సాక్షి, ముంబై: లాటరీలో ఇల్లు వచ్చిన మిల్లు కార్మికులు ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత పత్రాలతో కార్యాలయానికి రావాలని మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) సూచించింది. గడువు దాటిన తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ఆ ఇళ్లను పంపిణీ చేస్తామని హెచ్చరించింది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత వచ్చే వారిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. మూతపడిన మిల్లు స్థలాల్లో మాడా నిర్మించిన 6,925 ఇళ్లకు అర్హులను ఎంపికచేసి 2012 జూన్ 26న లాటరీ వేసింది.
అందులో పేరు వచ్చిన కార్మికులకు లేఖలు పంపించింది. ఒక్కో ఇల్లుకు రూ.7.50 లక్షలు చెల్లించాలి. సంబంధిత పత్రాలతో మాడా కార్యాలయానికి రావాలని పేర్కొంది. ఇందులో సుమారు 80 శాతం మంది కార్మికులు రూ.7.50 లక్షలు నగదు చెల్లించగా, మరికొందరు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఇల్లు సొంతం చేసుకున్నారు. కాని 20 శాతం కార్మికులు ఇంతవరకు మాడాను సంప్రదించలేదు.
లాటరీలో వారి పేరట వచ్చిన ఇళ్లు గత రెండున్నరేళ్లుగా ఖాళీగా పడిఉన్నాయి. లాటరీకి ముందు సమర్పించిన పత్రాలలో పొందుపర్చిన చిరునామాకు అధికారులు పలుమార్లు లేఖలు పంపించినప్పటికీ వారి నుంచి స్పందన రాలేదు. అందులో కొన్ని ఉత్తరాలు తిరిగి మాడా కార్యాలయానికి వచ్చాయి. దీంతో వారికి చివరి అవకాశం ఇచ్చామని, ఆ తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి సదరు ఇళ్లను కేటాయిస్తామని మాడా అధికారులు స్పష్టం చేశారు.
మాడా ఇళ్లు.. 15 చివరితేదీ..!
Published Sun, Jan 11 2015 9:37 PM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM
Advertisement
Advertisement