Maharashtra Housing
-
సమాచార శాఖ పనితీరు భేష్
హైదరాబాద్ పర్యటనలో మహారాష్ట్ర ఐఅండ్‌పీఆర్ బృందం ప్రశంస సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సకాలంలో మీడియాకు చేరవేస్తూ తెలంగాణ సమాచార శాఖ (పబ్లిసిటీ సెల్) ప్రశంసనీయంగా పనిచేస్తోందని సోమవారం సచివాలయంలో మహారాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ అజయ్ అంబేకర్ కితాబునిచ్చారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల అధ్యయనానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం అజయ్ అంబేకర్ అధ్యక్షతన సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లు సురేఖ ములే, ప్రవీణ్ టాకే, విలాస్ బోడాకేలతో కూడిన అధికారుల బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రచార విభాగం ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ పబ్లిసిటీ సెల్ పనితీరును మహారాష్ట్ర బృందానికి వివరించారు. మహారాష్ట్రలో జర్నలిస్టులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అజయ్ వివరించారు. తెలంగాణ జర్నలి స్టులకు అందుతున్న ఫలాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార పౌర సం బంధాల శాఖలో ఉత్తమంగా అమలవు తున్న వాటిని తమ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ పథకం చాలా బావుందని, దీన్ని అధ్యయ నం చేసి నివేదికను తమ ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అంతకు ముందు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై అక్రిడిటేషన్ జారీ విధానం, మీడియాకు ప్రకటనల జారీ, వివిధ ప్రభుత్వ కార్యక్ర మాలు, ప్రము ఖుల సమావేశాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు, జర్నలిస్టులకు రాయితీలు తదితర పథకాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సమాచార పౌరసం బంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఎల్. ఎల్.ఆర్.కిశోర్ బాబు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ సుజాత, డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశం, భాస్కర్, మధుసూ దన్, శ్రీనివాస్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు దామోదర్, విజయభాస్కర్‌రెడ్డి, అకౌంట్స్ అధికారి శౌరిరెడ్డి పాల్గొన్నారు. -
‘స్పందన’ లేని ఇళ్లు ఇతరులకు కేటాయింపు
సాక్షి, ముంబై: లాటరీలో ఇల్లు వచ్చినా ఇంతవరకు వాటిని స్వాధీనం చేసుకోని కార్మికుల కోసం గాలింపు చర్యలు ఇక నిలిపివేయాలని మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) నిర్ణయం తీసుకుంది. పలుమార్లు పోస్టు ద్వారా ఉత్తరాలు పంపించినప్పటికీ వారి నుంచి స్పందన రావడం లేదు. ఇంతకూ వారున్నారా...? లేరా..? తప్పుడు చిరునామా ఇచ్చారా...? అనేది కూడా అంతుచిక్కడం లేదు. దీంతో వారికోసం వేచి ఉండటం మానేసి వెయిటింగ్ లిస్టులో ఉన్న కార్మికులకు ఆ ఇళ్లు అందజేయాలని మాడా పరిపాలన విభాగం యోచిస్తోంది. మిల్లు కార్మికుల కోసం మాడా మొదటి విడతలో నిర్మించిన 6,925 ఇళ్లకు 2012 జూన్‌లో లాటరీ వేసింది. ఆ సమయంలో మిల్లు కార్మికుల నుంచి 1.48 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత మాడా అధికారులు పరిశీలన పనులు పూర్తిచేసి అర్హులైన 58 వేల దరఖాస్తులకు లాటరీ వేశారు. ఇందులో ఇల్లు వచ్చిన కార్మికులకు ఇళ్ల తాళాలు అందజేసే ప్రక్రియ ప్రారంభించింది. కాని లాటరీలో ఇల్లు వచ్చిన 625 మంది కార్మికులు మాడాతో సంప్రదింపులు జరపలేదు. దీంతో దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ 260 ఇళ్లు అలాగే పడి ఉన్నాయి. దీంతో వాటిని వెయిటింగ్లో ఉన్నవారికి అందజేయాలని మాడా అధికారులు నిర్ణయించారు. -
మిల్లు కార్మికులకు ఇళ్లు..
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు శుభవార్త. వారికి త్వరలో ఆరు వేల ఇళ్లు వడాల ప్రాంతంలో అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన ఎనిమిది ఎకరాల స్థలాన్ని వాడియా గ్రూప్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు వడాలలోని బాంబే డయింగ్ యూనిట్లో ఉన్న స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించించింది. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) కూడా అంగీకరించింది. దీంతో అందులో మిల్లు కార్మికుల కోసం ఆరువేల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మాడాకు మార్గం సుగమమైంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి... వాడియా గ్రూప్ యజమానికి ప్రభాదేవి, వడాల ప్రాంతంలో మిల్లు స్థలాలున్నాయి. ప్రభుత్వ నియమావళి 58 ప్రకారం మొత్తం స్థలాన్ని మూడు భాగాలు చేయాలి. అందులో ఒక భాగం మిల్లు యజమానికి, రెండో భాగం బీఎంసీకి, మూడో భాగం మాడాకు అప్పగించాలి. ఆ ప్రకారం ప్రభాదేవి, వడాలలో ఉన్న స్థలాలను అప్పగించాలని మాడా పట్టుబట్టింది. కాని ఆ స్థలాన్ని ఇచ్చేందుకు అప్పట్లో వాడియా గ్రూపు నిరాకరించింది. దీంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. కాని కోర్టులో ఈ కేసు ఎటూ పరిష్కారం కాకుండా పెండింగులో పడిపోయింది. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన వాడియా గ్రూపు నియమాల ప్రకారం బాంబే డయింగ్ నుంచి రావల్సిన ఒక భాగం స్థలాన్ని వడాలలో ఉన్న యూనిట్లో ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఒకే చోట రెండు భాగాల స్థలం లభించడంతో పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మించేందుకు అవకాశం లభించింది. మాడా 2012లో 6,925 ఇళ్లు నిర్మించి వాటిని లాటరీ ద్వారా అర్హులైన వారికి అందజేసిన విషయం తెలిసిందే. వడాలలో నిర్మించనున్న ఆరు వేల ఇళ్లకు త్వరలో లాటరీ వేసేందుకు రంగం చేయనుంది. -
అదనపు రాబడి వేటలో మాడా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివద్ధి సంస్థ (మాడా) అదనపు రాబడి వేటలో పడింది. ఇందులోభాగంగా సొంత భవనాలపై ప్రకటనలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించనుంది. ఇటీవల జరిగిన మాడా పరిపాలన విభాగం సమావేశంలో ఈ బృహత్తర నిర్ణయానికి అధికారులు ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఈ సంస్థ వీలైనంత త్వరగా ప్రారంభించనుంది. నగరంలో అక్కడక్కడ మాడాకు చెందిన 56 కాలనీలు ఉండగా, అందులో మూడు వేలకుపైగా భవనాలున్నాయి. ఇందులో కొన్ని భవనాలను అందులో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు (ఓనర్షిప్) కల్పించి నిర్వహణ బాధ్యతలను వారికే అప్పగించింది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక భవనాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఇందులో కొన్ని భవనాలు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్నాయి. మరికొన్ని కీలక ప్రాంతాలు, రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద ఉన్నాయి. వీటిపై ప్రకటనలు ఏర్పాటుకు వివిధ వాణిజ్య సంస్థలు ఏనాటి నుంచో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని అనేక ప్రైవేటు భవనాలపై ప్రకటనల బోర్డులు, హోర్డింగులు విపరీతంగా వెలుస్తున్నాయి. వాటివల్ల ఆ భవన యజమానులకు అదనపు రాబడి వస్తోంది. ఇదే తరహాలో తన సొంత భవనాలపై ప్రకటనలు ఏర్పాటుచేస్తే అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని మాడా భావించింది. అయితే ఈ నిర్ణయం నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు ఎంతమేర స్పందిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల మాడా భవనాలపై మొబైల్ టవర్లను ఏర్పాటుచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మొబైల్ కంపెనీలు మాత్రం ఆ భవనాలపై టవర్ల ఏర్పాటుపై ఆసక్తి కనబర్చలేదు. ఇప్పుడు ప్రకటనలు, హోర్డింగులు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంజూరు ఇచ్చినప్పటికీ వాణిజ్య సంస్థల నుంచి ఎంతమేర స్పందన వస్తుంది...? ఎంత మేర ఆదాయం రానుందనే విషయం త్వరలో స్పష్టం కానుంది. -
‘లాటరీ’ ప్రత్యక్ష ప్రసారం..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) ఈ నెల 25న నిర్వహించనున్న లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ‘వెబ్ కాస్టింగ్’ ద్వారా లాటరీ ప్రక్రియను ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయడంలో మాడా టెక్నిషియన్లు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంతోపాటు విరార్, కొంకణ్ రీజియన్‌లో మాడా దాదాపు 2,649 ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉంచింది. వీటికి ఈ నెల 25న బాంద్రాలోని రంగశారద సభా గృహంలో లాటరీవేసి అర్హులైన వారికి ఇళ్లు అందజేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాని ఆ రోజు ఎంతో ఆతృతతో అక్కడికి వచ్చే వేలాది జనాన్ని రంగశారద సభాగృహంలోకి అనుమతించేందుకు వీలులేదు. సభాగృహం పరిసరాల్లో ఒక్కసారిగా వేల సంఖ్యలో జనం గుమిగూడడంతో ట్రాఫిక్ జాం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజు టెండర్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రచారంచేస్తే అత్యధిక శాతం మంది తమ ఇళ్లవద్దే ఉండిపోతారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు వీలులేని వారు లేదా సభా గృహానికి వచ్చేందుకు వీలుపడనివారి సౌకర్యార్థం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అర్హులైన వారి పేర్లు, వెయిటింగ్ లిస్టు జాబితా తదితర వివారాలను మాడా వెబ్ సైట్లో ఉంచుతారు. ఈ గృహాల కోసం లక్షకుపైనే దరఖాస్తులు వచ్చాయి. వాటిలోకొందరు ప్రత్యక్షంగా, మరికొందరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. పరిశీలన అనంతరం అర్హులుగా తేలిన 93,128 మంది దరఖాస్తులకు ఆ రోజు లాటరీ వేయనున్నట్లు మాడా ముంబై రీజియన్ ప్రధాన అధికారి నిరంజన్‌కుమార్ సుధాంశు అన్నారు. ఇదిలా ఉండగా లాటరీలో ఇళ్లు రాని వారి డిపాజిట్ సొమ్మును వారం, పది రోజుల్లో వారి ఖాతాల్లో డిపాజిట్ చేస్తామని ఆయన వివరించారు. -
‘మాడా’ ఇళ్లకు మంచి గిరాకీ
మాడా నిర్మించిన 2,641 ఇళ్లకు 94,118 దరఖాస్తులు రావడంతో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నెల 25న లాటరీ నిర్వహిస్తారు. సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) నిర్మించిన 2,641 ఇళ్లకు 94,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల దారుల నుంచి డిపాజిట్ రూపంలో సేకరించిన రూ.286.94 కోట్లు మాడా ఖాతాలోకి చేరాయి. ఈ ఇళ్లకు నెల 25న బాంద్రాలోని రంగశారద సభాగృహంలో మాడా లాటరీ నిర్వహించనుంది. ఇందులో ఇళ్లు వచ్చిన వారు దరఖాస్తుతో చెల్లించిన డిపాజిట్ డబ్బులు మినహా మిగతా మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. ఇళ్లురాని వాళ్లు దరఖాస్తు సమయంలో చెల్లించిన మొత్తాన్ని తమ తమ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లీ డిపాజిట్ చేస్తామని మాడా ప్రజా సంబంధాల అధికారి వైశాలి సదానంద్ సింగ్ చెప్పారు. ముంబై రీజియన్‌లో ప్రతీక్షానగర్ (సైన్), మాన్‌ఖుర్ద్, తుంగవా (పవాయి), వినోబాభావే నగర్ (కుర్లా), శేలేంద్ర నగర్ (దహిసర్), మాగఠ్నే (బోరివలి), కోలేకల్యాణ్ (శాంతక్రజ్) ప్రాంతాల్లో మాడా 814 ఇళ్లు నిర్మించింది. అలాగే కొంకణ్ రీజియన్‌లోని విరార్-బోలింజ్ ప్రాంతంలో,1,716 ఇళ్లు, వెంగుర్లా (సింధుదుర్గ్)లో 111 ఇళ్లు నిర్మించింది. వీటికి ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11 సాయంత్రం వరకు గడువు విధించింది. గడువు ముగిసిన తరువాత దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్టు తేలింది. డిపాజిట్లు చెల్లించి దరఖాస్తు చేసుకున్నవి 94,118 ఉన్నాయి. ఈ దరఖాస్తుదారుల నుంచి లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుదారుల్లో 59,120 మంది డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా రూ.169.59 కోట్లను మాడా ఖాతాలో జమ చేశారు. అలాగే ఆన్లైన్ విధానంలో 34,998 మంది దరఖాస్తుదారులు రూ.117.35 కోట్లు చెల్లించారని వైశాలి చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను లెక్కిస్తే మరింత నగదు వస్తుందని ఆమె అన్నారు. -
భారీగా తగ్గిన మాడా ఇళ్ల ధరలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త. ఇళ్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. 70 వేల రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకూ తగ్గే అవకాశం ఉంది. సహ్యాద్రి అతిథి గృహంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాడా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నారు. కొన్ని సంవత్సరాలుగా మాడా నిర్మిస్తున్న ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఇలా ఏటా ధరలు పెరగుతుండటంతో స్పందన తగ్గింది. ఇళ్లకోసం దరఖాస్తు చేసుకునేవారే కరువయ్యారు. కారణమేంటని సమీక్షించిన మాడా ధరలు పెరిగిపోవడమేనని తెలుసుకుంది. దీంతో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయిస్తే కొనుగోలుదారులనుంచి భారీగా స్పందన వస్తుందని అధికారులు భావించారు. అందుకోసం సమీక్షా సమావేశం నిర్వహించి ఇళ్ల వ్యయానికి వడ్డీ రేటును తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 14.5 శాతం వడ్డీ విధిస్తున్నారు. ఇప్పుడు దానిని నాలుగుశాతం తగ్గించి 10 శాతం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఇళ్ల ధరలు 70 వేల నుంచి రెండున్నర లక్షలవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది జూన్ 15న నిర్వహించే లాటరీకి దరఖాస్తు చేసుకున్నవారికే వర్తిస్తుందని మాడా అధికారులు వెల్లడించారు. మిల్లు కార్మికుల ఇబ్బందులు: మూతపడిన మిల్లు స్థలాల్లో కార్మికుల కోసం మాడా నిర్మించిన ఇళ్లను అర్హులకు అందజేయుడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. మాడా లాటరీ వేసి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. అందులో అర్హులైన కొందరికి మాత్రమే ఇళ్లు పంపిణీ చేయుడం జరిగింది. అనర్హులకు విచారణ (హియరింగ్) ప్రక్రియు పూర్తిచేయుగా వారు సంబంధిత పత్రాలు సమర్పించారు. వారిని అర్హులుగా పరిగణించి ఇళ్లు పంపిణీ చేయూలి. కాని కావాలనే జాప్యం చేస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు నిలదీయగా పత్రాలు పరిశీలించే పనులు వెంటనే పూర్తిచేసి నెల రోజుల్లో ఇళ్లు అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ హామీ ఇచ్చి కూడా రెండు నెలలు పూర్తికావస్తోంది. ఇంతవరకూ ఏ ఒక్కరికీ ఇంటిని అప్పగించలేదు. అర్హులైన పేదలు చెప్పులరిగేలా మాడా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది మాత్రం సకాలంలో పనులు పూర్తి చేయుడం లేదు. మొన్నటివరకు లోక్‌సభ ఎన్నికల పనుల్లో హడావుడిగా ఉన్న మాడా అధికారులు తిరిగి విధుల్లోకి చేరారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే... ‘మీ ఫైలు సంతకాల కోసం పైఅధికారి వద్దకు పంపించామం’టూ దాటవేస్తున్నారు. సంతకాల పేరుతో నెలలు నెలలు తిప్పించుకుంటున్నారు. లంచాలు గుంజేందుకు కొందరు అధికారులు ఇలా సంతకాల డ్రామా ఆడుతున్నారని, కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లు కార్మిక సంఘాల ప్రతినిధులు దీనిపై దృష్టిసారించి వెంటనే ఇళ్ల పంపిణీ ప్రక్రియు పూర్తిచేసి వారికి న్యాయం చేయాలని కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ విజ్ఞప్తి చేశారు. -
జూన్ 15న మాడా లాటరీ
- రేపటి నుంచి యూజర్ అకౌంట్లకోసం పేర్ల నమోదు ప్రక్రియ - మే ఆరు నుంచి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) వివిధ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లకు లాటరీ తీసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి కారణంగా వాయిదా పడిన ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని మాడా అధికారులు ప్రకటించారు. 2,641 ఇళ్లకు మొదటగా నిర్ణయించిన మే 31నాడు కాకుండా జూన్ 15వ తేదీన లాటరీ తీస్తామన్నారు. ఆన్లైన్లో సోమవారం మధ్యాహ్నం నుంచి యూజర్ అకౌంట్ల కోసం పేర్లు నమోదు చేసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. అంతకుముందు ముంబైలోని కుర్లా, మాన్‌ఖుర్డ్, సైన్, పొవాయి, శాంతాక్రజ్, బోరివలి, దహిసర్ తదితర ప్రాంతాల్లోని 814 భవనాలు, విరార్బోలింజ్లోని 1,716, సింధుదుర్గా జిల్లా వెంగుర్లాలోని 111 భవనాలలోని ఇళ్ల కోసం మే 31న లాటరీ తీయనున్నట్టు ఫిబ్రవరి 28న మాడా ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనలో ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల నియమావళి కారణంగా ఈ ప్రక్రియను వాయిదా వేసింది. రాష్ట్రంలో ఈ నెల 24న ఎన్నికలు పూర్తి కావడంతో ఈసీ కోడ్ సడలించింది. తాజాగా మాడా ఇళ్ల కోసం లాటరీ తేదీని ఖరారు చేసింది. ఈ ప్రకటన ప్రకారం మాడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకుని యూజర్ అకౌంటర్లను రూపొందించుకోవాలి. ఈ యూజర్ అకౌంట్లో తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు యూజర్ అకౌంట్లను రూపొందించుకున్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను మే ఆరో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభించనున్నారు. ఇది మే 30వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. డిపాజిట్ నగదును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇవ్వాలనుకునే దరఖాస్తుదారులు యాక్సిస్ బ్యాంక్‌లో జూన్ రెండో తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లాటరీ కోసం స్వీకరించినవారి దరఖాస్తుదారుల పేర్లను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. జూన్ 15వ తేదీ బాంద్రాలోని రంగశారద హాల్లో ఉదయం 10 గంటలకు లాటరీ తీయనున్నారు. లాటరీలో ఇళ్లు లభించిన వారి వివరాలను వెబ్సైట్లో అదే రోజు పొందుపరుస్తారని మాడా అధికారి ఒకరు తెలిపారు. మాడా లాటరీ వివరాలు... యూజర్ అకౌంట్ల కోసం పేర్ల నమోదు ప్రక్రియ: ఏప్రిల్ 28 నుంచి మే 28 సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ: మే 6 నుంచి మే 30 స్వీకరించిన దరఖాస్తు దారుల జాబితా: జూన్ 9 లాటరీ: జూన్ 15 -
సకాలంలో డబ్బు చెల్లిస్తేనే ఇళ్లు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఇళ్ల విజేతలు తాత్కాలిక మంజూరు పత్రం (పీఓఎల్) పొందిన వారు మొత్తం డబ్బులు చెల్లించాలని మాడా సూచించింది. పీఓఎల్ లభించిన అనంతరం 180 రోజులలో ఇళ్ల డబ్బులు చెల్లించకపోతే, ఆ ఇంటిని మరొకరికి ఇస్తామని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాన్ని ముంబై మాడా విభాగం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో మాడా ఇళ్ల విజేతలు ముఖ్యంగా పీఓఎల్ అందుకున్నవారందరు 180 రోజులలో మొత్తం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇళ్లును కోల్పోవాల్సిందే. సాధారణంగా మాడా ఇళ్ల లాటరీ డ్రాలో విజేతలకు అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత పీఓఎల్ ఇస్తారు. ఇంటి ధరలో 25 శాతం డబ్బులను 30 రోజుల్లో, మిగిలిన 75 శాతం డబ్బులను 60 రోజుల్లోపు చెల్లించాలని అధికారులు చెబుతారు. డబ్బులు చెల్లించ డంలో జాప్యం చేసిన వారికి 13.5 శాతం జరిమానా విధించి, మరో 90 రోజుల గడువును ఇస్తారు. అయినా అనేకమంది డబ్బులు చెల్లించడం లేదని తెలిసింది. దీంతో మాడా నిర్మించి ఇచ్చిన నివాస ఇళ్లు ఎవరికి ఇవ్వకుండా వారి పేర్లపై అలాగే ఉన్నాయని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మాడా 180 రోజుల్లో ఇంటి డబ్బులు చెల్లించాలని, లేకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మరోవ్యక్తికి ఆ ఇళ్లు కేటాయించాలని గత అక్టోబర్ నెలలో నిర్ణయం తీసుకుంది. దీన్ని ముంబై విభాగం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చింది. 2012, 2013 సంవత్సరాల్లో లాటరీలో ఇళ్లు లభించిన వారికి పీఓఎల్ పంపించడం ప్రారంభించింది. మరోవైపు అనేక మంది పీఓఎల్ ఆలస్యంగా లభించిందన్న ఫిర్యాదులు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో మరో 15 రోజులు ఆలస్యమైన వారికోసం గడువు పెంచనున్నారు. -
ఇళ్ల నిర్మాణమే లేదు...అప్పుడే లాటరీనా?
సాక్షి, ముంబై: ఇంకా నిర్మాణమే ప్రారంభం కాలేదు... అప్పుడే మిల్లు స్థలాల్లో నిర్మించనున్న ఇళ్లకు మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) లాటరీ వేయాలని నిర్ణయించడం కార్మికుల్లో ఆందోళనను కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం నిర్మించిన ఇళ్ల ధరలు రూ.7.50 లక్షలకు కేటాయించిన మాడా ప్రస్తుతం నిర్మించనున్న ఇళ్ల ధరలు ఏకంగా రూ.20 లక్షలుగా నిర్ణయించడంతో ఏమి చేయాలో మిల్లు కార్మికులకు పాలుపోవడం లేదు. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సమకూర్చి ఇవ్వాలో తెలియక తికమక పడుతున్నారు. బ్యాంక్‌ల ద్వారా రుణం ఇప్పిస్తామని మాడా చెబుతున్నా అవి అచరణ రూపంలోకి వచ్చేసరికి ఏమి జరుగుతుందోనన్న ఆందోళన మిల్లు కార్మికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లతోపాటు మిల్లు కార్మికుల కోసం నిర్మించనున్న ఇళ్లకు కూడా ఒకేసారి లాటరీ వే యాలని మాడా నిర్ణయించడంపై వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తెలుగు మిల్లు కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల మాడా శివారులోని వివిధ ప్రాంతాల్లో 878 ఇళ్లు నిర్మించింది. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు విక్రయించడం, యాక్సిస్ బ్యాంకుల్లో స్వీకరించడం లాంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఇళ్లకు మే 31న లాటరీ వేయాలని మాడా తేదీని ఖరారు చేసింది. అలాగే మిల్లు కార్మికుల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల భూమిపూజ చేశారు. ఈ ప్రకారం మాడా అధీనంలోకి వచ్చిన వివిధ మిల్లు స్థలాల్లో మొత్తం 2,610 ఇళ్లు నిర్మించనుంది. వీటికి 21,954 దరఖాస్తులు లాటరీలో వేయనున్నారు. ఇందులో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే. ఇళ్లను త్వరగా అప్పగించాలనే: సతీష్ గవాయి ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభం కాగానే, లాటరీ వేసి కార్మికుల పేర్లు ప్రకటిస్తే తదుపరి ప్రక్రియ పూర్తిచేయడం సులభంగా ఉంటుందని మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి అన్నారు. లాటరీలో ఇళ్లు వచ్చినవారు మాడాకు అనేక రకాల పత్రాలు, రుజువులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ చాలా సమయంతో కూడుకున్నది కావడంతో ముందే పేరు ప్రకటించడంవల్ల వారికి ఈ పత్రాలను సేకరించుకునేందుకు తగిన సమయం లభిస్తుందన్నారు. అప్పటివరకు ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. వెంటనే అర్హులకు ఇళ్లు అందజేయవచ్చని గవయి అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం ఆరు మిల్లు కార్మికుల దరఖాస్తులు ఉన్నాయి. అందులో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు కార్మికులకు ఏప్రిల్ ఒకటి నుంచి 31 వరకు గడువు ఇచ్చాం. ఇళ్ల ధరలు కచ్చితంగా ఎంత మేర ఉంటాయనేది ఇంకా నిర్ణయించలేదు. లాటరీ ప్రక్రియ మాత్రం పూర్తిచేస్తామ’ని గవయి స్పష్టం చేశారు. -
‘మాడా’.. గుండె దడ!
సాక్షి, ముంబై: నగరంలో మహారాష్ర్ట హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) నిర్మించిన ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వాటిపై ఆశలు పెట్టుకున్న నిరుపేదలు, పేదలు, మధ్యత రగతి ప్రజలు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో మాడా నిర్మించిన ఇళ్లకు సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు ప్రకటన వెలువడగానే విక్రయించడం ప్రారంభిస్తారు. వాటిని మరుసటి రోజు నుంచి అన్ని యాక్సిస్ బ్యాంకుల్లో స్వీకరిస్తారని మాడా ప్రధాన అధికారి నిరంజన్‌కుమార్ సుధాంశు చెప్పారు. నగరంలో ఉంటున్న ప్రతి పేదవాడికి సొంతగూడు ఉండాలనే ఉద్దేశంతో గత దశాబ్దం నుంచి శివారు ప్రాంతాల్లో మాడా వేలాది ఇళ్లు నిర్మిస్తోంది. ఆదాయాన్ని బట్టి అల్ప, అత్యల్ప, ఉన్నత వర్గాలుగా విభజించి వాటిని మాడా నియమ, నిబంధనలకు లోబడి ఉన్న అర్హులకు లాటరీ ద్వారా చౌక ధరలకే విక్రయిస్తోంది. ఇళ్లు చౌక ధరలకే లభించడంతో గతంలో నాలుగు వేల ఇళ్లకు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా, మొదట్లో మాడా ఇళ్ల ధరలు పేదలకు సైతం అందుబాటులో ఉండడం వల్ల స్పందన విపరీతంగా ఉండేది. కాని ప్రస్తుతం నిర్మించిన 878 ఇళ్ల ధరలను మాడా ఒక్కసారిగా మూడు రెట్లు పెంచేయడంతో చాలామంది దరఖాస్తు చేయడానికే జంకుతున్నారు. కొంకణ్ రీజియన్‌తోపాటు ముంబై రీజియన్‌లో మాడా నిర్మించిన ఇళ్లకు లాటరీ వేయాలని నిర్ణయించారు. సదరు ఇళ్ల ధరలు నిశ్చయించేందుకు ఇటీవల మాడా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో ప్రాంతం, చదరపుటడుగులను బట్టి ధరలు నిర్ణయించారు. ఆ ప్రకారం దహిసర్‌లోని శైలేంద్రనగర్లో నిర్మించిన 871 చదరపుటడుగుల ఇల్లుకు ఏకంగా రూ.95 లక్షలు చొప్పున ధర నిర్ణయించారు. అంతేగాకుండా దరఖాస్తుతోపాటు డిపాజిట్ రూపంలో మాడాకు చెల్లించాల్సిన డబ్బులను ఏకంగా రెండు రెట్లు పెంచింది. అత్యల్ప వర్గాల ఇళ్లకు రూ.16 వేలు, అల్పవర్గాల వారు రూ.16వేల నుంచి రూ.40 వేలు, మధ్యతరగతి ఇళ్లకు రూ. 40 వేల నుంచి రూ.70 వేలు, ఉన్నత వర్గాలకు రూ.70వేలకు పైగా డిపాజిట్ చేయాలని సూచించింది. అయితే కచ్చితంగా ఎంత మేర డీడీ తీయాలనేది ప్రకటనతోపాటు వెల్లడిస్తామని నిరంజన్‌కుమార్ చెప్పారు. -
‘ధారావి’కి మహర్దశ
సాక్షి, ముంబై: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరు గాంచిన ‘ధారావి’ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఐదు సెక్టార్లు ఉన్నాయి. నాలుగు సెక్టార్లను ప్రైవేటు బిల్డర్లు అభివృద్ధి చేయగా మిగతా ఒక సెక్టార్ పనులు స్వయంగా మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) చేపట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ధారావి ప్రాంతాన్ని అత్యధిక శాతం ప్రైవేటు బిల్డర్లు చేపట్టనుండడంతో దీని లబ్ధి ఇక్కడి నివాసులకు లభించనుంది. ఈ ప్రాంతంలో ఉన్న చిన్న, పెద్ద గుడిసె వాసులందరికి కూడా ఒకేరకంగా, ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లు లభిస్తాయి. అదే విధంగా దీని లబ్ధి వీరితోసహా బిల్డర్లు, స్థల యజమానులు, ప్రభుత్వం కూడా పొందనున్నాయి. బిల్డర్ల ద్వారా వసూలయ్యే ప్రీమియం డబ్బులు ప్రభుత్వ ఖజానాలోకి చేరనున్నాయి. ఇలా దాదాపు రూ.10 వేల కోట్లు ప్రభుత్వ తిజోరిలో జమ కానున్నాయని అంచనవేశారు. ముంబై నగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని ధారావి ప్రాంతం అభివృద్ధితోనే ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకు 2004-05లోనే ప్రభుత్వం ధారావి పునరాభివృద్థి ప్రాజెక్టు ప్రకటించింది. కాని దీనిపై అనేక వివాదాలు, రాజకీయాలు మొదలయ్యాయి. అనేక పర్యాయాలు అధ్యయనం జరిగింది. ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అనేకసార్లు టెండర్లను ఆహ్వానించి రద్దు కూడా చేశారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుతం ధారావి ప్రాంతం మొత్తం 240 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ వెలసిన 65-70 వేల గుడిసెల స్థానంలో సరాసరి 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిస్తారు. ఇళ్లతోపాటు ఇక్కడ చిన్నచిన్న పరిశ్రమలు, గార్మెంట్, వస్త్ర, జరి, నగల తయారీ తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికి సరాసరి 225 చదరపు అడుగుల గాలాలు దొరుకుతాయి. గోదాములున్నవారికి నియమ, నిబంధనల ప్రకారం నిర్మించి అందజేస్తారు. ఐదో సెక్టార్లో మాడా చేపట్టే అభివృద్ధి పనులను మార్గదర్శకంగా తీసుకుని మిగతా నాలుగు సెక్టార్ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. దీనికి ప్రజల నుంచి మాకు సమ్మతమేనని హామీ తీసుకున్నారు. ఈ సెక్టార్ పనులు పూర్తికాగానే ఒకటి నుంచి నాలుగో సెక్టార్ వరకు ప్రైవేటు బిల్డర్ల ద్వారా జరగనున్నాయి. ఇక్కడ అత్యధిక స్థలం ప్రైవేటు యజమానులదే . ఈ ప్రాజెక్టులో స్థల యజమానులకు కూడా అత్యధికంగా లాభం పొందనున్నారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌కు ఈ ప్రాజెక్టు అనుకుని ఉంది. దీంతో పనులు పూర్తయితే ఇక్కడి ఇళ్లకు బంగారం కంటే ఎక్కువ ధర పలకనుంది. ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి ముంబై: వివిధ కారణాల వల్ల అనేక ప్రాజెక్టులు ఆలస్యం అవుతుండటంపై ఆందోళన చెందుతున్న రాష్ట్ర సర్కార్ అవి కాలానుగుణంగా పూర్తయ్యేలా వివాదాల పరిష్కార విభాగాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ప్రారంభ దశలోనే కొన్ని ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నుంచి సమస్యలు రావడంతో మళ్లీ మొదటి నుంచి టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోంది. దీంతో ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమవుతున్నాయని నగరంలో సోమవారం జరిగిన మహా ఇన్ఫ్రా సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వివిధ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్డు అభివృద్ధి సంస్థ తొలిసారిగా బిడ్ నిర్వహించిన 2004 నుంచి 22 కిలోమీటర్ల రూ.9,630 కోట్ల ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ (ఎంటీహెచ్ఎల్) ప్రాజెక్ట్‌కు ఐదుసార్లు టెండర్లు నిర్వహించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా రవాణా, విద్యుత్ రంగాల్లోనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని సీఎం అన్నారు. కాగా, కార్పొరేషన్ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఎంటీహెచ్ఎల్ ప్రాజెక్ట్ అమలును ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కి కట్టబెట్టారు. అయితే ఆగస్టు ఐదున నిర్వహించిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు ఏ ఒక్కరూ బిడ్ దాఖలు చేయలేదు. దీనికితోడు వివిధ సమస్యల వల్ల వర్లి-హజీ అలీ సిలింక్, మెట్రో లైన్ టూ, త్రీ, నవీముంబై ఎయిర్‌పోర్టు పనులు కూడా ముందుకు కదలడం లేదు. రూ.5,100 కోట్ల వ్యయమయ్యే వర్లి, హజీ సీలింక్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న ఎంఎస్ఆర్డీసీ ప్రస్తుతమున్న బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిని ఎత్తేయనుంది. సొంతంగానే ‘సీ లింక్’ ప్రాజెక్టు! సాక్షి, ముంబై: ప్రతిపాదిత ‘శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు’కు ఇటీవల చేపట్టిన టెండర్ల ప్రక్రియకు వివిధ కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రత్యామ్నాయ వేటలో పడింది. అందుకు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినివల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) ద్వారా నిధులు సేకరించి, మిగిలిన నిధులను తానే సమకూర్చుకుని ప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు సాగాలంటే జేఎన్ఎన్యూఆర్ఎం ను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ మిషన్ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల నిధులు లభించనున్నాయి. మిగతా రూ.ఐదు వేల కోట్లు ఎమ్మెమ్మార్డీయే స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సీ లింకు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలపై టోల్ భారం కొంత మేర తగ్గనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఆహ్వనించిన టెండర్ల ప్రక్రియకు గడువు ఈ నెల ఐదో తేదీన ముగిసింది. అయితే గతంలో ఆసక్తి కనబర్చిన బడా కంపెనీల్లో ఒక్క సంస్థ కూడా ఇప్పుడు టెండరు వేయలేదనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూ.పి.ఎస్.మదన్ స్పష్టం చేశారు. దాదాపు రూ.9,630 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం 22 కి.మీ. పొడవు ఉంటుంది. ఇందులో 16.5 కి.మీ. మార్గం సముద్రంపై ఉండగా మిగతాది చిర్లే ప్రాంతం వరకు నేలపై ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఐఆర్బీ ఇన్ఫ్రా, హూండాయ్, సింట్రా-సోమా, గెమన్ ఇన్ఫ్రా- ఓహెచ్ఎల్, జీఎంఆర్-ఎల్ అండ్ టీ-స్యామ్సన్, ది టాటా రియాల్టీ-ఆటో స్ట్రెడ్ ఇండియన్ ఇన్ఫ్రా-విన్సి ఇలా ఆరు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. కాని ఇందులో ఏ ఒక్క కంపెనీ కూడా టెండరు వేయలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ఈ కంపెనీలు టెండర్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఫలితం లభించలేదు. తాజాగా గత సోమవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నిధులు రాబట్టుకోవాలని ఎమ్మెమ్మార్టీయే యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.9,630 కోట్ల నిధుల్లో 50 శాతం జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా లభిస్తే మిగత నిధులు ఎమ్మెమ్మార్డీయే సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదు. నగర రహదారులపై విపరీతంగా పడుతున్న వాహనాల భారాన్ని తగ్గించేందుకు శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు తెరమీదకు వచ్చింది. అంతేకాక భవిష్యత్తులో నవీముంబైలో చేపట్టనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఎంతో దోహదపడనుంది. అయితే విమానాశ్రయ నిర్మాణం కార్యరూపం దాల్చకపోతే ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య తగ్గిపోయి టోల్ డబ్బులు రావనే ఉద్దేశంతోనే వివిధ సంస్థలు టెండర్లకు దూరంగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో జేఎన్ఎన్యూఆర్ఎం సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనే సంకల్పంతో ఎమ్మెమ్మార్డీయే ముందడుగు వేస్తోంది.