ఇక మథుర వంతు.. ఆ భూములపై యాజమాన్య హక్కులు ఎవరివి? | Krishna Janmabhoomi: Attackers Target Mathura Shahi Idgah Mosque | Sakshi
Sakshi News home page

Krishna Janmabhoomi: ఇక మథుర వంతు.. ఆ భూములపై యాజమాన్య హక్కులు ఎవరివి?

Published Sat, May 21 2022 5:04 AM | Last Updated on Sat, May 21 2022 8:35 AM

Krishna Janmabhoomi: Attackers Target Mathura Shahi Idgah Mosque - Sakshi

షాహీ ఈద్గా మసీదు

మొన్న అయోధ్య, నిన్న కాశీ, ఇవాళ మథుర దేశంలో మందిరం, మసీదు వివాదాలు రాజుకుంటున్నాయి. అయోధ్యలో వివాదం సమసిపోయి శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి మసీదు రగడ ఇంకా చల్లారకుండానే హఠాత్తుగా మథుర వివాదం తెరపైకి వచ్చింది.  మథుర ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివన్న చర్చ ఉత్కంఠని రేపుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో  శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న మసీదుపై భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పిటిషన్‌ విచారించడానికి మథుర జిల్లా న్యాయస్థానం అంగీకరించడంతో ఆ స్థలంపై ఎందుకు వివాదం నెలకొందో సర్వత్రా ఆసక్తిగా మారింది.

మథురలో  శ్రీకృష్ణుడు జన్మించినట్టుగా భావిస్తున్న స్థలానికి ఆనుకొని షాహీ ఈద్గా మసీదుని మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు నిర్మించారు. కృష్ణుడి ఆలయాన్ని కొంత భాగం పడగొట్టి ఆ మసీదు కట్టారని, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినట్టుగానే ఈ మసీదులో కూడా వీడియోగ్రఫీ సర్వే చేస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయని హిందూమత పరిరక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు.

కోర్టులో ఉన్న కేసులు ఎన్ని ?
ఈ వివాదంపై కోర్టులో ఇప్పటివరకు డజనుకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల సారాంశం ఒక్కటే. షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. మరికొన్ని పిటిషన్లు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే మాదిరిగా ఈ మసీదులో కూడా సర్వే చేపట్టాలని, అంతే కాకుండా ఆ ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాయి.

మసీదు భూములపై హక్కులు ఎవరివి ?
1670 సంవత్సరంలో నాటి మొఘల్‌ పాలకుడు ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని నాజల్‌ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమిగా చెప్పాలి. అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల చేతుల్లోకి వెళ్లింది.

1815 సంవత్సరంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వేసిన వేలంలో కృష్ణజన్మభూమిగా భావిస్తున్న కేత్రా కేశవ్‌దేవ్‌ ఆలయానికి సమీపంలో ఉన్న 13.77 ఎకరాల భూమిని బెనారస్‌కు చెందిన రాజాపాట్నిమాల్‌ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వారసులు ఆ స్థలాన్ని జుగల్‌ కిశోర్‌ బిర్లాకి విక్రయించారు. పండిట్‌ మదన మోహన్‌ మాలవీయ, గోస్వామి గణేశ్‌ దత్, భికెన్‌ లాల్జీ ఆటెరీ పేర్లపై ఆ భూములు నమోదయ్యాయి. వీరంతా కలిసి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌గా ఏర్పడి కేత్రా కేశవ్‌దేవ్‌ ఆలయం ప్రాంగణంపై యాజమాన్య హక్కులు సాధించారు.

మసీదు కింద తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం మసీదు కింద ఉందని, కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు విశ్వసిస్తున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే  చెరసాల బయటకు వస్తుందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రామజన్మభూమి మీద ఒక పుస్తకం రాసిన లక్నోకు చెందిన అడ్వొకేట్‌ రంజన అగ్నిహోత్రి శ్రీకృష్ణ జన్మభూమి మీద దృష్టి సారించారు.

మరో ఆరుగురితో కలిసి షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని , ఆ భూ యాజమాన్య హక్కులన్నీ తమకి అప్పగించాలంటూ శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ తరఫున  2020లోనే దిగువ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  అప్పట్లో న్యాయమూర్తి ఛాయా శర్మ అప్పటికే ఆలయానికి ఒక ట్రస్టు ఉందని ఆ స్థలంపై ఆలయానికి, మసీదుకి మధ్య 1968లోనే అవగాహన కుదిరిందంటూ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రంజన్‌ అగ్నిహోత్రి జిల్లా కోర్టుకెక్కడంతో ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్‌ జడ్జి రాజీవ్‌ భారతి విచారణకు అంగీకరించారు.

ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది ?
రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం మనకి స్వాతంత్య్రం సిద్ధించిన 1947, ఆగస్టు 15 నాటికి  మతపరమైన కట్టడాలు ఎవరి అధీనంలో ఉంటే, భూ హక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్టడాలని కదిల్చే హక్కులు లేవని ఆ చట్టం  చెబుతోంది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకి మాత్రం మినహాయింపు ఉంది. అందుకే రామజన్మభూమి వివాదంలో తీర్పు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మథుర ఆలయానికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉండడంతో పురావస్తు కట్టడం కింద మినహాయింపు వచ్చి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పిటిషన్‌దారులు ఆశతో ఉన్నారు.

1968లో రాజీ కుదిరిందా ?
కోర్టు రికార్డుల ప్రకారం 1968 సంవత్సరంలో ఆలయ నిర్వహణ కమిటీ అయిన శ్రీకృష్ణ జన్మస్థాన్‌ సేవా సంస్థాన్,షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్‌ మధ్య ఒప్పందం కుదిరింది. కోర్డు డిక్రీ ద్వారా ఇరు వర్గాలు ఒక రాజీ ఫార్ములాకు వచ్చాయి. అప్పటికింకా 13.77 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ముస్లింలు జీవనం సాగిస్తూ ఉండేవారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం వారిని ఖాళీ చేయించి మందిరానికి, మసీదుకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఆలయానికి అభిముఖంగా మసీదుకి ఎలాంటి తలుపులు, కిటికీలు ఉండకూడదు. రెండు ప్రార్థనాలయాలకి మధ్య గోడ కట్టాలని తీర్మానించారు. ఈ ఒప్పందానికి ఉన్న చెల్లుబాటుపై కూడా కోర్టు విచారణ చేయనుంది.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement