న్యూఢిల్లీ: భర్త నుంచి విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్న మహిళ అతడి నుంచి భరణం పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భర్తతో కలిసి ఉండలేకపోవడానికి తగిన కారణం ఉంటే భరణం కోరవచ్చని వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన యువతి, యువకుడికి 2014 మే 1వ తేదీన పెళ్లి జరిగిది. 2015 ఆగస్టులో వారు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. చివరకు ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టుకు చేరింది.
వారిద్దరూ కలిసి ఉండొచ్చని, వివాహ సంబంధం ఎప్పటిలాగే కొనసాగించవచ్చని సూచిస్తూ ఫ్యామిలీ కోర్టు 2022 మార్చి 23న డిక్రీ జారీ చేసింది. అయితే, భార్య ఈ డిక్రీకి కట్టుబడి ఉండలేదు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమెకు నెలకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ దేశాలను భర్త జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు.
భార్య తన వద్దకు తిరిగి రాలేదు కాబట్టి భరణం చెల్లించే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. అతడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోయినా భార్య భరణం పొందవచ్చని తేల్చిచెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందడం భార్య హక్కు అని గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment