సాక్షి, ముంబై: మిల్లు కార్మికులందరికీ తప్పక ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై కార్మికులుగాని, వారి వారసులుగాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు శనివారం సాయంత్రం సీఎం చవాన్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి చవాన్‌తోపాటు కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా, ఎంపీ ఏక్‌నాథ్ గైక్వాడ్, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, దత్తా ఇస్వాల్కర్, ప్రవీణ్ ఘాగ్, జయశ్రీ ఖాడిల్కర్, గన్నారపు శంకర్ తదితరులు హాజరయ్యారు.
తొలుత సెంచురీ మిల్లులో భూమి పూజ చేశారు. అనంతరం జాంబోరి మైదానంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చవాన్ కార్మికులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఆధీనంలోకి వచ్చిన 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. తొలి విడతలో కాలాచౌకి, ప్రభాదేవి ప్రాంతాల్లో నిర్మించిన 6,925 ఇళ్లను 2012 జూన్‌లో లాటరీ ద్వారా అర్హులకు అందజేశామని గుర్తు చేశారు. సెంచురీ మిల్లు స్థలాల్లో నిర్మించే ఇళ్లతోపాటు మాడా, ఎమ్మెమ్మార్డీయే ప్రస్తుతం నిర్మిస్తున్న, భవిష్యత్‌లో నిర్మించబోయే వాటిలో కూడా మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ఆందోళ న చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం సెంచురీ మిల్లులో తొలి విడతలో 1,430 ఇళ్లు నిర్మించనున్నారు. అందులో 651 ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుందని చవాన్ తెలిపారు. రూబీ మిల్లులో నిర్మిం చనున్న 23 ఇళ్లలో ఎనిమిది ట్రాన్సిట్ క్యాంపులు, పశ్చిమ మిల్లులో 250 ఇళ్లకు 124 ట్రాన్సిట్ క్యాం పులు, ప్రకాశ్ కాటన్ మిల్‌లో నిర్మించనున్న 562 ఇళ్లల్లో 281 ట్రాన్సిట్ క్యాంపులు, భారత్ మిల్‌లోని 188 ఇళ్లలో 93, జూబిలీ మిల్‌లోని 157 ఇళ్లలో 78 ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయిస్తున్నామని సీఎం చవాన్ వివరించారు.
ఇదిలావుండగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగం కొనసాగుతుండగానే 1.42 లక్షల కార్మికులకి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కరీరోడ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిని రాత్రి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇళ్లు ఇస్తాం.. ఆందోళన వద్దు
Published Sun, Mar 2 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement