Sachin Ahir
-
ముంబై ఎన్సీపీ అధ్యక్షుడిగా సచిన్ అహిర్
♦ వెల్లడించిన రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ♦ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నవాబ్ మలిక్ నియామకం ♦ బీఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న అహిర్ సాక్షి, ముంబై : బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న తరుణంలో ఎన్సీపీ ముంబై అధ్యక్షునిగా మాజీ మంత్రి సచిన్ అహిర్‌ను ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని పదవితోపాటు ముఖ్య అధికార ప్రతినిధిగా, ముంబై యూనిట్ ఇన్చార్జిగా నవాబ్ మలిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరితోపాటు జిల్లాలవారి అధ్యక్షులను కూడా ప్రకటించారు. ముంబై ఎన్సీపీ అధ్యక్షుని రేసులో సచిన్ అహిర్తోపాటు కిరణ్ పావస్కర్, నవాబ్ మలిక్, సంజయ్ దీనా పాటిల్‌ల పేర్లను చర్చించారు. కాగా ఎన్సీపీ అహిర్‌ను ముంబై అధ్యక్షునిగా ఎంపిక చేసింది. గతంలో సచిన్ అహిర్ గృహనిర్మాణ శాఖ సహాయక మంత్రులుగా, ముంబైలో ఉట్టి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపపి తనదైన ముద్రవేసుకున్నారు. మిల్లు కార్మికుల సమస్యలపై ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ యూనియన్‌లో విధులు నిర్వహించారు. మరోవైపు ‘ఇంటక్ కామ్‌గార్ యూనియన్’ అధ్యక్షుని పదవి కూడా చేపట్టారు. స్వతంత్రంగా పోటీ చేస్తాం : అహిర్ రాబోయే ఎన్నికల్లో పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని అహిర్ తెలిపారు. గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం వల్ల తమ పార్టీ ప్రజల్లో గుర్తింపు పొందలేకపోయిందన్నారు. ఓటు బ్యాంకును పెంపొందించకోలేక పోయామన్నారు. బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి మొత్తం 227 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. దహీహందీ, నవరాత్రి, గణేశ్ ఉత్సవాలు, పండుగల సమయంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మందిరాల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. దహీ హందీ విషయమై గతంలో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, అప్పుడు కోర్టు స్టే ఇచ్చిందన్నారు. పండుగలకు అంతరాయం కలిగించకూడదనీ, పండుగలు నగరాలు ఏర్పడకముందే మొదలయ్యాయని చెప్పారు. ముంబై ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీని త్వరలో వెల్లడిస్తామని తట్కరే అన్నారు. 100 మందిని బలిగొన్న కల్తీసారా కేసు, రైతుల సమస్యలు, బీజేపీ మంత్రులపై అవినీతి ఆరోపణలను త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన అన్నారు. -
‘ఉట్టి’ దిగులు..!
సాక్షి, ముంబై: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్న సామెత చందంగా ఉంది ప్రస్తుతం నగర పోలీసుల పరిస్థితి.. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొన కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా పిల్లలు లేకుం డా ఉత్సవమా.. సమస్యే లేదు.. ఉట్టి ఉత్సవాల్లో పిల్లలు తప్పకుండా పాల్గొం టారని ఉత్సవ మండళ్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. ఈ నెల 17వ తేదీన (ఆదివారం) ఉట్టి ఉత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనే అంశం ఎటూ తేలకపోవడంతో మధ్యలో నగర పోలీసులు నలిగి పోతున్నారు. ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొంటే సంబంధిత ఉట్టి ఉత్స వ మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల సంఘం ఆదేశించింది. మరోపక్క పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని మండళ్లు సవాలు చేస్తున్నాయి. మండళ్ల వైఖరిపై పోలీసులు ఏ విధంగా స్పం దిస్తారనేదానిపై అందరి ధృష్టి పడింది. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంవల్ల వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఉట్టి పగులగొట్టే ప్రయత్నంలో అదుపుతప్పి పైనుంచి కిందపడడంవల్ల వారు వికలాంగులయ్యే ప్రమాదముంది. గతంలో జరిగిన ఘటనల్లో కొందరు వికలాంగులుగా మారారు. కొం దరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. తాజాగా వారం కిందట నవీముంబైలోని సాన్‌పాడా ప్రాంతంలో ఉట్టిఉత్సవాలకు సాధన చేస్తుండగా కిరణ్ తల్కరే (14) అనే బాలుడు పైనుంచి కిందపడడంతో తలకు, చాతిలో గాయాలయ్యాయి. నేరుల్‌లోని సహ్యాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజులకు చనిపోయాడు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పిల్లలు ఉట్టి ఉత్పవాల్లో పాల్గొనడాన్ని బాలల హక్కుల సంఘం నిషేధించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక అలాంటి మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని తేల్చిచెప్పిం ది. అయితే పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని నగరం, ఠాణే జిల్లాకు చెందిన సార్వజనిక ఉట్టి ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి, బాలల హక్కుల సంఘానికి సవాలు విసిరాయి. అందుకు మహిళ గోవిందాందాలు కూడా మద్దతు పలికాయి. దీంతో ఏం చేయాలో తెలియక మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారు. ఇదిలాఉండగా ఈ సమస్యపై త్వరలో పరిష్కారం కనుగొంటామని మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కు ల సంరక్షణ కమిషన్ అధ్యక్షుడు ఉజ్వల్ ఉకే అన్నారు. గృహనిర్మాణ శాఖ సహా య మంత్రి సచిన్ అహిర్ సైతం ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని వా రం కిందట ప్రకటించారు. కాని ఇంతవరకు సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది. -
ఇళ్లు ఇస్తాం.. ఆందోళన వద్దు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులందరికీ తప్పక ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై కార్మికులుగాని, వారి వారసులుగాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు శనివారం సాయంత్రం సీఎం చవాన్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి చవాన్‌తోపాటు కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా, ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, దత్తా ఇస్వాల్కర్, ప్రవీణ్ ఘాగ్, జయశ్రీ ఖాడిల్కర్, గన్నారపు శంకర్ తదితరులు హాజరయ్యారు. తొలుత సెంచురీ మిల్లులో భూమి పూజ చేశారు. అనంతరం జాంబోరి మైదానంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చవాన్ కార్మికులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఆధీనంలోకి వచ్చిన 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. తొలి విడతలో కాలాచౌకి, ప్రభాదేవి ప్రాంతాల్లో నిర్మించిన 6,925 ఇళ్లను 2012 జూన్‌లో లాటరీ ద్వారా అర్హులకు అందజేశామని గుర్తు చేశారు. సెంచురీ మిల్లు స్థలాల్లో నిర్మించే ఇళ్లతోపాటు మాడా, ఎమ్మెమ్మార్డీయే ప్రస్తుతం నిర్మిస్తున్న, భవిష్యత్‌లో నిర్మించబోయే వాటిలో కూడా మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ఆందోళ న చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సెంచురీ మిల్లులో తొలి విడతలో 1,430 ఇళ్లు నిర్మించనున్నారు. అందులో 651 ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుందని చవాన్ తెలిపారు. రూబీ మిల్లులో నిర్మిం చనున్న 23 ఇళ్లలో ఎనిమిది ట్రాన్సిట్ క్యాంపులు, పశ్చిమ మిల్లులో 250 ఇళ్లకు 124 ట్రాన్సిట్ క్యాం పులు, ప్రకాశ్ కాటన్ మిల్లో నిర్మించనున్న 562 ఇళ్లల్లో 281 ట్రాన్సిట్ క్యాంపులు, భారత్ మిల్లోని 188 ఇళ్లలో 93, జూబిలీ మిల్లోని 157 ఇళ్లలో 78 ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయిస్తున్నామని సీఎం చవాన్ వివరించారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగం కొనసాగుతుండగానే 1.42 లక్షల కార్మికులకి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కరీరోడ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిని రాత్రి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మా వాళ్లు కాదు
ముంబై: గత వారం 23 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం చేసిన నిందితుల్లో కొందరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందినవారని వచ్చిన ఆరోపణలని ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ కొట్టిపారేశారు. తనతో నిందితులు ఉన్నట్టుగా చూపే ఫొటోని ప్రచురించిన హిందీ డైలీ దూపర్ కా సామ్నాతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం కేసులో నిందితుల ఫొటోలను ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా విడుదల చేయలేదని ఆయన మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయమై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (క్రైమ్) హిమాన్షు రాయ్‌తో మాట్లాడానని అన్నారు. పత్రికలో ప్రచురించిన ఫొటోలో తనతో ఉన్న వారికి, నిందితుల ముఖాలకు పొంతన కుదరడం లేదని ఆయన చెప్పారన్నారు. ఏమీ చూసుకోకుండానే ఫొటోను సోమవారం సర్క్యూలేట్ చేసిన ఉపాధ్యాయ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ‘దూపర్ కా సామ్నా పత్రికలో ప్రచురితమైన ఓ ఫొటోలో ముగ్గురు వ్యక్తుల ముఖాలను సర్కిల్ చేసి వీరు గ్యాంగ్ రేప్ నిందితులని పేర్కొంది. వారు సచిన్ అహీర్‌తో కరచాలనం చేస్తున్నట్టుగా ఉంది. 2010 సంవత్సరంలో ఓ ఈద్ కార్యక్రమంలో ఈ ఫొటో తీసినట్టు సేన పబ్లికేషన్ పేర్కొంది. ఈ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తాన’ని తెలిపారు. కొంత మంది రేపిస్టులు తనకు దగ్గరివాళ్లని, తన పార్టీ నిరాధారమైందని చేసిన ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనంతో వారి మానసిక స్థాయి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఇంతటి హేయమైన చర్యకు బీజేపీ చేస్తుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కొంత మంది బీజేపీ నాయకుల వ్యక్తిగత సహాయకులు పార్టీని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ్ వల్ల ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు. అయితే పార్టీ నాయకులతో మాట్లాడి ఉపాధ్యాయ్‌పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ అన్నారు. కఠిన చట్టాలు తీసుకురావాలి: నటి కాజోల్ ముంబై: అత్యాచారాలు చేసే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని బాలీవుడ్ నటి కాజోల్ మంగళవారం డిమాండ్ చేశారు. ‘మహిళా ఫోటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచారాన్ని చెప్పేందుకు ఎలాంటి మాటలు రావడం లేదు. అదో భయంకర సంఘటన. ఇది హత్య కన్నా ఏ మాత్రం తక్కువ కాద’ని అన్నారు. దీని గురించి మనం ఎంతో కొంత చేయాల్సి అవసరముందని చెప్పారు. కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రజల్లో భయం కలిగించే రీతిలో శిక్షలో మార్పు తీసుకరావాలి. ఆ మేరకు చట్టాలకు రూపకల్పన చేయాలి. దీనిని సర్కార్‌ను పట్టించుకోనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయ’ని ఆమె చెప్పారు.