Justice sanjaykumar
-
సంభాల్ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి
న్యూఢిల్లీ: సంభాల్‌లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్ఐలతోపాటు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్‌కు, హరి శంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలంది. -
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. -
చంద్రబాబు పేరును తొలగించండి...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, ఎన్కౌంటర్ పేరుతో మట్టుపెట్టేందుకు కుట్ర జరుగుతోందని, అందువల్ల అతన్ని కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొల్లం గంగిరెడ్డి సతీమణి కొల్లం మాళవిక దాఖలు చేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు శుక్రవారం రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే దీనికి ముందు ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదుల జాబితాలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును తొలగించాలని మాళవికను హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రీ నెంబర్ కేటాయించిన తరువాత సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ చేపడతామంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జైల్లో ఉన్న తన భర్తకు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించడంతో పాటు చంద్రబాబునాయుడి అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ మాళవిక ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేయడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక పూర్తిస్థాయి నెంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ రిజిస్ట్రీని సంప్రదించి, ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ముందు ఉంచాలని, అభ్యంతరాలకు అక్కడే సమాధానం చెబుతామని తెలిపారు. దీంతో రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ముందుంచింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ అటు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను విన్నారు. ఈ అభ్యంతరాలు సబబేనన్న న్యాయమూర్తి, ప్రతివాదుల జాబితా నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. పేరు తొలగించిన తరువాతనే ఈ వ్యాజ్యానికి పూర్తిస్థాయి నెంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతనే సోమవారం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తానని తేల్చి చెప్పారు.