ముంబై: గత వారం 23 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం చేసిన నిందితుల్లో కొందరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందినవారని వచ్చిన ఆరోపణలని ఆ పార్టీ నాయకుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ కొట్టిపారేశారు. తనతో నిందితులు ఉన్నట్టుగా చూపే ఫొటోని ప్రచురించిన హిందీ డైలీ దూపర్ కా సామ్నాతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం కేసులో నిందితుల ఫొటోలను ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా విడుదల చేయలేదని ఆయన మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయమై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (క్రైమ్) హిమాన్షు రాయ్‌తో మాట్లాడానని అన్నారు. పత్రికలో ప్రచురించిన ఫొటోలో తనతో ఉన్న వారికి, నిందితుల ముఖాలకు పొంతన కుదరడం లేదని ఆయన చెప్పారన్నారు. ఏమీ చూసుకోకుండానే ఫొటోను సోమవారం సర్క్యూలేట్ చేసిన ఉపాధ్యాయ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ‘దూపర్ కా సామ్నా పత్రికలో ప్రచురితమైన ఓ ఫొటోలో ముగ్గురు వ్యక్తుల ముఖాలను సర్కిల్ చేసి వీరు గ్యాంగ్ రేప్ నిందితులని పేర్కొంది. వారు సచిన్ అహీర్‌తో కరచాలనం చేస్తున్నట్టుగా ఉంది. 2010 సంవత్సరంలో ఓ ఈద్ కార్యక్రమంలో ఈ ఫొటో తీసినట్టు సేన పబ్లికేషన్ పేర్కొంది. ఈ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తాన’ని తెలిపారు.
కొంత మంది రేపిస్టులు తనకు దగ్గరివాళ్లని, తన పార్టీ నిరాధారమైందని చేసిన ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనంతో వారి మానసిక స్థాయి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఇంతటి హేయమైన చర్యకు బీజేపీ చేస్తుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. కొంత మంది బీజేపీ నాయకుల వ్యక్తిగత సహాయకులు పార్టీని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ్ వల్ల ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు. అయితే పార్టీ నాయకులతో మాట్లాడి ఉపాధ్యాయ్‌పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ అన్నారు.
కఠిన చట్టాలు తీసుకురావాలి: నటి కాజోల్
ముంబై: అత్యాచారాలు చేసే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని బాలీవుడ్ నటి కాజోల్ మంగళవారం డిమాండ్ చేశారు. ‘మహిళా ఫోటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచారాన్ని చెప్పేందుకు ఎలాంటి మాటలు రావడం లేదు. అదో భయంకర సంఘటన. ఇది హత్య కన్నా ఏ మాత్రం తక్కువ కాద’ని అన్నారు. దీని గురించి మనం ఎంతో కొంత చేయాల్సి అవసరముందని చెప్పారు. కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రజల్లో భయం కలిగించే రీతిలో శిక్షలో మార్పు తీసుకరావాలి. ఆ మేరకు చట్టాలకు రూపకల్పన చేయాలి. దీనిని సర్కార్‌ను పట్టించుకోనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయ’ని ఆమె చెప్పారు.
మా వాళ్లు కాదు
Published Wed, Aug 28 2013 12:43 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement