెళ్లి చేస్తున్నాయని ఓ యువతి తండ్రి 2016 ఆగస్టులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను బలవంతంగా సిరియా పంపి, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలలో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను మేజర్‌నని, తన ఇష్టం మేరకే మతం మారి పెళ్లి చేసుకున్నానని ఆమె కోర్టులో చెప్పినా, కోర్టు మాత్రం ఆ వివాహాన్ని చట్టపరంగా రద్దుచేసి, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించింది. హోమియోపతి వైద్యవిద్య చదువుతున్న 24 ఏళ్ల యువతి అన్నీ వదిలిపెట్టి ఉన్నట్టుండి మతం మారి వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని, దాని వెనక కొంతమంది బలవంతం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
అమ్మాయిని కాపాడి.. అమ్మేశాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సింధు ప్రావిన్స్‌లో ఓ పోలీస్ అధికారి హిందూ మతానికి చెందిన అమ్మాయిని 50 వేల రూపాయలకు అమ్మేశాడు. తర్వాత మూడు రోజులకు ఆమెతో బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేయించి, ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. గోట్కి జిల్లా మీర్పూర్ మతెలోకు చెందిన అనిలా బాగ్రి అనే ఈ అమ్మాయిని కొన్నిరోజుల క్రితం కొందరు కిడ్నాప్ చేశారు. కాగా పోలీసులు కిడ్నాపర్ల బారి నుంచి ఆమెను రక్షించినా కొత్త కష్టాలు మొదలయ్యాయి. సాజద్ ఖాజీ అనే పోలీస్ అధికారి ఆమెను ఇంటికి పంపలేదు. ఈ విషయం తెలుసుకున్న అనిలా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమార్తెను అప్పగించాల్సిందిగా కోరారు. అయితే 50 వేల రూపాయలు ఇస్తేనే పంపిస్తానని ఖాజీ డిమాండ్ చేశాడు. తర్వాత ఖాజీ తన స్నేహితుడు మసూరికి ఆ అమ్మాయిని అమ్మేశాడు. ఈ విషయం మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు ఖాజీని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. పాకిస్థాన్‌లో హిందూ మతానికి చెందిన అమ్మాయిని కిడ్నాప్ చేయడం, ఆమెపై లైంగికదాడి చేయడం లేదా బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసుకోవడం వంటి ఘటనలు జరగడం సాధారణమని, పాకిస్థాన్‌లో హిందువులను లేకుండా చేసి పూర్తిగా ఇస్లాం దేశంగా మార్చాలని చూస్తున్నారని రాజ్‌కుమార్ అనే హిందూ కార్యకర్త చెప్పాడు. -
'లవ్ జిహాద్'కు పోటీగా కోడల్ని తెచ్చుకోండి
ఆగ్రా: 'లవ్ జిహాద్'కు పోటీగా బజరంగ్ దళ్ బహు లావో, బేటీ బచావో(కోడల్ని తెచ్చుకోండి, ఆడపిల్లను కాపాడండి) ప్రచారం ప్రారంభించింది. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆగ్రాలోని పాఠశాలల వెలుపలి బజరంగ్ దళ్ కార్యకర్తలు పంచిపెట్టారు. 'లవ్ జిహాద్' పట్ల అప్రమత్తంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. తర్వాత దశలో మహిళా కాలేజీలకు వెళ్లి ప్రచారం చేస్తామని బజరంగ్ దళ్ యూపీ కన్వీనర్ అవనీంద్ర సింగ్ తెలిపారు. ఇతర మతాలను యువతులను కోడళ్లుగా తెచ్చుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. దీని ద్వారా తమ మతంలోని గొప్పతనాన్ని తెలుసుకునేందుకు హిందూ కుటుంబాలు అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. 'లవ్ జిహాద్'ను అడ్డుకునేందుకే 'బహు లావో, బేటీ బచావో' ప్రచారం చేస్తున్నామని తెలిపారు. -
'లవ్ జీహాద్‌తో ఉచ్చులో పడేస్తున్నారు'
బదాయూ(యూపీ): విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ 'లవ్ జీహాద్' ఇతర మత అంశాలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో వివాదం రాజేశారు. 'లవ్ జీహాద్‌తో వారు మన కూతుళ్లను ఉచ్చులో పడేస్తున్నారు. 35-40 మంది పిల్లలను కనే వారు.. లవ్ జీహాద్‌ను విస్తరిస్తున్నారు. హిందుస్థాన్ ఉదారుల్ ఇస్లాంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నలుగురు పిల్లల విషయంపై వ్యాఖ్యలతో వివాదం రేపానని మీడియా అంది. నేను హిందువులకు నలుగురు పిల్లలు కావాలన్నేనే కానీ 40 మంది కావాలనలేదు. హిందువులకు నలుగురు పిల్లలు దేశానికి అవసరం' అని ఆమె అన్నారు. ప్రాచీ ఆదివారమిక్కడ వీహెచ్‌పీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. నలుగురికంటే ఎక్కువ మంది పిల్లలున్న 20 మంది హిందువులను ఆమె సత్కరించారు. కుటుంబ నియంత్రణను హిందువులకే ఎందుకు అమలు చేయాలని ప్రాచీ ప్రశ్నించారు. దేశంలో 1,400 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ హిందువులేనని, ఢిల్లీ జమా మసీదు అధిపతి ఇమామం బుఖారీ, పాక్ మాజీ అధ్యక్ష, ప్రధానులు ముషార్రఫ్, గిలానీలు తిరిగి హిందూ మతంలోకి రావాల అన్నారు. కాగా, ప్రాచీ వ్యాఖ్యలు సరికాదని, వాటితో తమకు సంబంధం లేదని బీజేపీ యూపీ కమిటీ చీఫ్ లక్ష్మీకాంత్ వాజ్‌పేయి అన్నారు. -
నేను ప్రేమను మాత్రమే నమ్ముతాను: కరీనా కపూర్
న్యూఢిల్లీ: 'లవ్ జిహాద్' భావనని గానీ, అటువంటి సిద్ధాంతాలను గానీ తాను నమ్మనని బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ స్పష్టం చేశారు. తాను ప్రేమను మాత్రమే నమ్ముతానని చెప్పారు. ఇద్దరు మనుషుల మధ్య కులం, మతం లేదా మతవిశ్వాసాలతో ప్రమేయం లేకుండానే ప్రేమ ఏర్పడుతుందన్నారు. అందుకే తనకు లవ్ జిహాద్ వంటి భావనలపై నమ్మకం లేదని చెప్పారు.హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని, వారిని ముస్లిం మతంలోకి మార్చేందుకు 'లవ్ జిహాద్' నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో... నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడిన కరీనా ఈ మేరకు తన అభిప్రాయం తెలిపారు. ఢిల్లీలో ఛాందినీ చౌక్ లో తన కొత్త చిత్రం 'భజరంగి భాయ్‌జాన్' సినిమా షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైఫ్ విశాల దృక్పదం గత వ్యక్తి అని తెలిపారు. లవ్ జిహాద్‌పై తను ఒక బహిరంగ లేఖ ద్వారా అభిప్రాయం కూడా తెలియజేశారని చెప్పారు. హిందువునైన తను, సైఫ్ రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ** -
ప్రధాని.. ఆ రూమర్లను ఆపాలి!
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు తెరలేపిన 'లవ్ జీహాద్' రూమర్లను ఆపేందుకు ప్రధాని నరేంద్రమోడీ నడుంబిగించాలని జమైత్-ఉల్-ఐ-హింద్ జాతీయ కార్యదర్శి మౌలానా మహ్మద్ మదానీ స్పష్టం చేశారు. కొంతమంది 'లవ్ జీహాద్'పేరుతో ఓట్లను కొల్లగొట్టేందుకు చేసిన యత్నానికి వెంటనే చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. దీనికి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జాతీయ వార్తా సంస్థతో మదానీ మాట్లాడారు. 'లవ్ జీహాద్' లో ఎటువంటి వివాదం లేదు. కానీ వాటిని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ రూమర్లను ఇకనైనా దయచేసి ఆపండి' అంటూ మోడీకి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అదే నిజమైతే ఆ రకమైన చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని మదానీ తెలిపారు. -
మేనక నియోజకవర్గంలో 'లవ్ జిహాద్'
న్యూఢిల్లీ: కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నియోజకవర్గంలో 'లవ్ జిహాద్' కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిత్ లోక్‌సభ నియోజకవర్గానికి మేనక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో 7-8 లవ్ జిహాద్ కేసులు తన దృష్టికి మేనక చెప్పారు. అయితే ఇలాంటి కేసులు తన మంత్రిత్వ శాఖకు రాలేదని తెలిపారు. హిందూ యువతీయువకులను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతం మార్చడాన్ని లవ్ జిహాద్ అంటారు. ఇలాంటి కేసులు ఎక్కువ ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూస్తున్నాయి. -
లవ్ జీహాదా.. అంటే ఏమిటి?: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: ‘లవ్ జీహాదా.. అంటే ఏమిటి?’ కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్‌సింగ్ అడిగిన ప్రశ్న ఇదీ. ఒకవైపు బీజేపీ నేతలు లవ్‌జీహాద్ పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతులను పెళ్లి చేసుకుని వారి మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటున్న సమయంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లవ్‌జీహాద్ అంశంపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరుల ప్రశ్నలకు‘లవ్ జీహాదా అంటే ఏమిటి?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. కాగా ఆయుధాలు వీడితే నక్సల్స్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కాగా, ప్రధాని మోడీతో తనకు విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. -
'లవ్ జిహాద్' అంటే ఏమిటి?
న్యూఢిల్లీ:దేశ వ్యాప్తంగా 'లవ్ జిహాద్'పై దుమారం రేగుతున్న సమయంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందువుల సంస్కృతిని దెబ్బతీసేందుకు 'లవ్ జిహాద్'పేరిట కుట్ర జరుగుతుందని బీజేపీ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ అంశానికి సంబంధించి బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు ఏమీ తెలియదట. అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి? ఆ వాక్యానికి ఉన్న అర్ధం ఏమిటని? ప్రశ్నించడం ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీ యోగీ ఆదిత్యానాథ్ 'లవ్ జిహాద్'అంశాన్ని మరోసారి ప్రస్తావించడంతో రాజ్ నాథ్ దానిపై వివరణ అడిగారు.అందులో ఉన్న నిగూఢమైన అర్ధాన్నితెలపాలని బీజేపీ శ్రేణులను కోరారు. అంతకుముందు 'లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండాలని హిందూ యువతకు బీజేపీ సూచించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. ‘మెజారిటీ వర్గానికి చెందిన యువతుల మతాలను మార్చేందుకు మైనారిటీ యువకులు లైసెన్స్ పొందారా?’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ప్రశ్నించారు. మైనారిటీ యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. -
నేతల 'ప్రేమ యుద్ధం'
పొలిటికల్ లీడర్స్ ప్రేమ యుద్ధం చేస్తున్నారు. పరస్పరం ప్రేమ ఎక్కువైపోయి ప్రేమ యుద్ధం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేతాశ్రీ అందరూ విసురుకుంటున్నది ప్రేమాస్త్రాలు కాదు 'లవ్ జిహాద్'పై ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రేమ యుద్ధం ఇప్పుడు దేశమంతటా పాకింది. అన్ని పార్టీల నాయకులు 'లవ్ వార్' లోకి దూకారు. సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వమే 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తోందని కమలనాథులు కయ్యిమనడంతో జగడం మొదలయింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని యోగి ఆదిత్యనాథ్ లాంటి కాషాయ నేతలు ఆరోపించడంతో వివాదం రేగింది. ఇక అక్కడి నుంచి మీరంటే మీరంటూ ఏలుబడిదారులు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వివాదస్పద నాయకుడు అజంఖాన్ ఈ గోదాలోకి దూకారు. లవ్ జిహాద్ కు అర్థం చెప్పాలంటే కాషాయ నేతలను ప్రశ్నించారు. బీజేపీ పార్టీలో ఉన్న చాలా మంది మైనారిటీ నాయకులు హిందూ మహిళలను పెళ్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అగ్రనేతలు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షాహనాజ్ హు్స్సేన్ సతీమణులు హిందూ మతానికి చెందిన వారని తెలిపారు. లవ్ జిహాద్ అర్థం ఏమిటో నఖ్వీ, హుస్సేన్ చెబితే బాగుంటుందన్నారు. లవ్, జిహాద్- ఈ రెండు పదాలు పవిత్రమైనవని చెప్పారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన వారు పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తే తప్పేంలేదని ఉద్ఘాటించారు. అయితే షాహనాజ్ హుస్సేన్ భార్య రేణు, నఖ్వీ సతీమణి సీమలకు రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. వీరిద్దరూ గృహిణులు. ప్రేమ యుద్ధం ఇప్పుడూ పొలిటికల్ ఫ్యామిలీలకు పాకింది. ఇంకా ఎంతదాకా పోతుందో? -
'లవ్ జిహాద్' పేరిట అంతర్జాతీయ కుట్ర: శివసేన
ముంబై: హిందువుల సంస్కృతి దెబ్బతీసేందుకు 'లవ్ జిహాద్' పేరిట అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపించింది. 'లవ్ జిహాద్' అడ్డుకోవడానికి పోరాటం సాగించాలని పిలుపునిచ్చిన బీజేపీ నేత స్వామి ఆదిత్యనాథ్ కు శివసేన మద్దతు తెలిపింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. హిందూ యువతులు అప్రమత్తంగా ఉండాలని తమ అధికార పత్రిక 'సామ్నా' ఎడిటోరియల్ లో శివసేన పేర్కొంది. 'లవ్ జిహాద్' పిలుపునిచ్చిన వారికి తగిన గుణపాఠం నేర్పాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జిహాద్ (పవిత్రయుద్ధం) పేరిట ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారని ఎడిటోరియల్ తెలిపారు. దేశ సమైక్యత దెబ్బతీసేందుకు లష్కరే ఏ తోయిబా, సిమీ, అల్ ఖైదా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సామ్నా హెచ్చరించింది. ప్రేమ పేరుతో హిందూ యువతను ముఖ్యంగా అమ్మాయిలనూ టార్గెట్ చేసుకుని మత మార్పిడి చేయాలనే లక్ష్యంతో 'లవ్ జిహాద్' పేరుతో ఓ పథకాన్ని ఉగ్రవాదసంస్థలు రచిస్తున్నాయి. -
‘ప్రేమ జీహాద్’పై స్పందించండి
లక్నో: ప్రేమ జీహాద్ అనే పదం ఉపయోగించకుండా నిరోధించాలని, బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్‌ను కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా గురువారం ఆదేశించింది. ఇందుకు 10 రోజుల సమయం ఇచ్చింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీన్నే 'లవ్ జిహాద్'గా పేర్కొంటోంది. అయితే బీజేపీ ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. -
మరో లవ్ జీహాద్ కేసు!!
లవ్ జీహాద్.. ఇప్పుడీ పదం చాలామంది నోళ్లలో నానుతోంది. తారా సచ్దేవ్ సంఘటన తర్వాత దీని గురించి అందరికీ తెలిసింది. ఈసారి జార్ఖండ్ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లాలో ఈ తరహా సంఘటన జరిగింది. తానెవరన్న విషయం చెప్పకుండా ఓ యువకుడు వేరే వర్గానికి చెందిన యువతిని మోసగించాడు. ఎనిమిది నెలల గర్భవతి అయిన ఆమెతో గతవారం ఆ కుర్రాడు పారిపోయాడు. దాంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు న్యాయం చేయాలని, ఇది మరో లవ్ జీహాద్ కేసేనని బీజేపీ, వీహెచ్‌పీ కార్యకర్తలు మండిపడ్డారు. బాలిక తండ్రి తమ కుమార్తె కిడ్నాప్ అయినట్లు ఫిర్యాదు చేశారని, దాంతో ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపామని ఛాత్రా ఎస్పీ ప్రశాంతకుమార్ కర్ణ్ తెలిపారు. అతడు తనపేరు సోనుకుమార్ అని అతడు చెప్పుకొన్నాడని, నుదుటన బొట్టు కూడా పెట్టుకునేవాడని, ఓ ప్రైవేటు బస్సులో కండక్టర్‌గా పనిచేస్తూ ప్రతిరోజూ ఆమె కాలేజీకి వెళ్లేటప్పుడు వెంటపడేవాడని వీహెచ్‌పీ నాయకుడు విజయ్ పాండే తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. -
'లవ్ జీహాద్' పై వెనక్కి తగ్గిన బీజేపీ
మధుర: ‘లవ్ జీహాద్’పై నిప్పులు కక్కిన ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ వెనక్కి తగ్గింది. ఆదివారమిక్కడ ముగిసిన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశంలో చేసిన రాజకీయ తీర్మానంలో దీన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ముస్లిం యువకులు ప్రేమ పేరుతో హిందూ యువతులను తమ మతంలోకి మార్చేందుకు కుట్రపన్నుతున్నారని, ఈ లవ్ జీహాద్‌పై అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ ఆదివారం పిలుపునివ్వడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండించారు. బీజేపీ ఎంపీ హేమమాలిని నటించిన సినిమాల్లో ముస్లిం-హిందూ సంబంధాలే చూపారన్నారు. దీనిని ఇక్కడితో ముగింపుపలకాలని భావించిన బీజేపీ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. యూపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దృష్టి పెట్టింది. అఖిలేష్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మహిళలు, బాలికలపై జరుగుతున్న అరాచాకాలు 50 శాతం వరకూ పెరిగినట్లు బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. గత 30 నెలల్లో 1,981 వరకూ అత్యాచార కేసులు నమోదైనట్లు స్పష్టం చేశాయి. అంతకుముందు 'లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండాలని హిందూ యువతకు బీజేపీ సూచించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. ‘మెజారిటీ వర్గానికి చెందిన యువతుల మతాలను మార్చేందుకు మైనారిటీ యువకులు లైసెన్స్ పొందారా?’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ప్రశ్నించారు. మైనారిటీ యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వమే లవ్‌జీహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో లక్ష్మీకాంత్ బాజ్‌పేయి శనివారం ఈ వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ విధానాల వల్లనే రాష్ట్రంలో మతకలహాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు. -
'లవ్ జీహాద్ పై ఆమెకు అభ్యంతరం లేదు'
లక్నో: ‘లవ్ జీహాద్’పై బీజేపీ, సమాజ్‌వాది పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హిందూ యువతను ఇస్లాం వైపు ఆకర్షించే 'లవ్ జిహాద్'కు యూపీలో అధికార సమాజ్‌వాది పార్టీ అండదండలు అందిస్తోందని బీజేపీ ఆరోపించింది. తమ ప్రభుత్వంపై బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం అఖిలేష్ యాదవ్ తిప్పికొట్టారు. ప్రేమను ప్రోత్సహించడం వెనుక తమ ప్రమేయం లేదని, ఆ మాటకొస్తే బీజేపీ నేతలు కూడా లవ్ జిహాద్ ను సమర్థించారంటూ ఎదురుదాడికి దిగారు. లవ్ జీహాద్ పట్ల సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఎటువంటి అభ్యంతరం చేయలేదన్న విషయాన్ని అఖిలేష్ గుర్తు చేశారు. 1970 ప్రాంతంలో వచ్చిన 'ధర్మాత్మ' సినిమాలో హిందువు యువకుడిని ప్రేమించిన పాత్రలో హేమమాలిని నటించారని తెలిపారు. 'లవ్ జిహాద్'కు అనుకూలంగా ఉన్న పాటలో కూడా ఆమె నర్తించారని చెప్పి బీజేపీని ఇరుకున పెట్టారు. హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని బీజేపీ ఆరోపించింది. -
ప్రేమను ఏ సీఎం నిషేధించాడు?
మధుర:‘లవ్ జీహాద్’ను సమాజ్ వాదీ పార్టీ ప్రోత్సహిస్తుందన్నబీజేపీ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. లక్నోలోని మీడియా సమావేశంలో మాట్లాడిన అఖిలేష్.. బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 'అసలు యువకులు ప్రేమలో పడకుండా ఉండటాన్ని ఏ ముఖ్యమంత్రి నిషేధించాడో నాకు చెప్పండి. ప్రేమను మీరు నిషేధించాలనుకుంటున్నారా?' అని అఖిలేష్ ప్రశ్నించారు. అసలు ప్రేమ వ్యవహారాలను నిషేధించడం సాధ్యమయ్యే అంశమేనా?అని నిలదీశారు. శనివారం నాటి ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన సమక్షంలో సమాద్ వాదీ పార్టీలో చేరారు. ‘లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండాలని హిందూ యువతకు బీజేపీ సూచించింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. ‘మెజారిటీ వర్గానికి చెందిన యువతుల మతాలను మార్చేందుకు మైనారిటీ యువకులు లైసెన్స్ పొందారా?’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ప్రశ్నించారు. మైనారిటీ యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వమే లవ్‌జీహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో లక్ష్మీకాంత్ బాజ్‌పేయి శనివారం ఈ వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ విధానాల వల్లనే రాష్ట్రంలో మతకలహాలు చెలరేగుతున్నాయని ఆరోపించారు.