ముంబైకర్ల మెడపై...కరెంటు కత్తి! | power produce decreasing due to less rains | Sakshi
Sakshi News home page

ముంబైకర్ల మెడపై...కరెంటు కత్తి!

Published Tue, Jul 1 2014 11:52 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

power produce decreasing due to less rains

సాక్షి, ముంబై: అనధికారికంగా 5 శాతం నీటి కోతను ఎదుర్కొంటున్న ముంబైకర్లు త్వరలో 20 శాతం నీటి కోతను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చిన మరుసటి రోజే మరో పిడుగులాంటి వార్త ముంబైకర్లను బెంబేలెత్తిస్తోంది. నీటి కోతతోపాటు కరెంటు కోత కూడా తప్పదని ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ స్వయంగా వెల్లడించారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో  ఉందో ఊహించుకోవచ్చు.

జల విద్యుదుత్పత్తి కేంద్రాలన్నీ వరుసగా మూతపడుతున్న విషయం తెలిసిందే. వీటికి తోడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా మూతపడడం ఆందోళనకర పరిణామంగా విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. బొగ్గు నిల్వలు నిండుకోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు. నగరానికి సరఫరా అవుతున్న విద్యుత్‌లో సింహభాగం దబోల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ కావడం, ఈ విద్యుత్ కేంద్రంలో సగానికిపైగా విద్యుత్ యూనిట్లు బొగ్గు కొరత కార ణంగా మూతపడడం వంటి పరిణామాల నేపథ్యంలోనే అజిత్‌పవార్ ఈ రకమైన ప్రకటన చేసి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోపక్క జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది.


 ఇప్పటికే బొగ్గు కొరత కారణంగా రాష్ర్టంలోని దబోల్ విద్యుత్ ప్రాజెక్టులోని కొన్ని ప్లాంట్లను నిలిపివేశారు. తాజాగా ఇప్పుడు డ్యాముల్లో నీరు లేకపోవడంతో కోయినా విద్యుత్ ప్లాంట్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాసిక్‌లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఏర్పడింది. నాసిక్‌లో ఏక్‌లహరా విద్యుత్ కేంద్రంలో 14 రోజులకు సరిపడే బొగ్గు  నిల్వలు మాత్రమే ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నీరు, బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి బ్యాలెన్స్‌గా వినియోగించాలని పవార్ సూచించారు. నాసిక్ రీజియన్‌లో నీటి కొరతపై ఆరా తీసేందుకు పవార్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికీ చినుకు పత్తాలేకుండా పోయింది. నీటి కొరత కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఒకపక్క వర్షాలు లేక ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రజలకు ఇళ్లలో, ఉద్యోగులు కార్యాలయాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు భారీగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు ఉత్పత్తి తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ బిల్లులు రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలాఉండగా నగరానికి నీటి సరఫరాచేసే జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు 20 శాతం నీటి కోత విధించాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ త్వరలో దీన్ని అమలుచేయక తప్పదని తెలుస్తోంది. ముంబైలో ఇప్పటికే అనధికారికంగా ఐదు శాతం నీటి కోత విధిస్తున్నారు. అదనంగా మరో 20 శాతం నీటి కోత విధిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. నగరానికి ప్రతీరోజు 3,750 మిలియన్ లీటర్ల నీరు అవసరముంటుంది.


 ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నిల్వలను పొదుపుగా వాడినా నెలరోజులకు మాత్రమే సరిపోతాయి. కృత్రిమ వర్షాల కోసం బీఎంసీ చేసిన ప్రయత్నాలు కూడా గతంలో విఫలమయ్యాయి. దీంతో ఈసారి కృత్రిమ వర్షాలపై కూడా ఆశలు వదులుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని వర్షాలు కురిసేవరకు తగినంత నీటి నిల్వలు ఉంచుకోవడమే ఉత్తమమని బీఎంసీ భావిస్తోందంటున్నారు. అందుకు ఇప్పటి నుంచే నీటి కోత విధించడమొక్కటే మార్గమని చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement