న్యూఢిల్లీ: వివాహ బంధం పునరుద్ధరించలేనంతగా దెబ్బ తింటే దంపతులు పరస్పర అంగీకారంతో తక్షణం విడాకులు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఇలాంటి సందర్భాల్లో హిందూ వివాహ చట్టం (1955)లో విధించిన ఆరు నెలల తప్పనిసరి వెయిటింగ్ పీరియడ్ వర్తించదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 కింద ఉన్న అసాధారణ అధికారాలతో వెంటనే విడాకులు మంజూరు చేసే విచక్షణాధికార పరిధి అత్యున్నత న్యాయస్థానానికి ఉందని తేల్చి చెప్పింది.
ఫ్యామిలీ కోర్టులతో నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేయడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 142(1) కింద తక్షణం విడాకులు మంజూరు చేసే అధికార పరిధి సుప్రీంకోర్టుకు ఉందా వంటి ప్రశ్నలను లేవనెత్తాయి. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎ.ఎస్.ఓకా, జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం గత సెప్టెంబర్‌లో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది.
ఆ అధికారాన్ని ఆచితూచి వాడాలి
ఆర్టికల్ 142(1) కింద దఖలు పడిన అసాధారణ అధికారాల ద్వారా సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. వాటి పరిధి అత్యంత విస్తృతమైనదని ధర్మాసనం గుర్తు చేసింది. కనుక ఆ అధికారాలను ఆచితూచి వాడాలని అభిప్రాయపడింది. ‘‘వివాహ బంధం పూర్తిగా దెబ్బ తిన్న సందర్భాల్లో విడాకుల మంజూరు సుప్రీంకోర్టు అధికారానికి సంబంధించిన విషయం కాదు. విచక్షణకు సంబంధించినది. సుప్రీంకోర్టు సమస్యల పరిష్కర్తగా వ్యవహరిస్తుంది.
కనుక ఇలాంటి విచక్షణాధికారాలను ఇరుపక్షాలకూ పరిపూర్ణ న్యాయం జరిగే రీతిలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ అత్యంత జాగరూకతతో వినియోగించాల్సి ఉంటుంది. వివాహం పూర్తిగా విఫలమైందని, దంపతులు ఇంకెంత మాత్రమూ కలిసి జీవించే పరిస్థితులు లేవని అసందిగ్ధంగా రుజువై, ఆ బంధాన్ని ఇంకా కొనసాగించడం అన్యాయమని న్యాయస్థానం విశ్వసిస్తే తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చు’’ అని పేర్కొంది.
భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు భరణం (సీఆర్పీసీ సెక్షన్ 125), వివాహితపై గృహ హింస (ఐపీసీ 498–ఎ) తదితరాల నిబంధనలను కూడా ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు పక్కన పెట్టవచ్చని స్పష్టం చేసింది. అయితే 32, 226 అధికరణల కింద విడాకుల కోసం నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది.
వెంటనే విడాకులు
Published Tue, May 2 2023 4:39 AM | Last Updated on Tue, May 2 2023 4:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment