మథురలోని ఆలయం– మసీదు వివాదంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు.
ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment