ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి | Assembly Election Arrangement Works Are Completed In Nizamabad | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Published Tue, Apr 9 2019 5:26 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Assembly Election Arrangement Works Are Completed In Nizamabad - Sakshi

సాక్షి, కామారెడ్డి: పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 101 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. వాటిని వెబ్‌కాస్టింగ్‌ చేస్తున్నాం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు’ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. ఈ నెల 11న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ను ‘సాక్షి’ ఇంట ర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేని విధంగా పక్కా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

జిల్లాలో 16,091 మంది దివ్యాంగులు
మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 16,091 మంది దివ్యాంగులైన ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ వివరించారు. వీరిలో 2,690 మంది చూపులేనివారున్నారని, వారికి బ్రెయిలీ లిపితో కూడిన బోర్డులు ఉంటాయని, వాటి ఆధారంగా ఓటు వేస్తారని తెలిపారు. 2,059 మంది మూగవారు, 9,905 మంది నడవలేని వారు ఉన్నారని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి గాను 535 వీల్‌ చైర్‌లు ఏర్పా టు చేశామని పేర్కొన్నారు. జుక్కల్‌లో 163, ఎల్లారెడ్డిలో 130, కామారెడ్డిలో 242 వీల్‌చైర్లను ఉంచామన్నారు. దివ్యాంగులతో పాటు వృద్ధులను పోలింగ్‌ కేంద్రాల కు తరలించడానికి కావాల్సిన రవాణా ఏర్పాట్లు కూడా చేసినట్టు కలెక్టర్‌ చెప్పారు.

2,426 మందికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు
జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లుగా ఉండి, ఎన్నికల విధుల్లో ఉన్న 2,426 మంది పోలింగ్‌ సిబ్బంది, అధి కారులకు ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. వారు డ్యూటీ చేసే స్థలంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు 289 మంది పోస్టల్‌ బ్యాలె ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

పోలింగ్‌ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలోని 786 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు నీడతో పాటు నీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే తాగడానికి నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఎండలు మండిపోతున్నందున పోలింగ్‌ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగడం ద్వారా వేడి నుంచి కొంత రక్షణ పొందవచ్చన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు, సిబ్బందికి తెలిపామన్నారు. పోలింగ్‌ సిబ్బందికి తెల్లని టోపీలు అందజేస్తున్నట్టు కలెక్టర్‌ వివరించారు. 

జిల్లాలో 6,28,418 మంది ఓటర్లు..
జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,28,418 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 262 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 2,30,076 మంది ఓటర్లు, ఎల్లారెడ్డిలో 269 పోలింగ్‌ కేంద్రాల్లో 2,09,567 మంది ఓటర్లు, జుక్కల్‌లో 255 పోలింగ్‌ కేంద్రాల్లో 1,88,775 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం ఓట్లలో 3,04,384 మంది పురుషులు, 3,23,990 మంది మహిళలు, 44 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. మొత్తం 786 పోలింగ్‌ కేంద్రాల్లో ఒకే పోలింగ్‌ కేంద్రం ఉన్న పోలింగ్‌స్టేషన్‌లు 287 ఉన్నాయని, రెండు పోలింగ్‌ కేంద్రాలు ఉన్న స్టేషన్లు 131, మూడు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నవి 43 ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నవి నాలుగు ఉన్నాయన్నారు. 

ఈవీఎంలు సిద్ధం
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలను ఇప్పటికే సిద్ధం చేసి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు పంపించామన్నారు. 943 కంట్రోల్‌యూనిట్లు, 948 బ్యాలెట్‌ యూనిట్లు ఉన్నాయన్నారు. అవసరానికి మించి సిద్ధంగా ఉంచామని తెలిపారు. 1,022 వీవీ ప్యాట్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులు, సిబ్బంది 3,770 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. వారిని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు తరలించడానికి గాను 34 స్థలాలను గుర్తించామని, అక్కడి నుంచి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వారిని అక్కడే వదిలివేయడం జరుగుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement