ajit power
-
ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!: అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర కూటమిపై నేపనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు(ఎన్సీపీ) అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఈ మేరకు అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) అగ్ర నేతలు రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనికి మద్దతిస్తున్నట్లు కూడా తెలిపారు. అలాగే ఎంవీఏలో సొంత పార్టీ గురించి ఆలోచించకుండా ఎలక్టివ్ మెరిట్ ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంవీఏ నేతలు కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ఎంవీఏ తన ఎమ్మెల్యే, ఎంపీలను ఎలా పెంచాలనే దానిపై చర్చించి కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సందర్భంలో కూటమి ప్రాముఖ్యతను వివరిస్తూ..మహా వికాస్ అఘాడి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ)లో ఉన్న పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేవన్నది వాస్తవమని, దీన్ని మనమందరం అంగీకరించాలని పవార్ అన్నారు. ఏక్నాథ్్ షిండే, బీజేపీ కూటమిని ఓడించడానికి తామంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత శివసేన ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే..మనం కలిసి ఉండాలి, ఎలాంటి పొరపొచ్చా లేకుండా పోటీ చేయాలి. అప్పుడే మనం కచ్చితంగా ఎన్నికల్లో గెలవగలమని చెప్పారు అజిత్ పవార్. కాగా మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. (చదవండి: మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది) -
ముంబైకర్ల మెడపై...కరెంటు కత్తి!
సాక్షి, ముంబై: అనధికారికంగా 5 శాతం నీటి కోతను ఎదుర్కొంటున్న ముంబైకర్లు త్వరలో 20 శాతం నీటి కోతను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చిన మరుసటి రోజే మరో పిడుగులాంటి వార్త ముంబైకర్లను బెంబేలెత్తిస్తోంది. నీటి కోతతోపాటు కరెంటు కోత కూడా తప్పదని ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ స్వయంగా వెల్లడించారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. జల విద్యుదుత్పత్తి కేంద్రాలన్నీ వరుసగా మూతపడుతున్న విషయం తెలిసిందే. వీటికి తోడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా మూతపడడం ఆందోళనకర పరిణామంగా విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. బొగ్గు నిల్వలు నిండుకోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు. నగరానికి సరఫరా అవుతున్న విద్యుత్‌లో సింహభాగం దబోల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ కావడం, ఈ విద్యుత్ కేంద్రంలో సగానికిపైగా విద్యుత్ యూనిట్లు బొగ్గు కొరత కార ణంగా మూతపడడం వంటి పరిణామాల నేపథ్యంలోనే అజిత్‌పవార్ ఈ రకమైన ప్రకటన చేసి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోపక్క జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే బొగ్గు కొరత కారణంగా రాష్ర్టంలోని దబోల్ విద్యుత్ ప్రాజెక్టులోని కొన్ని ప్లాంట్లను నిలిపివేశారు. తాజాగా ఇప్పుడు డ్యాముల్లో నీరు లేకపోవడంతో కోయినా విద్యుత్ ప్లాంట్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాసిక్‌లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఏర్పడింది. నాసిక్‌లో ఏక్లహరా విద్యుత్ కేంద్రంలో 14 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నీరు, బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి బ్యాలెన్స్‌గా వినియోగించాలని పవార్ సూచించారు. నాసిక్ రీజియన్‌లో నీటి కొరతపై ఆరా తీసేందుకు పవార్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికీ చినుకు పత్తాలేకుండా పోయింది. నీటి కొరత కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఒకపక్క వర్షాలు లేక ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రజలకు ఇళ్లలో, ఉద్యోగులు కార్యాలయాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు భారీగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు ఉత్పత్తి తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలాఉండగా నగరానికి నీటి సరఫరాచేసే జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు 20 శాతం నీటి కోత విధించాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ త్వరలో దీన్ని అమలుచేయక తప్పదని తెలుస్తోంది. ముంబైలో ఇప్పటికే అనధికారికంగా ఐదు శాతం నీటి కోత విధిస్తున్నారు. అదనంగా మరో 20 శాతం నీటి కోత విధిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. నగరానికి ప్రతీరోజు 3,750 మిలియన్ లీటర్ల నీరు అవసరముంటుంది. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నిల్వలను పొదుపుగా వాడినా నెలరోజులకు మాత్రమే సరిపోతాయి. కృత్రిమ వర్షాల కోసం బీఎంసీ చేసిన ప్రయత్నాలు కూడా గతంలో విఫలమయ్యాయి. దీంతో ఈసారి కృత్రిమ వర్షాలపై కూడా ఆశలు వదులుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని వర్షాలు కురిసేవరకు తగినంత నీటి నిల్వలు ఉంచుకోవడమే ఉత్తమమని బీఎంసీ భావిస్తోందంటున్నారు. అందుకు ఇప్పటి నుంచే నీటి కోత విధించడమొక్కటే మార్గమని చెబుతున్నారు. -
మిల్లు స్థలాల్లో కార్మికులకు ఇళ్లు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు శుభవార్త. మూతపడిన మిల్లు స్థలాల్లో రెండో విడతలో నిర్మించనున్న ఇళ్లు త్వరలో కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. మహారాష్ట్ర హౌసింగ్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (మాడా) అధీనంలో ఉన్న 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో శనివారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రాజెక్ట్‌కు భూమిపూజా చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే చవాన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో జాంబోరి మైదానంలో కార్మికుల విజయోత్సవ ర్యాలీ జరగనుంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సెంచురీ మిల్లు స్థలంలో జరగనున్న ఈ ర్యాలీకి గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా తదితరులు హాజరవుతారని గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఘాగ్ తెలిపారు. నాలుగు మిల్లుల కార్మికుల యూనియన్ ప్రతినిధులు నిర్వహించనున్న ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యే అవకాశాలుండడంతో నాయకులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకు మాడా అధీనంలోకి వచ్చిన 19 మిల్లు స్థలాల్లో దాదాపు 10వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో కార్మికులు, వారి వారసులకు 6,925 ఇళ్లు కేటాయించింది. మిగతా ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయించింది. ఆ ఇళ్లను 2012 జూన్ 28న లాటరీ నిర్వహించి అర్హులైన కార్మికులకు అందజేసింది. ఇంకా 16 మిల్లుల స్థలాలు మాడా అదీనంలో ఉన్నా, అందులో ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్టు ఇంతవరకు ప్రారంభించలేదు. దీంతో గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి, రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్, మహారాష్ట్ర గిరిణి కామ్‌గార్ యూనియన్, సెంచురీ మిల్లు కామ్‌గార్ ఏక్తా మంచ్ తదితర యూనియన్లు తరచూ ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు రెండో విడతలో మాడా ద్వారా కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని భవనాల నిర్మాణ పనుల ప్రణాళికను బీఎంసీకి ఇప్పటికే పంపించారు. మంజూరు లభించగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయి. 16 మిల్లు స్థలాల్లో మాడా సుమారు 11,503 ఇళ్లు నిర్మించనుంది. ఇందులో 7,697 ఇళ్లు కార్మికులు, వారి వారసులకు కేటాయించనుంది. మిగతా ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించనుంది.