Web casting
-
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, కామారెడ్డి: పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 101 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వాటిని వెబ్‌కాస్టింగ్ చేస్తున్నాం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు’ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ఈ నెల 11న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ను ‘సాక్షి’ ఇంట ర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేని విధంగా పక్కా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాలో 16,091 మంది దివ్యాంగులు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 16,091 మంది దివ్యాంగులైన ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. వీరిలో 2,690 మంది చూపులేనివారున్నారని, వారికి బ్రెయిలీ లిపితో కూడిన బోర్డులు ఉంటాయని, వాటి ఆధారంగా ఓటు వేస్తారని తెలిపారు. 2,059 మంది మూగవారు, 9,905 మంది నడవలేని వారు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి గాను 535 వీల్ చైర్లు ఏర్పా టు చేశామని పేర్కొన్నారు. జుక్కల్‌లో 163, ఎల్లారెడ్డిలో 130, కామారెడ్డిలో 242 వీల్చైర్లను ఉంచామన్నారు. దివ్యాంగులతో పాటు వృద్ధులను పోలింగ్ కేంద్రాల కు తరలించడానికి కావాల్సిన రవాణా ఏర్పాట్లు కూడా చేసినట్టు కలెక్టర్ చెప్పారు. 2,426 మందికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లుగా ఉండి, ఎన్నికల విధుల్లో ఉన్న 2,426 మంది పోలింగ్ సిబ్బంది, అధి కారులకు ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. వారు డ్యూటీ చేసే స్థలంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు 289 మంది పోస్టల్ బ్యాలె ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి జిల్లాలోని 786 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు నీడతో పాటు నీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే తాగడానికి నీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఎండలు మండిపోతున్నందున పోలింగ్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగడం ద్వారా వేడి నుంచి కొంత రక్షణ పొందవచ్చన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు, సిబ్బందికి తెలిపామన్నారు. పోలింగ్ సిబ్బందికి తెల్లని టోపీలు అందజేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. జిల్లాలో 6,28,418 మంది ఓటర్లు.. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,28,418 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2,30,076 మంది ఓటర్లు, ఎల్లారెడ్డిలో 269 పోలింగ్ కేంద్రాల్లో 2,09,567 మంది ఓటర్లు, జుక్కల్‌లో 255 పోలింగ్ కేంద్రాల్లో 1,88,775 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం ఓట్లలో 3,04,384 మంది పురుషులు, 3,23,990 మంది మహిళలు, 44 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. మొత్తం 786 పోలింగ్ కేంద్రాల్లో ఒకే పోలింగ్ కేంద్రం ఉన్న పోలింగ్స్టేషన్లు 287 ఉన్నాయని, రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్న స్టేషన్లు 131, మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నవి 43 ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నవి నాలుగు ఉన్నాయన్నారు. ఈవీఎంలు సిద్ధం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలను ఇప్పటికే సిద్ధం చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పంపించామన్నారు. 943 కంట్రోల్యూనిట్లు, 948 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయన్నారు. అవసరానికి మించి సిద్ధంగా ఉంచామని తెలిపారు. 1,022 వీవీ ప్యాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, సిబ్బంది 3,770 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. వారిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తరలించడానికి గాను 34 స్థలాలను గుర్తించామని, అక్కడి నుంచి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వారిని అక్కడే వదిలివేయడం జరుగుతుందన్నారు. -
ఓటేస్తూ యువకుడి సెల్ఫీ
సాక్షి,పెద్దపల్లిఅర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోలింగ్‌లో నిట్టూరు గ్రామానికి చెందిన సంపత్ అనే గ్రాడ్యుయేట్ ఓటేస్తు సెల్ఫీ దిగి కాసేపు కలకలం సృష్టించాడు. సెల్ఫీ దిగిన సందర్భంలో ఫ్లాష్‌లైట్ రావడంతో గుర్తించిన ఎన్నికల అధికారి వెంటనే వెబ్‌కాస్టింగ్ వీడియోను పరిశీలించారు. సెల్ఫీ దిగినట్లు వెబ్‌కాస్టింగ్‌లో స్పష్టంగా తెలియడంతో సంపత్‌ను పోలీసులకు అప్పగించారు. సంపత్‌పై 128 ఆర్టీ ఆక్ట్ కింద బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
పోల్ సీన్ లైవ్
పోలింగ్ కేంద్రాలను వశపర్చుకోవడం లేదంటే బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం.. ఓటమి ఖాయమని తెలిస్తే రీపోలింగ్‌కు పట్టుబట్టడం లేదా పోలింగ్ వాయిదా వేయించడం.. ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి వెబ్ కాస్టింగ్ ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈ విధానంలో.. ఓటరు ఓటుహక్కు వినియోగించుకునే దృశ్యం ప్రత్యక్షం కానుంది. అంటే.. ఈ ఎన్నికల్లో 2.78 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే క్షణాలు 32,796 పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ ఎన్నికల లైవ్ వెబ్ కాస్టింగ్‌కు కర్త, కర్మ కేంద్ర ఎన్నికల సంఘం కాగా ‘క్రియా’శీలక పాత్రను ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పోషించనున్నారు. ఈ ప్రక్రియకు త్వరలో జరిగే ఎన్నికలు వేదిక కానున్నాయి. ప్రతి దృశ్యం ప్రత్యక్ష ప్రసారం: ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుంటున్న తీరుతో పాటు.. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల ప్రతి కదలికను ఎన్నికల సంఘం లైవ్‌లో వీక్షించనుంది. వచ్చే నెల 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 32,574 పోలింగ్ కేంద్రాలతో పాటు మరో 222 అనుబంధ పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియను ఆద్యంతం ‘లైవ్ వెబ్‌కాస్ట్’ చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి అపశ్రుతి చేసుకున్నా, పోలింగ్‌కు ఆటంకాలు కలిగినా.. క్షణాల్లో ఎన్నికల సంఘం సంబంధిత పోలింగ్ కేంద్రంలోని పరిస్థితులను లైవ్ వెబ్ కాస్టింగ్(http://webcast.gov.in/eci/)ద్వారా వీక్షిస్తూ స్థానిక పోలింగ్ అధికారులకు సూచనలు జారీ చేయనుంది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్, జిల్లా కేంద్రాల నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ ప్రక్రియను టీవీ తెరలపై ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సాంకేతికంగా ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాల ద్వారా మొత్తం పోలింగ్ ప్రక్రియను రికార్డు చేస్తారు. ఈసారి పూర్తిస్థాయిలో వెబ్‌కాస్ట్: ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 2009లో పోలింగ్ కేంద్రాల లైవ్ వెబ్‌కాస్టింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి ఏదో చోట అలజడి చెలరేగడం.. పోలింగ్‌కు ఆటంకం కలగడం వంటి ఘటనలు చోటుచేసుకునేవి. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను లైవ్ వెబ్ కాస్టింగ్ చేయడం లేదా వీడియో కెమెరాలతో రికార్డు చేయడం ప్రారంభించాక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా చెదురుమదురు ఘటనలు సైతం చోటుచేసుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రమే ఉండడం, అవసరమైన మేరకు హార్డ్‌వేర్ పరికరాలు లేకపోవడంతో 2009లో కేవలం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ నిర్వహించగా మంచి ఫలితాలొచ్చాయి. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 29,138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16,512 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. బ్రాండ్ బ్యాండ్‌తో పాటు వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో 7,986 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించగా, మరో 4,142 కేంద్రాల్లో వీడియోగ్రఫీ, 320 కేంద్రాల్లో డిజిటల్ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను రికార్డు చేశారు. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా 32,796 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈసారి అన్ని కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తేవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట్ల డేటా కార్డులు, వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం ద్వారా వెబ్‌కాస్టింగ్ నిర్వహించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భావి ఇంజనీర్ల పాత్ర ఈ ఎన్నికల లైవ్ వెబ్ కాస్టింగ్ ప్రక్రియ అమలులో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ముగ్గురు ఇం జనీరింగ్ కళాశాల విద్యార్థులను వెబ్‌కాస్టింగ్ అవసరాల కోసం నియమిస్తారు. ఇందుకోసం స్థానిక ఇంజనీరింగ్ కళా శాలల యాజమాన్యాలతో క్షేత్ర స్థాయిలో ఎన్నికల యంత్రాంగం సంప్రదింపులు జరుపుతోంది. ఇందుకు 98,382 మంది విద్యార్థులు అవసరం. ఇప్పటికే విద్యార్థుల గుర్తింపు పూర్తయింది. ఇంజనీరింగ్ కళాశాలలు, వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు. లైవ్‌లో పోలింగ్ పరిశీలన ఇలా..: - ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం 7–8 అడుగుల ఎత్తులో సీసీ కెమెరాలను అమర్చి.. లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తారు - ప్రతి పోలింగ్ కేంద్రంలో ‘వెబ్ కెమెరా/సీసీటీవీ నిఘా పరిధిలో మీరు ఉన్నార’నే నోటీసులు అతికిస్తారు - పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన ఓటరును పోలింగ్ అధికారి గుర్తించారా?.. వేలిపై సిరా చుక్క వేశారా? - ఓటరును గుర్తించిన అనంతరం ఈవీఎంకు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను ప్రిసైడింగ్ అధికారి స్టార్ట్ చేయడం.. - ఓటు వేసేందుకు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు ప్రవేశించే దృశ్యం (అయితే, ఓటెవరికి వేశారన్న రహస్యాన్ని కాపాడేందుకు ఈవీఎం బ్యాలెట్ యూనిట్ కనిపించని విధంగా కెమెరా ఏర్పాటు చేస్తారు) - పోలింగ్స్టేషన్లో పోలింగ్ ఏజెంట్ల కదలికలు - పోలింగ్ ముగింపు సమయంలో ఇంకా ఓటేసేందుకు వరుసలో నిలబడిన ఓటర్లకు టోకెన్లు/స్లిప్పులు అందించే ప్రక్రియ - పోలింగ్ ముగిశాక ఈవీఎంలు (బ్యాలెట్ యూనిట్/కంట్రోల్ యూనిట్), వీవీ ప్యాట్లను సీల్‌వేసే దృశ్యం.. పోలింగ్ ఏజెంట్లకు 17సీ కాపీలు అందజేయడం.. ఇవన్నీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తారు. ఎలక్షన్ ‘టెక్’..: - ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఉన్న అభ్యంతరాలు, సందేహాలను తీర్చడానికి ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ పాట్) కీలకపాత్ర పోషించనుంది. ఇది.. ఎవరికి ఓటు వేశామనేది ఏడు క్షణాల పాటు తెరపై చూపించనుంది. - పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ప్రచార ర్యాలీలు, బహిరంగసభలకు సత్వర అనుమతుల కోసం ‘సువిధ’ మొబైల్ యాప్ అమల్లోకి వచ్చింది. - ఎన్నికల్లో అక్రమాలు, అవినీతి, డబ్బుల పంపిణీ, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సా మాన్య పౌరులు నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ‘సీ–విజిల్’ యాప్ ప్రవేశపెట్టారు. - ఈఆర్వో నెట్ వెబ్సైట్లో రాష్ట్ర ఓటర్ల జాబితాను ఉంచారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలకు ఈ వెబ్సైట్ అనుసంధానంగా పనిచేయనున్నది. బరిలో 89 పార్టీలు.. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నుం చి 89 పార్టీలు (ఇండిపెండెంట్లు అదనం) బరి లో దిగాయి. బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి జాతీయ పార్టీలు, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఏఐఎంఐ ఎం, రాష్ట్ర పార్టీలు, ఆప్, ఏఐఎఫ్బీ, ఐయూఎం ఎల్, జేడీ (ఎస్), జేడీ (యూ), లోక్‌జనశక్తి పా ర్టీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, శివసేన, ఎస్ పీ, అఖిల భారత జనసంఘ్, సీపీఐ (ఎంఎల్) రెడ్‌స్టార్, సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తదితర 70 పార్టీలు పోటీ చేశాయి. ...::: మహమ్మద్ ఫసియొద్దీన్ -
పోలింగ్ బూత్‌లలో వెబ్ కాస్టింగ్
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 54 సమస్యాత్మక బూత్‌లను అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమస్యాత్మక బూత్‌లతోపాటు సాధారణ బూత్‌లలో సైతం ఇలాంటి చర్యలు చేపట్టాలని సూచిస్తే తప్పకుండా నియోజకవర్గంలోని 235 కేంద్రాల్లో వెబ్‌క్యాస్ట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులచే వెబ్ క్యాస్టింగ్‌కు నియమిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని, ల్యాప్‌టాప్ కలిగిన యవతరం వెబ్ క్యాస్టింగ్‌కు అర్హులని ఆయన తెలిపారు. అలాగే బూత్‌ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే ప్రతీ బూత్‌ల వద్ద ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టాలని, అనేక ప్రాంతాల్లో ర్యాంప్‌ల నిర్మాణాలు దాదాపు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అలాగే విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, వృద్ధులు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు, సిబ్బంది గ్రామగ్రామాన ప్రతీ పోలింగ్ స్టేషన్లో సరైన ఏర్పాట్లు చేసేందుకు పనులు ప్రారంభించారు. పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చని, లేదా వేములవాడ నియోజకవర్గం టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 3465 కాల్ చేసి చెప్పవచ్చన్నారు. ఆదివారం నామినేషన్లకు సెలవు... ఈనెల 12న నోటిఫికేషన్ వెలువడటంతోపాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. అయితే మధ్యలో ఆదివారం సెలవు దినం రావడంతో ఆ రోజు నామినేషన్లు వేసేందుకు లేదని ఆయన తెలిపారు. 19తో ముగియనున్న నామినేషన్ల పర్వం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 12 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభించిన రిటర్నింగ్ అధికారులు ఈనెల 19 మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేసే వాళ్లు తమ కార్యాలయానికి రావచ్చని, ఎన్నికల నిబంధనల మేరకు తమ నామినేషన్ పత్రాలు అందజేయవచ్చని సూచించారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు విత్‌డ్రాలు, వచ్చేనెల 7న ఉదయం 7 గంటల నుచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్,11న సిరిసిల్ల మండలం బద్దెనపల్లిలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వచ్చేనెల 13తో ఎన్నికల బాధ్యతలు పూర్తవుతాయని ఆయన తెలిపారు. -
స్మార్ట్‌సిటీ లపై దిశానిర్దేశం చేసిన ప్రధాని
వెబ్‌కాస్టింగ్ ద్వారా బల్దియాలో ప్రసారం కరీంనగర్‌కార్పొరేషన్ : పట్టణ ప్రజల జీవన విధానంలో మార్పు తేవడమే స్మార్ట్‌సిటీల ల క్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శని వారం మహారాష్ట్రలోని పుణే స్మార్ట్‌సిటీ ప్రా రంభోత్సవం, అమృత్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రసారం చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వెబ్‌స్క్రీన్ ఏ ర్పాటుచేసి పాలకవర్గ సభ్యులు, అధికారు లు వీక్షించారు. స్మార్ట్‌సిటీ, అమృత్ పథకంలో చేరిన నగరాల పాలకవర్గాలు, అధికారులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సాధ్యమన్నారు. 24 గంటల నీటిసరఫరా, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వే యాలని సూచించారు. ఈ-ఆఫీస్‌ల ద్వారా అన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టాల న్నారు. మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు, అధికారులు పా ల్గొన్నారు. కాగా ఇంటర్నెట్లో ఏర్పడ్డ సాంకేతికలోపంతో కొంత నిరాశకు గురయ్యూరు. కార్యక్రమానికి ముందే అన్ని సరిచూసుకోవాల్సిన సిబ్బంది తీరా సమయానికి హడావిడి పడడం కనిపించింది. -
వెబ్ కాస్టింగ్ చేయాలంటే...
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ చేయడానికి ఆసక్తి గల ఇంజినీరింగ్ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలని కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. సొంత ల్యాప్‌టాప్ ఉన్న విద్యార్థులు www.ghmc.gov.in వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వీరికి వెబ్ కాస్టింగ్‌పై గంటసేపు శిక్షణనిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ రోజు(ఫిబ్రవరి 2) ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వెబ్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు నగదు పారితోషకంతో పాటు ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తామన్నారు. పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి ఒకటిన రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
‘లాటరీ’ ప్రత్యక్ష ప్రసారం..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) ఈ నెల 25న నిర్వహించనున్న లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ‘వెబ్ కాస్టింగ్’ ద్వారా లాటరీ ప్రక్రియను ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయడంలో మాడా టెక్నిషియన్లు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంతోపాటు విరార్, కొంకణ్ రీజియన్‌లో మాడా దాదాపు 2,649 ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉంచింది. వీటికి ఈ నెల 25న బాంద్రాలోని రంగశారద సభా గృహంలో లాటరీవేసి అర్హులైన వారికి ఇళ్లు అందజేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాని ఆ రోజు ఎంతో ఆతృతతో అక్కడికి వచ్చే వేలాది జనాన్ని రంగశారద సభాగృహంలోకి అనుమతించేందుకు వీలులేదు. సభాగృహం పరిసరాల్లో ఒక్కసారిగా వేల సంఖ్యలో జనం గుమిగూడడంతో ట్రాఫిక్ జాం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు టెండర్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రచారంచేస్తే అత్యధిక శాతం మంది తమ ఇళ్లవద్దే ఉండిపోతారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు వీలులేని వారు లేదా సభా గృహానికి వచ్చేందుకు వీలుపడనివారి సౌకర్యార్థం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అర్హులైన వారి పేర్లు, వెయిటింగ్ లిస్టు జాబితా తదితర వివారాలను మాడా వెబ్ సైట్లో ఉంచుతారు. ఈ గృహాల కోసం లక్షకుపైనే దరఖాస్తులు వచ్చాయి. వాటిలోకొందరు ప్రత్యక్షంగా, మరికొందరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. పరిశీలన అనంతరం అర్హులుగా తేలిన 93,128 మంది దరఖాస్తులకు ఆ రోజు లాటరీ వేయనున్నట్లు మాడా ముంబై రీజియన్ ప్రధాన అధికారి నిరంజన్‌కుమార్ సుధాంశు అన్నారు. ఇదిలా ఉండగా లాటరీలో ఇళ్లు రాని వారి డిపాజిట్ సొమ్మును వారం, పది రోజుల్లో వారి ఖాతాల్లో డిపాజిట్ చేస్తామని ఆయన వివరించారు. -
జిల్లాలో 2085 పోలింగ్ కేంద్రాలు
475 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ 2562 మంది పీఓలు, 10వేల మంది పోలింగ్ సిబ్బంది కలెక్టర్ కాంతిలాల్ దండే విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 2085 పోలింగ్ కేంద్రాలు గుర్తించామని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ కేంద్రాల్లో 416 అతి సున్నితమైన, 304 సున్నితమైన, 287 సమస్యాత్మక కేంద్రాలున్నాయన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో ఆదివారం రాత్రి జరిగిన జనరల్ అబ్జర్వర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెబ్ కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకులు, వీడియో గ్రఫీ ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 475 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 355 ప్రాంతాలలో సూక్ష్మ పరిశీలకులు, 194 కేంద్రాలలో వీడియోగ్రఫీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు సమక్షంలో సూక్ష్మ పరిశీలకులు కేటాయింపును ర్యాండమైజేషన్ ద్వారా నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2562 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 2562 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 10 వేల మంది ఇతర పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. రెండవ ర్యాండమైజేషన్ ద్వారా నియోజక వర్గాల కేటాయింపు జరిగిందని , మూడవ ర్యాండ మైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు విజయ్ బహుదూర్ సింగ్, దినేష్ కుమార్ సింగ్, అజయ్ శంకర్ పాండే, స్వపన్ కుమార్ పాల్, నరేందర్ శంకర్ పాండే, సంయుక్త కలెక్టర్ బి.రామారావు, అదనపు సంయుక్త కలెక్టర్ యు.సి.జి. నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అదికారి బి.హెచ్.ఎస్.వెంకటరావు, ముఖ్య ప్రణాళికాధికారి మోహనరావు, ఇన్మర్మేటిక్ అధికారి నరేంద్ర, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు తొలి విడత ‘స్థానిక’ పోరు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 6వ తేదీన పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 మండలాల్లో 36 జెడ్పీటీసీ, 512 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మొత్తం 2,434 పోలింగ్ కేంద్రాల్లో 162 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థులచే వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు 400 మంది సూక్ష్మ పరిశీలనకులను నియమించారు. ఎన్నికలు జరగనున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను అవసరమైన మేరకు తరలించారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణనిచ్చారు. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. మార్చి 10, 2014 నాటి కి సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో గ్రామీణ ఓటర్లు 20,21,330 మంది కాగా.. పురుషులు 10,05,352, మహిళలు 10,15,976 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు మహిళా ఓటర్లపైనే అత్యధికంగా దృష్టి సారించారు. -
వెబ్బు.. చాలదు డబ్బు
ఏలూరు, న్యూస్‌లైన్:వెబ్‌క్యాస్టింగ్ నడుమ పోలింగ్ నిర్వహించే విషయంలో అధికారులకు ఆటుపోట్లు తప్పడం లేదు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ తీరు చిత్రీకరణకు వెబ్‌క్యాస్టింగ్ విధానాన్ని అమలు చేయూలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. పోలింగ్ సందర్భంగా తలెత్తే ఇబ్బందులను ఆన్లైన్లో చూడటం ద్వారా అధికారులు అప్రమత్తం కావడానికి ఈ విధానం ఉపకరిస్తుంది. అరుుతే, దీనిని అందిపుచ్చుకునేందుకు అధికారులు అగచాట్లు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు కలిగిన ల్యాప్‌టాప్ కంప్యూటర్లను ఏర్పాటు చేసి, వాటిని ఆపరేట్ చేసే వ్యక్తుల అవసరం చాలా ఉంది. ఇందుకోసం ఇంజినీరింగ్, ఎంసీఏ విద్యార్థులను ఉపయోగిస్తున్నారు. అరుుతే, వీరు జిల్లా అంతటా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ల్యాప్‌టాప్‌లు గల విద్యార్థుల వివరాలను ఇవ్వాల్సిందిగా కళాశాలల యూజమాన్యాలను యంత్రాంగం కోరుతోంది. కాగా వచ్చే నెలలో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ పెద్దఎత్తున వెబ్ కెమెరాలు వినియోగించాల్సి రావటం అధికారులను కలవరపరుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం 3,038 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, కనీసం సగం కేంద్రాల్లోనైనా వెబ్‌క్యాస్టింగ్ అవసరం అవుతుందని భావిస్తున్నారు. అరకొరగా ఐదొందలు ల్యాప్‌టాప్‌ల కోసం జెడ్పీ అధికారులు టెండర్లు పిలిచారు. దీనికి స్పందన లభించలేదు. దీంతో ల్యాప్‌టాప్ కలిగిన విద్యార్థులు రోజంతా పోలింగ్ కేంద్రంలో వెబ్‌క్యాస్టింగ్ చేస్తే రూ.500 ఇస్తామని అధికారులు ప్రకటించారు. అక్కడక్కడా ఔత్సాహికులైన కొందరు తప్ప విద్యార్థులెవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. గత నెల 30న నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌లో విద్యార్థుల సేవలను వినియోగించుకున్నప్పటికీ ఎంత సొమ్ము ఇస్తారనేది ముందుగా చెప్పలేదు. చివరకు స్థానిక అధికారులు బేరాలు ఆడటంతో విద్యార్థులు వెబ్‌క్యాస్టింగ్ సేవలందించేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమించాలనేది అధికారులకు అర్థం కావడం లేదు. -
పోలింగ్ ప్రశాంతం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీపోలింగ్ సమస్య ఎక్కడా తలెత్తలేదన్నారు. అయితే పోలింగ్ 80 శాతం ఆశించగా.. 71.09 శాతానికే పరిమితమైందన్నారు. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈ శాతం కాస్త మెరుగేనన్నారు. ఇటీవల నగర పంచాయతీలుగా మారిన గూడూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరులో పోలింగ్ సంతృప్తికరంగా ఉందన్నారు. పోలింగ్ ప్రారంభంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం తదితర సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించామన్నారు. 225 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓటరుగా నమోదు కావడమే కాదు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైనత్యం తీసుకొస్తామని తెలిపారు. ఈ విషయమై కళాజాతలతో అవగాహన కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు -
మున్సి‘పోలింగ్’ 77.14 శాతం
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఈవీఎంల మొరాయింపు వంటి స్వల్ప ఘటనలు మినహా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీ పోలీస్ బందోబస్తు, వెబ్ కాస్టింగ్ నిఘా వంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడంతో జిల్లా అధికార యంత్రాంగం సఫలీకృతమైంది. సగటున 77.14 శాతం పోలింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో జరిగిన ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, చాలా చోట్ల ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరడం, ఈవీఎం మొరాయించి ఓటింగ్ ఆలస్యం కావడం వంటి కారణాలతో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా కొనసాగింది. -
ఓటింగ్‌లో వందశాతం పాల్గొనాలి
భైంసా/భైంసారూరల్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు లొంగకుండా వందశాతం ఓటింగ్‌లో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అహ్మద్ బాబు సూ చించారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం భైంసా పట్టణానికి వచ్చిన కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల అధికారి ప్రభాకర్, ముథోల్ ఎన్నికల అధికారి ఎస్ఎస్ రాజుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది ఈవీఎంలు, పోలిం గ్ సామగ్రి పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈవీ ఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. కౌం టింగ్ నిర్వహించే హాలుకు వెళ్లారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన.. పట్టణంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ అహ్మద్‌బాబు రెండు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కుంట ప్రాం తంలోని నాలుగో పోలింగ్ కేంద్రంలో సిబ్బందితో చర్చిం చారు. ఓటరు జాబితాను పరిశీలించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేదని, పోలింగ్‌లో పాల్గొనే వారు సమయం అయిపోయాక వచ్చే అవకాశం ఉందని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రత్యేక బలగాలను మోహరించాలని డీఎస్పీ గిరిధర్‌కు ఆదేశాలిచ్చారు. పాఠశాల చుట్టూ కట్టెలతో భారీకేడ్లను ఏర్పాటు చేయించాలని మున్సిపల్ ఎన్నికల అధికారులకు సూచించారు. ఫిల్టర్‌బెడ్ ప్రాంతంలోని ఏడో పోలింగ్ కేంద్రానికి వెళ్లి వెబ్ కాస్టింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థి ల్యాప్‌టాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లోని దృశ్యాలను చిత్రీకరించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల కార్యాల యానికి పంపించేలా అ నుసంధానం చేశారు. ఈ విధానాన్ని కలెక్టర్ ప రిశీలించారు. నెట్ సౌకర్యంలో తలెత్తుతున్న ఇబ్బందులపై బీఎస్ఎన్ఎల్ ఇంజినీర్లను ప్రశ్నిం చారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూడాలని సూచించా రు. వెబ్‌కాస్టింగ్ విధానంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో నిఘా.. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో ఆదివారం జరగబోయే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అహ్మద్‌బాబు వివరించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆరు మున్సిపాలిటీల్లో 327 వార్డుల్లో పోలింగ్ జరుగబోతోందని, 2 వేల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. 320 మంది ట్రిపుల్ఐటీ విద్యార్థులతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్ట్ విధానంలో అక్కడి చిత్రాలను ప్రధాన ఎన్నికల కార్యాలయాలకు పంపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఇందుకుగాను 170 మంది మైక్రో అబ్జర్వర్లను, మరో 120 మంది వీడియో గ్రాఫర్లను నియమించామన్నారు. పోలింగ్ తీరుపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
మున్సి‘పల్స్’పోలింగ్ నేడే
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు విజయవాడ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు 945 పోలింగ్ కేంద్రాలు సిద్ధం ఈవీఎంలలోనే పోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఆదివారం జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి శనివారం ఈవీఎంలు తదితర సామగ్రిని అందజేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించిన అనంతరం శనివారం మధ్యాహ్నం నుంచి అధికారులు పోలింగ్స్టేషన్లకు తరలివెళ్లారు. పోలింగ్ సామగ్రి పంపిణీలో, సిబ్బంది నియామకంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు సకాలంలో స్పందించటంతో పరిస్థితి చక్కబడింది. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఎన్నికల సామగ్రిని, సిబ్బందిని నియమించే సమయంలో కొంత గందరగోళం నెలకొంది. దూరప్రాంతాల నుంచి వచ్చినవారిని ఎన్నికల విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు జాప్యం చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు వాగ్వాదానికి దిగారు. ఏజేసీ చెన్నకేశవరావు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికల విధుల్లో 1088 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1088 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 3700 మంది సిబ్బందిని నియమించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సిబ్బందిని నియమించిన అనంతరం మిగిలినవారిని రిజర్వులో ఉంచారు. ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు పనిచేయకుంటే వెంటనే వాటిని మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 10.21 లక్షల మంది ఓటర్లు... విజయవాడ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 10 లక్షల 21 వేల 914 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 218 వార్డుల్లో 859 మంది, విజయవాడ కార్పొరేషన్‌లోని 59 డివిజన్లలో 508 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 277 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల్లోని మొత్తం 945 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఓటుకు రూ.2,500... పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నా వారి కళ్లుగప్పి అభ్యర్థుల అనుచరులు మద్యం పంపిణీలో తమ పంతం నెగ్గించుకున్నారు. శనివారం రాత్రి మద్యం పంపిణీ అన్ని ప్రాంతాల్లో జోరుగా సాగింది. గత రెండు, మూడు రోజులుగా ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం అభ్యర్థులు గుట్టుగా చేపట్టారు. ఉయ్యూరు పురపాలక సంఘంలోని ఓ వార్డులో టీడీపీ, ఇండిపెండెంట్ల అభ్యర్థుల మధ్య నగదు పంపిణీలో పోటీ నెలకొనడంతో ఒక్కొక్కరు ఓటరుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. జగ్గయ్యపేట పురపాలక సంఘంలోనూ ఒకటి, రెండు వార్డుల్లో నగదు పంపిణీ చేశారు. తిరువూరు పురపాలక సంఘంలో ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో ఓటుకు రూ.200 నుంచి రూ.500 వరకు పంపిణీ చేశారు. -
ఎన్నికలు సమర్థంగా నిర్వహించండి
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 30న జరగనున్న పురపాలక సంఘ ఎన్నికలను పారదర్శకంగానూ, సమర్థంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు ధనుంజయరెడ్డి ఆదేశిం చారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపైన ఇస్తున్న శిక్షణను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ రోజున రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీవిఎం యూనిట్లను పరిశీలించి ఓటింగ్‌కు సిద్ధం చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లలో ఏదో ఒకటి ఉండేలా చర్యలు చేపట్టాల న్నారు. పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా అమలుచేయాలని ధనుంజయ్ రెడ్డి ఆదేశించారు. ఎన్నిక ల వ్యయానికి సంబంధించిన నివేదికలు అభ్యర్థిపరంగా పారదర్శకంగా నివేదించాలన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల వ్యయంపై ఫిర్యాదులను 9177745658 నంబరుకు ఫోన్ చేసి నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఆర్డీఓ జె.వెంకటరావు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.