సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని, త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం నగరంలో మిల్లు కార్మికులు, వారి వారసులు ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. గిర్నీ కామ్‌గార్ కర్మచారి కల్యాణ్‌కారి సంఘ్, గిర్నీ కామ్‌గార్ సేనా, గిర్నీ కామ్‌గార్ ఏక్‌జూట్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం దాదర్‌లోని వీర్ కోత్వాల్ ఉద్యాన్ నుంచి మొదలైన ఈ ర్యాలీ కాంగ్రెస్ కార్యాలయమైన తిలక్‌భవన్ వరకు సాగింది. ఇందులో సుమారు వేయిమందికిపైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం సాయంత్రం ఏర్పాటుచేసిన బహిరంగసభలో సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల్లో ఉచితంగా ఇళ్లు ఇచ్చేలా తీర్మానాన్ని చేయాలని, లేని పక్షంలో మిల్లు కార్మికులు అత్యధికంగా ఉంటున్న 11జిల్లాల్లోని ప్రజలు, వారి బంధువులు సెప్టెంబరులో జరగనున్న శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తారని హెచ్చరించారు. గత అనేక సంవత్సరాల నుంచి ఇళ్ల సమస్యపై పోరాడుతున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడైన తమ సమస్యను పరిగణనలోకి తీసుకొని మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో 11 జిల్లాలతోపాటు మిగతా ప్రాంతాల్లో ఉంటున్న కార్మికులు, వారి వారసులు, బంధువులు ఓటు హక్కును వినియోగించుకోరని హెచ్చరించారు.
ఉచితంగా ఇళ్లు ఇవ్వకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తాం
Published Sun, Jun 1 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Advertisement