లవ్‌ జిహాద్‌ : విస్తరిస్తున్న కొత్త వివాదం | New Debate On Love Jihad In India | Sakshi
Sakshi News home page

లవ్‌ జిహాద్‌ : విస్తరిస్తున్న కొత్త వివాదం

Published Tue, Nov 3 2020 12:45 PM | Last Updated on Tue, Nov 3 2020 4:19 PM

New Debate On Love Jihad In India - Sakshi

దేశంలో గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కొత్త చర్చకు దారితీసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతమంది భిన్న మతాల యువతీ యువకులు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. మరోవైపు దేశంలో వేగంగా విస్తరిస్తున్న లవ్‌ జిహాద్‌పై బీజేపీ పాలిత ప్రభుత్వాలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. మతాంతర వివాహాలను విరుద్ధంగా చట్టల రూపకల్పనకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేవలం వివాహం కోసమే మతాల మారటం సమంజసం కాదని అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పును ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

సాక్షి, న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం కేరళ వేదికగా వెలుగుచూసిన లవ్‌ జిహాద్‌ నేడు దేశంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 25 ఏళ్ల ఓ హిందూ యువతి ముస్లింగా మతమార్పిడి చేసుకుని హిందూ యువకుడిని వివాహం చేసుకోగా.. అది చెల్లదంటూ కేరళ హైకోర్టు 2018లో వివాదాస్పద తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ జంటకు ఉపశమనం అభించింది. కేరళ హైకోర్టును ఇచ్చిన తీర్పును కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.. హదియా తన భర్తతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చని సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చజరిగింది. అప్పటి నుంచి దేశంలో  ఏదో ఓ మూలన లవ్‌ జిహాద్‌ నినాదం వినపడుడూనే ఉంది.

తన ఇష్టపూర్తిగానే మత మార్పిడి చేసుకుని ఇతర మతస్థుడిని వివాహం చేసుకున్నా అంటూ యువతి చెబుతున్నా.. తమ కుమార్తెను బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఛండీగఢ్‌ సమీపంలోని ఫరీదాబాద్‌లో ముస్లిం యువకుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన నికితా తోమర్‌ ఉదంతం మరోసారి లవ్‌ జిహాద్‌పై చర్చకు దారితీసింది. తమ కుమార్తె మతమార్పిడికి ఒప్పుకోకపోవడంతోనే ప్రేమోన్మాది తన బిడ్డను బలితీసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. (ఉరి తీయండి లేదా ఎన్‌కౌంటర్ చేయండి)

హిందు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనే దుర్భుద్ది
మరోవైపు హిందు యువతులకు వలవేసి ముస్లిం యువకులు మోసపూరిత వివాహాలు చేసుకుంటున్నారని పలువురు హిందు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందు యువతులను మోసం చేసి వివాహం చేసుకుంటున్న ముస్లిం యువకులపై కఠిన చర్యలకు తీసుకోవాలని గత అక్టోబర్‌లో బీజేపీపాలిత అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగినే నేపథ్యంలో చాలామంది అమాయక బాలికలు మోసపోతున్నారని, హిందు అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్భుద్దితో కొంతమంది ముస్లిం యువకులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి హేమంత్‌ బిశ్వా ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారని, ఇలా ఎంతో మంది యువతులు ముస్లింల చేతిలో మోసపోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా మోసపూరితమైన మతాంతర వివాహాలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు.

లవ్‌ జిహాద్‌కు చెక్‌ : యోగీ
ఇకపై లవ్‌ జిహాద్‌ పేరుతో వివాహం చేసుకుంటే ఏమాత్రం ఉపక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సైతం మతాంతర వివాహాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లవ్‌ జిహార్‌పై కఠినమైన చట్టం తీసుకురావలని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్‌నామ్‌ సత్య యాత్ర ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. లవ్‌ జిహాద్‌కు చెక్‌ పెట్టడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు
ఇలాంటి తరుణంలో వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునివ్వడం సంచలనంగా మారింది. ఇతర మతాలపై ఎలాంటి అవగహాన లేకుండా కేవలం వివాహం కోసమే మతమార్పిడి చేసుకోవడం సమంజసం కాదని న్యాయస్థానం స్పష్టం చెప్పింది. ఈ తీర్పు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీసింది. లవ్‌ జిహాద్‌పై దేశంలో ఇప్పటి వరకు  ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం  ఆలోచన చేస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఈ తరుణంలోనే అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. యువతీ, యువకులు అభిప్రాయలకు విరుద్ధంగా తీర్పు ఉందని పలువురు ప్రజాస్వామికవాదలు పెదవి విరుస్తున్నారు. మనుషులు ఇష్టాయిష్టాలపై చట్టం చేసే హక్కు ఎవరికీ లేదని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం.. ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అయితే మత మార్పడి అనేది ఇతరుల అభిప్రాయాలను అవమానపరిచే విధంగా ఉండకూడదు అనేది రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఇక ఈ లవ్‌ జిహాద్‌ అనే వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement