నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నికల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారింది. 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండడంతో వారంతా ప్రతి బూత్‌లో ఏజెంట్లను నియమించుకుంటే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బూత్‌లలో కాకుండా విశాలమైన ఆవరణల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి.
మోర్తాడ్: రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులకు పార్టీకి సంబంధించిన గుర్తులను కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు వివిధ రకాలైన గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయించారు. పోలింగ్ రోజున ఓటర్లను గుర్తించడానికి ప్రతి అభ్యర్థి పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలో 1,788 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. బరిలో 185 మంది అభ్యర్థులు ఉన్నారు. వారు పోలింగ్ కేంద్రాలలో తమ ఏజెంట్లను నియమించుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో 3,30,780 మంది పోలింగ్ ఏజెంట్లు అవసరం అవుతారు. అందరు అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకుంటే రికార్డు స్థాయిలో ఏజెంట్లు పోలింగ్ స్టేషన్‌లలో కొనసాగించాల్సి వస్తుంది.
పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి ఒక్కో పోలింగ్ బూత్‌లో తన ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. పోలింగ్ స్టేషన్‌లు ఎక్కువగా పాఠశాలల్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్నాయి. ఎక్కడ పోలింగ్ బూత్ ఉన్నా గది విస్తీర్ణం చిన్నగా ఉంటుంది. ఒక పోలింగ్ స్టేషన్‌లో 185 మంది ఏజెంట్లను కూర్చోబెట్టాలంటే ఆ గది సరిపోదు. అయితే పోలింగ్ ఏజెంట్లు కూర్చోడానికి పోలింగ్ స్టేషన్‌ల ఆవరణల్లో టెంట్లు వేసి కుర్చీలను ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పోలింగ్ ఏజెంట్ స్థానిక ఓటరు అయి ఉండాల్సి ఉంటుంది. అంటే ఓటర్లలో ఎక్కువ శాతం మంది పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అందరూ తమ పోలింగ్ ఏజెంట్లను నియమించుకున్నా లేకపోయినా ఎన్నికల అధికారులు మాత్రం ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారికి అవసరమైన సౌకర్యాల కోసం పరిశీలిస్తున్నారు. అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో ఉండడం వల్ల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment