‘లాటరీ’ ప్రత్యక్ష ప్రసారం..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) ఈ నెల 25న నిర్వహించనున్న లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ‘వెబ్ కాస్టింగ్’ ద్వారా లాటరీ ప్రక్రియను ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయడంలో మాడా టెక్నిషియన్లు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంతోపాటు విరార్, కొంకణ్ రీజియన్‌లో మాడా దాదాపు 2,649 ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉంచింది. వీటికి ఈ నెల 25న బాంద్రాలోని రంగశారద సభా గృహంలో లాటరీవేసి అర్హులైన వారికి ఇళ్లు అందజేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాని ఆ రోజు ఎంతో ఆతృతతో అక్కడికి వచ్చే వేలాది జనాన్ని రంగశారద సభాగృహంలోకి అనుమతించేందుకు వీలులేదు. సభాగృహం పరిసరాల్లో ఒక్కసారిగా వేల సంఖ్యలో జనం గుమిగూడడంతో ట్రాఫిక్ జాం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు టెండర్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రచారంచేస్తే అత్యధిక శాతం మంది తమ ఇళ్లవద్దే ఉండిపోతారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు వీలులేని వారు లేదా సభా గృహానికి వచ్చేందుకు వీలుపడనివారి సౌకర్యార్థం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అర్హులైన వారి పేర్లు, వెయిటింగ్ లిస్టు జాబితా తదితర వివారాలను మాడా వెబ్ సైట్‌లో ఉంచుతారు.
ఈ గృహాల కోసం లక్షకుపైనే దరఖాస్తులు వచ్చాయి. వాటిలోకొందరు ప్రత్యక్షంగా, మరికొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. పరిశీలన అనంతరం అర్హులుగా తేలిన 93,128 మంది దరఖాస్తులకు ఆ రోజు లాటరీ వేయనున్నట్లు మాడా ముంబై రీజియన్ ప్రధాన అధికారి నిరంజన్‌కుమార్ సుధాంశు అన్నారు. ఇదిలా ఉండగా లాటరీలో ఇళ్లు రాని వారి డిపాజిట్ సొమ్మును వారం, పది రోజుల్లో వారి ఖాతాల్లో డిపాజిట్ చేస్తామని ఆయన వివరించారు.