సాక్షి, ముంబై: ఇంకా నిర్మాణమే ప్రారంభం కాలేదు... అప్పుడే మిల్లు స్థలాల్లో నిర్మించనున్న ఇళ్లకు మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) లాటరీ వేయాలని నిర్ణయించడం కార్మికుల్లో ఆందోళనను కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం నిర్మించిన ఇళ్ల ధరలు రూ.7.50 లక్షలకు కేటాయించిన మాడా ప్రస్తుతం నిర్మించనున్న ఇళ్ల ధరలు ఏకంగా రూ.20 లక్షలుగా నిర్ణయించడంతో ఏమి చేయాలో మిల్లు కార్మికులకు పాలుపోవడం లేదు.
అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సమకూర్చి ఇవ్వాలో తెలియక తికమక పడుతున్నారు. బ్యాంక్‌ల ద్వారా రుణం ఇప్పిస్తామని మాడా చెబుతున్నా అవి అచరణ రూపంలోకి వచ్చేసరికి ఏమి జరుగుతుందోనన్న ఆందోళన మిల్లు కార్మికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లతోపాటు మిల్లు కార్మికుల కోసం నిర్మించనున్న ఇళ్లకు కూడా ఒకేసారి లాటరీ వే యాలని మాడా నిర్ణయించడంపై వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తెలుగు మిల్లు కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల మాడా శివారులోని వివిధ ప్రాంతాల్లో 878 ఇళ్లు నిర్మించింది.
ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు విక్రయించడం, యాక్సిస్ బ్యాంకుల్లో స్వీకరించడం లాంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఇళ్లకు మే 31న లాటరీ వేయాలని మాడా తేదీని ఖరారు చేసింది.
అలాగే మిల్లు కార్మికుల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల భూమిపూజ చేశారు. ఈ ప్రకారం మాడా అధీనంలోకి వచ్చిన వివిధ మిల్లు స్థలాల్లో మొత్తం 2,610 ఇళ్లు నిర్మించనుంది. వీటికి 21,954 దరఖాస్తులు లాటరీలో వేయనున్నారు. ఇందులో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.
ఇళ్లను త్వరగా అప్పగించాలనే: సతీష్ గవాయి
ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభం కాగానే, లాటరీ వేసి కార్మికుల పేర్లు ప్రకటిస్తే తదుపరి ప్రక్రియ పూర్తిచేయడం సులభంగా ఉంటుందని మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి అన్నారు. లాటరీలో ఇళ్లు వచ్చినవారు మాడాకు అనేక రకాల పత్రాలు, రుజువులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ చాలా సమయంతో కూడుకున్నది కావడంతో ముందే పేరు ప్రకటించడంవల్ల వారికి ఈ పత్రాలను సేకరించుకునేందుకు తగిన సమయం లభిస్తుందన్నారు. అప్పటివరకు ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. వెంటనే అర్హులకు ఇళ్లు అందజేయవచ్చని గవయి అభిప్రాయపడ్డారు.
‘ప్రస్తుతం ఆరు మిల్లు కార్మికుల దరఖాస్తులు ఉన్నాయి. అందులో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు కార్మికులకు ఏప్రిల్ ఒకటి నుంచి 31 వరకు గడువు ఇచ్చాం. ఇళ్ల ధరలు కచ్చితంగా ఎంత మేర ఉంటాయనేది ఇంకా నిర్ణయించలేదు. లాటరీ ప్రక్రియ మాత్రం పూర్తిచేస్తామ’ని గవయి స్పష్టం చేశారు.
ఇళ్ల నిర్మాణమే లేదు...అప్పుడే లాటరీనా?
Published Wed, Mar 5 2014 10:34 PM | Last Updated on Mon, Oct 8 2018 5:59 PM
Advertisement
Advertisement