చంద్రబాబు పేరును తొలగించండి...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని, ఎన్‌కౌంటర్ పేరుతో మట్టుపెట్టేందుకు కుట్ర జరుగుతోందని, అందువల్ల అతన్ని కడప జైలు నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ జైలుకైనా తరలించేలా ఏపీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొల్లం గంగిరెడ్డి సతీమణి కొల్లం మాళవిక దాఖలు చేసిన పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు శుక్రవారం రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే దీనికి ముందు ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదుల జాబితాలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును తొలగించాలని మాళవికను హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రీ నెంబర్ కేటాయించిన తరువాత సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ చేపడతామంది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జైల్లో ఉన్న తన భర్తకు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించడంతో పాటు చంద్రబాబునాయుడి అధికార దుర్వినియోగాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ మాళవిక ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేయడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంతేకాక పూర్తిస్థాయి నెంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ రిజిస్ట్రీని సంప్రదించి, ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ముందు ఉంచాలని, అభ్యంతరాలకు అక్కడే సమాధానం చెబుతామని తెలిపారు. దీంతో రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ముందుంచింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ అటు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను విన్నారు. ఈ అభ్యంతరాలు సబబేనన్న న్యాయమూర్తి, ప్రతివాదుల జాబితా నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. పేరు తొలగించిన తరువాతనే ఈ వ్యాజ్యానికి పూర్తిస్థాయి నెంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతనే సోమవారం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తానని తేల్చి చెప్పారు.