Videography
-
ఇక మథుర వంతు.. ఆ భూములపై యాజమాన్య హక్కులు ఎవరివి?
మొన్న అయోధ్య, నిన్న కాశీ, ఇవాళ మథుర దేశంలో మందిరం, మసీదు వివాదాలు రాజుకుంటున్నాయి. అయోధ్యలో వివాదం సమసిపోయి శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే, కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానవాపి మసీదు రగడ ఇంకా చల్లారకుండానే హఠాత్తుగా మథుర వివాదం తెరపైకి వచ్చింది. మథుర ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివన్న చర్చ ఉత్కంఠని రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న మసీదుపై భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పిటిషన్ విచారించడానికి మథుర జిల్లా న్యాయస్థానం అంగీకరించడంతో ఆ స్థలంపై ఎందుకు వివాదం నెలకొందో సర్వత్రా ఆసక్తిగా మారింది. మథురలో శ్రీకృష్ణుడు జన్మించినట్టుగా భావిస్తున్న స్థలానికి ఆనుకొని షాహీ ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు నిర్మించారు. కృష్ణుడి ఆలయాన్ని కొంత భాగం పడగొట్టి ఆ మసీదు కట్టారని, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించినట్టుగానే ఈ మసీదులో కూడా వీడియోగ్రఫీ సర్వే చేస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయని హిందూమత పరిరక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు. కోర్టులో ఉన్న కేసులు ఎన్ని ? ఈ వివాదంపై కోర్టులో ఇప్పటివరకు డజనుకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల సారాంశం ఒక్కటే. షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని విజ్ఞప్తి చేశాయి. మరికొన్ని పిటిషన్లు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే మాదిరిగా ఈ మసీదులో కూడా సర్వే చేపట్టాలని, అంతే కాకుండా ఆ ప్రాంగణంలో పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాయి. మసీదు భూములపై హక్కులు ఎవరివి ? 1670 సంవత్సరంలో నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని నాజల్ ల్యాండ్‌గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమిగా చెప్పాలి. అప్పట్లో మరాఠాల అధీనంలో ఉన్న ఈ భూమి ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. 1815 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వేసిన వేలంలో కృష్ణజన్మభూమిగా భావిస్తున్న కేత్రా కేశవ్దేవ్ ఆలయానికి సమీపంలో ఉన్న 13.77 ఎకరాల భూమిని బెనారస్‌కు చెందిన రాజాపాట్నిమాల్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన వారసులు ఆ స్థలాన్ని జుగల్ కిశోర్ బిర్లాకి విక్రయించారు. పండిట్ మదన మోహన్ మాలవీయ, గోస్వామి గణేశ్ దత్, భికెన్ లాల్జీ ఆటెరీ పేర్లపై ఆ భూములు నమోదయ్యాయి. వీరంతా కలిసి శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌గా ఏర్పడి కేత్రా కేశవ్దేవ్ ఆలయం ప్రాంగణంపై యాజమాన్య హక్కులు సాధించారు. మసీదు కింద తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలు బందీలుగా ఉన్న, శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం మసీదు కింద ఉందని, కోర్టుకెక్కిన కొంతమంది పిటిషన్‌దారులు విశ్వసిస్తున్నారు. మసీదు కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే చెరసాల బయటకు వస్తుందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. రామజన్మభూమి మీద ఒక పుస్తకం రాసిన లక్నోకు చెందిన అడ్వొకేట్ రంజన అగ్నిహోత్రి శ్రీకృష్ణ జన్మభూమి మీద దృష్టి సారించారు. మరో ఆరుగురితో కలిసి షాహీ ఈద్గా మసీదుని తొలగించాలని , ఆ భూ యాజమాన్య హక్కులన్నీ తమకి అప్పగించాలంటూ శ్రీకృష్ణ విరాజ్మాన్ తరఫున 2020లోనే దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో న్యాయమూర్తి ఛాయా శర్మ అప్పటికే ఆలయానికి ఒక ట్రస్టు ఉందని ఆ స్థలంపై ఆలయానికి, మసీదుకి మధ్య 1968లోనే అవగాహన కుదిరిందంటూ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రంజన్ అగ్నిహోత్రి జిల్లా కోర్టుకెక్కడంతో ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి రాజీవ్ భారతి విచారణకు అంగీకరించారు. ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది ? రామజన్మభూమి ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం మనకి స్వాతంత్య్రం సిద్ధించిన 1947, ఆగస్టు 15 నాటికి మతపరమైన కట్టడాలు ఎవరి అధీనంలో ఉంటే, భూ హక్కులు వారికే సంక్రమిస్తాయని, మరెవరికీ ఆ కట్టడాలని కదిల్చే హక్కులు లేవని ఆ చట్టం చెబుతోంది. అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన, వారసత్వ కట్టడాలకి మాత్రం మినహాయింపు ఉంది. అందుకే రామజన్మభూమి వివాదంలో తీర్పు ఆలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మథుర ఆలయానికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉండడంతో పురావస్తు కట్టడం కింద మినహాయింపు వచ్చి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని పిటిషన్‌దారులు ఆశతో ఉన్నారు. 1968లో రాజీ కుదిరిందా ? కోర్టు రికార్డుల ప్రకారం 1968 సంవత్సరంలో ఆలయ నిర్వహణ కమిటీ అయిన శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్,షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. కోర్డు డిక్రీ ద్వారా ఇరు వర్గాలు ఒక రాజీ ఫార్ములాకు వచ్చాయి. అప్పటికింకా 13.77 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ముస్లింలు జీవనం సాగిస్తూ ఉండేవారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం వారిని ఖాళీ చేయించి మందిరానికి, మసీదుకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. ఆలయానికి అభిముఖంగా మసీదుకి ఎలాంటి తలుపులు, కిటికీలు ఉండకూడదు. రెండు ప్రార్థనాలయాలకి మధ్య గోడ కట్టాలని తీర్మానించారు. ఈ ఒప్పందానికి ఉన్న చెల్లుబాటుపై కూడా కోర్టు విచారణ చేయనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, కామారెడ్డి: పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 101 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వాటిని వెబ్‌కాస్టింగ్ చేస్తున్నాం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు’ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ఈ నెల 11న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ను ‘సాక్షి’ ఇంట ర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేని విధంగా పక్కా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో 16,091 మంది దివ్యాంగులు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 16,091 మంది దివ్యాంగులైన ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. వీరిలో 2,690 మంది చూపులేనివారున్నారని, వారికి బ్రెయిలీ లిపితో కూడిన బోర్డులు ఉంటాయని, వాటి ఆధారంగా ఓటు వేస్తారని తెలిపారు. 2,059 మంది మూగవారు, 9,905 మంది నడవలేని వారు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి గాను 535 వీల్ చైర్లు ఏర్పా టు చేశామని పేర్కొన్నారు. జుక్కల్‌లో 163, ఎల్లారెడ్డిలో 130, కామారెడ్డిలో 242 వీల్చైర్లను ఉంచామన్నారు. దివ్యాంగులతో పాటు వృద్ధులను పోలింగ్ కేంద్రాల కు తరలించడానికి కావాల్సిన రవాణా ఏర్పాట్లు కూడా చేసినట్టు కలెక్టర్ చెప్పారు. 2,426 మందికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లుగా ఉండి, ఎన్నికల విధుల్లో ఉన్న 2,426 మంది పోలింగ్ సిబ్బంది, అధి కారులకు ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. వారు డ్యూటీ చేసే స్థలంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు 289 మంది పోస్టల్ బ్యాలె ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి జిల్లాలోని 786 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు నీడతో పాటు నీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే తాగడానికి నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఎండలు మండిపోతున్నందున పోలింగ్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగడం ద్వారా వేడి నుంచి కొంత రక్షణ పొందవచ్చన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు, సిబ్బందికి తెలిపామన్నారు. పోలింగ్ సిబ్బందికి తెల్లని టోపీలు అందజేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. జిల్లాలో 6,28,418 మంది ఓటర్లు.. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,28,418 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2,30,076 మంది ఓటర్లు, ఎల్లారెడ్డిలో 269 పోలింగ్ కేంద్రాల్లో 2,09,567 మంది ఓటర్లు, జుక్కల్‌లో 255 పోలింగ్ కేంద్రాల్లో 1,88,775 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం ఓట్లలో 3,04,384 మంది పురుషులు, 3,23,990 మంది మహిళలు, 44 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. మొత్తం 786 పోలింగ్ కేంద్రాల్లో ఒకే పోలింగ్ కేంద్రం ఉన్న పోలింగ్స్టేషన్లు 287 ఉన్నాయని, రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్న స్టేషన్లు 131, మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నవి 43 ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నవి నాలుగు ఉన్నాయన్నారు. ఈవీఎంలు సిద్ధం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలను ఇప్పటికే సిద్ధం చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పంపించామన్నారు. 943 కంట్రోల్యూనిట్లు, 948 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయన్నారు. అవసరానికి మించి సిద్ధంగా ఉంచామని తెలిపారు. 1,022 వీవీ ప్యాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, సిబ్బంది 3,770 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. వారిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తరలించడానికి గాను 34 స్థలాలను గుర్తించామని, అక్కడి నుంచి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వారిని అక్కడే వదిలివేయడం జరుగుతుందన్నారు. -
వీడియో తీయట్లేదా.. అయితే పెళ్లి క్యాన్సిల్!
తిరుచ్చి: పెళ్లి జరుగుతుంటే వీడియో తీయట్లేదని తెలిసి.. పెళ్లికూతురు ఆ పెళ్లినే రద్దు చేసేసింది. ఈ సంఘటన కేరళలోని తిరుచ్చి జిల్లా తురైయ్యూర్ లో చోటుచేసుకుంది. మరి కొద్ది నిమిషాల్లోనే పెళ్లి ఉందనగా.. ఇలా పెళ్లిని రద్దు చేయడంతో వరుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరంబలూర్ కు చెందిన సెంథిల్ (33)తో తంగారసుకు చెందిన అమ్మాయికి ఈ నెల 26న పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఆదివారం వివాహ ఆచారాలు మొదలైన తర్వాత పెళ్లిని వీడియో తీయట్లేదని వధువు సోదరులు ఇద్దరూ గుర్తించారు. సెంథిల్ తండ్రిని ఈ మేరకు ప్రశ్నించగా.. ఆయన తనకంత స్థోమత లేదని సమాధానం ఇవ్వడంతో ముగ్గురి మధ్య పెళ్లిమండపంలో పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపగించుకున్న వధువు కుటుంబసభ్యులు అమ్మాయిని తీసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు. పెళ్లి కూతురు కూడా వీడియో లేని పెళ్లి తనకు అవసరం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
నేను తీసిన ఫొటోలతో త్వరలో వెబ్సైట్
ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్ రాయదుర్గం: తనకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టమని, ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫొటోలు తీస్తుంటానని ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. రాయదుర్గం లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఫోటో ఎక్స్పో-2016ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా తన మనోగతాన్ని విలేకరులతో పంచుకున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే కెమెరాలను కొన్నేళ్ళుగా కొనుగోలు చేస్తూ భద్రపర్చుకుంటున్నానన్నారు. తాను తీసిన ఫొటోలన్నింటినీ ఒక చోట పెట్టడానికి ప్రత్యేకంగా ఒక ప్రదర్శన కన్నా వెబ్సైట్ లాంచ్ చేసి అందులో పెట్టాలని ఉందని, త్వరలో ఈ విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నానన్నారు. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు, ఖాళీ స్థలాలు, పార్కులు, అందమైన ప్రాంతాలు, మోడల్స్, డ్యాన్సర్స్ ఫొటోలను హబీగా తీస్తుంటానన్నారు. తన తండ్రి సత్యమూర్తి మంచి ఫొటోగ్రాఫర్ అని, తరువాత తయన రైటర్‌గా మారారన్నారు. తనకు కారం అంటే పడదని, అందుకే మా అమ్మ నా ఒక్కడి కోసం వేరుగా వంటచేసేదన్నారు. ఫొటోగ్రఫీలో కొత్త కొత్త అంశాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా విల్లార్ట్ ఎం.డీ వెంకటరమణకు ఫోన్ చేసి విసిగించి సందేహాలను తీర్చుకుంటానని దేవిశ్రీప్రసాద్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో పిల్లలు మ్యూజికల్ ఇన్స్ట్రమెంట్స్ వాయిస్తుంటే ఫొటోలు తీయాలనే కోరిక ఉందని, కొన్ని చోట్ల తీశానన్నారు. మనదేశంలోని పిల్లలు డప్పు కొట్టే ఫొటోలను తీసి నా స్టూడియోలో ఒక గోడను ఖాళీగా ఉంచానని, దానిపై ఈ ఫొటోలన్నింటినీ ఒకేచోట అమర్చాలని చాలా రోజులుగా ఈ కోరిక ఉందని, దీనిపై దృష్టి పెట్టానన్నారు. సంగీతానికి ఫొటోగ్రఫికి చాలా అవినాభావ సంబంధం ఉందని దేవిశ్రీప్రసాద్ తెలిపారు. -
భలే ఆప్స్
విండోస్ 8.1పై కొత్త అప్లికేషన్లు! విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగిస్తున్న వారికి ఈ దీపావళి సందర్భంగా కొత్త అప్లికేషన్లను తీసుకొస్తున్నామని ప్రకటించింది మైక్రోసాఫ్ట్. పీసీ వినియోగంలో ఈ అప్లికేషన్లు సరికొత్త అనుభవాన్ని ఇస్తాయిని మైక్రోసాఫ్ట్వాళ్లు అంటున్నారు. ఇ-వెంట్: ఇది ఒక క్విక్ ఈవెంట్ మేనేజ్ అప్లికేషన్. సంబరాల సమయంలో సోషల్ మీడియా ద్వారా అందరికీ కనెక్ట్ కావడానికి ఈ అప్లికేషన్ ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. నాన్‌స్టాప్ మ్యూజిక్: సొంతంగా మ్యూజిక్ మిక్స్ చేసి.. ఇష్టమైనట్టుగా కొత్త ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. వీటితో పాటు వందల, వేల కొద్దీ రెసిపీల గుట్టును వివరించి కొత్త రుచులు చూపించే ఎమ్ఎస్ఎన్ ఫుడ్ అండ్డ్రింక్, లూమియా సెల్ఫీ, ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఫోటో ఫూనియా, ఇన్‌స్టాగ్రామ్‌లను విండోస్ 8.1పై అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మాత్రమే గాక దీపావళి సంబరాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఐదివాళీ, రంగోళీ క్రియేటర్ వంటి అప్లికేషన్లను కూడా విండోస్8.1 వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ల్యాప్స్ ఇట్తో అద్భుతమైన వీడియోలు టైమ్‌ల్యాప్స్ వీడియోగ్రఫీ గురించి మీరు వినే ఉంటారు. మెరుపువేగంతో మారిపోయే ఫ్రేమ్స్‌తో సృష్టించే ఈ రకమైన వీడియోలను అప్పుడప్పుడు సినిమాల్లోనూ చూసే ఉంటాం. ఇలాంటి అద్భుతాలను మీ స్మార్ట్‌ఫోన్‌తోనూ సృష్టించుకోవచ్చు. కావాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ‘ల్యాప్స్ ఇట్’ అప్లికేషన్ మాత్రమే. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలోని సెన్సర్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని అద్భుతమైన ఫొటోలు తీయడంతోపాటు వాటితో అందమైన టైమ్‌ల్యాప్స్ వీడియోలను కూడా సృష్టించుకోవచ్చు. ఫిల్టర్ల సాయంతో స్పెషల్ ఎఫెక్ట్లు కూడా సృష్టించుకోవచ్చు. వీడియోలను మెరుపువేగానికి మార్చుకోవడంతోపాటు చాలా స్లోగానూ రన్ చేయవచ్చు. ప్రోగ్రామింగ్ కోసం ట్రీహౌస్... మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఉందా? అయితే ట్రీహౌస్ అప్లికేషన్ మీ కోసమే. ఆన్లైన్ పద్ధతిలో ప్రోగ్రామింగ్ మెళకువలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌తో రూబీ ఆన్ రెయిల్స్, పీహెచ్‌పీ, పైథాన్ వంటి వాటిని ఉపయోగించే నైపుణ్యం కలిగించేందుకు ఈ అప్లికేషన్లో వెయ్యికిపైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. చిన్నచిన్న క్విజ్లు సవాళ్లతో ప్రోగ్రామింగ్‌ను నేర్చుకోవడం కూడా సరదాగా మార్చేస్తుంది. మీరు నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. ఐఓఎస్‌పై కిండ్లేకి కొత్త సొబగులు! ఐ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అప్లికేషన్లు కొత్త కళను సంతరించుకొంటున్నాయి. ఐడివైజ్లను వాడే వాళ్లు ఐఓఎస్ 8కి అప్డేట్ అయితే అప్లికేషన్లు కొత్త అనుభవాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి అమెజాన్స్ కిండ్లే. ఐ డివైజ్‌లపై పుస్తకాలను చదివేందుకు కిండ్లే ఉత్తమమైన అప్లికేషన్. ఆన్లైన్ మెంబర్షిప్ ద్వారా పుస్తకాలు చదవడానికి అవకాశం ఇస్తుంది ఇది. కొత్త అప్డేట్స్తో కూడిన కిండ్లే అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకొంటే... వాడకం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఉన్నట్టుండి అప్లికేషన్ క్లోజ్ అయినా.. తర్వాత ఓపెన్ చేసుకొన్నప్పుడు డెరైక్ట్‌గా అదే పేజ్‌లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి మెరుగులతో కిండ్లే అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. -
మోగనున్న ‘సార్వత్రిక’ నగారా
12 నుంచి నామినేషన్ల స్వీకరణ 21న పరిశీలన 23న ఉపసంహరణ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా రిటర్నింగ్ అధికారులు భారత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పగడ్బంధీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్వోలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల నామినేషన్లు,వాటి పరిశీలన, ఉపసంహరణ, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. సెలవు రోజులైన ఈ నెల 13, 14, 18 తేదీల్లో నామినేషన్లను స్వీకరించరాదన్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని వివరించారు. రిటర్నింగ్ అధికారులు ప్రతీ నియోజకవర్గానికి పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ విధిగా చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు వేసే నామినేషన్ల పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా ఖాళీలు వదిలితే వారికి చెప్పి రాయించాలన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు పార్లమెంట్ స్థానానికి రూ.25 వేలు, అసెంబ్లీ స్థానానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు సమర్పించే కులధ్రువీకరణ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 30న జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలను పారదర్శకంగానూ, సమర్థంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఆదేశిం చారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపైన ఇస్తున్న శిక్షణను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ రోజున రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీవిఎం యూనిట్లను పరిశీలించి ఓటింగ్‌కు సిద్ధం చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లలో ఏదో ఒకటి ఉండేలా చర్యలు చేపట్టాల న్నారు. పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా అమలుచేయాలని ధనుంజయ్ రెడ్డి ఆదేశించారు. ఎన్నిక ల వ్యయానికి సంబంధించిన నివేదికలు అభ్యర్థిపరంగా పారదర్శకంగా నివేదించాలన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల వ్యయంపై ఫిర్యాదులను 9177745658 నంబరుకు ఫోన్ చేసి నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఆర్డీఓ జె.వెంకటరావు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడే వీఆర్వో, వీఆర్ఏ రాతపరీక్ష
కొన్ని సూచనలు.. నిమిషం లేటైనా అనుమతించరు గంట ముందుగా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి 20 నిమిషాల ముందు హాల్లోకి అనుమతిస్తారు ఓఎంఆర్‌పై వైట్నర్, ఎరేజర్లు వాడకూడదు బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులే వాడాలి వీడియోగ్రఫీతో పటిష్ట పర్యవేక్షణ సాక్షి, సిటీబ్యూరో: జంటనగరాల్లో ఆది వారం జరిగే వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం 280 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ ఎ.కోటేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జరిగే వేళలు... ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. బస్సులపై ‘వీఆర్ఓ అండ్ వీఆర్ఏ’ అనే డెస్టినేషన్ బోర్డులు ఉంటాయి. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయి. ప్రత్యేక బస్సులు నడిచే ప్రాంతాలివే... సికింద్రాబాద్-కోఠీ, సికింద్రాబాద్-ఆఫ్జల్‌గంజ్, ఈసీఐఎల్-ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం-సికింద్రాబాద్, రీసాలాబజార్-అబిడ్స్, జీడిమెట్ల-కోఠీ, సికింద్రాబాద్-సనత్‌నగర్, ఉప్పల్-సికింద్రాబాద్, నాంపల్లి-సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట-సికింద్రాబాద్, ఈసీఐఎల్-సికింద్రాబాద్, హనుమాన్‌పేట్-సికింద్రాబాద్, కోఠీ-సికింద్రాబాద్, కోఠీ-సనత్‌నగర్, మెహదీపట్నం-చార్మినార్, హయత్‌నగర్-బహదూర్‌పురా, ఉప్పల్-మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్-పటాన్చెరు, ఎల్బీనగర్-మెహదీపట్నం, రాంనగర్-మెహదీపట్నం, మిధానీ-సికింద్రాబాద్, మధుబన్‌కాలనీ-సికింద్రాబాద్, ఎల్బీనగర్-సికింద్రాబాద్ తదితర మార్గాలు. ఓయూ నుంచి గ్రామాలకు... ఉస్మానియా యూనివర్సిటీ: కాగా, ఈ పరీక్షల కోసం ఓయూ క్యాంపస్ నుంచి సుమారు 8 వేల మంది విద్యార్థులు తమతమ గ్రామాలకు తరలివెళ్లారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఇంటరే అయినా... ఇంజినీరింగ్, లా, బీఈడీ, పీజీ, పీహెచ్డీ తదితర ఉన్నత విద్య అభ్యశిస్తున్నవారు కూడా పోటీపడుతుండటం విశేషం. -
ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, విజయవాడ : అవనిగడ్డ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఆఫీసర్ భన్వర్‌లాల్ తెలిపారు. ఈ నెల 21న జరిగే ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారని ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి, ఎస్పీ జె.ప్రభాకరరావులతో సోమవారం ఆయన సమావేశమై ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 1.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 93 వేల మంది పురుషులు, సుమారు 94 వేల మందికి పైగా స్త్రీలు ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. మొత్తం 241 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 2,500 మంది సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, పోలింగ్ కేంద్రాల అధికారులుగా ఇతర విధులకు నియమించామని వివరించారు. 33 పోలింగ్స్టేషన్లను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, వాటిలో ప్రత్యేకంగా కేంద్ర పారామిలటరీ బలగాలు, స్పెషల్ పోలీసుల్ని బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మినహా మిగిలినచోట్ల వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను నియమించామని చెప్పారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఎన్నికల అధికారులు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తారని, ఆయా తేదీల్లో తీసుకోనివారికోసం 21న పోలింగ్ కేంద్రాల్లో బూత్ రిటర్నింగ్ అధికారులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించబోమన్నారు. 21, 22 తేదీల్లో ‘అవనిగడ్డ’లో సెలవు.. ఉప ఎన్నికలను పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గంలో 21, 22 తేదీల్లో జిల్లా అధికారులు సెలవుగా ప్రకటించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. అక్కడి నుంచి బయట ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లేవారికి కూడా ఆ రోజుల్లో సెలవులు ఉంటాయని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సోమవారం నుంచే శిక్షణ తరగతులు మొదలు పెట్టామన్నారు. ఇప్పటికే ఏపీ ఎన్జీవోలతో మాట్లాడి ఎన్నికల్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశామని చెప్పారు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరుకావాలని తెలిపారు.