Idgah
-
బెంగళూరు ఈద్గాలో గణేష్ ఉత్సవాలకు బ్రేక్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
బెంగళూరు: బెంగళూరులోని ఈద్గా మైదానంలో రెండు రోజుల పాటు గణేష్ ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్టు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. గణేష్ ఉత్సవాలకు బ్రేకులు వేసింది ధర్మాసనం. స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం.. ఆ మైదానంలో ఎలాంటి మతపరమైన ఉత్సవాలు జరపకూడదు. విచారణ సందర్భంగా వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దావే. తమ హక్కులు అణచివేతకు గురవుతున్నాయనే భావన మతపరమైన మైనారిటీలకు కలుగకుండా చూడాలని కోరారు. ఈ మైదానంలో 200 ఏళ్లుగా ఇతర మతాల కార్యక్రమాలు నిర్వహించటం లేదని, చట్ట ప్రకారం ఇది వక్ఫ్ బోర్డు ఆస్తిగా తెలిపారు. 2022లో ఇది వివాదాస్పద స్థలమని ప్రకటించారని, ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నారని ధర్మాసనానికి నివేదించారు. మరోవైపు.. ఇది ప్రభుత్వం పేరుతో ఉందని, చాలా ఏళ్లుగా పిల్లలు ఆడుకునే ఆట స్థలంగానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్ని అంతకు ముందు కర్ణాటక హైకోర్టు సైతం ఏకీభవించింది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కర్ణాటక వక్ఫ్‌బోర్డు. తాజాగా స్టేటస్ కో విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయటం వల్ల.. ప్రస్తుతం మరో కొత్త సమస్య తలెత్తింది. ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వానిదా లేక వక్ఫ్‌బోర్డుదా? అనే విషయం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు -
ఇక మథుర వంతు.. ఆ భూములపై యాజమాన్య హక్కులు ఎవరివి?
మొన్న అయోధ్య, నిన్న కాశీ, ఇవాళ మథుర దేశంలో మందిరం, మసీదు వివాదాలు రాజుకుంటున్నాయి. అయోధ్యలో వివాదం సమసిపోయి శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి మసీదు రగడ ఇంకా చల్లారకుండానే హఠాత్తుగా మథుర వివాదం తెరపైకి వచ్చింది. మథుర ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివన్న చర్చ ఉత్కంఠని రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న మసీదుపై భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పిటిషన్ విచారించడానికి మథుర జిల్లా న్యాయస్థానం అంగీకరించడంతో ఆ స్థలంపై ఎందుకు వివాదం నెలకొందో సర్వత్రా ఆసక్తిగా మారింది. మథురలో శ్రీకృష్ణుడు జన్మించినట్టుగా భావిస్తున్న స్థలానికి ఆనుకొని షాహీ ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు నిర్మించారు. కృష్ణుడి ఆలయాన్ని కొంత భాగం పడగొట్టి ఆ మసీదు కట్టారని, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినట్టుగానే ఈ మసీదులో కూడా వీడియోగ్రఫీ సర్వే చేస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయని హిందూమత పరిరక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు. కోర్టులో ఉన్న కేసులు ఎన్ని ? ఈ వివాదంపై కోర్టులో ఇప్పటివరకు డజనుకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల సారాంశం ఒక్కటే. షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. మరికొన్ని పిటిషన్లు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే మాదిరిగా ఈ మసీదులో కూడా సర్వే చేపట్టాలని, అంతే కాకుండా ఆ ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాయి. మసీదు భూములపై హక్కులు ఎవరివి ? 1670 సంవత్సరంలో నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని నాజల్ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమిగా చెప్పాలి. అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. 1815 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వేసిన వేలంలో కృష్ణజన్మభూమిగా భావిస్తున్న కేత్రా కేశవ్దేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న 13.77 ఎకరాల భూమిని బెనారస్‌కు చెందిన రాజాపాట్నిమాల్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వారసులు ఆ స్థలాన్ని జుగల్ కిశోర్ బిర్లాకి విక్రయించారు. పండిట్ మదన మోహన్ మాలవీయ, గోస్వామి గణేశ్ దత్, భికెన్ లాల్జీ ఆటెరీ పేర్లపై ఆ భూములు నమోదయ్యాయి. వీరంతా కలిసి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌గా ఏర్పడి కేత్రా కేశవ్దేవ్ ఆలయం ప్రాంగణంపై యాజమాన్య హక్కులు సాధించారు. మసీదు కింద తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం మసీదు కింద ఉందని, కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు విశ్వసిస్తున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే చెరసాల బయటకు వస్తుందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రామజన్మభూమి మీద ఒక పుస్తకం రాసిన లక్నోకు చెందిన అడ్వొకేట్ రంజన అగ్నిహోత్రి శ్రీకృష్ణ జన్మభూమి మీద దృష్టి సారించారు. మరో ఆరుగురితో కలిసి షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని , ఆ భూ యాజమాన్య హక్కులన్నీ తమకి అప్పగించాలంటూ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరఫున 2020లోనే దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో న్యాయమూర్తి ఛాయా శర్మ అప్పటికే ఆలయానికి ఒక ట్రస్టు ఉందని ఆ స్థలంపై ఆలయానికి, మసీదుకి మధ్య 1968లోనే అవగాహన కుదిరిందంటూ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రంజన్ అగ్నిహోత్రి జిల్లా కోర్టుకెక్కడంతో ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి రాజీవ్ భారతి విచారణకు అంగీకరించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది ? రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం మనకి స్వాతంత్య్రం సిద్ధించిన 1947, ఆగస్టు 15 నాటికి మతపరమైన కట్టడాలు ఎవరి అధీనంలో ఉంటే, భూ హక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్టడాలని కదిల్చే హక్కులు లేవని ఆ చట్టం చెబుతోంది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకి మాత్రం మినహాయింపు ఉంది. అందుకే రామజన్మభూమి వివాదంలో తీర్పు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మథుర ఆలయానికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉండడంతో పురావస్తు కట్టడం కింద మినహాయింపు వచ్చి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పిటిషన్‌దారులు ఆశతో ఉన్నారు. 1968లో రాజీ కుదిరిందా ? కోర్టు రికార్డుల ప్రకారం 1968 సంవత్సరంలో ఆలయ నిర్వహణ కమిటీ అయిన శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్,షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. కోర్డు డిక్రీ ద్వారా ఇరు వర్గాలు ఒక రాజీ ఫార్ములాకు వచ్చాయి. అప్పటికింకా 13.77 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ముస్లింలు జీవనం సాగిస్తూ ఉండేవారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం వారిని ఖాళీ చేయించి మందిరానికి, మసీదుకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఆలయానికి అభిముఖంగా మసీదుకి ఎలాంటి తలుపులు, కిటికీలు ఉండకూడదు. రెండు ప్రార్థనాలయాలకి మధ్య గోడ కట్టాలని తీర్మానించారు. ఈ ఒప్పందానికి ఉన్న చెల్లుబాటుపై కూడా కోర్టు విచారణ చేయనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్తకొత్తగా.. రంజాన్ కానుకగా..
రొట్టెల పండగకు వేదికగా నిలిచే బారాషహీద్ దర్గా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి ఆవరణలో ఉన్న ఈద్గా భవనం ముస్లింలకు ఎంతో ప్రీతికరం. అయితే టీడీపీ హయాంలో ఈద్గా నిర్మాణాన్ని అర్థాంతరంగా కూల్చేశారు. కొత్త నిర్మాణం చేపడుతామని మిన్నకుండి పోయారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. రంజాన్ కానుకగా ముస్లింలకు అంకితం చేయనున్నారు. సాక్షి, నెల్లూరు : నెల్లూరులో చారిత్రాత్మకమైన ప్రదేశంగా విరాజిల్లుతున్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ప్రత్యేకతలతో కూడిన ఈద్గా నిర్మాణం పూర్తయింది. రంజాన్ మాసం కానుకగా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈనెల 29న ముస్లింలకు అంకితం చేయనున్నారు. గత టీడీపీ హయాంలో ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఈద్గాను కూల్చివేసి నిర్మాణం గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి చొరవతో పూర్తి హంగులతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం చేపట్టడం ఆనందదాయకం. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేయించి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేనివిధంగా నిర్మాణం చేయించారు. ముస్లింల పట్ల ఎమ్మెల్యేకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు మేమంతా కృతజ్ఞతులై ఉంటాం. – అబూబకర్, మాజీ చైర్మన్, బారాషహీద్ రొట్టెల పండగ కమిటీ ఎంతో సంతోషంగా ఉంది ప్రత్యేక హంగులతో నిర్మించిన ఈద్గాను రంజాన్ కానుకగా మాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా ఈద్గా లేక ప్రార్థనల కోసం ఇబ్బందిపడేవారం. స్థానిక ఎమ్మెల్యే మా మనోభావాలను గౌరవిస్తూ ఈద్గా నిర్మాణంపై దృష్టిపెట్టి మాకు రంజాన్ కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది. పండగ రోజు అందరం కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటాం. – ఎస్డీ ఇలియాజ్ స్థానికుడు, నెల్లూరు వైఎస్సార్సీపీ హయాంలో.. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. అదే విధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ముస్లింల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో రూ.1.03 కోట్ల వ్యయంతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. ► గత రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ముస్లింలు కలిసి ప్రార్థనలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. కానీ ఈ ఏడాది రంజాన్ పండగ కానుకగా ఈద్గాను వారికి అంకితం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈనెల 29న వారికి అంకితం చేసేందుకు కృషి చేస్తున్నారు. ► 100 అడుగుల వెడల్పు, సుమారు 70 అడుగుల ఎత్తులో మినార్ల నిర్మాణం చేపట్టారు. వచ్చే శుక్రవారం అంకితం.. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈద్గాను స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముస్లింలకు అంకితం చేయనున్నారు. దాదాపు రెండు వేల మందికి పైగా ముస్లింలు హాజరుకానున్న సభలో ఇఫ్తార్ విందు కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పూర్తి హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈద్గా నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేదని ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో.. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఈద్గాలో నగరంలో ఉన్న ముస్లింలు బక్రీద్, రంజాన్ పండగలకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేవారు. ప్రతి ఏటా రెండు పండగలకు ఈద్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యక ప్రార్థనలు చేసుకునేవారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈద్గాను కూల్చివేశారు. ఆ ప్రదేశంలో నూతన ఈద్గా నిర్మిస్తామని చెప్పి పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా ఈద్గా లేక ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఈద్గా వద్ద ఉద్రిక్తత
- ఎంఐఎం నాయకుడు హాదీ వివాదాస్పద వ్యాఖ్య - మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే గొడవ బషీరాబాద్ (తాండూరు): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులో ఈద్గా ప్రాంగణంలో రంజాన్ సందర్భంగా సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఐఎం తాండూరు పట్టణ అధ్యక్షుడు హాదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముస్లిం నేతలు ఆయన వైపు దూసుకొచ్చారు. మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే గొడవ జరిగింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సమస్య సద్దు మణిగింది. తాండూరు ఈద్గా వద్ద సోమవారం ఉదయం రంజాన్ సందర్భంగా వేల సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈద్గాలో ప్రార్థనల అనంతరం ముస్లింలకు పండగ శుభాకాంక్షల కార్యక్రమాన్ని ముగించుకొని ఈద్గా ప్రాంగణంలో ఈద్గా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాదీ మాట్లాడారు. ‘తాండూరులో ముస్లింలు కొందరు కడుపులో కత్తులను గుచ్చారు.. రానున్న రోజుల్లో మేమేంటో చూపిస్తాం.. చూడండి’(ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల విషయంలో మోసం చేశారనే నేపథ్యంలో) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పలువురు ముస్లిం నాయకులు ఒక్కసారిగా హాదీ వైపునకు దూసుకొచ్చారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అప్రమత్తమైన డీఎస్పీ రామచంద్రుడు తదితరులు గొడవ పెద్దది కాకుండా అక్కడున్న వారిని పక్కకు తీసుకెళ్లారు.