సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు శుభవార్త. వారికి త్వరలో ఆరు వేల ఇళ్లు వడాల ప్రాంతంలో అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన ఎనిమిది ఎకరాల స్థలాన్ని వాడియా గ్రూప్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు వడాలలోని బాంబే డయింగ్ యూనిట్‌లో ఉన్న స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించించింది. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) కూడా అంగీకరించింది. దీంతో అందులో మిల్లు కార్మికుల కోసం ఆరువేల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మాడాకు మార్గం సుగమమైంది.
పూర్తి వివరాలిలా ఉన్నాయి... వాడియా గ్రూప్ యజమానికి ప్రభాదేవి, వడాల ప్రాంతంలో మిల్లు స్థలాలున్నాయి. ప్రభుత్వ నియమావళి 58 ప్రకారం మొత్తం స్థలాన్ని మూడు భాగాలు చేయాలి. అందులో ఒక భాగం మిల్లు యజమానికి, రెండో భాగం బీఎంసీకి, మూడో భాగం మాడాకు అప్పగించాలి. ఆ ప్రకారం ప్రభాదేవి, వడాలలో ఉన్న స్థలాలను అప్పగించాలని మాడా పట్టుబట్టింది. కాని ఆ స్థలాన్ని ఇచ్చేందుకు అప్పట్లో వాడియా గ్రూపు నిరాకరించింది. దీంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. కాని కోర్టులో ఈ కేసు ఎటూ పరిష్కారం కాకుండా పెండింగులో పడిపోయింది.
దీంతో ఒక మెట్టు దిగివచ్చిన వాడియా గ్రూపు నియమాల ప్రకారం బాంబే డయింగ్ నుంచి రావల్సిన ఒక భాగం స్థలాన్ని వడాలలో ఉన్న యూనిట్‌లో ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఒకే చోట రెండు భాగాల స్థలం లభించడంతో పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మించేందుకు అవకాశం లభించింది. మాడా 2012లో 6,925 ఇళ్లు నిర్మించి వాటిని లాటరీ ద్వారా అర్హులైన వారికి అందజేసిన విషయం తెలిసిందే. వడాలలో నిర్మించనున్న ఆరు వేల ఇళ్లకు త్వరలో లాటరీ వేసేందుకు రంగం చేయనుంది.
మిల్లు కార్మికులకు ఇళ్లు..
Published Fri, Nov 7 2014 11:21 PM | Last Updated on Mon, Oct 8 2018 5:59 PM
Advertisement
Advertisement