బీఎంసీ కార్లపై అనాసక్తి | officers not interested on bmc cars due to insufficient facilities | Sakshi
Sakshi News home page

బీఎంసీ కార్లపై అనాసక్తి

Published Mon, Aug 18 2014 11:06 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

officers not interested on bmc cars due to insufficient facilities

ముంబై: వివిధ పదవుల్లో కొనసాగుతున్న కార్పొరేటర్ల కోసం బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రూ.70 లక్షలు వెచ్చించిన కొనుగోలు చేసి కార్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇందులో సదుపాయాలు తక్కువగా ఉన్నాయనే సాకుతో కార్పొరేటర్లు వీటిని ఉపయోగించడం లేదు. ఖర్చు తగ్గించుకుందామనే ఉద్దేశంతో పవర్ స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్, ఆటోమాటిక్ డోర్ లాకింగ్ వంటి సదుపాయాలు లేని కార్లను బీఎంసీ కొనుగోలు చేసింది. అందుకే కార్పొరేటర్లు వీటిని ఆదరించడం లేదని తెలుస్తోంది.

 బీఎంసీ మూడు నెలల క్రితం రూ.5.25 లక్షల చొప్పున 14 కార్లను కొనుగోలు చేసింది. వీటిలో ఏడింటిని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు కేటాయించారు. మిగతా వాటిని బీఎంసీ కమిటీల అధిపతులకు కేటాయించాల్సి ఉంది. ఈ కార్లలో సదుపాయాలు బాగా లేవంటూ ముగ్గురు కార్పొరేటర్లు ఇది వరకే కార్లను వాపసు పంపించారు. విపక్ష నాయకుడు దేవేంద్ర అంబేద్కర్, సభాపక్ష నాయకుడు తృష్ణా విశ్వాస్‌రావు, ప్రజారోగ్య కమిటీ చైర్‌పర్సన్ గీతాగావ్లీకి బీఎంసీ కేటాయించిన కార్లను కొన్ని రోజులు వాడి వెనక్కి పంపించారు.

బీఎంసీలో నిరంకుశ పాలన కొనసాగుతుందని చెప్పడానికి నాసిరకం కార్ల కేటాయింపే నిదర్శమని ఈ కార్పొరేటర్లు అంటున్నారు. మిగతా వాళ్లు కూడా కార్ల నాణ్యతపై బీఎంసీ రవాణా విభాగానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి తమ సొంత కార్లనే వినియోగించుకుంటున్నామని తెలిపారు. ‘ఎలాంటి సదుపాయాలూ లేని కార్లను బీఎంసీ కమిషనర్ వినియోగిస్తారా ? వ్యయనియంత్రణ చర్యలు కేవలం కార్పొరేటర్ల కోసమేనా ? ఇలాంటి పిసినారితనం వల్ల సంస్థకు ప్రజల్లో చెడ్డపేరు వస్తుంది’ అని ఒక కార్పొరేటర్ అన్నారు. ఇదిలా ఉంటే ఇవే కార్లను వాడాల్సిందిగా బీఎంసీ అధికారులు నచ్చజెప్పినప్పటికీ కార్పొరేటర్లు ససేమిరా అనడంతో వాహనాలన్నీ వృథాగానే పడి ఉంటున్నాయి.

గతంలో ఉన్న కార్లు తరచూ మొరాయిస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో వీటిని కొనుగోలు చేశారు. తన పాత కారు తరచూ ఆగిపోతోందని పేర్కొంటూ అంబేద్కర్ ఇటీవలే వాహనాన్ని బీఎంసీకి వాపసు చేశారు. కార్యాలయానికి రావడానికి సొంత వాహనం లేదనా ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నానని తెలిపారు. అయితే కార్పొరేషన్ అంబేద్కర్‌కు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం కల్పించింది. అధికారిక వినియోగం కోసం మరో వాహనం కేటాయించింది. కార్పొరేటర్లు బీఎంసీ వాహనాలను విచ్చలవిడిగా వాడుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్టు గతంలో పలుసార్లు వార్తలు వచ్చాయి. మేయర్ సునీల్ ప్రభు కూడా రెండేళ్లలో మూడు కార్లు మార్చడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement