సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు శుభవార్త. మూతపడిన మిల్లు స్థలాల్లో రెండో విడతలో నిర్మించనున్న ఇళ్లు త్వరలో కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. మహారాష్ట్ర హౌసింగ్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (మాడా) అధీనంలో ఉన్న 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో శనివారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రాజెక్ట్‌కు భూమిపూజా చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే చవాన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో జాంబోరి మైదానంలో కార్మికుల విజయోత్సవ ర్యాలీ జరగనుంది.
శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సెంచురీ మిల్లు స్థలంలో జరగనున్న ఈ ర్యాలీకి గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా తదితరులు హాజరవుతారని గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఘాగ్ తెలిపారు. నాలుగు మిల్లుల కార్మికుల యూనియన్ ప్రతినిధులు నిర్వహించనున్న ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యే అవకాశాలుండడంతో నాయకులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకు మాడా అధీనంలోకి వచ్చిన 19 మిల్లు స్థలాల్లో దాదాపు 10వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో కార్మికులు, వారి వారసులకు 6,925 ఇళ్లు కేటాయించింది. మిగతా ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయించింది. ఆ ఇళ్లను 2012 జూన్ 28న లాటరీ నిర్వహించి అర్హులైన కార్మికులకు అందజేసింది. ఇంకా 16 మిల్లుల స్థలాలు మాడా అదీనంలో ఉన్నా, అందులో ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్టు ఇంతవరకు ప్రారంభించలేదు.
దీంతో గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి, రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్, మహారాష్ట్ర గిరిణి కామ్‌గార్ యూనియన్, సెంచురీ మిల్లు కామ్‌గార్ ఏక్తా మంచ్ తదితర యూనియన్లు తరచూ ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు రెండో విడతలో మాడా ద్వారా కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని భవనాల నిర్మాణ పనుల ప్రణాళికను బీఎంసీకి ఇప్పటికే పంపించారు. మంజూరు లభించగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయి. 16 మిల్లు స్థలాల్లో మాడా సుమారు 11,503 ఇళ్లు నిర్మించనుంది. ఇందులో 7,697 ఇళ్లు కార్మికులు, వారి వారసులకు కేటాయించనుంది. మిగతా ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించనుంది.
మిల్లు స్థలాల్లో కార్మికులకు ఇళ్లు
Published Thu, Feb 27 2014 11:05 PM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM
Advertisement