
ప్రస్తుత స్టార్ హీరోల్లో ఎందరో అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చినవారే అయి ఉంటారు. కానీ అప్పటి తమ పరిస్థితులు ఇప్పటికీ గుర్తుంచుకుని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆపన్నులను ఆదుకునే మనసున్నవాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff) ముందున్నాడు. తన మానవతా సేవలతో నిరుపేదల మనసులను గెలుచుకుంటున్నాడు. ఇటీవల, జాకీ ష్రాఫ్ తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ, ముంబైలోని చవల్‌లో 33 సంవత్సరాలు గడిపిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఏడు భవనాలకు మూడే బాత్‌రూమ్స్ ఉన్న ఓ కాంప్లెక్స్‌లోని ఒకటే గదిలో తమ కుటుంబం మొత్తం నివసించిన రోజుల్ని తలచుకుంటూ...రాత్రుళ్లు ఎలకలు తమ వేళ్లనే ఆహారంగా మార్చుకునేవన్నారు.
అలాంటి దుర్భర పరిస్థితుల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితులు అనుకూలించక తన చదువు కొనసాగించలేకపోయానని చెప్పారు. అర్ధాకలితో గడిపిన రోజులు మర్చిపోలేనంటున్న ఆయన అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా వారికి నేనున్నా అంటున్నారు.

ఏదో ఇంటర్వ్యూ కోసం మాత్రమే ఆయన మాట్లాడడం లేదు. ఇప్పటికే ముంబైలోని దాదాపు 100 కుటుంబాల బాగోగులు చూస్తున్నారు. అది కూడా కొన్నేళ్లుగా. అంతేకాకుండా, వీధుల్లో ఉన్న ప్రతి బిచ్చగాడికి ఆయన తన ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారు, తద్వారా వారు అవసరమైనప్పుడు ఎంత అర్ధరాత్రయినా, అపరాత్రయినా సాయం పొందగలుగుతారు.
తిండికి లేని స్థితి నుంచి వందలాది మందికి తిండి పెట్టగలిగే పరిస్థితి వరకూ సాగిన ప్రయాణంలో పల్లీలు అమ్ముకోవడంతో మొదలై ఎన్నో చిరుద్యోగాలు, చిరు వ్యాపారాలు... అయిపోయాయి. చివరకు ఒక బస్టాండ్‌లో నిలబడి ఉండగా తనని గమనించిన సుభాష్ ఘయ్ కి జాకీలో తన కొత్త చిత్రంలో కధానాయకుడు కనిపించడంతో ఆయన జీవితం మారిపోయింది. హీరో పేరుతో రూపొందిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దానిని తెలుగులో నాగార్జున ఆరంగేట్రంగా కూడా రీమేక్ చేసి విక్రమ్ తీశారు.
అలా బస్టాండ్ బతుకు నుంచి బాలీవుడ్ హీరోగా మారిన జాకీ ష్రాఫ్ అక్కడ నుంచి అంచలంచెలుగా టాప్ స్టార్‌గా ఎదిగాడు. అయితే ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోలేదు. ఇపుడేదో స్థితి మంతుడయ్యాడు కాబట్టి చేయడం కాకుండా...తాను ఆర్ధికంగా లేని పరిస్థితుల నుంచే ఆయన సేవను ఒక దినచర్యగా మార్చుకున్నాడు. ప్రతీ యాచకునికీ , ఫుట్‌పాత్‌పై నివసించే ప్రతీ చిన్నారికీ తన కాంటాక్ట్‌నెంబర్ అందేలా ఏర్పాటు చేశాడు.
తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామూహిక భోజనాలు, పేద పిల్లలకు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజుల సందర్భాలలో కూడా ఆయన ఇదే విధమైన సేవా కార్యక్రమాలను చేస్తాడు. వయసు పై బడిన జాకీష్రాఫ్ ఇప్పడు తెరపై హీరో కాకపోవచ్చు కానీ వందలాది మంది మనసుల్లో ఆయన ఎప్పటికీ హీరోనే...