రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు కంపెనీలతో...
ఒప్పందం ప్రకారం టాటా నుంచి సరఫరా కాని విద్యుత్
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు కంపెనీలతో బృహన్‌ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థ చర్చలు ప్రారంభించింది. టాటా పవర్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బెస్ట్‌కి విద్యుత్ సరఫరా జరగడం లేదు.
ఈ నేపథ్యంలో విద్యుత్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బెస్ట్‌కు నగరంలో సుమారు 10 లక్షల మంది వినియోగదారులున్నారు. అందులో 8 లక్షల మంది సాధారణ ప్రజలు, 2 లక్షల మంది వ్యాపారులు ఉన్నారు. 932 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలా టాట్ పవర్‌తో బెస్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ టాటా పవర్ యూనిట్ ఆరులో విద్యుత్ సెట్ మూతపడడంతో కంపెనీ కేవలం 550 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. దాంతో బెస్ట్‌కు 383 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. ఈ కారణంగా బెస్ట్‌కు ఇతర కంపెనీల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇతర కంపెనీలతో చర్చలు.
అవసరానికన్నా తక్కువ విద్యుత్ సరఫరా అవుతుండటంతో బెస్ట్ అధికారులు ఇతర కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. విద్యుత్ కొరతను పూర్తి చేయడం కోసం రాష్ట్ర గ్రిడ్, మహా వితరణ, ఇతర ప్రైవేట్ కంపెనీల వద్ద విద్యుత్ కొనుగోలు కోసం సిద్ధమయ్యారు. సంబంధిత కంపెనీలతో చర్చలు కూడా ప్రారంభించారు. వినియోగదారులకు అవసరమున్నంత మేరకు సరఫరా చేయవచ్చని, వేసవిలో కొరత ఉండబోదని అందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని అధికారులు తెలిపారు.